Mama Mascheendra Movie Review: రివ్యూ: మామా మశ్చీంద్ర.. సుధీర్‌బాబు కొత్త మూవీ మెప్పించిందా?

Mama Mascheendra Movie Review: సుధీర్‌బాబు కీలక పాత్రలో హర్షవర్థన్‌ తెరకెక్కించిన ‘మామ మశ్చీంద్ర’ ఎలా ఉంది?

Updated : 06 Oct 2023 14:18 IST

Mama Mascheendra Movie Review | చిత్రం: మామ మశ్చీంద్ర; నటీనటులు: సుధీర్‌బాబు, ఈషారెబ్బ, మృణాళిని రవి, హర్షవర్థన్‌, అలీ రెజా, రాజీవ్‌ కనకాల, హరితేజ, మిర్చి కిరణ్‌ తదితరులు; సంగీతం: చైతన్‌ భరద్వాజ్‌; నేపథ్య సంగీతం: ప్రవీణ్ లక్కరాజు; ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె వెంకటేశ్‌; సినిమాటోగ్రఫీ: పి.జి.విందా; నిర్మాత: సునీల్‌ నారంగ్‌, పుష్కర్‌ రామ్మోహన్‌రావు; బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ; రచన, దర్శకత్వం: హర్ష వర్థన్‌; విడుదల: 06-10-2023

ఈ శుక్ర‌వారం బాక్సాఫీసు కొత్త సినిమాల‌తో క‌ళ‌క‌ళ‌లాడింది. న‌వ‌త‌రం తార‌లు న‌టించిన సినిమాలు... ప‌రిమిత వ్య‌యంతో రూపొందిన సినిమాలు దాదాపు ప‌ది విడుద‌ల‌య్యాయి. అందులో ఒక‌టి... సుధీర్‌బాబు న‌టించిన ‘మామా మ‌శ్చీంద్ర‌’. విభిన్న‌మైన క‌థ‌ల్ని ఎంచుకుని ప్ర‌యాణం చేస్తాడ‌నే పేరున్న సుధీర్ బాబు త్రిపాత్రాభిన‌యం చేయ‌డం, ర‌చ‌యిత‌, న‌టుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డంతో సినిమాకి మంచి ప్ర‌చార‌మే ల‌భించింది. (Mama Mascheendra Movie Review) మ‌రి ఈ సినిమా కథేంటి? ఎలా ఉంది?

క‌థేంటంటే: క్రూరుడైన తండ్రి వ‌ల్ల చిన్న‌ప్పుడే త‌ల్లిని కోల్పోతాడు ప‌ర‌శురామ్ (సుధీర్‌బాబు). త‌నకి ద‌క్కాల్సిన ఆస్తుల్ని మేన‌మామ (అజ‌య్‌) లాగేసుకోవ‌డంతో ఎలాగైనా ఆ ఆస్తిని తిరిగి రాబ‌ట్టుకోవాల‌ని ప‌థ‌కం ర‌చిస్తాడు. మామ‌కు కూతురుతో స‌మానమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని అనుకున్న‌ట్టే ఆస్తిని తిరిగి సొంతం చేసుకుంటాడు. ఆ త‌ర్వాత ప‌ర‌శురామ్ భార్య ఓ పాప‌కి జ‌న్మినిచ్చి చ‌నిపోతుంది. త‌న మామ పేరిట ఉన్న ఆస్తుల‌న్నింటినీ అమ్మేసుకుని కూతురుతో స‌హా వెళ్లి పారిస్‌లో స్థిర‌ప‌డిపోవాల‌ని నిర్ణ‌యించుకుంటాడు ప‌ర‌శురామ్‌. ఆ ప్ర‌య‌త్నాల్లో ఉండ‌గానే అత‌నిపై హ‌త్యాయ‌త్నం జ‌రుగుతుంది. ఇంత‌కీ ప‌ర‌శురామ్‌ని హ‌త్య చేయాల‌నుకున్న‌దెవ‌రు? త‌న రూపురేఖ‌ల‌తోనే ఉన్న క‌వ‌ల‌లు డీజే, దుర్గ (సుధీర్‌)లకి ఈ హ‌త్య‌తో సంబంధం ఏమైనా ఉందా? వాళ్లిద్ద‌రినీ హ‌త్య చేయాల‌ని ప‌ర‌శురామ్ ముందే ఎందుకు ప్లాన్ చేశాడు?వైర‌ల్ విశాలాక్షి (ఈషారెబ్బా), మీనాక్షి (మృణాళిని ర‌వి)ల్లో ప‌ర‌శురామ్ కూతురు ఎవ‌రు?త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే:  కొన్ని సినిమాలు ఆరంభ‌మైన  క్ష‌ణాల్లోనే  ప్రేక్ష‌కుడిని ఆ క‌థ‌లో లీనం చేస్తాయి. పాత్ర‌ల‌తో  క‌లిసి ప్ర‌యాణం చేయిస్తాయి. కొన్ని సినిమాలు మాత్రం గంద‌ర‌గోళానికి గురిచేస్తూ ఆ క‌థ‌ని, పాత్ర‌ల్ని ఒక ప‌ట్టాన మ‌న‌సుకి ఎక్కించుకోలేని విధంగా చేస్తాయి. రెండో రకానికి చెందిందే ఈ సినిమా. ద‌ర్శ‌కుడు చెప్పాల‌నుకున్న అంశం మంచిదే. కానీ, చెప్పిన విధాన‌మే కుద‌ర‌లేదు. ర‌చ‌నా ప్ర‌తిభ‌నంతా ఉప‌యోగించి ప‌లు పార్శ్వాలుగా క‌థని రాసుకున్నారు. అది స్క్రిప్ట్‌పై ఉన్నంత‌వ‌ర‌కూ ఆస‌క్తిని రేకెత్తించ‌వ‌చ్చు కానీ, తెర‌పైకి వ‌చ్చేస‌రికి తిక‌మ‌క వ్య‌వ‌హారంలా మారింది. క‌థ‌ని, పాత్ర‌ల్ని ఎన్ని మ‌లుపులైనా తిప్పొచ్చు. కానీ ఆ ప్ర‌య‌త్నంతో హాస్య‌మో, లేక ఏదో ఒక భావోద్వేగ‌మే పండాలి. కానీ, ఈ సినిమాలో ఏ ఒక్క స‌న్నివేశం ఎలాంటి భావోద్వేగాన్ని పంచ‌కపోగా బోన‌స్‌గా మెద‌డుకి ప‌నిపెడుతుంది. (Mama Mascheendra Movie Review) ఉన్న పాత్ర‌ని లేన‌ట్టు... లేని పాత్ర ఉన్న‌ట్టు చూపిస్తూ అంతా ఓ పజిల్‌లా సినిమాని మార్చేశారు ద‌ర్శ‌కుడు. ఎంత పెద్ద క‌థ‌నైనా,  సినిమాలో ఎన్ని పార్శ్వాలున్నా అది ప్రేక్ష‌కులకు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌డం అవ‌స‌రం అని ఈ సినిమా మ‌రోసారి చాటింది.

త‌న‌పైనా త‌న కూతురుపైనా క‌క్ష క‌డతారేమో అని క‌థానాయ‌కుడు త‌న‌కి తానే ఊహించుకుంటూ పిల్ల‌ల్ని మార్చేస్తుంటాడు.. బాంబులు పెట్టి ఇళ్ల‌ని పేల్చేస్తుంటాడు. తెరపై ఇలా చాలా వ్య‌వ‌హారం జ‌రిగిపోతుంటుంది. ఆర్జీవీ ఎపిసోడ్  స‌హా ఏదీ  కూడా సంద‌ర్భోచితంగా  అనిపించ‌దు.  ప్ర‌థ‌మార్ధంలో పాత్ర‌ల మ‌ధ్య బంధాల విష‌యంలో ఎంత కంగాళీ  ఉంటుందో...  ద్వితీయార్ధంలో నాయ‌కానాయిక‌ల మ‌ధ్య ప్రేమ వ్య‌వ‌హారంలోనూ అంతే గ‌బిజిజి. సినిమాకి కీల‌కం ప‌ర‌శురామ్ పాత్రే. చిన్న‌ప్పుడే త‌ల్లిని పోగొట్టుకున్న ఆ పాత్ర‌పై ఆరంభంలో ప్రేక్షకులకు జాలి క‌లుగుతుంది. (Mama Mascheendra Movie Review) అలాంటి పాత్ర‌ని విల‌న్ ఛాయ‌ల‌తో మ‌లిచి,  ఓ స్ప‌ష్ట‌త‌, ఓ ల‌క్ష్యం లేకుండా మార్చేయ‌డం సినిమాకి మైన‌స్‌గా మారింది.  మ‌నిషిలోని స్వార్థం గురించి  ప‌తాక స‌న్నివేశాల్లో చెప్పిన విష‌యం త‌ప్ప సినిమా ఏ ద‌శ‌లోనూ ర‌క్తిక‌ట్టించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: సుధీర్‌బాబు మూడు పాత్ర‌ల్లో క‌నిపిస్తాడు. ప‌ర‌శురామ్ పాత్ర ఆయ‌న‌కి ఏమాత్రం న‌ప్ప‌లేదు. విగ్గు, గ‌డ్డం అతికించుకుని క‌నిపించ‌డం త‌ప్ప అందులో కొత్త‌ద‌నం లేదు. దుర్గ పాత్ర‌తోనే ఆయ‌న వైవిధ్యం ప్ర‌ద‌ర్శించారు. అయితే నాసిర‌క‌మైన మేక‌ప్ వ‌ల్ల ఆ పాత్ర లుక్ ఒక్కోసారి ఒక్కోలా క‌నిపిస్తుంటుంది. మూడో పాత్ర‌లో సుధీర్ ఎప్ప‌ట్లాగే సిక్స్‌ ప్యాక్‌తో క‌నిపిస్తాడు. రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌, తెలంగాణ యాస‌ల్లో సంభాష‌ణ‌లు చెప్పారు. ప‌ర‌శురామ్ పాత్ర‌కి డ‌బ్బింగ్ అత‌క‌లేదు. ఈషారెబ్బా, మృణాళిని ర‌వి తెర‌పై ఎక్కువ‌సేపే క‌నిపిస్తారు. (Mama Mascheendra Movie Review) ఈషారెబ్బా హాస్పిట‌ల్‌లో మాట్లాడే స‌న్నివేశాలు త‌ప్ప ఆ ఇద్ద‌రూ మ‌రెక్క‌డా ప్ర‌భావం చూపించ‌రు. ప‌ర‌శురామ్ ద‌గ్గ‌ర ప‌నిచేసే వ్య‌క్తిగా  హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తారు. రాజీవ్ క‌న‌కాల‌, అజ‌య్, మిర్చి కిర‌ణ్, అలీరెజా, హ‌రితేజ  త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. సాంకేతికంగా  కెమెరా, సంగీతం విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. పాట‌లు గుర్తు పెట్టుకునేలా లేవు కానీ, నేప‌థ్య‌సంగీతం ఆక‌ట్టుకుంటుంది. ర‌చ‌నే ఈ సినిమాకి బ‌ల‌హీన‌త‌. ప‌లు పార్శ్వాలున్న ఈ క‌థ‌ని స‌ర‌ళంగా  చెప్ప‌డంలో విఫ‌ల‌మ‌య్యారు ద‌ర్శ‌కుడు, ర‌చ‌యిత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌. నిర్మాణం ప‌రంగా ఎలాంటి లోటుపాట్లు క‌నిపించ‌వు.

  • బ‌లాలు
  • + మూడు పాత్ర‌ల్లో సుధీర్‌బాబు
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - పాత్ర‌ల మ‌ధ్య గంద‌ర‌గోళం
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌రిగా:  మామా మ‌శ్చీంద్ర‌... ఇదొక గ‌జిబిజి మాయ‌ (Mama Mascheendra Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని