Allu Arjun: ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్‌

నటుడు అల్లు అర్జున్‌ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Updated : 08 Apr 2024 14:12 IST

‘ఏ ఒక్క రాయి పర్వతాన్ని చేయలేదు... విజయం కూడా అలాంటిదే’.. అల్లు అర్జున్‌ తన కార్యాలయంలో స్వయంగా రాసుకున్న సూక్తి ఇది. ఆయన సినీ కెరీర్‌కు ఇది అద్దం పడుతుంది. తొలి సినిమా ‘గంగోత్రి’ తర్వాత లుక్స్‌, నటనపై ఎన్నో అభిప్రాయాలు. వాటిని పట్టించుకోకుండా ఆయన మాత్రం పర్వతమంత ఎత్తు ఎదగాలనుకున్నారు. అందుకు అనుగుణంగా ప్రతి చిత్రానికీ తనని తాను తీర్చిదిద్దుకున్నారు. ఒక్కో అడుగు వేస్తూ తెలుగు సినీ చరిత్రలోనే అరుదైన ఘనత సాధించారు. టాలీవుడ్‌లో ఇప్పటివరకూ ఏ హీరో కూడా అందుకోని జాతీయ ఉత్తమ నటుడి పురస్కారాన్ని పొందారు. దీంతో ఈ ఏడాది పుట్టినరోజు ఆయనకెంతో ప్రత్యేకంగా మారింది. ఈ సందర్భంగా బన్నీకి సంబంధించిన ఆసక్తికర విశేషాలు.

ప్రభాస్‌ ఫ్రెండ్‌గా వెళ్లి.. సూపర్‌ హిట్‌ కొట్టి..!

‘గంగోత్రి’తో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే హిట్‌ అందుకున్నారు అల్లు అర్జున్‌ (Allu Arjun). సరిగ్గా ఏడాది తర్వాత ‘ఆర్య’గా ప్రేక్షకులను పలకరించి స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు. సుకుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అవకాశం అంత సులభంగా రాలేదు. ‘గంగోత్రి’ తర్వాత దాదాపు 96 కథలు విన్నారు. అన్నీ రొటీన్‌గా అనిపించడంతో నో చెప్పేశారు. అలాంటి సమయంలో ప్రభాస్‌, అతడి స్నేహితుల కోసం నిర్మాత దిల్‌రాజు ‘దిల్‌’ స్పెషల్‌ షో వేశారు. దీనికి హాజరైన బన్నీ స్నేహితులపై జోకులు వేస్తూ సరదాగా కనిపించారు. అది చూసిన సుకుమార్‌ - దిల్‌రాజు.. తాము చేయబోయే ‘ఆర్య’లో కాలేజీ స్టూడెంట్‌గా ఆయనే సెట్ అవుతాడని భావించారు. అలా, మొదలైన ‘ఆర్య’ 2004 మే నెలలో విడుదలై సూపర్‌ హిట్‌ అయ్యింది. ఇందులో బన్ని లుక్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు.ఈ సినిమా చూసి ‘నా వారసుడు వచ్చేశాడు’ అని తన తాతయ్య అల్లు రామలింగయ్య అన్నారని బన్నీ గతంలో చెప్పారు. ఆ మాట తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు.

సమంత నుంచి నేర్చుకున్నా..!

అల్లు అర్జున్‌కు (Allu Arjun) సమంత మంచి స్నేహితురాలు. వీరిద్దరి కాంబోలో వచ్చిన చిత్రం ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’. త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. ఆమె గురించి ఓ సందర్భంలో బన్నీ మాట్లాడుతూ.. ‘‘సమంత నుంచి ఎన్నో  విషయాలు నేర్చుకున్నా. ఆమెలో ఒక గొప్ప లక్షణం ఉంది. అందంగా కనిపిస్తూనే మంచి అభినయం పండించగలదు. నా దగ్గర పనిచేసే వాళ్లను బాగా చూసుకుంటా. ఆమెను చూశాక.. మన దగ్గర పనిచేసే సిబ్బందిని తనంత బాగా చూసుకోవాలని నేర్చుకున్నా’’ అని చెప్పారు. అల్లు అర్జున్‌ కోసమే ‘పుష్ప’లో స్పెషల్‌ సాంగ్ (ఊ అంటావా మావ) చేశానని సమంత చెప్పిన విషయం తెలిసిందే.

డ్యాన్సులో తప్పులు..!

బెస్ట్‌ డ్యాన్స్‌ చేయగలిగిన నటుల్లో అల్లు అర్జున్‌ ఒకరు. అభిమానులు మాత్రమే కాదు సినీ ప్రముఖులు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు. దీనిపై ఓసారి మాట్లాడుతూ... ‘‘డ్యాన్సుల్లో నేనెవరికీ పోటీ కాను. నాకు నేనే పోటీ. నేను మంచి డ్యాన్సర్‌నని అందరూ అంటుంటారు. కానీ, నేను చేసిన వాటిల్లోనూ తప్పులు కనిపిస్తాయి. ఆ సంగతి ఎవరికీ తెలీదు. ఒక్కోసారి నాకే సంతృప్తి కలగదు’’ అంటారు

ఫ్యామిలీ మ్యాన్‌..!

‘‘మా నాన్నకు ముగ్గురు అబ్బాయిలు. మా అన్నయ్యకు స్వతంత్రంగా జీవించడం ఇష్టం. తమ్ముడు కూడా అంతే! ‘వాళ్లిద్దరూ వెళ్లిపోతే అమ్మానాన్నతో ఎవరు ఉంటారు?’ అనిపించింది. అందుకే వాళ్లతో కలిసి ఉండాలనిపించింది. ఇదే విషయాన్ని పెళ్లికి ముందే నా సతీమణి స్నేహకు చెప్పా. తను ఓకే అంది. పెళ్లైన నాటి నుంచి అమ్మవాళ్లతోనే కలిసి ఉంటున్నాం. జాతీయ అవార్డు వచ్చిందని తెలిశాక.. నా భార్య కన్నీళ్లు పెట్టుకుని తొలిసారి భావోద్వేగానికి గురైంది. తను సినీ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి కాదు. సినిమా చూసి బాగుందో, బాగోలేదో చెబుతుంది తప్ప అంత లోతుగా విశ్లేషించదు. ఏదైనా పురస్కారం వచ్చినట్టు తెలిస్తే ఆ సంతోషాన్ని నాతో పంచుకుంటుందంతే ’’ అని చెప్పి అభిమానులతో ఫ్యామిలీమ్యాన్‌ అనిపించుకున్నారు.

ఆసక్తి ఉంటే సినిమాల్లోకి..

‘‘మా పిల్లలు అయాన్‌, అర్హ బాగా అల్లరి చేస్తారు. షూట్స్‌ నుంచి ఏమాత్రం ఖాళీ దొరికినా వాళ్లతో టైమ్‌ స్పెండ్‌ చేస్తుంటా. అయాన్‌ సినిమాలు ఎక్కువగా చూస్తాడు. రామ్‌చరణ్‌ అంటే వాడికి చాలా ఇష్టం. మా పిల్లలను షూటింగ్‌లకు తీసుకువెళ్తుంటా. సినిమా వాతావరణం పిల్లలను చెడగొడుతుందని చెబుతుంటారు కొంత మంది. నేను మాత్రం ఏకీభవించను. ‘మా నాన్న ఏం చేస్తుంటాడ’నే విషయం పిల్లలకి తెలియాలి కదా. నాకు నేషనల్‌ అవార్డు రావడంపై అయాన్‌ ఎంతో సంతోషించాడు. వాడికి ఆసక్తి ఉంటే సినిమాల్లోకి తీసుకువస్తా’’ అంటూ తనలోని ఫాదర్‌ని పరిచయం చేశారు.

క్లిక్‌.. క్లిక్..!

‘‘నాకు ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. కొన్ని కెమెరాలు సేకరించా. ఖరీదైన లెన్సులూ ఉన్నాయి. మంచి కలెక్షన్‌ ఉంది. ఇంట్లో పిల్లల ఫొటోలు నేనే తీస్తుంటా. ఓ మంచి ఫొటో తీయడానికి కెమెరా, లైటింగ్‌ కంటే పరిజ్ఞానం ముఖ్యమని నా అభిప్రాయం. పియానో ప్లే చేయడం అంటే చాలా ఇష్టం. కొంతవరకూ నేర్చుకున్నా. జీవితంలో ఎదురైన పాఠాలను ఆధారంగా చేసుకుని ఖాళీ సమయంలో సూక్తులు కూడా రాస్తుంటా. నా కార్యాలయంలో గోడలపై రాసిన సందేశాలన్నీ నా ఆలోచనల నుంచి జాలువారినవే’’

తెలుగు భాషపై మక్కువ..!

‘‘మన భాష, సంస్కృతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మనదే. చెన్నైలో చదువుకోవడంతో తెలుగు పూర్తిగా నేర్చుకోలేకపోయా. మన భాషపై మనకు పట్టు లేకపోతే ఎలా? నా విషయంలో జరిగిన తప్పు నా పిల్లల విషయంలో జరగకూడదు. అందుకే ఇంట్లో అమ్మా నాన్న అంటూ తెలుగులో మాట్లాడాలని చెబుతుంటా. వాళ్లకి తెలుగులో చదువు చెప్పిస్తున్నాం’’

ఆశ్చర్యపోయా..!

‘‘ఉత్తమ జాతీయ నటుడిగా తొలి పురస్కారం సాధించానని తెలిసినప్పుడు ఎంత ఆనందం కలిగిందో, అంతే షాక్‌కు గురయ్యా. తెలుగు ఇండస్ట్రీలో ఇదివరకు వచ్చిందేమో.. నేను మూడోవాణ్నో, నాలుగోవాణ్నో అనుకున్నా. కానీ టీవీలో ఈ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిశాక ఆశ్చర్యపోయా. నేనేదో మిగతా వాళ్లకంటే గొప్ప అని కాదు. గొప్ప గొప్ప నటులున్నా ఎందుకో కుదరలేదు’’ అని ఇటీవల ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో ఆయన ఈ విషయాలు పంచుకున్నారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని