God Movie Review: రివ్యూ: ‘గాడ్‌’.. క్రైమ్‌ థ్రిల్లర్‌ మెప్పించిందా?

God Movie Review: జయం రవి, నయనతార కీలక పాత్రల్లో నటించిన ‘గాడ్‌’ మూవీ ఎలా ఉందంటే?

Published : 13 Oct 2023 08:17 IST

God Movie Review; చిత్రం: గాడ్‌; న‌టీన‌టులు: జ‌యం ర‌వి, న‌య‌న‌తార‌, న‌రైన్, ఆశిష్ విద్యార్థి, వినోద్ కిష‌న్‌, రాహుల్ బోస్‌, విజ‌య‌ల‌క్ష్మి త‌దిత‌రులు; ఛాయాగ్ర‌హ‌ణం: హ‌రి కె.వేదాంతం; సంగీతం: యువ‌న్ శంక‌ర్ రాజా; ద‌ర్శ‌క‌త్వం: ఐ.అహ్మ‌ద్‌; నిర్మాత‌లు: సుధన్ సుందరం, జి.జయరాం, సి.హెచ్.సతీష్ కుమార్; విడుద‌ల తేదీ: 13-10-2023

ద‌స‌రా వ‌స్తుందంటే చాలు రెండు వారాల ముందు నుంచే బాక్సాఫీస్ సంద‌డి మొద‌లైపోతుంది. సినీప్రియుల్ని ఊరిస్తూ అగ్ర తార‌ల చిత్రాలు థియేట‌ర్ల ముందుకు వ‌రుస క‌డుతుంటాయి. కానీ, ఈసారి ఆ సినీ వినోదాలు ఒక్క వారానికే ప‌రిమిత‌మ‌వ‌నున్నాయి. పండ‌గ ముందొచ్చిన  ఈ శుక్ర‌వారం స్టార్ల సంద‌డి క‌నిపించ‌లేదు. న‌య‌న‌తార‌, జ‌యం ర‌వి క‌లిసి న‌టించిన అనువాద చిత్రం ‘గాడ్’ మాత్ర‌మే కాస్త అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. (God Movie Review) సైకో థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో రూపొందిన ఈ సినిమా ప్రేక్ష‌కుల‌కు ఎలాంటి అనుభూతిని అందించింది?  జ‌యం ర‌వి, న‌య‌న్‌ల‌కు విజ‌యాన్ని అందించిందా?

క‌థేంటంటే: అర్జున్ (జ‌యం ర‌వి) అసిస్టెంట్ పోలీస్ క‌మిష‌న‌ర్‌. భ‌య‌మంటే ఏమిటో తెలియ‌ని వ్య‌క్తిత్వం త‌న‌ది. కోపం.. దూకుడు రెండూ ఎక్కువే. నేర‌స్థుల్ని శిక్షించే క్ర‌మంలో అవ‌స‌ర‌మ‌నుకుంటే చ‌ట్టాన్ని మీర‌డానికైనా వెన‌కాడడు. త‌న‌ మిత్రుడు, స‌హోద్యోగి ఆండ్రూ (న‌రైన్) అంటే అర్జున్‌కు చాలా ఇష్టం. అత‌ని కుటుంబాన్ని సొంత కుటుంబంలా భావిస్తుంటాడు. వృత్తిప‌రంగా సాఫీగా సాగిపోతున్న వారి జీవితాల‌కు స్మైలింగ్ కిల్ల‌ర్ బ్ర‌హ్మ (రాహుల్ బోస్‌) రూపంలో స‌వాల్ ఎదుర‌వుతుంది.సైకో కిల్ల‌ర్ అయిన అత‌ను న‌గ‌రంలో అనేక మంది యువ‌తుల్ని కిడ్నాప్ చేసి.. వారిని అత్యంత పాశ‌వికంగా హ‌త్య చేసి త‌ప్పించుకు తిరుగుతుంటాడు. (God Movie Review) దీంతో అత‌ని ఆట‌క‌ట్టించేందుకు అర్జున్ బృందం రంగంలోకి దిగుతుంది.  అయితే బ్ర‌హ్మ‌ను ప‌ట్టుకునే క్ర‌మంలో అనుకోకుండా ఆండ్రూ ప్రాణాలు కోల్పోతాడు. ఆ బాధ‌లో అర్జున్ డిపార్ట్‌మెంట్ నుంచి త‌ప్పుకొంటాడు. కానీ, బ్ర‌హ్మ జైలు నుంచి త‌ప్పించుకోవ‌డంతో క‌థ మ‌ళ్లీ మొద‌ట‌కొస్తుంది. న‌గ‌రంలో వ‌రుస హ‌త్య‌లు మ‌ళ్లీ మొద‌ల‌వుతాయి. అయితే ఈసారి బ్ర‌హ్మ.. అర్జున్ స‌న్నిహితుల్నే ల‌క్ష్యం చేసుకోవ‌డం ప్రారంభిస్తాడు. మ‌రి ఆ త‌ర్వాత ఏమైంది?  సైకో కిల్ల‌ర్ బ్ర‌హ్మ‌ను ప‌ట్టుకునేందుకు అర్జున్ ఏం చేశాడు? ఈ క్ర‌మంలో అత‌నికి ఎలాంటి స‌వాళ్లు ఎదురయ్యాయి?  వాటిని త‌నెలా ప‌రిష్క‌రించాడు? ప్రియాతో అత‌ని ప్రేమాయ‌ణం ఏమైంది? అన్న‌ది మిగతా క‌థ‌.

ఎలా సాగిందంటే:  ఓ సైకో కిల్ల‌ర్‌.. న‌గ‌రంలో వ‌రుస హ‌త్య‌ల‌కు పాల్ప‌డ‌టం.. అత‌ని ఆట క‌ట్టించేందుకు క‌థానాయ‌కుడు రంగంలోకి దిగ‌డం.. త‌న తెలివితేట‌ల‌న్నీ ఉప‌యోగించి ఆఖ‌రికి సైకో కిల్ల‌ర్‌ను అంత‌మొందించ‌డం.. ఇలా సైకో థ్రిల్ల‌ర్ క‌థ‌ల‌న్నీ ఇంచుమించు ఒకే మూస‌లో సాగుతాయి. (God Movie Review) దీంట్లో నేరం జ‌రుగుతున్న తీరు.. వాటి చుట్టూ అల్లుకున్న మైండ్ గేమ్‌.. దాన్ని క‌థానాయ‌కుడు ఎంత తెలివిగా ఛేదించాడ‌న్న అంశాల‌పైనే చిత్ర విజ‌యం ఆధార‌ప‌డి ఉంటుంది. ఇందుకోసం బిగిస‌డ‌ల‌ని స్ర్కీన్‌ప్లేను సిద్ధం చేసుకోవాలి. అప్పుడే ఇంత‌ చిన్న పాయింట్‌తో ప్రేక్ష‌కుల్ని రెండున్న‌ర గంట‌లు థియేట‌ర్ల‌లో కూర్చోబెట్ట‌గలుగుతారు. అయితే ఈ చిత్ర విష‌యంలో ఆ ప్ర‌య‌త్నం స‌గమే విజ‌య‌వంత‌మ‌య్యింది. నేరం జ‌రిగే తీరు.. దాన్ని చూపించిన విధానం ఉత్కంఠ‌భ‌రితంగా ఉన్నా.. దాని చుట్టూ అల్లుకున్న మైండ్‌గేమ్ అంత ఆస‌క్తిక‌రంగా ఉండ‌దు. దీంతో ఇదొక స‌గ‌టు థ్రిల్ల‌ర్‌గానే మిగిలిపోతుంది.  అర్జున్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేస్తూనే.. క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా అస‌లు క‌థ‌ను మొద‌లు పెట్టాడు ద‌ర్శ‌కుడు. న‌గ‌రంలో 25ఏళ్ల లోపు అమ్మాయిలు ఒకొక్క‌రిగా కిడ్నాప్ అవ్వ‌డం.. వారు సైకో కిల్ల‌ర్ బ్ర‌హ్మ చేతిలో అత్యంత దారుణంగా హ‌త్య‌కు గుర‌వ‌డం.. అత‌న్ని ప‌ట్టుకునేందుకు హీరో గ్యాంగ్ రంగంలోకి దిగ‌డం.. ఇలా తొలి 10నిమిషాలు క‌థ‌నం చ‌క‌చ‌కా సాగిపోతుంది. కానీ, ఆ త‌ర్వాత నుంచి క‌థ‌లో ఎలాంటి వేగం క‌నిపించ‌దు. (God Movie Review) సైకో హ‌త్య‌లు చేసే తీరును చూపించ‌డానికి ద‌ర్శ‌కుడు మ‌రీ ఎక్కువ స‌మ‌యం తీసుకున్నాడు.  ఆ హ‌త్య‌ల‌న్నీ ఒళ్లు గ‌గుర్పాటుకు గురి చేసేలా ఉంటాయి. అయితే అవి మ‌రీ సుదీర్ఘంగా సాగ‌డంతో ఓ ద‌శ త‌ర్వాత స‌హ‌నానికి ప‌రీక్ష‌లా తోస్తాయి. పోలీసులు పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌కుండానే సైకో కిల్ల‌ర్ వాళ్ల‌కు చిక్క‌డంతో అప్ప‌టి వ‌ర‌కు ప్రేక్ష‌కుల్లో సినిమాపై ఉన్న కాస్తంత ఆస‌క్తి కూడా పూర్తిగా చ‌చ్చిపోతుంది.  ఎప్పుడైతే బ్ర‌హ్మ పోలీసుల నుంచి త‌ప్పించుకుంటాడో అప్ప‌టి నుంచి క‌థ‌లో మళ్లీ క‌ద‌లిక మొద‌ల‌వుతుంది. విరామానికి ముందు క‌థానాయ‌కుడు సైకో కిల్ల‌ర్‌ను మ‌ట్టుబెట్ట‌డం.. అదే స‌మ‌యంలో అతని వెన‌క మ‌రో సైకో కిల్ల‌ర్ ఉన్నాడ‌ని తెలియ‌డంతో ద్వితీయార్ధంపై ఆస‌క్తి పెరుగుతుంది.

ప్ర‌థమార్ధంలాగే ద్వితీయార్ధం కూడా సైకో కిల్ల‌ర్ చేసే వ‌రుస హ‌త్య‌ల‌తో మొద‌ల‌వుతుంది. అయితే ఈసారి ఆ నేర‌స్థుడు క‌థానాయ‌కుడు స‌న్నిహితుల్నే ల‌క్ష్యం చేసుకుంటుండ‌టంతో క‌థ‌లో సంఘ‌ర్ష‌ణ మొద‌ల‌వుతుంది. అంత‌కు ముందు వ‌ర‌కు వ‌రుస హ‌త్య‌లు చేసింది చ‌నిపోయిన బ్ర‌హ్మ‌నా.. అత‌ని వెన‌కున్న మ‌రో కిల్ల‌రా? అనే విష‌యంలో ద‌ర్శ‌కుడు న‌డిపిన డ్రామా బాగుంది. జైలులో సైకో కిల్ల‌ర్ బ్ర‌హ్మ త‌న‌లా మ‌రో వ్య‌క్తిని త‌యారు చేసే తీరు ఆస‌క్తిరేకెత్తిస్తుంది. (God Movie Review) అయితే ద్వితీయార్ధంలోనూ హీరో బుర్ర‌కు ప‌దును పెట్టే స‌న్నివేశం ఒక్క‌టీ క‌నిపించ‌దు. బ్ర‌హ్మ వెన‌కున్న మ‌రో సైకో కిల్ల‌ర్‌ను ప‌ట్టుకోవ‌డం కోసం అత‌ను పెద్ద‌గా క‌ష్ట‌ప‌డ‌డు. అలా చూసీ చూడ‌గానే త‌నే వ‌రుస హ‌త్య‌లు చేస్తున్నాడ‌ని హీరో క‌నిపెట్టేయ‌డం.. సైకో కిల్ల‌రే త‌న క‌థ‌ను అత‌నికి స్వ‌యంగా చెప్ప‌డం ఏమాత్రం ఆస‌క్తిక‌రంగా అనిపించ‌వు. ప‌తాక స‌న్నివేశాలు ఆద్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా ఉంటాయి. హీరో.. సైకో కిల్ల‌ర్ త‌ల‌ప‌డే తీరు బాగుంటుంది.

ఎవ‌రెలా చేశారంటే: అర్జున్ పాత్ర‌లో జ‌యం ర‌వి ఆద్యంతం సీరియ‌స్ లుక్స్‌తో క‌నిపించారు. సినిమా మొత్తం ఆయ‌న చుట్టూనే తిరుగుతుంది. దూకుడైన స్వ‌భావం గ‌ల పోలీస్‌గా స‌హ‌జ‌మైన న‌ట‌న‌తో మెప్పిస్తాడు. ఈ క‌థ‌లో న‌య‌న‌తార పాత్ర రెండు మూడు స‌న్నివేశాల‌కే ప‌రిమిత‌మైంది. ఇందులో ఆమె పాత్ర లేకున్నా క‌థ‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ లేదు. ఆమె పాత్ర‌ను పెట్ట‌డం అన‌వ‌స‌రంగా సినిమాలో ఓ పాట‌ను కూడా ఇరికించాల్సి వ‌చ్చింది. (God Movie Review) సైకో కిల్ల‌ర్స్ పాత్ర‌లు చేసిన ఇద్దరు న‌టులూ తమ‌దైన న‌ట‌న‌తో క‌ట్టిప‌డేశారు. ఆశిష్ విద్యార్థి, న‌రైన్‌, వినోద్ కిష‌న్‌, విజ‌య‌ల‌క్ష్మీ త‌దిత‌రుల పాత్ర‌లు ప‌రిధి మేర‌కు ఉన్నాయి. ద‌ర్శ‌కుడు క‌థ‌ను ఆస‌క్తిక‌రంగా తీర్చిదిద్దుకోవ‌డంలో త‌డ‌బ‌డ్డాడు. సైకో కిల్ల‌ర్స్ బ్యాక్ స్టోరీస్‌ను చూపించ‌లేదు. అలాగే వాళ్లు అత్యంత పాశ‌వికంగా హ‌త్య‌లు చేయ‌డానికి వెన‌కున్న కార‌ణాన్ని వివ‌రించ‌లేదు. అయితే వారు హ‌త్య‌లు చేసే తీరును మాత్రం గ‌గుర్పాటుకు గురి చేసేలా చూపించారు. యువ‌న్ శంక‌ర్ రాజా నేప‌థ్య సంగీతం సినిమాకి బ‌లాన్నిచ్చింది. ఛాయాగ్ర‌హ‌ణం, నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

  • బ‌లాలు
  • - జ‌యం ర‌వి న‌ట‌న‌
  • -  విరామ స‌న్నివేశాలు
  • -  ద్వితీయార్ధంలోని మ‌లుపులు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ప్ర‌థమార్ధం
  • - ఆస‌క్తిరేకెత్తించ‌ని స్ర్కీన్‌ప్లే
  • చివ‌రిగా: ‘గాడ్‌’.. ద్వితీయార్ధంలో మెప్పిస్తాడు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని