Pragathi: ఆర్థిక కష్టాలు.. కన్నీళ్లు.. నటి ప్రగతి ఇంత ‘స్ట్రాంగ్‌’గా ఉండటానికి కారణాలివే..!

ఇటీవల జరిగిన నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిలో కాంస్యాన్ని గెలుచుకున్నారు నటి ప్రగతి. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

Published : 29 Nov 2023 16:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: Pragstrong.. నటి ప్రగతి (Pragathi) ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా ఐడీ ఇది. పేరుకు తగ్గట్టే ఆమె ఎంతో స్ట్రాంగ్‌. అందుకు నిదర్శనమే జీవితంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలు.. కన్నీళ్లు.. ఎదురైన ప్రతి సవాల్‌ను ధైర్యంగా దాటుకుంటూ ఆమె ముందుకు అడుగువేశారు. ట్రెండ్‌కు తగ్గట్టు తనని తాను మార్చుకుంటూ కెరీర్‌లో కొనసాగుతున్నారు. మరోవైపు ఫిట్‌నెస్‌పై దృష్టి సారించి.. అందర్నీ అబ్బుర పరుస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల జరిగిన నేషనల్‌ పవర్‌ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యంతో రాణించారామె. ఈ నేపథ్యంలోనే తన జీవితం గురించి గతంలో ఆమె పంచుకున్న పలు విశేషాలు..

చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులు:

‘‘మాది హైదరాబాద్‌. పదో తరగతి వరకూ ఇక్కడే ఉన్నాం. ఆ తర్వాత చెన్నైకు షిఫ్ట్‌ అయ్యాం. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయాను. దాంతో అమ్మా నేనూ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఆర్థికంగా అమ్మకు సాయం చేయడం కోసం కాలేజీ రోజుల్లో కొంతకాలంపాటు కార్టూన్‌ పాత్రలకు డబ్బింగ్ చెప్పా. చెన్నైలోని ‘మైసూర్‌ స్కిల్‌ ప్యాలెస్‌’ షోరూమ్‌ కోసం మోడల్‌గానూ వర్క్‌ చేశా.

ఆయన మాటలకు షాకయ్యా:

మోడల్‌గా వర్క్‌ చేసిన రోజుల్లో తెలిసిన వారి ద్వారా నా ఫొటోలు ప్రముఖ దర్శకుడు భాగ్యరాజా వద్దకు వెళ్లాయి. ఆడిషన్స్‌ అనంతరం ఆయన తన సినిమాలోకి నన్ను సెలెక్ట్‌ చేశారు. సహాయ నటి పాత్ర కోసం నన్ను ఎంచుకున్నారనుకుని ఓకే చెప్పా. తీరా చూస్తే.. ఆ సినిమాలో హీరోయిన్‌గా నన్ను తీసుకున్నట్లు చెప్పారు. ఆయన మాటకు షాకయ్యా. మా అమ్మ ధైర్యం చెప్పడంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేశా. అలా, భాగ్యరాజా తెరకెక్కించిన ‘వీట్టులే విశేషం’ నా తొలి చిత్రం. అదే చిత్రం ‘గౌరమ్మా నీ మొగుడెవరమ్మా’ అనే పేరుతో తెలుగులో విడుదలైంది. హీరోయిన్‌గా నేను దాదాపు ఎనిమిది చిత్రాల్లో నటించా.

సినిమాలు వద్దనుకున్నా:

హీరోయిన్‌గా రాణిస్తోన్న రోజుల్లోనే నాకొక ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. నేను హీరోయిన్‌గా నటించిన ఓ చిత్రానికి హీరోగా వర్క్‌ చేసిన వ్యక్తే నిర్మాతగానూ వ్యవహరించాడు. సినిమాలోని వాన పాట కాస్ట్యూమ్‌ విషయంలో ఆ టీమ్‌తో నాకు గొడవ జరిగింది. కోపంతో నేను సెట్‌ నుంచి వెళ్లిపోయా. చివరకు రాజీ పడి పెండింగ్‌ షూట్‌ పూర్తి చేశా. ఆ సమయంలో సెట్‌లో వాళ్ల చూపులు నన్నెంతో బాధించాయి. ఇకపై సినిమాలు చేయకూడదని అప్పుడు డిసైడ్‌ అయ్యా.

విడాకులు..!

20 ఏళ్ల వయసులోనే నేను వైవాహిక బంధంలోకి అడుగుపెట్టా. వెంటనే బాబుకు జన్మనిచ్చా. సింగిల్‌ పేరెంట్‌గా ఉంటే వచ్చే కష్టాలు ఎలా ఉంటాయో అమ్మ వల్ల తెలుసుకున్నా. దాంతో ఇబ్బందులు వచ్చిన ప్రతిసారీ సర్దుకుపోవడం అలవాటు చేసుకున్నా. కాకపోతే కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకోవాల్సి వచ్చింది.

ఆ క్షణం బాధపడ్డా..!

వివాహం తర్వాత నాకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి. దాంతో సీరియల్స్‌లోకి అడుగుపెట్టా. తమిళంలో పలు ధారావాహికల్లో నటించా. నా యాక్టింగ్‌ నచ్చడంతో సినిమాల్లో మళ్లీ అవకాశాలు వచ్చాయి. అలా, ‘నువ్వు లేక నేను లేను’లో హీరోయిన్‌ తల్లిగా నటించా. అప్పుడు నా వయసు 24 ఏళ్లు. ఆరోజు జడతో సెట్‌లోకి అడుగుపెడితే ముడి వేసుకోమని చెప్పారు. మేకప్‌ రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేశా. తల్లి పాత్రలు పోషిస్తున్నందుకు ఆ తర్వాత ఎప్పుడూ బాధపడలేదు.

టాటూకి కారణమదే..!

నా చేతిపై ఉండే టాటూకు ప్రత్యేక కారణం అంటూ ఏమీ లేదు. చిన్నతనంలో వేయించిన ఓ వ్యాక్సిన్‌ సెప్టిక్‌ అయ్యి.. చేయిపై మచ్చపడింది. అది కనిపించకుండా ఉండేందుకు టాటూ వేయించా.

ఫిట్‌నెస్‌..!

నేను భోజన ప్రియురాలిని. నచ్చిన ఆహారాన్ని తినేస్తా. అలాగే, ఫిట్‌నెస్‌ విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తుంటా. ప్రస్తుతం ఉన్న రోజుల్లో హీరోహీరోయిన్స్‌ అందరూ ఫిట్‌గా ఉండేందుకు ఇష్టపడుతున్నారు. వాళ్లకు తల్లి పాత్రల్లో నటించినప్పుడు మనం కూడా ఫిట్‌గా కనిపించాలనేది నా ఉద్దేశం. అందుకే క్రమం తప్పకుండా జిమ్‌, వర్కౌట్లు చేస్తుంటా. అలాగే, నేనొక క్లాసికల్‌ డ్యాన్సర్‌ని. చిన్నప్పుడే క్లాసికల్‌ డ్యాన్స్‌లో శిక్షణ తీసుకున్నా. వెండితెరపై తల్లి పాత్రల్లో నటించినప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం నాకు నచ్చిన విధంగా ఉంటాను. డ్యాన్సులు.. వర్కౌట్లు.. ఇష్టాయిష్టాలను తెలియజేస్తూ వీలున్న సమయంలో ఇన్‌స్టాలో పోస్టులు కూడా పెడుతుంటా’’ అని ఆమె చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు