Nikhil Spy Movie Review: రివ్యూ: స్పై.. నిఖిల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..?

నిఖిల్‌ (Nikhil) నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘స్పై’ (SPY Movie) సినిమా ఎలా ఉందంటే..?

Updated : 29 Jun 2023 13:35 IST

Nikhil Spy Movie Review: చిత్రం: స్పై; నటీనటులు: నిఖిల్‌, ఐశ్వర్య మేనన్‌, మకరంద్‌ దేశ్‌ పాండే, జీసు సేన్‌గుప్తా, అభినవ్‌, ఆర్యన్‌ రాజేశ్‌, నితిన్‌ మెహ్తా, రానా (అతిథి పాత్రలో..), తదితరులు; కథ: కె.రాజశేఖర్‌ రెడ్డి; సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు, మార్క్‌ డేవిడ్‌; సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, విశాల్‌ చంద్రశేఖర్; నిర్మాణ సంస్థ: ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌; నిర్మాత: కె.రాజశేఖర్‌ రెడ్డి; దర్శకత్వం: గ్యారీ బీహెచ్‌; విడుదల తేదీ: 29-06-2023

నిఖిల్ (Nikhil) చేసిన ‘కార్తికేయ‌2’ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. ఆ ఇమేజ్‌కి త‌గ్గ‌ట్టుగానే ఆయ‌న త‌దుప‌రి సినిమాల ప్ర‌యాణం కొన‌సాగుతోంది. అందులో భాగంగానే ఆ స్థాయి ఉన్న క‌థ‌ని ఎంచుకుని ‘స్పై’ (SPY Movie Review) చేశారు. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ అదృశ్యం వెనుక ర‌హ‌స్యాన్ని స్పృశిస్తూ.. ఓ గూఢ‌చారి క‌థ‌తో రూపొందిన చిత్ర‌మిది. పాన్ ఇండియా స్థాయిలోనే విడుద‌లైన ఈ చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

కథేంటంటే: జైవ‌ర్ధ‌న్ (నిఖిల్) (Nikhil) రా ఏజెంట్‌. శ్రీలంక‌లో ప‌నిచేస్తుంటాడు. భార‌తదేశంపై దాడి ప్ర‌య‌త్నాల్లో ఉన్న ఉగ్ర‌వాది ఖదీర్ ఖాన్ చ‌నిపోయాడ‌ని భావిస్తారంతా. కానీ అత‌డి నుంచి న‌ష్టం మాత్రం కొన‌సాగుతూనే ఉంటుంది. చ‌నిపోయాడ‌నుకున్న ఖ‌దీర్ కోసం ప్ర‌త్యేక‌మైన మిష‌న్‌తో జై రంగంలోకి దిగుతాడు. మ‌రి ఖ‌దీర్ దొరికాడా? లేక అంద‌రూ ఊహించిన‌ట్టుగానే చ‌నిపోయాడా? ఈ ప్ర‌య‌త్నంలో ఉన్న జై త‌న అన్న సుభాష్ (ఆర్య‌న్ రాజేశ్‌)ని చంపిన‌వాళ్ల‌ని ఎలా క‌నుక్కున్నాడు? ఈ మిష‌న్‌కి ఆజాద్ హింద్ ఫౌజ్ ద‌ళ‌ప‌తి నేతాజీ అదృశ్యం వెనకున్న ర‌హ‌స్యానికీ సంబంధం ఏమిటనేది మిగ‌తా క‌థ‌.

ఎలా ఉందంటే: అత్యంత ర‌హ‌స్యమైన క‌థ‌తో రూపొందిన చిత్రంగా ‘స్పై’ (SPY Movie Review) ప్ర‌చార‌మైంది. నేతాజీ అంశం కూడా సినిమాపై ఆస‌క్తిని పెంచింది. కానీ సినిమా మాత్రం ఏ దశ‌లోనూ ఆ స్థాయిని అందుకోలేక‌పోయింది. అంత‌ర్జాతీయ స్థాయి, దేశ‌భ‌క్తితో ముడిప‌డిన ఇలాంటి గూఢ‌చారి క‌థ‌ల‌కి క‌థ‌నం, ఉత్కంఠ రేకెత్తించే థ్రిల్లింగ్ అంశాలు, భావోద్వేగాలు బ‌లంగా ఉండాల్సిందే. అవి లేక‌పోతే క‌థ ఎన్ని దేశాలు చుట్టొచ్చినా వృథానే. ఆ విషయాన్ని ఈ సినిమా మ‌రోమారు రుజువు చేస్తుంది. దేశానికి ముప్పుగా మారిన క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాది, అత‌డిని మ‌ట్టుబెట్టేందుకు ఓ మిష‌న్‌, అందులో హీరో.. ఇలా చాలా సినిమాల్లో చూసినట్టే ఓ ఫార్ములాతో ప్ర‌థ‌మార్ధం సన్నివేశాలు సాగిపోతాయి త‌ప్ప ఏ ద‌శ‌లోనూ ప్ర‌త్యేకమైన ఆస‌క్తి రేకెత్తించ‌వు. ద్వితీయార్ధంలో ఏమైనా మేజిక్ చేశారేమో అని ఆశిస్తే అక్క‌డా నిరాశే. నేతాజీ సుభాష్ చంద్ర‌బోస్ ఫైల్ చుట్టూ సాగే కొన్ని స‌న్నివేశాలు, ఆయ‌న పోరాట స్ఫూర్తి నేప‌థ్యం మినహా ఎక్క‌డా సినిమా ఆస‌క్తిని రేకెత్తించ‌లేక‌పోయింది. ద్వితీయార్ధంలో కొత్త ప్ర‌తినాయ‌కుడు, రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం, బోలెడ‌న్ని పోరాట ఘ‌ట్టాలు.. ఇలా చాలా హంగామా తెర‌పై క‌నిపిస్తుంటుంది కానీ, ఎక్క‌డా ప్రేక్ష‌కుడిని క‌ట్టిప‌డేసే స‌న్నివేశాలు ఉండ‌వు. ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వంలోనే లోపాలు క‌నిపిస్తాయి. క‌థానాయ‌కుడి సోద‌రుడి మ‌ర‌ణం వెన‌క ర‌హ‌స్యం, నేతాజీ ఫైల్.. ఇలా క‌థ‌లో ప‌లు పార్శ్వాలున్నా వాటిని స‌మ‌ర్థ‌ంగా న‌డిపించి ప్రేక్ష‌కులకి థ్రిల్‌ని పంచ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌లమ‌య్యాడు. దాంతో ఓ సాదాసీదా ప్ర‌య‌త్నంలా అనిపిస్తుందీ చిత్రం. (SPY Movie Review)

ఎవ‌రెలా చేశారంటే: నిఖిల్‌ని ఈ సినిమా కొత్త‌గా చూపించిందేమీ లేదు. ఆయ‌న వేషం, హావ‌భావాల్లోనూ చెప్పుకోద‌గ్గ మార్పులేమీ క‌నిపించ‌వు. పోరాట ఘ‌ట్టాల కోసమైతే ఆయ‌న బాగా శ్ర‌మించారు. అభిన‌వ్ గోమ‌టం త‌న సంభాష‌ణ‌ల‌తో అక్క‌డ‌క్క‌డా న‌వ్వించాడు. క‌థానాయిక‌లు ఐశ్వ‌ర్య మేన‌న్‌, సానియా అందంతోనూ, అభిన‌యంతోనూ ఆక‌ట్టుకున్నారు. ఆర్య‌న్ రాజేశ్, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ‌ముర‌ళి, స‌చిన్ ఖేడేక‌ర్ త‌దిత‌ర న‌టులు సినిమాలో క‌నిపించినా.. ఆ పాత్ర‌లు ఏ ర‌కంగానూ ప్ర‌భావం చూపించ‌వు. రా అధికారిగా మ‌క‌రంద్ దేశ్‌పాండే న‌ట‌న‌లో స‌హ‌జ‌త్వం క‌నిపించ‌దు. నితిన్ మెహ‌తా, జిష్షూసేన్ గుప్తా ప్ర‌తినాయ‌క పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. ఆ పాత్ర‌ల్లో బ‌లం లేదు. రానా అతిథి పాత్రలో తళుక్కున మెరిశారు. సాంకేతిక విభాగాల్లో కెమెరా, సంగీతం ప్ర‌భావం చూపించాయి. ద‌ర్శ‌కుడిగా గ్యారీ ప‌నిత‌నం అంతంత మాత్ర‌మే అయినా ఎడిట‌ర్‌గా ఈ సినిమాని ప‌క్కా కొల‌త‌ల‌తో మ‌లిచారు. ర‌చ‌న పేల‌వం.

  • బ‌లాలు
  • నేతాజీ నేప‌థ్యంలో స‌న్నివేశాలు
  • + కొన్ని యాక్ష‌న్ ఘ‌ట్టాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌నం
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌రిగా: అంచనాలు అందుకోలేని...‘స్పై’ (SPY Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే..!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని