Fighter Movie Review: రివ్యూ: ఫైట‌ర్‌.. హృతిక్‌ యాక్షన్ మూవీ మెప్పించిందా?

Fighter Movie Review; హృతిక్‌ రోషన్‌, దీపిక పదుకొణె జంటగా సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్‌ మూవీ ‘ఫైటర్‌’ ఎలా ఉంది?

Updated : 25 Jan 2024 15:11 IST

Fighter Movie Review; చిత్రం: ఫైటర్‌; నటీనటులు: హృతిక్‌ రోషన్‌, దీపికా పదుకొణె, అనిల్‌ కపూర్‌, కరణ్‌ సింగ్‌ గ్రోవర్‌, అక్షయ్‌ ఒబెరాయ్‌, సంజీవ్‌ జైశ్వాల్‌ తదితరులు; సంగీతం: విశాల్‌-శేఖర్‌( సంచిత్‌ బల్హారా అండ్‌ అంకిత్‌-నేపథ్యం); సినిమాటోగ్రఫీ: సచిత్‌ పాలోస్‌; ఎడిటింగ్‌: ఆరిఫ్‌ షేక్‌; నిర్మాత: సిద్ధార్థ్‌ ఆనంద్‌, మమతా ఆనంద్‌, జ్యోతి దేశ్‌పాండే, అజిత్‌ అంధారే, అంకు పాండే, రామోన్‌ చిబ్బి కెవిన్‌వాజ్‌; రచన, దర్శకత్వం: సిద్ధార్థ్‌ ఆనంద్‌; విడుదల: 25-01-2024

భారీ యాక్ష‌న్ చిత్రాల‌కి పెట్టింది పేరు బాలీవుడ్‌. రూ.250 కోట్లుపై చిలుకు వ్య‌యంతో అక్క‌డ తెర‌కెక్కిన చిత్రమే ‘ఫైట‌ర్‌’. లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హా చిత్రాల‌కి కేరాఫ్‌గా మారిన సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో హృతిక్ రోష‌న్ క‌థానాయ‌కుడిగా సినిమా అంటే ఎన్నో అంచ‌నాలు. దానికితోడు విజ‌య‌వంత‌మైన ‘ప‌ఠాన్‌’ త‌ర్వాత వ‌స్తున్న సిద్ధార్థ్ ఆనంద్ సినిమా కావ‌డం,  ‘వార్‌’ త‌ర్వాత హృతిక్-సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా కావ‌డంతో ‘ఫైట‌ర్‌’ ప్ర‌త్యేకంగా ప్రేక్ష‌కుల్ని ఆక‌ర్షించింది. (Fighter Movie Review) మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? హృతిక్‌, దీపిక కలిసి చేసిన యాక్షన్‌ హంగామా ఏంటి?

క‌థేంటంటే: సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కి వెనుకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించే క్ర‌మంలో త‌న‌కున్న ప‌రిధుల్ని, నిబంధ‌న‌ల్ని దాటి మ‌రీ సాహ‌సాలు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే జ‌రిగిన ఓ దుస్సంఘ‌ట‌న‌కి బాధ్యుడిగా నింద‌ని మోస్తూ ఉంటాడు.  రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. సీవో రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను అలియాస్ మిన‌ల్ సింగ్ రాఠోడ్‌ (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది?(Fighter Movie Review) పాటీ మ‌ళ్లీ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించాడా?రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని దాటి పాటీ నిజ‌మైన ఫైట‌ర్ అని ఎలా చాటుకున్నాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సాగే ఎయిర్ ఫోర్స్  డ్రామా ఇది. దేశ ర‌క్ష‌ణ కోసం స‌రిహ‌ద్దుల్లో త్రివిధ ద‌ళాలు భూమిపైన, ఆకాశంలోనూ, నీళ్ల‌లోనూ పోరాటం చేస్తుంటాయి. ఇప్ప‌టివ‌ర‌కూ దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే సినిమాలు ఎక్కువ‌గా భూమిపై పోరాటం నేప‌థ్యంలో వ‌చ్చిన‌వే. అప్పుడ‌ప్పుడూ నావికాద‌ళం, వైమానిక ద‌ళం నేప‌థ్యంలోనూ సినిమాలు రూపుదిద్దుకుంటూ ఉంటాయి. అలా మ‌న వాయు సేన చుట్టూ సాగే క‌థ ఇది. (Fighter Movie Review in telugu) మ‌న వీరులు గ‌గ‌న‌తలంలో చేసే సాహ‌స విన్యాసాలు ఎలా ఉంటాయో క‌ళ్ల‌కు క‌ట్టేలా చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇందులో క‌థ కంటే కూడా డ్రామా, యాక్ష‌న్‌తో కూడిన హంగామానే ఎక్కువ‌. క‌శ్మీర్ చుట్టూ సాగే క‌థ అంటే.. శ‌త్రుదేశ‌మైన పాకిస్థాన్‌, అక్క‌డ ఉగ్ర‌వాదులు క‌లిసి ప‌న్నే ప‌న్నాగాల చుట్టూనే తిరుగుతుంది. ఇది కూడా అదే టెంప్లేట్‌లోనే సాగుతుంది. క‌థ ప‌రంగా చూస్తే వైవిధ్య‌మేమీ క‌నిపించ‌దు. కానీ, ఓ ఫైట‌ర్ పైల‌ట్ పోరాట ప‌టిమ చుట్టూ అల్లిన డ్రామానే ఈ సినిమాకి హైలైట్‌.

వైమానిక ద‌ళం నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ స‌న్నివేశాలు లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హాలో సాగుతూ ప్రేక్ష‌కుల్ని అబ్బుర ప‌రుస్తాయి. హాలీవుడ్ చిత్రాల్ని త‌ల‌దన్నే రీతిలో ఆ స‌న్నివేశాల్ని తీర్చిదిద్దడంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. వాటికి తోడు దేశ‌భ‌క్తి అంశం కూడా ప్ర‌భావం చూపించ‌డం సినిమాకి క‌లిసొచ్చింది. ప్ర‌థ‌మార్ధం ప్ర‌ధాన పాత్ర‌ల్ని, క‌థా ప్ర‌పంచాన్ని ప‌రిచ‌యం చేస్తుంది. గ‌గ‌న‌త‌లంలో పోరాటం చేసే విష‌యంలో స‌న్న‌ద్ధ‌త ఎలా ఉంటుంది?దూసుకొస్తున్న శ‌త్రువుల తూటాల్ని ఎదురొడ్డుతూ ఫైట‌ర్ పైల‌ట్స్ ఆకాశంలో ఎలాంటి సాహ‌సాలు చేస్తుంటారో చూపించారు. ద్వితీయార్ధంలో క‌థ‌లోని అస‌లైన సంఘ‌ర్ష‌ణ ఉంటుంది. (Fighter Movie Review in telugu) పుల్వామా దాడి, ఆ త‌ర్వాత  సంఘ‌ట‌న‌ల స్ఫూర్తితో స‌న్నివేశాల్ని మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. రెండేళ్ల కింద‌ట పాటీ జీవితంలో జ‌రిగిన సంఘ‌ట‌న‌, మిన్ను వ్య‌క్తిగ‌త జీవితం, వాళ్ల తల్లిదండ్రులు గ‌ర్వ‌ప‌డే సంద‌ర్భంలో వ‌చ్చే సెంటిమెంట్ స‌న్నివేశాలు మ‌న‌సుల్ని క‌దిలిస్తాయి. ప‌తాక స‌న్నివేశాల్లో  క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ ఘ‌ట్టాలు చిత్రానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. ప్రేక్ష‌కుడిని గ‌గ‌న‌తలంలోకి తీసుకెళ్లి ఓ స‌రికొత్త అనుభూతిని పంచుతుందీ చిత్రం.

ఎవ‌రెలా చేశారంటే: హృతిక్‌రోష‌న్ (Hrithik Roshan), దీపికా (Deepika Padukone) జోడీ చిత్రంలో చక్కగా నటించారు. వాళ్లిద్ద‌రూ ఎంతో స్టైలిష్‌గా క‌నిపించారు. పోరాట ఘ‌ట్టాల్లో హృతిక్ త‌న మార్క్‌ని ప్ర‌ద‌ర్శించాడు.  క‌ళ్ల‌తోనూ భావాల్ని ప‌లికిస్తూ చాలా స‌న్నివేశాల్లో బ‌ల‌మైన భావోద్వేగాల్ని పండించాడు. ‘ఈ ఒక్క‌సారికి నన్ను న‌మ్ము’ అంటూ స‌హ‌చరుడి భార్య‌తో చెప్పే స‌న్నివేశాలు క‌దిలిస్తాయి. ‘ఫైట‌ర్ గొడ‌వ చేయడు.. యుద్ధం చేస్తాడు’ అంటూ ఆ పాత్ర స్వ‌భావానికి త‌గ్గ‌ట్టుగా ఎంతో ప‌రిణ‌తితో క‌నిపిస్తూ న‌టించాడు హృతిక్‌. ఇంట్లోవాళ్లు పెళ్లి చేయాల‌నుకుంటుంటే, త‌ను మాత్రం త‌న క‌లలకి రెక్క‌లు తొడుగుతూ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిన యువ‌తిగా  దీపికా ప‌దుకొణె క‌నిపిస్తుంది. అమ్మాయిలు ఆకాశంలోనూ స‌మానం అంటూ ఆమె పాత్ర చాటుతుంది. ద్వితీయార్ధంలో దీపికా పాత్ర చ‌క్క‌టి భావోద్వేగాల్ని పండిస్తుంది. (Fighter Movie Review) అనిల్ క‌పూర్ పాత్ర చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. ఆయ‌న రాకీ పాత్ర‌లో ఒదిగిపోయారు. క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌, అక్ష‌య్ ఒబెరాయ్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. స‌చిత్ కెమెరా, సంచిత్‌-అంకిత్ నేప‌థ్య సంగీతం, విశాల్-శేఖ‌ర్ పాట‌లు చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది. విజ‌య‌వంత‌మైన ‘ప‌ఠాన్‌’ త‌ర్వాత సిద్ధార్థ్ ఆనంద్ నుంచి వ‌చ్చిన చిత్ర‌మిది. ఆ చిత్రానికి దీటుగానే దీనిని రూపొందించాడు. యాక్ష‌న్‌, నేప‌థ్యం, విజువ‌ల్స్ ప‌రంగా ప‌ర్వాలేదు కానీ... క‌థ, క‌థ‌నాల ప‌రంగానే నిరుత్సాహ ప‌రుస్తాడు. త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే ఉత్సుక‌త‌ని ఏమాత్రం క‌లిగించ‌లేక‌పోయాడు ద‌ర్శ‌కుడు. వ‌యాకామ్ 18 స్టూడియోస్ నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బలాలు
  • + కథా నేపథ్యం
  • + యాక్షన్
  • + హృతిక్, దీపికాల నటన
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ
  • చివరిగా..: ‘ఫైటర్’... గగనతలంలో యాక్షన్‌ హంగామా (Fighter Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని