Karan Johar: 27 ఏళ్ల కెరీర్‌.. తొలిసారి యాక్షన్‌ ఫిల్మ్‌!

అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా బాలీవుడ్‌కు పరిచయమై, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా, వ్యాఖ్యాతగా తానేంటో నిరూపించుకున్నారు కరణ్‌ జోహార్‌. ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ సినిమాతో మెగాఫోన్‌ పట్టిన ఆయన పలు వైవిధ్య భరిత కథలను తెరకెక్కించారు.

Published : 26 May 2022 01:12 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించి, దర్శకుడు, నిర్మాత, నటుడు, వ్యాఖ్యాతగా తానేంటో నిరూపించుకున్నారు కరణ్‌ జోహార్‌ (Karan Johar). ‘కుచ్‌ కుచ్‌ హోతా హై’ సినిమాతో మెగాఫోన్‌ పట్టిన ఆయన పలు వైవిధ్య భరిత కథలను తెరకెక్కించారు. ‘కబీ ఖుషి కబీ ఘమ్’, ‘మై నేమ్‌ ఈజ్‌ ఖాన్‌’, ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్’, ‘బాంబే టాకీస్‌’ తదితర డ్రామా, ఎంటర్‌టైనర్‌లకు దర్శకత్వం వహించిన కరణ్‌ తొలిసారి యాక్షన్‌ చిత్రాన్ని పట్టాలెక్కించనున్నట్టు ప్రకటించారు. బుధవారం తన పుట్టినరోజు (50వ) సందర్భంగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. తన సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఓ లేఖను విడుదల చేశారు. ప్రస్తుతం తాను దర్శకత్వం వహిస్తున్న ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ చిత్రం 2023 ఫిబ్రవరి 10న విడుదలకానుందని, ఏప్రిల్‌లో యాక్షన్‌ సినిమాను ప్రారంభిస్తానని తెలిపారు. ఈ ప్రకటనతో బాలీవుడ్‌ వర్గాల్లో చర్చసాగుతోంది. ‘ఈ యాక్షన్‌ ఫిల్మ్‌లో నటించేంది ఈ హీరోనే’ అంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. షారుఖ్‌ఖాన్‌, సిద్ధార్థ్‌ మల్హోత్రా పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

1995లో వచ్చిన బ్లాక్‌ బస్టర్‌ ‘దిల్‌వాలే దుల్హానియా లే జయేంగే’ చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు కరణ్‌. ఈ సినిమాతోనే ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. 1998లో దర్శకుడిగా మారారు. 2003లో వచ్చిన ‘కల్‌ హో నా హో’ సినిమాతో నిర్మాత అయ్యారు. సెలబ్రిటీలతో కరణ్‌ నిర్వహించిన చిట్‌చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ విశేష ఆదరణ పొందింది. ఆయనలో మంచి కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కూడా ఉన్నాడు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని