Label Review: రివ్యూ: లేబుల్‌.. చేయని నేరానికి శిక్ష అనుభవిస్తే?

తమిళ నటుడు జై ప్రధాన పాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘లేబుల్‌’. ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోన్న ఈ సిరీస్‌ రివ్యూ మీకోసం..

Updated : 10 Nov 2023 16:57 IST

Label Review in Telugu వెబ్‌సిరీస్‌: లేబుల్‌; తారాగణం: జై, తాన్యా హోప్‌, చరణ్‌ రాజ్‌, మహేంద్రన్‌, హరిశంకర్‌ నారాయణన్‌ తదితరులు; సినిమాటోగ్రఫీ: దినేష్‌ కృష్ణన్‌; ఎడిటర్‌: రాజా అరుముగమ్‌; మ్యూజిక్‌: సామ్‌ సి.ఎస్‌; రచన, దర్శకత్వం: అరుణ్‌ రాజా కామరాజ్‌; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: డిస్నీ+హాట్‌స్టార్‌.

‘జర్నీ’, ‘రాజా రాణి’ చిత్రాలతో కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు జై (Jai). చాలాకాలం తర్వాత ఆయన ‘లేబుల్‌’ (Label) వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చారు. దర్శకుడు అరుణ్‌రాజా కామరాజ్‌ రూపొందించిన ఈ సిరీస్‌ ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’ (Disney+ Hotstar)లో శుక్రవారం విడుదలైంది. మరి, ఈ సిరీస్‌ స్టోరీ ఏంటి? జై తన నటనతో మెప్పించారా? తెలుసుకుందాం (Label Review in Telugu)..

కథేంటంటే: తమిళనాడులోని వాలీ నగర్‌ అంటే ఇతర ప్రాంతాల వారికి చిన్నచూపు. అక్కడ పుట్టి పెరిగిన వాళ్లంతా రౌడీలు, గూండాలుగా మిగిలిపోతారని చాలామంది అభిప్రాయం. ఈ క్రమంలోనే ఆ ఏరియాకు చెందిన సుమారు 12 ఏళ్ల అబ్బాయి ప్రభాకరన్‌ అలియాస్‌ ప్రభ (జై) చేయని నేరానికి జువైనల్‌ హోంకు వెళ్తాడు. కొన్ని రోజుల తర్వాత నిరపరాధిగా బయటకు వస్తాడు. తనతోపాటు తన స్వస్థలంపై ఇతరుల్లో ఉన్న దురభిప్రాయాన్ని చెరిపేయాలని నిర్ణయించుకుంటాడు. ఈ మేరకు ‘లా’ పూర్తిచేసి అడ్వకేట్‌గా మారతాడు. మరి, ప్రభ తాను అనుకున్నట్లు వాలీ నగర్‌పై మచ్చను తొలగించగలిగాడా? ఆ ప్రయత్నంలో ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నాడు? న్యాయమూర్తి కావాలనే తన కలను నిజం చేసుకునే క్రమంలో ఎదురైన అడ్డంకులేంటి? జర్నలిస్ట్‌ అయిన మహిత (తాన్యా హోప్‌)కు, వాలీ నగర్‌కు సంబంధమేంటి? తదితర ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే సిరీస్‌ చూడాల్సిందే (Label Review).

ఎలా ఉందంటే: చిన్నప్పుడు తాను అనుభవించిన బాధ ఎవరికీ కలగకూడదని ఓ న్యాయవాది చేసే పోరాటమే ఈ ‘లేబుల్‌’. ఈ పేరు ఎందుకు పెట్టారోనన్న ప్రేక్షకుడి సందేహానికి ఆలస్యం చేయకుండా ఆన్సర్‌ ఇచ్చేశారు దర్శకుడు. దాన్ని తెరపై చూస్తేనే బాగుంటుంది. హీరో లాయరు అనగానే ఇదొక కోర్టు రూమ్‌ డ్రామా అనుకోవడం సహజం. కానీ, ఇందులో నేర నేపథ్యం ఎక్కువగా కనిపిస్తుంది. సిరీస్‌ ప్రారంభ సన్నివేశంతోనే ఆ విషయం అర్థమైపోతుంది. కొన్ని కథల్లో.. చేయని నేరంతో శిక్ష అనుభవించే వారికి న్యాయం చేసే లాయరుగా హీరో కనిపిప్తే.. ఇంకొన్ని కథల్లో అక్రమ నేరారోపణ ఎదుర్కొనే హీరోకు ఓ అడ్వకేట్‌ సాయం చేయడం కనిపిస్తుంది. ఈ సిరీస్‌ వాటికి భిన్నం. హీరో ‘లా’ వృత్తిని ఎంపిక చేసుకోవడం.. న్యాయమూర్తికావాలని మరో అడుగు ముందుకు వేయాలనుకోవడం ఆసక్తికరం. ఈ సిరీస్‌ మొత్తం పది ఎపిసోడ్లతో రూపొందగా తాజాగా మూడు మాత్రమే విడుదలయ్యాయి. ప్రతి శుక్రవారం ఒక్కో ఎపిసోడ్‌ విడుదలవుతుంది (Label Web Series Review).

ఈ మూడు ఎపిసోడ్ల ద్వారా ప్రభ కుటుంబ నేపథ్యం, మహిత, పాతాళం తదితర కీలక పాత్రలను పరిచయం చేశారు దర్శకుడు. తెలిసీతెలియని వయసులో ప్రభ నేరారోపణ ఎదుర్కోవడం, పోలీసులు జువైనల్‌ హోంకు తరలిస్తుండగా ‘నేను ఏ తప్పూ చేయలేదు’ అంటూ ఆవేదన వ్యక్తం చేయడం హృదయాన్ని కదిలిస్తుంది. అడ్వకేట్‌గా జై ఇంట్రడక్షన్‌ అలరిస్తుంది. అయితే, ఓ కేసు విషయంలో చోటు చేసుకునే వాదప్రతివాదనలు అంతగా ఆకట్టుకోవు. లాయరుగానే కాకుండా వ్యక్తిగానూ తన ప్రాంత ప్రజలను అభివృద్ధిలోకి తీసుకురావాలని ప్రభ చేసే ప్రయత్నం మెప్పిస్తుంది. జర్నలిజం ప్రస్తుతం ఎలా ఉందో జర్నలిస్ట్‌ మహిత పాత్ర ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు. ‘లేబుల్‌’ పేరుతో అక్రమాలకు పాల్పడే పాతాళంలాంటి పాత్రలు తదుపరి ఎపిసోడ్లపై ఆసక్తి రేకెత్తిస్తాయి (Label Review). జడ్జి అయ్యేందుకు ప్రభ తగిన సన్నాహాలు చేసుకుంటున్న క్రమంలో అతడిపై ఒకరు కేసు పెట్టే ట్విస్ట్‌తో చివరి ఎపిసోడ్‌ను ముగించారు. కేసును విత్‌డ్రా చేసుకుంటేనే తప్ప ప్రభ జడ్జి అయ్యే అవకాశాలు ఉండవు. ఆ కేసు పెట్టిన వ్యక్తి మరణించి ఉంటే ప్రభ పరిస్థితేంటి? మిగిలిన ఎపిసోడ్లే ఈ ప్రశ్నలకు సమాధానం.   

ఎవరెలా చేశారంటే: ఎక్కువగా రొమాంటిక్‌ చిత్రాల్లో నటించిన జైకు ఇది కొత్త అనుభవమే. అడ్వకేట్‌గా ఆకట్టుకుంటారు. తాన్యా హోప్‌ విలేకరిగా ఫర్వాలేదనిపిస్తుంది. ప్రభ తండ్రిగా చరణ్‌ రాజ్‌ కనిపిస్తారు. అయితే, ప్రస్తుతానికి ఆయనకు స్క్రీన్‌ స్పేస్‌ చాలా తక్కువ. వాలీ నగర్‌ కుర్రాళ్లుగా నటించిన వారు, విలన్‌ పాత్రధారులు ఓకే అనిపిస్తారు. సామ్ సి.ఎస్‌. అందించిన నేపథ్య సంగీతం బాగుంది. బ్రిడ్జి నేపథ్యంలో సాగే ఓ యాక్షన్‌ సీక్వెన్స్‌కు సంబంధించిన విజువల్స్‌ వావ్‌ అనిపిస్తాయి. మూడు ఎపిసోడ్లకే స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ప్లస్‌, మైనస్‌ పాయింట్లు చెప్పడం కష్టం (Label Review).

చివ‌రిగా: ‘లేబుల్‌’ అసలు కథ ముందుంది. ఇది పరిచయమే (Label Web Series Review)!

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు