Little Miss Naina Review: రివ్యూ: లిటిల్‌ మిస్‌ నైనా.. ఎత్తులో వ్యత్యాసం ఉంటే?

షేర్షా షరీఫ్‌, గౌరి జి. కిషన్‌ జంటగా నటించిన చిత్రం ‘లిటిల్‌ మిస్‌ నైనా’. ఈ సినిమా ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. రివ్యూ మీకోసం..

Updated : 28 Jan 2024 18:12 IST

చిత్రం: లిటిల్‌ మిస్‌ నైనా; నటీనటులు: షేర్షా షరీఫ్‌, గౌరి జి. కిషన్‌, జిష్ణు శ్రీకుమార్, నందిని గోపాల కృష్ణన్‌, రంజిత్‌ వేలాయుధన్‌, మనోజ్‌ కె.యు, నీరజా రాజేంద్రన్‌ తదితరులు; సంగీతం: గోవింద్ వసంత; కూర్పు: సంగీత్‌ ప్రతాప్‌; ఛాయాగ్రహణం: ల్యూక్‌ జోస్‌; నిర్మాణ సంస్థ: ఎస్‌ ఒరిజినల్స్‌; కథ: షేర్షా షరీఫ్‌; దర్శకత్వం: విష్ణు దేవ్; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

రూ. 1కే రోజంతా వినోదాన్ని పంచుతున్న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్‌’ (ETV Win). ఎన్నో కార్యక్రమాలు, క్లాసిక్‌ మూవీస్‌, వార్తలు, ఒరిజినల్‌ వెబ్‌సిరీస్‌లు అందిస్తోంది. ఇతర భాషల్లో అలరించిన చిత్రాలనూ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. అలా.. తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చిన మలయాళ సినిమా ‘లిటిల్‌ మిస్‌ నైనా’ (Little Miss Naina). షేర్షా షరీఫ్‌ (Shersha Sherief), గౌరి జి. కిషన్‌ (Gouri G Kishan) ప్రధాన పాత్రల్లో దర్శకుడు విష్ణు దేవ్‌ తెరకెక్కించిన చిత్రమిది. మరి, ఈ సినిమా (Little Miss Rawther) కథేంటి? ఎలా ఉంది? తెలుగు ఆడియన్స్‌ను మెప్పించిందా? తెలుసుకుందాం (Little Miss Naina Review)..

కథేంటంటే?: ఒకే కాలేజీ విద్యార్థులైన అభిజిత్‌ చంద్రదాస్‌ (షేర్షా షరీఫ్‌) చాలా పొడవుగా ఉంటే.. నైనా (గౌరి జి. కిషన్‌) హైట్‌ తక్కువగా ఉంటుంది. ఆ వ్యత్యాసం వల్లే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. తర్వాత అది ప్రేమకు దారితీస్తుంది. సినిమా డైరెక్టర్‌ కావాలనే లక్ష్యంతో ఉండే అభిజిత్‌ అటుగా అడుగులు వేస్తాడు. బిజీ అయిపోతాడు. అదే సమయంలో నైనా కుటుంబ సభ్యులు పెళ్లి చేసేందుకు సిద్ధమవుతారు. తాను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో వివాహం జరగబోతుందని తెలిసిన అభిజిత్‌.. మద్యానికి బానిస అవుతాడు. అదే సమయంలో.. పెళ్లికి ముందు రోజు మాట్లాడాలని చెప్పి అభిజిత్‌ను పిలుస్తుంది నైనా. వివాహ బంధంతో ఒక్కటికావాలనుకున్న ఆ ఇద్దరు ఇంటి నుంచి పారిపోతారు. ఆ ప్రయాణంలో వారు ఎదుర్కొన్న సమస్యలేంటి?చివరకు పెళ్లి చేసుకున్నారా? అభిజిత్‌ డైరెక్టర్‌ కల నెరవేరిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. (Little Miss Naina Review in Telugu)

ఎలా ఉందంటే?: కాలేజీ నేపథ్యంలో సాగే ప్రేమకథలు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇదీ అలాంటి స్టోరీనే. కానీ, దాన్ని ఆకట్టుకునేలా మలచడంలో దర్శకుడు మార్కులు కొట్టేశారు. లవ్‌స్టోరీని నేరుగా చెప్పకుండా దానికి ఫ్లాష్‌బ్యాక్‌ను జోడించి, ప్రధాన పాత్రే కథను వివరిస్తున్నట్లు క్రియేట్‌ చేయడం బాగుంది. కానీ, ఆ టెక్నిక్‌ వల్ల అక్కడక్కడా క్లారిటీ మిస్‌ అయింది. హీరో బాల్యం, కుటుంబ నేపథ్యంలో సాగే ప్రారంభ సన్నివేశంతోనే సినిమాపై ఆసక్తి పెంచారు. హీరో- హీరోయిన్ల ఇంట్రడక్షన్‌ సీన్‌ కొత్తగా ఉంటుంది. హైట్‌ అంశాన్ని కాలేజీలో సరదాగా చిత్రీకరించి వినోదం పంచిన దర్శకుడు.. పెళ్లి విషయంలో అదే అంశాన్ని సీరియస్‌గా చూపించిన తీరు ఆకట్టుకుంటుంది. హీరో-హీరోయిన్ల పరిచయం, స్నేహం ప్రేమగా మారడం.. ఎన్నో చిత్రాల్లో కనిపించిన ఈ ఫార్మాట్‌ ఇందులోనూ తారసపడుతుంది. ఇలాంటి రొటీన్‌ ఎపిసోడ్స్‌తో నెమ్మదిగా సాగే కథలో.. అభిజిత్‌ ఓ పార్టీకి వెళ్లే సన్నివేశంతో వేగం పుంజుకుంటుంది. అక్కడ అతడి స్నేహితుడు అరుణ్‌ (జిష్ణు శ్రీకుమార్‌)తో కలిసి చేసే హంగామా నవ్వులు పంచుతుంది. నైనా తన పెళ్లికి ముందు రోజు అభిజిత్‌కి ఫోన్‌ చేయడంతో కథ మలుపు తిరుగుతుంది.

గౌరి.జి. కిషన్‌ గురించి ఆసక్తికర విశేషాల కోసం క్లిక్‌ చేయండి

ఇంటి నుంచి పారిపోయిన క్రమంలో వీరిద్దరు సమస్యల్లో చిక్కుకోవడం, తన సినిమా మైండ్‌తో హీరో వాటిని పరిష్కరించడం, హీరోయిన్‌ ఆట పట్టించడం.. సెకండాఫ్‌లో కనిపిస్తుంది. నైనా.. అభిజిత్‌ను పెళ్లి చేసుకోవడానికే వచ్చిందా? మరో ఉద్దేశం ఉందా అనే సందేహం కలిగేలా ఆయా షాట్స్‌ను రూపొందించారు. ఈ జంట ప్రయాణం ముగిశాక ఎదురయ్యే మరో ట్విస్ట్‌ యువతను ఆలోచింపజేస్తుంది. క్లైమాక్స్‌ హత్తుకుంటుంది. హీరోనే (షేర్షా షరీఫ్‌) ఈ సినిమా కథను రాయడం విశేషం. ఇంజినీరింగ్‌ స్టూడెంట్‌ అయిన ఆయన నటనపై ఉన్న ఆసక్తితో పలు లఘు చిత్రాలను రూపొందించారు. తర్వాత చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఈ స్టోరీ ఆ జర్నీని గుర్తుచేస్తుంది.

ఎవరెలా చేశారంటే?: హీరో- హీరోయిన్లకే ఈ కథలో ఎక్కువ స్కోప్‌ ఉంది. తెరపై వారిద్దరే ఎక్కువ సేపు కనిపిస్తారు. అభిజిత్‌ చంద్రదాస్‌గా షేర్షా షరీఫ్‌ మెప్పిస్తారు. ‘జాను’, ‘శ్రీదేవి శోభన్‌బాబు’ చిత్రాలతో తెలుగు వారికి దగ్గరైన గౌరి జి. కిషన్‌ ఇప్పుడు నైనా క్యారెక్టర్‌తో మరోసారి కట్టిపడేశారు. జిష్ణు శ్రీకుమార్‌, నందిని గోపాలకృష్ణన్‌, మనోజ్‌ కె.యు, నీరజా రాజేంద్రన్‌ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతిక బృందం విషయానికొస్తే.. నేపథ్య సంగీతంతో గోవింద్‌ వసంత మాయ చేశారు గానీ పాటలు అలరించవు. ‘జాను’ చిత్రంతో ఈ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ల్యూక్‌ జోస్‌ సినిమాటోగ్రఫీ ప్రత్యేక ఆకర్షణ. సంగీత్‌ ప్రతాప్‌ ఎడిటింగ్‌ ఓకే. దర్శకుడు విష్ణు దేవ్‌కి ఇది తొలి సినిమా. టేకింగ్‌ బాగుంది (Little Miss Naina Review).

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: యువత లక్ష్యంగా రూపొందిన చిత్రమిది. అశ్లీల సన్నివేశాలు ఉండవుగానీ శృంగారానికి సంబంధించిన టాపిక్‌ పలుమార్లు తెరపైకి వస్తుంది. దాన్ని గుర్తించి స్కిప్‌ చేయడం బెటర్‌. కాలక్షేపం కోసం ఈ ‘లిటిల్‌ మిస్‌’ను ట్రై చేయొచ్చు.

  • బలాలు
  • + గౌరి జి. కిషన్‌, షేర్షా షరీఫ్‌ నటన
  • + కామెడీ
  • బలహీనతలు
  • -  కొత్తదనం లేని కథ
  • -  కొన్ని సన్నివేశాల్లో స్పష్టత లోపించడం
  • చివరిగా: ‘మిస్‌ నైనా’ కథ పాతదే అయినా మెప్పిస్తుంది (Little Miss Naina Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని