Ram Charan: రామ్‌ చరణ్‌ బర్త్‌డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?

టాలీవుడ్‌ ప్రముఖ హీరో రామ్‌ చరణ్‌ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు..

Updated : 27 Mar 2024 10:07 IST

చిరుతనయుడిగా తెరంగేట్రం చేసినా తనకంటూ సెపరేట్‌ రూట్‌ వేసుకుని దూసుకెళ్తున్నారు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీ హిట్‌ కొట్టారు. అంతటి స్టార్‌డమ్‌తోనూ వినికిడి లోపం ఉన్న వ్యక్తిగా ‘రంగస్థలా’న్ని రక్తికట్టించారు. ఆ ధృవతార ఇంకెవరు? రామ్‌ చరణ్‌ (Ram Charan). నేడు ఆయన పుట్టిన రోజు (39) (Happy BirthDay Ram Charan) సందర్భంగా కొన్ని ఆసక్తికర విశేషాలు..

అలా మంచి డ్యాన్సర్‌గా..

చరణ్‌కు చిన్నప్పుడు చాలా సిగ్గు. ఇంట్లో నిర్వహించే వేడుకల్లో తన బావ అల్లు అర్జున్‌, శిరీశ్‌ ఎంచక్కా స్టెప్పులేస్తుంటే చెర్రీ చూస్తుండేవారట. తప్పదూ అనుకున్నారో.. తనలోని డ్యాన్సర్‌ని చూపించాలనుకున్నారోగానీ ఒకే ఒకసారి కాలు కదిపారు. సంబంధిత వీడియోనే సోషల్‌ మీడియాలో ఇటీవల వైరల్‌ అయింది. మరి, చిన్నప్పుడు డ్యాన్స్‌కు దూరంగా ఉండేవాడు ఇప్పుడు ఇంతలా ఎలా ఆకట్టుకోగలుతున్నారనే సందేహం కలగడం సహజం. ఆయన నటనలో మాత్రమే శిక్షణ తీసుకున్నారు. తన నుంచి తండ్రి ఏం ఆశిస్తున్నారో గ్రహించిన చరణ్‌ శిక్షణ అవసరం లేకుండా డ్యాన్స్‌పై పట్టు సాధించడం విశేషం.

అది.. పది తర్వాతే!

‘చిరంజీవి నటించిన ఎన్నో సినిమాల చిత్రీకరణలకు రామ్‌ చరణ్‌ వెళ్లి ఉంటాడు. చిన్నప్పటి నుంచీ ఆయనకు నటనపై ఆసక్తి ఉంది’ అని అనుకుంటే పొరపడినట్టే. ‘రాజా విక్రమార్క’, ‘లంకేశ్వరుడు’, ‘ఆపద్భాంధవుడు’ సెట్స్‌కు మాత్రమే ఈ హీరో వెళ్లారు. చిన్నప్పుడు సినిమా ధ్యాసే ఉండేది కాదట. అంతెందుకు తాను చదువుకునే రోజుల్లో.. ఇంట్లో సినిమా పోస్టర్లు ఉండేవి కాదు. సినీ పత్రికలు, అవార్డులను ఆఫీసుకే పరిమితం చేసేవారు చిరంజీవి. ఓ సారి (8వ తరగతి చదివేటప్పుడు) సినీ మ్యాగజైన్‌ చదవాలనే కుతూహలంతో దాన్ని ఓపెన్‌ చేయగా.. చిరంజీవి హఠాత్తుగా రావడంతో భయంతో చరణ్‌ వణికిపోయారు. ఆ రోజు ఇంట్లో పెద్ద చర్చే జరిగింది. పదో తరగతి పూర్తయ్యాకే.. కొడుక్కి కొంచెం ‘సినీ ఫ్రీడమ్‌’ ఇచ్చారు చిరు.

పెట్స్‌.. గిఫ్ట్స్‌

చదువు విషయానికొస్తే.. ఈయన యావరేజ్‌ స్టూడెంట్‌. ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవారు కాదు. అలా 8 స్కూల్స్‌, 3 కాలేజీలు మారారు. ఆటలంటే బాగా ఇష్టం. నాలుగో తరగతి చదివే సమయంలోనే గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. హార్స్‌ రైడింగ్‌లో ఆయనకు ఎంత ప్రావీణ్యం ఉందో ‘మగధీర’లోని సన్నివేశాలే తెలియజేస్తాయి. సినీ పత్రికల విషయంలో చిరు ఎంత స్ట్రిక్ట్‌గా ఉండేవారో బైక్‌ విషయంలోనూ అంతే. అందుకే బైక్‌ రైడింగ్‌ కూడా భయయే అంటుంటారు. పెంపుడు జంతువులను ఇష్టపడే ఆయన.. బంధువుల, స్నేహితుల పుట్టిన రోజు, పెళ్లి రోజులకు వాటినే కానుకగా ఇస్తుంటారు.

అందుకే దీక్ష..

ఈ యాక్టర్‌ తరచూ ఏదో ఒక మాలధారణలో కనిపిస్తుంటారనే సంగతి తెలిసిందే. ప్రశాంతత లభిస్తుందని, క్రమశిక్షణ అలవడుతుందనే ఉద్దేశంతోనే దీక్ష చేపడుతుంటానని ఓ సందర్భంలో తెలిపారు. అపోలో సంస్థల ఉపాధ్యక్షురాలు ఉపాసన (Upasana)తో 2012లో చరణ్‌ వివాహమైంది. వీరి పాప పేరు క్లీంకార. సేవా కార్యక్రమాల్లోనూ ఈ నటుడు ముందుంటారు. 

మరిచిపోలేని క్షణాలు..

‘‘నాన్న నా సినిమాలు చూశాక డ్యాన్స్‌ బాగుందనో, ఫైట్లు బాగా చేశాననో చెబుతుంటారు. కథకు, పాత్రకు తగిన న్యాయం చేశావంటూ ‘ధృవ’ విషయంలో మెచ్చుకున్నారు. ‘రంగస్థలం’ సినిమా చూస్తూ అమ్మ భావోద్వేగానికి గురైంది. సినిమా పూర్తయ్యాక భారమైన హృదయంతో నన్ను పక్కన కూర్చోమని అడిగింది. ఈ రెండూ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేని క్షణాలు’’ అని చరణ్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

సినీ అప్‌డేట్స్‌..

‘చిరుత’, ‘మగధీర’, ‘ఆరెంజ్‌’, ‘రచ్చ’, ‘గోవిందుడు అందరివాడేలే’, ‘ధృవ’, ‘రంగస్థలం’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.. ఇలా 14 విభిన్న కథా చిత్రాలతో అలరించిన చరణ్‌ ప్రస్తుతం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer)తో బిజీగా ఉన్నారు. ప్రముఖ దర్శకుడు శంకర్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. ‘ఉప్పెన’ ఫేమ్‌ బుచ్చిబాబు డైరెక్షన్‌లో ఓ చిత్రం (#RC16), సుకుమార్‌ దర్శకత్వంలో మరో చిత్రంలో (#RC17) నటించనున్నారు. నిర్మాతగానూ టాలీవుడ్‌లో తనదైన ముద్ర (సైరా, గాడ్‌ ఫాదర్‌ తదితర చిత్రాలు) వేశారు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని