Jeethu Joseph: 17 సినిమాలు.. మూడే ఫ్లాప్‌లు.. చైనీస్‌, ఇండోనేషియా, కొరియాలోనూ రీమేక్‌ అయిన మొదటి భారతీయ సినిమా ఆయనదే!

Jeethu Joseph: మోహన్‌లాల్‌ కథానాయకుడిగా జీతూ జోసెఫ్‌ తెరకెక్కించిన ‘నెరు’ ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో జీతూ గురించి ఆసక్తికర విషయాలు..

Updated : 30 Jan 2024 17:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రతి దర్శకుడికి ఓ శైలి ఉంటుంది. ఒకరు మాస్‌ కమర్షియల్‌ సినిమాలను బాగా తీయగలిగితే, మరొకరు హాస్య ప్రధానమైనవి, ఫ్యామిలీ ఆడియెన్స్‌ మెప్పించేలా తీర్చిదిద్దగలరు. కానీ, ప్రేక్షకుడిని కుర్చీలో కూర్చొబెట్టగలిగేలా తీయడమే జీతూ జోసెఫ్‌ (Jeethu Joseph) స్టైల్‌. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన కోర్టు రూమ్‌ డ్రామా ‘నెరు’ ఓటీటీలో ప్రేక్షకులను మెప్పిస్తోంది. డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న  ఇలాంటి చిత్రాలు ప్రస్తుతం సమాజానికి ఎంతో అవసరం అంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

అలా సినిమాలపై ఆసక్తి..

జీతూ జోసెఫ్‌ది కేరళలో ఎర్నాకుళం జిల్లాలోని ఎలంజి అనే చిన్న గ్రామం. తండ్రి వి.వి.జోసెఫ్‌ ఎమ్మెల్యేగా సేవలందించారు. జీతూ ఇంటర్‌ చదువుతుండగా, పెదనాన్న పిల్లలతో కలిసి సినిమాలకు వెళ్లడం అలవాటైంది. వాళ్లు ఊరికే సినిమా చూడటం కాదు, ‘ఆ టేక్‌ చూశావా... ఎలా తీశాడో! అబ్బబ్బా ఏం యాంగిల్‌రా అది!’ అంటూ విశ్లేషిస్తుండేవారు.  అవేవీ జీతూకి అర్థమయ్యేవి కావు.  వాళ్లు ఈ సంగతులన్నీ చెబుతున్నకొద్దీ ‘ఇందులో ఇంతుందా!’ అని ఆశ్చర్యపోతుండేవాడు.  అప్పటి నుంచి సినిమాలు చూడటమే కాదు... పుస్తకాలుగా వస్తే వాటి స్క్రీన్‌ ప్లేలూ చదవటమూ మొదలు పెట్టాడు.  ఇంటర్‌ ముగిసేనాటికి సినిమా పిచ్చి బాగా ముదిరిపోయింది. ‘నాన్న.. నేను సినిమాల్లోకి వెళతా’ అని చెబితే ఆయన విస్తుపోయారు. ‘నిన్ను ఇంజినీర్‌ని చేయాలన్నది నా కల. అది నెరవేర్చకున్నా ఫర్వాలేదు కానీ కనీసం ఏదో ఒక డిగ్రీ అయినా చెయ్యి. ఆ తర్వాత నీ ఇష్టం!’ అనడంతో  సినిమాలు బాగా చూడొచ్చని డిగ్రీలో ఆర్ట్స్‌ గ్రూపులో చేరాడు. పుణె ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో అడ్మిషన్‌ ఎంట్రన్స్‌కి సిద్ధమవ్వగా,  కామెర్లు రావడంతో ఆగిపోయాడు.

ప్రేమించిన అమ్మాయి కోసం ప్రాణమైన సినిమా వదులుకుని..

ఒక రోజు చర్చిలో ప్రార్థనలకు వెళ్లిన జీతూ జోసెఫ్‌ అక్కడే లిండాను చూశాడు. ఆమె అందం మనసులో చెరగని ముద్రవేసింది. మరుసటి రోజు ఆ  అమ్మాయి కాలేజ్‌ ఏంటో తెలుసుకుని, ఆమె దగ్గరకు వెళ్లాడు. ‘నిన్న మిమ్మల్ని చర్చ్‌లో చూశాను!’ అంటూ ఏదో చెప్పబోయాడు. ‘అవును... నేనూ చూశా నీ వాలకాన్ని!’ విసురుగా అంది ఆ అమ్మాయి. ‘మిమ్మల్ని చూడగానే ప్రేమలో పడిపోయాను!’ అన్నాడు. ‘అదొట్టి ఆకర్షణ... ప్రేమ కాదు!’ అంది. ‘కాదండీ... నాది ప్రేమే. నా లవ్‌ ప్రపోజల్‌కి సాక్షిగా మా అమ్మానాన్న, అక్కయ్యల్నీ పిలుచు కొచ్చాను చూడండి!’ అంటూ వాళ్లవైపు చూపించాడు. వాళ్లని చూశాక ఆ అమ్మాయికి మతిపోయింది ‘ఓ ఫ్యామిలీలో ఇలా కూడా ఉంటారా!’ అని నవ్వేసింది.‘నా డిగ్రీ పూర్తికానివ్వండి... తర్వాత ఆలోచిద్దాం!’ అంటూ వెళ్లిపోయింది.  ఆ తర్వాత కొన్ని రోజులకు ‘పెళ్ళి నాకిష్టమే కానీ... జీవితంలో నువ్వేం చేయాలనుకుంటున్నావ్‌!’ అని అడిగింది. ‘సినిమా డైరెక్టర్‌ని అవుదామనుకుంటున్నా!’ అని చెప్పాడు. ఆ అమ్మాయి జీతూ వైపు సాలోచనగా చూస్తూ ‘ఆ మాట చెబితే మావాళ్లు పెళ్లికి ఒప్పుకోకపోవచ్చు. ఆలోచించుకో!’ అంది. ‘నాకు నీ ఇష్టం ఏమిటన్నదే ముఖ్యం..!’ అన్నాడు జీతూ. ‘మావాళ్ల ఇష్టమే నాది కూడా. సినిమానా... నాతో పెళ్లా... ఏదో ఒకటి తేల్చుకో!’ అంది. గుండెని ఎవరో రంపంతో కోస్తున్నంత బాధతో ‘నాకు నువ్వే కావాలి... లిండా!’ అని జీతూ చెప్పడంతో పెళ్లి అయింది. ఇచ్చిన మాటకు కట్టుబడి సినిమాలకు  జీతూ దూరంగా ఉండిపోయాడు. ఫ్యామిలీ వ్యాపారాలను చూసుకుంటూ ఉన్నా, సరదాగా సినిమాకు వెళ్లినప్పుడు ఆయన కళ్లలో కనిపించే బాధను లిండా గమనించింది. సినిమాల్లోకి వెళ్లమని ప్రోత్సహించడంతో దర్శకుడు జయరాజ్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేరాడు.

అండగా నిలబడ్డ కుటుంబం..

మూడేళ్ల తర్వాత కథ రాసుకుని దిలీప్‌ హీరోగా సినిమా చేద్దామని నిర్మాతను కలిస్తే, చివరి నిమిషంలో అవకాశం చేజారిపోయింది. అప్పుడే ‘డిటెక్టివ్‌’ కథతో సురేశ్‌గోపిని కలిశారు. ఆయన ఓకే చెప్పినా నిర్మాతలు దొరక్క ఇబ్బంది పడ్డారు. అయితే, జీతూ వాళ్ల అమ్మ అతడి దగ్గరకు వచ్చి, ‘ మనకున్న ఆస్తి మొత్తం అమ్మేద్దాం... నువ్వు కోరుకున్న సినిమా తీద్దాం. కానివ్వండి!’ అనడంతో ‘డిటెక్టివ్‌’ పట్టాలెక్కింది. మహిత్‌ అనే మరో ప్రొడ్యూసర్‌ సహాయంతో సినిమాను పూర్తి చేయడమే కాదు, బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయాన్ని నమోదు చేశారు.

నాన్న స్ఫూర్తితోనే సామాన్యుడి పాత్ర..

కేరళలో జరిగిన ఓ హత్య కేసు దృశ్యం సినిమాకి ప్రేరణ. కాకపోతే ఆ నిజం కేసులో- ఆ వ్యక్తి పోలీసులకి దొరికిపోయాడు. అలా దొరక్కుండా తన కుటుంబం కోసం అతను చివరికంటా పోరాడితే ఎలా ఉంటుందన్నదే దృశ్యం కథ! ఇందులో మోహన్‌లాల్‌ (తెలుగులో వెంకటేశ్‌) పాత్రను తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకుని తీర్చిదిద్దారు. జోసెఫ్‌ నాన్న ఎమ్మెల్యే అయినా సరే బస్సుల్లోనే ప్రయాణించేవారు. ఏడాదికో రెండేళ్లకో తప్ప దుస్తులూ తీసుకొనే వారు కాదు.  కరెంటూ, నీళ్లూ క్షణం వృథా అయినా సహించేవారు కాదు. ఇదంతా ‘దృశ్యం’ కథలో భాగం చేశాడు. దానికి మధ్యతరగతి కుటుంబాల్లోని భయాలనీ, తమవాళ్ల కోసం ఎంతకైనా పోరాడే తెగువనీ కలిపారు. ఈ అంశాలే దృశ్యం సినిమాలని మామూలు థ్రిల్లర్‌ల కంటే భిన్నంగా నిలిపాయి.  తెలుగు, తమిళం, హిందీలోనే కాదు సింహళంలో తీసినా పెద్ద హిట్‌ అయింది. చైనీస్‌ మాండరిన్‌ భాషలో రీమేక్ అయిన మొదటి భారతీయ చిత్రంగానూ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇండోనేషియా, కొరియన్‌ భాషల్లోనూ ‘దృశ్యం’ రీమేక్‌ చేస్తున్నారు.

17 సినిమాలు చేస్తే, మూడే ఫ్లాప్‌లు..

‘డిటెక్టివ్’తో కెరీర్‌ను మొదలు పెట్టిన జీతూజోసెఫ్‌ విభిన్న జానర్లలో సినిమాలు చేశారు. ఇప్పటివరకూ 17 సినిమాలు చేస్తే, వాటిలో మూడే ఫ్లాప్‌ (లైఫ్‌ ఆఫ్ జోసుట్టీ, మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ రౌడీ, ది బాడీ) మిగిలినవన్నీ హిట్‌లే. దృశ్యం ఆల్‌ టైమ్‌ హిట్‌. ఇటీవల వచ్చిన ‘నెరు’ కూడా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌. కేవలం రూ.12కోట్లతో సినిమా చేస్తే, రూ.85కోట్లు వసూలు చేసింది. దీనికి ఓటీటీ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ అదనం. అంటే దాదాపు రూ.100కోట్లు రాబట్టినట్లే.  ప్రస్తుతం మోహన్‌లాల్‌ కథానాయకుడిగా ‘రామ్‌’ అనే యాక్షన్ థ్రిల్లర్‌ చేస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రానుంది. మొదటి భాగాన్ని ఈ ఏడాదిలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మోహన్‌లాల్‌ ‘రా’ఆఫీసర్‌గా కనిపించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని