Jigarthanda Double X Review Telugu: రివ్యూ.. జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌

Jigarthanda Double X Review Telugu: రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో కార్తిక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్ తండ: డబుల్‌ ఎక్స్‌’ ఎలా ఉంది?

Updated : 10 Nov 2023 17:29 IST

Jigarthanda Double X Review Telugu: చిత్రం: జిగర్‌ తండ: డబుల్‌ ఎక్స్‌; నటీనటులు: రాఘవ లారెన్స్‌, ఎస్‌జే సూర్య, షైన్‌ టామ్‌ చాకో, నిమేషా సజయన్‌, నవీన్‌ చంద్ర, సత్యన్‌, అర్వింద్‌ ఆకాష్‌, తదితరులు; సంగీతం: సంతోష్‌ నారాయణ్‌; సినిమాటోగ్రఫీ: తిరు; ఎడిటింగ్‌: షఫీక్‌ మహ్మద్‌ అలీ; నిర్మాత: కార్తికేయన్‌ సంతానం, ఎస్‌.కథిరేసన్‌, అలంకార్‌ పాండియన్‌; రచన, దర్శకత్వం: కార్తిక్‌ సుబ్బరాజ్‌; విడుదల తేదీ: 10-11-2023

‘పిజ్జా’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే తమిళంతో పాటు తెలుగు సినీప్రియుల్ని మెప్పించారు దర్శకుడు కార్తీక్‌ సుబ్బరాజు. ఆ తర్వాత ఆయన ‘జిగర్‌ తండ’ (తమిళనాడులో లభించే శీతల పానీయం) చిత్రంతో స్టార్‌ దర్శకుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడీ సినిమాకి సీక్వెల్‌గా ‘జిగర్‌ తండ డబుల్‌ ఎక్స్‌’ను సిద్ధం చేశారు కార్తీక్‌. ఇది దీపావళి సందర్భంగా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ సీక్వెల్‌ కథేంటి? ఇందులో గ్యాంగ్‌స్టర్‌గా లారెన్స్, దర్శకుడిగా ఎస్‌.జె.సూర్య చేసిన సందడి ఎలా ఉంది? ప్రేక్షకులకు ఎలాంటి వినోదాన్ని అందించింది?

కథేంటంటే: కృపాకర్‌ (ఎస్‌.జె.సూర్య)కు పోలీస్‌ అవ్వాలన్నది కల. ఎస్సై పరీక్షలో ఉత్తీర్ణత సాధించి పోలీస్‌శాఖలో ఉద్యోగం కూడా సంపాదించుకుంటాడు. కానీ, అంతలోనే చేయని తప్పునకు ఓ హత్య కేసులో జైలు పాలవుతాడు. ఆ తర్వాత ఆ కేసు నుంచి తప్పించుకోవడానికి తనకొక మార్గం దొరుకుతుంది. కర్నూల్‌లోని జిగర్‌ తండ మర్డర్‌ క్లబ్‌ గ్యాంగ్‌స్టర్‌ సీజర్‌ (లారెన్స్‌)ను చంపే ఆపరేషన్‌ను అతని చేతికి అప్పగిస్తారు. తను ఆ పని పూర్తి చేస్తే కేసు నుంచి బయట పడటమే కాకుండా ఎస్సై ఉద్యోగం కూడా తిరిగి పొందగలుగుతాడు. అందుకే ఆ ఆపరేషన్‌ను పూర్తి చేసేందుకు తను ఒప్పుకొంటాడు. సీజర్‌కు హీరో అవ్వాలన్న పిచ్చి ఉందని తెలిసి.. దాన్ని అడ్డం పెట్టుకొని రే దాసన్‌ అనే దర్శకుడిగా అతని దగ్గరకు చేరతాడు. (jigarthanda double x review) తనతో పాన్‌ ఇండియా సినిమా తీస్తానని చెప్పి.. హత్యకు ప్రణాళిక రచిస్తాడు. మరి ఆ తర్వాత ఏమైంది? రే దాసన్‌ ప్రణాళిక ఫలించిందా? పాన్‌ ఇండియా తొలి నల్ల హీరోగా పేరు తెచ్చుకోవాలనుకున్న సీజర్‌ కల నెరవేరిందా? వీళ్ల కథకూ... నల్లమల అడవుల్లో ఏనుగుల్ని చంపి.. దంతాలు తరలించే క్రూరమైన సెటానీకి ఉన్న సంబంధం ఏంటి? ఈ మొత్తం వ్యవహారం వెనకున్న రాజకీయ కోణమేంటి? అన్నవి మిగతా కథ.

ఎలా ఉందంటే: ఇది జగర్‌ తండకు సీక్వెల్‌ అయినా రెండు కథలు పూర్తి భిన్నంగా ఉంటాయి. అయితే రెండింటిలోనూ సెటప్‌ ఇంచుమించు ఒకే తరహాలో సాగుతుంది. తొలి భాగంలో దర్శకుడు కావాలనుకునే ఓ యువకుడు.. ఒక పెద్ద గ్యాంగ్‌స్టర్‌తో సినిమా తీయడాన్ని.. ఈ ప్రయాణంలో ఎదురైన అనుభవాల్ని చూపించారు. ఈ రెండో భాగంలో మాత్రం ఎస్సై అయిన వ్యక్తి తిరిగి తన ఉద్యోగం పొందాలనుకునే వ్యక్తి.. అనుకొని పరిస్థితుల్లో దర్శకుడి అవతారమెత్తి గ్యాంగ్‌స్టర్‌తో సినిమా చేయడాన్ని చూపించారు. ఈ రెండింటి సెటప్‌ ఒకేలా ఉన్నా.. తొలి పార్ట్‌తో పోలిస్తే ఈ రెండో భాగం కథలో అనేక కోణాలు కనిపిస్తాయి. ఓవైైపు గ్యాంగ్‌స్టర్‌ను చంపి తన ఉద్యోగం తాను సంపాదించుకోవాలనుకునే దర్శకుడు.. మరోవైపు సీఎం కుర్చీ కోసం రెండు రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న పోరు.. ఇంకొక వైపు అడవిలో జరిగే స్మగ్లింగ్‌.. వీటన్నింటి మధ్య అన్యాయంగా నలిగిపోతున్న ఓ గిరిజన తెగ.. ఇలా అనేక కోణాల్లో కథ సాగుతుంది.(jigarthanda double x review)  అయితే వీటన్నింటినీ ఎలాంటి గందరగోళం లేకుండా తేలికగా అర్థమయ్యే రీతిలో తెరపై చూపించే ప్రయత్నం చేశాడు కార్తీక్‌. కృపాకరన్‌కు జరిగిన అన్యాయం.. నల్లమల అడవుల్లో జరుగుతున్న ఏనుగు దంతాల స్మగ్లింగ్‌.. సీఎం కుర్చీ కోసం రాష్ట్రంలో రెండు ప్రధాన రాజకీయ వర్గాల మధ్య జరిగే పోరు.. ఇలా ప్రతి అంశాన్ని ఒకొక్కటిగా చూపిస్తూ నెమ్మదిగా డబుల్‌ ఎక్స్‌ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తారు. ఆ తర్వాత కథ పూర్తిగా కృపాకరన్, సీజర్‌ల మధ్యకు మారుతుంది. సీజర్‌ను చంపేందుకు కృపా దర్శకుడిగా మారడం.. సినిమా తీయాలనే పేరుతో అతను చేసే హడావుడి.. సీజర్‌ బృందం నుంచి అతడికి ఎదురయ్యే సవాళ్లతో ప్రధమార్ధమంతా సాగుతుంది. ఇదంతా సాగతీత వ్యవహారంలాగే ఉంటుంది. ఈ క్రమంలో వచ్చే విరామ సన్నివేశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి.

ద్వితీయార్ధంలో అసలు కథ మొదలైనప్పటి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. రియల్‌ హీరో అనిపించుకోవడం కోసం సీజర్‌ అడవి బాట పట్టడం.. కందనూర్‌ గిరిజనుల సమస్యను భుజానికి ఎత్తుకోవడం.. ఈ క్రమంలో క్రూరమైన సెటానీని ఢీ కొట్టడం.. అదే సమయంలో పోలీసుల రాజకీయ కుట్రలోనూ తను చిక్కుకోవడం కథలో సంఘర్షణ మొదలవుతుంది. ఈ ఎపిసోడ్లన్నీ ఆసక్తికరంగా సాగుతాయి. ముఖ్యంగా సెటానీ ఏనుగుల్ని వేటాడే ఎపిసోడ్‌.. సీజర్, సెటానీకి మధ్య వచ్చే యాక్షన్‌ బ్లాక్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. (jigarthanda double x review) ప్రీక్లైమాక్స్‌లో కథంతా రాజకీయ రంగు పులుముకుంటుంది. సినిమా చివరి 20నిమిషాలు భావోద్వేగభరితంగా సాగుతుంది. పతాక సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా ఉన్నా ఉత్కంఠభరితంగా ఉంటాయి. ముగింపులో దీనికి సీక్వెల్‌ ఉందంటూ ఓ హింట్‌ ఇచ్చి వదిలేశారు.

ఎవరెలా చేశారంటే: సీజర్‌ పాత్రలో రాఘవ లారెన్స్‌ చక్కగా జీవించారు. ఆయన పాత్రలో పలు కోణాలు కనిపిస్తాయి. వాటన్నింటినీ తను చక్కగా ఆవిష్కరించారు. ఇందులో ఎస్‌.జె.సూర్యది కూడా భిన్నమైన పాత్రే. ప్రధమార్ధంలో కన్నా ద్వితీయార్ధంలో ఆయన పాత్ర ప్రభావం బలంగా కనిపిస్తుంది. సెటానీ పాత్రను తీర్చిదిద్దిన తీరు బాగుంది. ఆ పాత్రలో చేసిన నటుడు క్రూరమైన నటనతో ఆకట్టుకున్నాడు. క్రూరుడైన పోలీస్‌గా నవీన్‌ చంద్ర నటన కూడా కట్టిపడేస్తుంది. లారెన్స్‌ భార్య చేసిన నిమేష కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంటుంది. (jigarthanda double x review) కథలో ఆమె పాత్రకు ఇచ్చిన ప్రాధాన్యత బాగుంది. కార్తీక్‌ అసలు కథను ప్రారంభించడానికి చాలా సమయం తీసుకున్నారు. ప్రథమార్ధంలో అరగంటకు పైగా తీసేసినా అసలు కథకు వచ్చిన నష్టమేమీ ఉండదనిపిస్తుంది. కార్తీక్‌ కథల్లో ఉండే థ్రిల్లింగ్‌ మూమెంట్స్‌ ఇందులో అంతగా కనిపించవు. ‘జిగర్‌ తండ’తో పోలిస్తే ఈ రెండో భాగం అనేక విషయాల్లో తడబడింది. సంతోష్‌ నారాయణన్‌ నేపథ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. (jigarthanda double x review) పాటలు మాత్రం ఒక్కటీ గుర్తుంచుకునేలా లేవు. ఛాయాగ్రహణం కూడా సినిమాకి అదనపు బలం. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.

  • బలాలు
  • + కథా నేపథ్యం..
  • + లారెన్స్, ఎస్‌.జె.సూర్య నటన
  • + ద్వితీయార్ధం
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే కథనం..
  • - ప్రథమార్ధం
  • - సినిమా నిడివి
  • చివరిగా: ప్రథమార్ధాన్ని ఓపికగా చూడగలిగితే.. ద్వితీయార్ధంలో వినోదాన్ని ఆస్వాదించొచ్చు (jigarthanda double x review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని