
దీపిక... కారణం అదేనా!
కరోనా పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే థియేటర్లు గాడిలో పడుతున్నాయి. అదే సమయంలో ఓటీటీలోనూ సినిమాలు ఎక్కువగానే విడుదలవుతున్నాయి. ఎక్కువశాతం భారీ చిత్రాలు థియేటర్ల వైపే మొగ్గు చూపుతున్నాయి. కానీ దీపికా పదుకొణె, అనన్యా పాండే ప్రధాన పాత్రల్లో షకున్ బత్రా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటీటీలో విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శృంగార సన్నివేశాల మోతాదు కాస్త ఎక్కువగానే ఉందని సమాచారం. దీంతో సెన్సార్‌బోర్డు నుంచి ఎక్కువ కట్స్ వచ్చే అవకాశం ఉండేలా ఉందట. అదే జరిగితే సినిమా బాగా దెబ్బతినే అవకాశాలున్నాయట. దీంతో చిత్రబృందం ఓటీటీ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధాల నేపథ్యంగా నడిచే కథని సున్నితంగా చెప్పే ప్రయత్నం చేసినట్లు బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది, ధైర్య కర్వ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కరణ్‌జోహార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లతో చిత్రబృందం సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.