Suhas: చాలా సన్నివేశాలు షాక్‌కు గురి చేస్తాయి

‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్‌కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్‌ వై.కె తెరకెక్కించారు.

Updated : 03 May 2024 10:01 IST

‘‘ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టే వినూత్నమైన కథతో రూపొందిన థ్రిల్లర్‌ చిత్రం ‘ప్రసన్న వదనం’. దీంట్లో చాలా సన్నివేశాలు షాక్‌కు గురి చేసేలా ఉంటాయి’’ అన్నారు సుహాస్‌. ఆయన హీరోగా నటించిన ఈ సినిమాని అర్జున్‌ వై.కె తెరకెక్కించారు. ఇది శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలోనే సుహాస్‌ మాట్లాడుతూ ‘‘ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ అనే కాన్సెప్ట్‌పై సాగే చిత్రమిది. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. నేనిందులో ఆర్జేగా పనిచేసే మామూలు కుర్రాడి పాత్ర పోషించా. అతను తనకున్న ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ కారణంగా ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. మరి దాని నుంచి అతనెలా బయట పడ్డాడన్నది ఆసక్తికరంగా ఉంటుంది’’ అన్నారు. తన కొత్త సినిమాల గురించి చెబుతూ ‘‘ప్రస్తుతం నా చేతిలో ఎనిమిది చిత్రాలున్నాయి. ‘కేబుల్‌ రెడ్డి’ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. అమెజాన్‌ ప్రైమ్‌ కోసం కీర్తి సురేశ్‌తో ఓ ప్రాజెక్ట్‌ చేస్తున్నా. దిల్‌రాజు నిర్మాణంలో చేయనున్న సినిమా జులైలో మొదలవుతుంది. కార్తీక్‌ సుబ్బరాజుతో ఓ చిత్రం చేయాలి’’ అన్నారు.


స్వాతంత్య్రం వచ్చిన రాత్రి

బాలీవుడ్‌లో ఎన్నో విజయవంతమైన చిత్రాలను రూపొందించిన  దర్శకనిర్మాత నిఖిల్‌ అడ్వాణీ.. ఇప్పుడు ఓ సరికొత్త వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన సంఘటనల ఆధారంగా ‘ఫ్రీడమ్‌ ఎట్‌ మిడ్‌నైట్‌’ అనే సిరీస్‌ను రూపొందిస్తున్నారు. ఇందులో జవహార్‌లాల్‌ నెహ్రూ పాత్రలో బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు సిద్ధాంత్‌ గుప్తా, గాంధీగా చిరాగ్‌ వోహ్రా, సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ పాత్రలో రాజేంద్ర చావ్లా కనిపించనున్నారు. తాజాగా ఈ సిరీస్‌ ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు దర్శకుడు. ఇందులో ఈ ముగ్గురు ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఈ సిరీస్‌ త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుంది.


‘బాక్‌’లో కొత్త తమన్నాని చూస్తారు

‘‘ప్రేక్షకుల్ని ఆద్యంతం థ్రిల్‌ చేస్తూ.. ఆశ్చర్యపరిచే సినిమా ‘బాక్‌’. ముగింపు రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంటుంది’’ అన్నారు సుందర్‌. సి. ఆయన హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రమే ‘బాక్‌’. విజయవంతమైన హారర్‌ కామెడీ సిరీస్‌ ‘అరణ్మనై’ నుంచి వస్తున్న నాలుగో సినిమా ఇది. తమన్నా, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో సుందర్‌ సి మాట్లాడుతూ ‘‘అరణ్మనై’ సిరీస్‌లో వచ్చిన గత మూడు సినిమాలన్నీ పగ, ప్రతీకారాలకు కేంద్ర బిందువుగా ఉంటాయి. కానీ, ఈ నాలుగో భాగం వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. క్లైమాక్స్‌ చిత్రీకరణ సవాల్‌గా అనిపించింది. తప్పకుండా ఇది ప్రేక్షకులకు కనులవిందుగా ఉంటుంది. ‘అరణ్మనై’ సిరీస్‌లో వచ్చే అన్ని సినిమాల్లో స్త్రీ పాత్రలు బలంగా ఉంటాయి. ఇందులోనూ తమన్నా, రాశీ ఖన్నా పాత్రలు అంతే బలంగా ఉంటాయి. ఈ చిత్రంతో ప్రేక్షకులు ఓ కొత్త తమన్నాని చూస్తారు. రాశి పాత్ర కూడా అదిరిపోతుంది’’ అన్నారు.


ఓ మంచి దెయ్యం!

వెన్నెల కిశోర్‌, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో శంకర్‌ మార్తాండ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఓ మంచి ఘోస్ట్‌’. అబినికా ఇనాబతుని నిర్మించారు. నాగినీడు, షకలక శంకర్‌, రఘుబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్ర కాన్సెప్ట్‌ పోస్టర్‌, గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘హారర్‌ థ్రిల్లర్‌ అంశాలతో పాటు మంచి వినోదం నిండి ఉన్న చిత్రమిది. ఓవైపు నవ్విస్తూనే.. ఆద్యంతం భయపెడుతూ ఉత్కంఠత రేకెత్తిస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరిస్తుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, ఛాయాగ్రహణం: ఐ.ఆండ్రూ.


1980ల్లో ప్రేమ

రాజేశ్‌ కొంచాడ, శ్రావణి శెట్టి జంటగా స్వామి పట్నాయక్‌ తెరకెక్కించిన చిత్రం ‘కౌసల్య తనయ రాఘవ’. అడపా రత్నాకర్‌ నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘1980 నేపథ్యంలో సాగే ఓ అందమైన కుటుంబ ప్రేమ కథతో ఈ చిత్రం రూపొందింది. నిర్మాణానంతర పనులు ముగింపు దశలో ఉన్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రాజేశ్‌ రాజ్‌ తేలు, ఛాయాగ్రహణం: యోగి రెడ్డి.


మనుషులంతా ఒక్కటే

రాజ్‌ భీమ్‌ రెడ్డి ప్రధాన పాత్రలో నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘ది ఇండియన్‌ స్టోరీ’. ఆర్‌.రాజశేఖర్‌ రెడ్డి తెరకెక్కించారు. జరా ఖాన్‌ కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర హీరో, నిర్మాత మాట్లాడుతూ.. ‘‘అన్ని రకాల వాణిజ్యాంశాలతో నిండిన మంచి సందేశాత్మక చిత్రమిది’’ అన్నారు. ‘‘అన్ని మతాలు సమానమే.. మనుషులంతా ఒక్కటే’ అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందించాం. తప్పకుండా ఇది అందర్నీ అలరిస్తుంది’’ అన్నారు దర్శకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు