Kabzaa Review: రివ్యూ: కబ్జ

ఉపేంద్ర, శ్రియ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘కబ్జ’. శుక్రవారం విడుదలైన ఈ పాన్‌ ఇండియా సినిమా ఎలా ఉందంటే?

Updated : 17 Mar 2023 23:10 IST

Kabzaa Review చిత్రం: కబ్జ; నటీనటులు: ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్, శ్రియా శరణ్, మురళీశర్మ, పోసాని కృష్ణమురళీ, కోటా శ్రీనివాసరావు, సుధ, అనూప్ రేవన్న, కబీర్ సింగ్, దేవ్ గిల్ తదితరులు; సంగీతం: రవి బస్రూర్; సినిమాటోగ్రఫీ: ఎ. జె. శెట్టి; ఎడిటింగ్: మహేశ్ ఎస్.రెడ్డి; దర్శకత్వం: ఆర్.చంద్రు; విడుదల తేదీ: 17-03-2023.

కన్నడ నుంచి ‘కేజీయఫ్’ తర్వాత ఆ రేంజ్‌లో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తూ విడుదలైన చిత్రం ‘కబ్జ’. ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్‌లాంటి అగ్ర నటుల కలయికలో ఆర్.చంద్రు దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో.. ప్రేక్షకుల ముందుకు శుక్రవారం వచ్చింది. మరి, ‘కబ్జ’.. ‘కేజీయఫ్’ను మరిచిపోయేలా చేసిందా? అసలు దాని కథేంటి? తెలుసుకోవాలనుంటే ఈ సమీక్ష చదివేయండి..

ఇదీ కథ: స్వాతంత్య్ర సమరయోధుడి కుటుంబంలో పుట్టిన ఆర్కేశ్వర (ఉపేంద్ర) భారత వైమానిక దళంలో అధికారిగా పని చేస్తుంటాడు. ఉద్యోగ రీత్యా డెహ్రాడూన్ కు వెళ్లే ముందు 15 రోజుల సెలవు తీసుకొని అమరాపురంలో ఉన్న తల్లిని, అన్నను చూడటానికి వస్తాడు. అమరాపురం రాజా బహదూర్ (మురళీశర్మ) కుమార్తె మధుమతి (శ్రియ)తో ప్రేమ విషయం చెప్పి, పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అదే సమయంలో అమరాపురం ప్రాంతాన్ని రాజకీయంగా కైవసం చేసుకోడానికి రాజ వంశీయులు, గ్యాంగ్‌స్టర్స్‌ మధ్య యుద్ధం జరుగుతుంటుంది. ఆ క్రమంలో వృద్ధ దంపతుల హత్యను అడ్డుకున్న ఆర్కేశ్వర అన్నను ఖలీద్ గ్యాంగ్ అతి దారుణంగా హత్య చేస్తుంది. అది చూసి తట్టుకోలేని ఆర్కేశ్వర.. క్రైమ్ వరల్డ్‌లోకి అడుగుపెట్టి దాన్ని శాసించే స్థాయికి ఎదుగుతాడు. అమరాపురంపై ఆధిపత్యాన్ని బహదూర్ వంశీయులు చేజిక్కించుకునేలా అండగా ఉంటాడు. ఆ తర్వాత ఆర్కేశ్వర జీవితం ఎలాంటి మలుపు తిరిగింది? మధుమతిని పెళ్లి చేసుకున్నాడా? కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్‌ల పాత్ర ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: స్వాతంత్య్ర సమరయోధుడి కొడుకు నేర సామ్రాజ్యానికి అధిపతి ఎలా అయ్యాడు? అందుకు దారి తీసిన పరిస్థితులను ఆవిష్కరిస్తూ సాగే కథే ఈ ‘కబ్జ’. ఒక ప్రాంతంపై ఆధిపత్యం చెలాయించేందుకు చేసే దారుణాలు, అన్యాయాలు ఎలా ఉంటాయో ప్రేక్షకులు ఇది వరకు చాలా చిత్రాల్లో చూశారు. దర్శకుడు చంద్రు మరో కోణంలో చూపించేందుకు ప్రయత్నించాడు. ప్రథమార్ధం అర్కేశ్వర కుటుంబ నేపథ్యం, అమరాపురంలో నేర సామ్రాజ్యం, యువరాణి మధుమతితో ప్రేమాయణం సాగుతుంది. ద్వితీయార్ధం నేర సామ్రాజ్యంలోకి అడుగుపెట్టిన ఆర్కేశ్వర.. అండర్ వరల్డ్ ముఠాలను అంతం చేస్తూ ఎలా ఎదిగాడనేది కనిపిస్తుంది. అయితే, స్వాతంత్య్రానికి ముందు, ఆ తర్వాత జరిగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ కథ సాగుతుంది. ‘కేజీయఫ్’ తరహాలో ఎలివేషన్స్, యాక్షన్ ఎపిసోడ్లను ప్లాన్ చేశారు. కానీ, అవి ఆ స్థాయిలో ఆకట్టుకోవు. ఉపేంద్ర చేసే పోరాట సన్నివేశాలు సహజత్వానికి చాలా దూరంగా ఉన్నాయి. ప్రతి నాయకులను చూపించిన స్థాయిలో కథానాయకుణ్ని చూపించలేకపోయారు. స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో వచ్చే సీన్లు పెద్దగా పండలేదు. ముఖ్యంగా తల్లి సెంటిమెంట్‌ నేపథ్యంలో రూపొందిన సన్నివేశాలు వర్కౌట్‌ కాలేదు. చివరకు ప్రభుత్వమే పోలీసు బలగాలను దింపి నేర సామ్రాజ్యానికి అధినేతగా నిలిచిన వ్యక్తిని అంతమొందించాలని చెప్పడం ఇది వరకే ప్రేక్షకులు చూశారు. కానీ, ఇందులో మరో డాన్ ఎంట్రీతో కథను ముగించారు. సీక్వెల్‌ ఉందని చెబుతూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. కానీ మొదటి భాగం కథే చాలా బలహీనంగా ఉండటంతో రెండో భాగం కూడా చూడాలా అనే ప్రశ్న ప్రేక్షకుడికి ఎదురవుతుంది.


ఎవరెలా చేశారంటే: గ్యాంగ్‌స్టర్‌ ఆర్కేశ్వరగా ఉపేంద్ర కొత్తగా కనిపించాడు. పోరాట సన్నివేశాల్లో తన శక్తినతా చూపించే ప్రయత్నం చేశాడు. యువరాణి మధుమతి పాత్రలో శ్రియా శరణ్ ఒదిగిపోయింది. ఉపేంద్రతో వచ్చే ప్రేమ సన్నివేశాల్లో సాదాసీదాగానే కనిపించినా పతాక సన్నివేశాల్లో శ్రియ నటన బాగుంది.  కిచ్చా సుదీప్ పాత్ర ఫర్వాలేదనిపిస్తుంది. పతాక సన్నివేశాల్లో శివన్న పాత్ర మెరుస్తుంది. సాంకేతికంగా సినిమా స్థాయి ఏ మాత్రం బాగాలేదు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం ‘కేజీయఫ్‌’ను పోలి ఉంటుందే తప్ప కొత్తదనం కనిపించదు. కొన్ని చోట్ల మాత్రం ఆయన ఇచ్చిన బీజీఎం హైలెట్‌గా నిలిచింది. విజువల్ ఎఫెక్ట్స్ మరింత తీర్చిదిద్దితే బాగుండేది. దర్శకుడిగా చంద్రు తన వంతు కృషి చేసినా కథపై మరింత దృష్టి పెట్టాల్సిందనిపిస్తుంది. ‘కేజీయఫ్’లాంటి బ్లాక్ బస్టర్ ఇప్పటికీ ప్రేక్షకుల కళ్ల ముందే ఉన్నా.. ఆ ఛాయలు కనిపించకుండా చేసేందుకు ఎలాంటి కృషి చేయలేదు. 

బలాలు: + ఉపేంద్ర, శ్రియా శరణ్‌ల నటన, + రవి బస్రూర్‌ సంగీతం

బలహీనతలు: - కథ, భావోద్వేగాలు పండకపోవడం, - పోరాట సన్నివేశాలు,  - ఉపేంద్ర- శ్రియల లవ్‌ ట్రాక్

చివరిగా:  ఇది ప్రేక్షకుల మనసులను ‘కబ్జ’ చేయదు.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని