Love Guru Review: రివ్యూ: లవ్‌గురు.. విజయ్‌ ఆంటోనీ మూవీ ఎలా ఉంది?

Love Guru Review: విజయ్ ఆంటోని, మృణాళిని రవి కీలక పాత్రల్లో నటించిన న్యూఏజ్‌ ఫ్యామిలీడ్రామా మెప్పించిందా?

Updated : 11 Apr 2024 07:15 IST

Love Guru Review; చిత్రం: లవ్‌గురు; నటీనటులు: విజయ్‌ ఆంటోనీ, మృణాళిని రవి, యోగిబాబు, వీటీవీ గణేష్‌, ఇలవరుసు, శ్రీజ రవి, తలైవసల్‌ విజయ్‌ తదితరులు; సంగీతం: భరత్‌ ధన శేఖర్‌; సినిమాటోగ్రఫీ: ఫారూక్‌ బాష; ఎడిటింగ్‌: విజయ్‌ ఆంటోనీ; నిర్మాత: మీరా విజయ్‌ ఆంటోనీ, విజయ ఆంటోనీ, సంద్రా జాన్సన్‌, నవీన్‌కుమార్‌; రచన, దర్శకత్వం: వినాయక్‌ వైద్యనాథన్‌; విడుదల: 11-04-2024

ప్రయోగాలకు పెట్టింది పేరు విజయ్‌ ఆంటోని. ఎక్కువగా థ్రిల్లర్‌ కథలతో ప్రేక్షకుల్ని పలకరించే ఆయన.. తొలిసారి రొమాంటిక్‌ జానర్‌లో చేసిన చిత్రం ‘లవ్‌ గురు’. మైత్రీ మూవీ మేకర్స్‌ దీన్ని తెలుగులో చేసింది. మరి ఈ మూవీ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుందా? విజయ్‌ ఆంటోనికి మరో విజయాన్ని అందించిందా?

కథేంటంటే: అరవింద్‌ (విజయ్‌ ఆంటోని) మలేసియాలో కేఫ్‌ నడుపుతుంటాడు. అతన్ని తన చెల్లి తాలూకూ ఓ చేదు గతం వెంటాడుతుంటుంది. మరోవైపు ఆర్థిక సమస్యల నుంచి ఇంటిని గట్టేక్కించే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35ఏళ్ల వయసొచ్చినా ప్రేమ, పెళ్లికి నోచుకోలేకపోతాడు. అయితే ఈ సింగిల్‌ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో మలేసియా నుంచి ఇండియాకు తిరిగొచ్చిన అరవింద్‌.. అనుకోకుండా ఓ చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీల (మృణాళిని రవి)ని చూసి మనసు పారేసుకుంటాడు. దీన్ని గ్రహించిన అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడతారు.(Love Guru Review)  కానీ, లీలాకు ఆ పెళ్లి అసలు ఇష్టముండదు. ఎందుకంటే సినిమా హీరోయిన్‌ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. అయితే ఆమె నటిగా మారడాన్ని అంగీకరించని తండ్రి అరవింద్‌తో వివాహం జరిపిస్తాడు. కానీ, పెళ్లైన మరుసటి రోజే లీలాకు తనతో పెళ్లి ఇష్టం లేదన్న సంగతి అరవింద్‌కు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అరవింద్‌ తన భార్య మనసు గెలుచుకునేందుకు ఏం చేశాడు? అతన్ని వెంటాడుతున్న చెల్లి తాలూకూ చేదు గతమేంటి? హీరోయిన్‌ అవ్వాలన్న లీలా లక్ష్యం నెరవేరిందా? లేదా? ఆమె ఆఖరికి అరవింద్‌ను భర్తగా అంగీకరించిందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా సాగిందంటే:  ఓ పెద్ద జీవిత లక్ష్యంతో ముందుకు సాగుతున్న అమ్మాయి ఇష్టం లేకున్నా పెద్దల బలవంతంతో పెళ్లికి సిద్ధపడటం.. మూడుముళ్లు పడ్డాక ఆమె తన లక్ష్యం కోసం భర్తను దూరం పెట్టడం.. ఆమె మనసు గెలుచుకునేందుకు ఆ భర్త రకరకాల ప్రయత్నాలు చేయడం.. ముగింపులో ఇద్దరూ ఒక్కటవ్వడం.. ఈ తరహా ఫ్యామిలీడ్రామా చిత్రాలు తెలుగు తెరపై చాలా వచ్చాయి. ఈ ‘లవ్‌ గురు’ కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. కాకపోతే దర్శకుడు దీన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దుకున్న తీరు.. ఆ కథకు చెల్లి సెంటిమెంట్‌ను జోడించి భావోద్వేగభరితంగా తెరపై చూపించిన విధానం సినిమాకి ఓ కొత్త లుక్‌ను తీసుకొచ్చాయి.(Love Guru Review) క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక భర్త తన భార్య మనసు గెలవడానికి ప్రయత్నించే కథగా ఉంటుంది. దీని ద్వారా పెళ్లి అనేది స్త్రీ కలలకు అడ్డంకి కాదు అనే ఓ సందేశాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారు దర్శకుడు.

కథలో చెప్పుకొన్నట్లుగానే ఒక రొటీన్‌ డ్రామాతో సినిమా ఆరంభమవుతుంది. అరవింద్‌ - లీలా పెళ్లయి హైదరాబాద్‌కు మకాం మార్చినప్పటి నుంచి కథలో వినోదం మొదలవుతుంది. అప్పటి వరకు సంప్రదాయబద్ధంగా కనిపించిన లీలా ఒక్కసారిగా మోడ్రన్‌ గర్ల్‌ అవతారమెత్తడం.. ఇంట్లో ఫ్రెండ్స్‌తో కలిసి ఆమె చేసే హంగామా.. అరవింద్‌ను దూరం పెట్టేందుకు చేసే ప్రయత్నాలు.. వాటిని అతను తన ప్రేమతో తిప్పికొట్టే విధానం అన్నీ మంచి కాలక్షేపాన్నిస్తాయి. ఈ మధ్యలో విజయ్‌ ఆంటోనికి.. వీటీవీ గణేష్‌కు మధ్య వచ్చే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. విరామానికి ముందు యోగిబాబు పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథ మలుపు తిరుగుతుంది. అతని సలహాతో భార్య ప్రేమను గెలుచుకునేందుకు హీరో మరో వ్యక్తిగా ఆమెకు ఫోన్‌ పరిచయమవడమన్నది షారుక్‌ ఖాన్‌ ‘రబ్‌ నే బనా ది జోడీ’ చిత్రాన్ని గుర్తు చేస్తుంది. ఇక విరామ సమయానికి లీలాను హీరోయిన్‌ చేసేందుకు అరవింద్‌ నిర్మాతగా మారాలని నిర్ణయించుకోవడం.. ఆ చిత్రంలో తనే హీరోగా నటిస్తానని షరతు పెట్టడంతో ద్వితీయార్ధం ఏం జరుగుతుందన్న ఆసక్తి మొదలవుతుంది. (Love Guru Review) అయితే ప్రథమార్ధమంతా ఫన్నీగా సాగిన కథనం.. ద్వితీయార్ధంలో భావోద్వేగభరితంగా మారుతుంది.  ముఖ్యంగా అరవింద్‌ తన చెల్లికి దూరమైన ఎపిసోడ్‌ కథను కాస్త సీరియస్‌గా మారుస్తుంది. అలాగే ముగింపులో అరవింద్, లీలాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్‌గా ఆకట్టుకుంటాయి. ఈ మధ్యలో ‘లవ్‌ గురు’ సినిమా చిత్రీకరణ పేరుతో అరవింద్‌ - లీలా చేసే హంగామా కాస్త బోర్‌ కొట్టిస్తుంది.

ఎవరెలా చేశారంటే: వైవిధ్య పాత్రలకు భిన్నంగా అరవింద్‌గా విజయ్‌ ఆంటోని కొత్త ప్రయత్నం చేశారు. కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌లో చక్కటి నటన కనబరిచారు. ముఖ్యంగా ముగింపులో తనకు.. మృణాళినికి మధ్య వచ్చే ఎపిసోడ్‌లో ఆయన నటన భావోద్వేగభరితంగా ఉంటుంది. లీలాగా మృణాళిని తెరపై అందంగా కనిపించింది. ఆమె తెరపై ఆద్యంతం కనిపించినా.. నటనకు పెద్దగా స్కోప్‌ దొరికినట్లు అనిపించదు. (Love Guru Review) విజయ్‌ మామయ్యగా వీటీవీ గణేష్‌ కనిపించినంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రేమ సలహాలు ఇచ్చే పాత్రలో యోగిబాబు కూడా అక్కడక్కడా నవ్విస్తారు. ఇళవరసు, సుధ, తలైవాసల్‌ విజయ్‌ తదితరుల పాత్రలన్నీ పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు ఎంచుకున్న కథలో కొత్తదనం కనిపించదు. కథనమంతా ఊహలకు తగ్గట్లుగానే సాగుతుంది. కానీ, సినిమాని ఎక్కడా బోర్‌ కొట్టించనీయకుండా తీర్చిదిద్దడంలో సఫలమయ్యాడు.

  • బలాలు
  • + వినోదాత్మకంగా కథను నడిపిన తీరు
  • + విజయ్‌ ఆంటోని, మృణాళిని నటన
  • + పతాక సన్నివేశాలు
  • బలహీనతలు
  • - పాటలు
  • - ఊహలకు తగ్గట్లుగా సాగే సన్నివేశాలు
  • చివరిగా: కాలక్షేపాన్నిచ్చే ‘లవ్‌ గురు’ (Love Guru Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని