Sini Shetty: మిస్‌ వరల్డ్‌ పోటీలు.. ‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌’ విజేతగా సినిశెట్టి

మిస్‌ వరల్డ్‌ 2024 పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. 

Updated : 07 Mar 2024 17:52 IST

మిస్‌ వరల్డ్‌ 2024 (Miss World 2024 Competitions) విన్నర్‌ ఎవరో మరికొన్ని గంటల్లో తేలనుంది. 28 ఏళ్ల తర్వాత భారత్‌ వేదికగా జరుగుతున్న పోటీలు కావడం, మిస్‌ ఇండియా వరల్డ్‌- 2022 విజేత సినిశెట్టి (Sini Shetty) పాల్గొనడంతో అంతటా ఆసక్తి నెలకొంది. మరి, ఇప్పటి వరకు సినిశెట్టి ప్రయాణం ఎలా సాగింది? ఏయే అవార్డులు దక్కించుకుంది?ఆమె నేపథ్యమేంటి? తెలుసుకుందాం (Miss World 2024)..

 • ఈ అందాల భామ తల్లిదండ్రులది మంగళూరు (కర్ణాటక). ముంబయిలో పుట్టి, పెరిగింది.
 • అకౌంటింగ్‌& ఫైనాన్స్‌లో డిగ్రీ పట్టా పొందిన శెట్టి ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా కార్పొరేట్‌ సంస్థల్లో పనిచేసింది. ఆమెకు డ్యాన్స్‌ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. నాలుగేళ్ల వయసులోనే భరతనాట్యంలో శిక్షణ తీసుకుంది. 14 ఏళ్ల వయసులో నృత్యకారిణిగా అరంగేట్రం చేసింది.

 • ఫ్యాషన్‌పై మక్కువ ఉన్న శెట్టి.. మాజీ మిస్‌ వరల్డ్‌, నటి ప్రియాంక చోప్రా స్ఫూర్తితో మోడలింగ్‌ రంగంలోకి అడుగుపెట్టింది. ఆ క్రమంలో ఎయిర్‌టెల్‌కు సంబంధించి ఓ వాణిజ్య ప్రకటనలో నటించి, ఆకట్టుకుంది.
 • 2022లో తొలిసారిగా ‘మిస్‌ ఇండియా కర్ణాటక’ పోటీలో పాల్గొని టైటిల్‌ని సొంతం చేసుకుంది.
 • అదే ఏడాదిలో మిస్‌ ఇండియా పోటీల్లోనూ పాల్గొని కిరీటం దక్కించుకుంది. ‘టైమ్స్‌ మిస్‌ బాడీ బ్యూటిఫుల్’, ‘ఎన్‌ఐఎఫ్‌డీ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఫ్యాషన్‌ డిజైన్‌) మిస్‌ టాలెంట్‌’ సబ్‌- టైటిల్‌ అవార్డులూ అందుకుంది.

 • మిస్‌ వరల్డ్‌ పోటీల్లో పాల్గొనేందుకు దాదాపు రెండేళ్ల నుంచి సన్నద్ధమైన శెట్టి, ఇప్పటికే నిర్వహించిన పలు ఛాలెంజ్‌ ఈవెంట్లలో సత్తా చాటింది.
 • ‘హెడ్‌ టు హెడ్‌ ఛాలెంజ్‌’లో టాప్ 25, ‘టాలెంట్‌ ఛాలెంజ్‌’లో టాప్‌ 14, ‘టాప్‌ మోడల్‌ ఛాలెంజ్‌’లో టాప్‌ 20లో నిలిచి, ‘మిస్‌ వరల్డ్‌ 2024’ టైటిల్‌ లక్ష్యంగా దూసుకెళ్తోంది. 
 • ‘టాలెంట్‌ ఛాలెంజ్‌’లో భాగంగా.. మాజీ మిస్‌ వరల్డ్‌, నటి ఐశ్వర్యా రాయ్‌ హిట్‌ సాంగ్స్‌కు శెట్టి డ్యాన్స్‌ చేసి విశేషంగా అలరించింది. ధోతిశారీలో ప్రదర్శన ఇచ్చి, ప్రత్యేకంగా నిలిచింది.

 • బ్లాక్‌ కలర్‌ స్టైలిష్‌ దుస్తుల్లో హొయలొలికించి, ‘బెస్ట్‌ డిజైనర్‌ డ్రెస్‌ ఫ్రమ్‌ ఆసియా అండ్‌ ఓషియానియా’గా విజయాన్ని అందుకుంది.
 • దిల్లీలోని భారత్‌ మండపంలో ఫిబ్రవరి 18న ప్రారంభమైన 71వ మిస్‌ వరల్డ్‌ పోటీలు ముంబయిలోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో మార్చి 9న ముగియనున్నాయి (71st Miss World Pageant). ఈ టైటిల్‌ కోసం 112 మంది అందాల భామలు పోటీ పడుతున్నారు.
 • ఇప్పటి వరకు ఆరుగురు భారతీయ మహిళలు మిస్‌ వరల్డ్‌ కిరీటం పొందారు. ఏడో మహిళగా సినిశెట్టి నిలవాలని ఆశిద్దాం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని