Chandramohan: ‘పదహారేళ్ల వయసు’.. చంద్రమోహన్‌కు నచ్చలేదట..!

Chandramohan: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ నటుడు చంద్రమోహన్‌ గతంలో పలు ఇంటర్వ్యూలో తన వృత్తి జీవితం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అవేంటో చూద్దాం..!

Updated : 11 Nov 2023 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘రంగుల రాట్నం’ సినిమాతో సినీ ప్రపంచానికి పరిచయమై ‘పదహారేళ్ల వయసు’ లాంటి సినిమాలో వైవిధ్యమైన నటనను ప్రదర్శించి చిత్ర సీమలో ‘సిరి సిరి మువ్వలు’ మోగించిన చంద్రమోహన్‌ (Chandramohan) ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయారు. అనారోగ్యంతో శనివారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా గతంలో ఆయన పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విశేషాలను ఓ సారి ఆయన మాటల్లోనే గుర్తుచేసుకుందాం..!

ఒడుదొడుకుల ప్రయాణమే..

‘‘తొలి సినిమా ‘రంగుల రాట్నం’తో మంచి పేరొచ్చింది. నంది అవార్డు కూడా అందుకున్నా. కానీ ఆరు నెలల వరకూ మరో సినిమా లేదు. ఆ తర్వాత  ‘మరుపురాని కథ’, ‘బంగారు పిచ్చుక’ చిత్రాల్లో నటించాను. అటుపైన రెండున్నర ఏళ్లవరకూ వేషాలే లేవు. మా గురువు బి.ఎన్‌.రెడ్డిగారు నన్ను హీరోగా తప్ప చేయవద్దన్నారు. అందుకే మొదట్లో చిన్న చిన్న వేషాలు వచ్చినా అంగీకరించలేదు. ఇంటి నుంచి డబ్బు తెప్పించుకోవడానికి మొహమాటం. మద్రాసు వెంకటనారాయణ రోడ్డులో ఉన్న పార్కులో పస్తులతో పడుకున్న రోజుల్ని ఇప్పటికీ  మరిచిపోలేను. ఒకదశలో మద్రాసు వదిలి వెళ్లిపోదామనే అనుకున్నాను. కానీ పట్టుదల పెరిగి అక్కడే ఉండి తేల్చుకుందామని నిర్ణయించుకున్నాను. నన్ను నేను పోషించుకోవాలి. ప్రేక్షకులు నన్ను మరిచిపోకూడదు. అందుకే హీరోగానే నటించాలనే నా పట్టుదలను వీడి అన్ని రకాల వేషాలు వేసి ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యాను. అలా చేయడం వల్లే ఇండస్ట్రీలో 50 ఏళ్లు ఉండగలిగాననిపిస్తోంది’’ అని ఓ సందర్భంలో చంద్రమోహన్‌ పంచుకున్నారు.

పదహారేళ్ల వయసు.. అందుకే నచ్చలేదు..

‘‘ఇండస్ట్రీలో వందల సినిమాల్లో చేశా. కానీ, మనసుకు నచ్చిన సినిమాలు కొన్నే ఉన్నాయి. తొలి సినిమా ‘రంగుల రాట్నం’ నాకు చాలా ఇష్టమైన సినిమా. ‘ఆమె’, ‘కలికాలం’, ‘సగటు మనిషి’.. నాకు తృప్తిగా అన్పించాయి. ‘పదహారేళ్ల వయసు’తో చాలా పేరొచ్చినా అది రీమేక్‌ సినిమా. అందుకే ఆ సినిమా పట్ల నేను సంతృప్తిగా లేను. కానీ, ఆ సినిమా చేసిన తర్వాత.. ఓసారి కమల్‌హాసన్‌ మాట్లాడుతూ నాకంటే చంద్రమోహన్‌ చాలా బాగా చేశాడని మెచ్చుకున్నారు. అది చాలు అన్పించింది. ఇక, సిరి సిరి మువ్వ కూడా దర్శకుడి అభిరుచి మేరకే చేశా’’ అని ఆలీతో సరదాగా ఇంటర్వ్యూలో చంద్రమోహన్‌ చెప్పారు.

శోభన్‌బాబు నా దగ్గర డబ్బు తీసుకునేవారు..

‘‘శోభన్‌బాబు నాకు చాలా మంచి స్నేహితుడు. ఆయన  చాలా ఆస్తిపరుడు. అయినా.. నన్ను డబ్బులు అడిగేవారు. మొదట్లో ఆశ్చర్యపోయా. నేను ఇచ్చిన డబ్బుతో కలిసొచ్చిందని ఆయన నమ్మేవారు. అందుకే, ఆస్తి కొన్న ప్రతిసారీ నా దగ్గర డబ్బులు తీసుకునేవారు. ఆయన మరణం నా జీవితంలో తీరని లోటు’’ అని నాటి సంగతులను ఓ సందర్భంలో గుర్తుచేసుకున్నారు.

ఆ సంఘటన జీవితంలో మర్చిపోలేను..

‘‘నాకు నాగేశ్వరరావుగారితో ఎక్కువగా సినిమా అవకాశాలు వచ్చాయి. మేమిద్దరం కలిసి 40 సినిమాలు చేశాం. ఒకేలా ఉండటం వల్ల బహుశా ఆయన పక్కన నన్ను తీసుకునేవారేమో. ఇక, రామారావుగారితో పెద్దగా నటించే అవకాశం రాలేదు. అయితే ఓసారి ఎన్టీఆర్‌ సినిమా కారణంగా నాకు చేదు అనుభవం ఎదురైంది. అది నా జీవితంలో మర్చిపోలేను. ఆయన పక్కన తమ్ముడిగా ముందు నన్ను అనుకుని చివరి నిమిషంలో బాలకృష్ణను తీసుకున్నారు. ఆ క్షణం ఎంతో బాధపడ్డా. అయితే, ఆ తర్వాత అదే సినిమా తమిళంలో రీమేక్‌ చేసినప్పుడు ఎంజీఆర్‌ పక్కన తమ్ముడిగా చేసే అవకాశం లభించింది. ఎన్టీఆర్‌ సినిమా సెట్‌లో జరిగిన ఘటన వల్లే.. నాకు ఎంజీఆర్‌ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాతో నాకు తమిళంలో బ్రహ్మాండమైన పేరు వచ్చింది’’ అని చంద్రమోహన్‌ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు