Mission Raniganj: రివ్యూ: మిషన్‌ రాణిగంజ్‌.. జస్వంత్‌సింగ్‌గా అక్షయ్‌ చేసిన సాహసం

బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘మిషన్‌ రాణిగంజ్‌’ ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో విడుదలైంది. ఈ సినిమా ఎలా ఉందంటే?

Published : 01 Dec 2023 17:13 IST

Mission Raniganj review; చిత్రం: మిషన్‌ రాణిగంజ్‌: ది గ్రేట్‌ భారత్‌ రెస్క్యూ; తారాగణం: అక్షయ్‌ కుమార్, పరిణీతి చోప్రా, రవికిషన్‌, కుముద్‌ మిశ్రా, పవన్‌ మల్హోత్ర తదితరులు; నేపథ్య సంగీతం: సందీప్‌ శిరోడ్కర్‌; ఛాయాగ్రహణం: అసీమ్‌ మిశ్రా; కూర్పు: ఆరిఫ్‌ షేక్‌; నిర్మాణ సంస్థలు: పూజ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఏకే ప్రొడక్షన్స్‌; సంభాషణలు: దీపక్‌; స్క్రీన్‌ప్లే: విపుల్‌ కె. రావల్‌; దర్శకత్వం: టిను సురేశ్‌ దేశాయ్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్‌.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలు ఇటీవల విరివిగా వస్తున్నాయి. ఆ జాబితాలోనిదే ‘మిషన్‌ రాణిగంజ్‌’ (Mission Raniganj). బాలీవుడ్‌ అగ్ర నటుడు అక్షయ్‌ కుమార్‌ (akshay kumar) ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా అక్టోబరు 6న థియేటర్లలో విడుదలకాగా తాజాగా ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Mission Raniganj on Netflix)లోకి వచ్చింది. మరి, సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులను మెప్పించగలిగిందా? తెలుసుకుందాం (Mission Raniganj Review)..

కథేంటంటే: అది 1989. రాణిగంజ్‌ (పశ్చిమ బెంగాల్‌) బొగ్గు గనుల్లో మైనింగ్‌ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా వరద ముంచెత్తుతుంది. ఆ ప్రమాదాన్ని గుర్తించిన వందలాది కార్మికులు బయటపడగా 65మంది కార్మికులు అక్కడే చిక్కుకుపోతారు. వారిని కాపాడేందుకు మైనింగ్‌ ఇంజినీర్‌, రెస్క్యూ ట్రైన్డ్‌ ఆఫీసర్‌ జస్వంత్‌సింగ్‌ గిల్‌ (అక్షయ్‌ కుమార్‌) రంగంలోకి దిగుతాడు. తన ప్రాణాన్ని సైతం పణంగా పెట్టి ఆ కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన సవాళ్లేంటి? అందరూ క్షేమంగా బయటపడ్డారా, లేదా? అనేది తెరపై చూసి తెలుసుకోవాల్సిందే (Mission Raniganj Review in Telugu).

ఎలా ఉందంటే: మైనింగ్‌ ఇంజినీర్‌ జస్వంత్‌సింగ్‌ గిల్‌ సాహసానికి అద్దం పట్టే చిత్రమిది. ఆయన గురించి ఈతరం వారికి తెలియజేయాలన్న దర్శక, రచయితల ఆలోచన అభినందించదగ్గది. ఆయన గురించి మరింత తెసుకుకోవాలనే ఆసక్తిని ప్రేక్షకుడికి కలిగించారు. ప్రారంభంలో హీరో ఎలివేషన్‌ సీన్‌, వెంటనే ఓ పాట రావడంతో కమర్షియల్‌ సినిమానా? అనే సందేహం కలుగుతుంది! కార్మికులు గనుల్లో చిక్కుకున్నారనే విషయం తెలియగానే జస్వంత్‌ సింగ్‌ రంగంలోకి దిగే సన్నివేశం నుంచి కథ కాస్త వేగం పుంజుకుంటుంది. 350 అడుగుల లోతులో ప్రాణాలు అరచేతపట్టుకుని ఉన్న కార్మికుల ఆర్తనాదాలు ప్రేక్షకుడి హృదయాన్ని కదిలిస్తాయి. ఎవరైనా ఓ మంచి పనిచేసేందుకు ముందడుగేస్తే ఏ రంగంలోనైనా పై అధికారుల నుంచో, చుట్టు పక్కల వారి నుంచో వ్యతిరేకత ఎదురవుతుంది. కార్మికులను ఎలాగైనా బయటకు తీసుకురావాలని సంకల్పించిన జస్వంత్‌సింగ్‌ గిల్‌కూ ఇదే పరిస్థితి తలెత్తుతుంది. ఆ నెగెటివిటీని పట్టించుకోకుండా జస్వంత్‌ తన ప్రణాళికలను ఆచరణలో పెట్టడం, ‘వరదలో చిక్కుకుపోయిన వారంతా చనిపోయి ఉంటారు’ అని ఇతర అధికారులు అనుమానం వ్యక్తం చేసినా తాను నమ్మకంతో ముందుకెళ్లడం.. ఇలా రెస్క్యూను ప్రారంభించే సన్నివేశాలు ఆసక్తికరంగా సాగుతాయి. ఇలాంటి చిత్రాలకు స్క్రీన్‌ప్లే ప్రధాన పాత్ర పోషిస్తుంది. కానీ, ఈ సినిమా విషయంలో అదే మైనస్‌ అనిపిస్తుంది. బాహ్య ప్రపంచానికి దూరంగా ఉన్న కార్మికుల అవస్థలను చూపిస్తూనే..రెస్క్యూ ఎలా సాగుతుందో చూపించి ఉంటే బాగుండేది. అలా కాకుండా అదో పార్ట్‌, ఇదో పార్ట్‌ అన్నట్లు విడివిడిగా చూపించడంతో కనెక్టివిటీ మిస్‌ అయింది. గ్రాఫిక్స్‌ కూడా ఓ డ్రాబ్యాక్‌గా నిలిచింది. ఇంటర్వెల్‌ సీన్‌ ద్వితీయార్ధంపై ఆసక్తి రేకెత్తిస్తుంది (Mission Raniganj Review in Telugu).

సెకండాఫ్‌ను భావోద్వేగం ప్రధానంగా తీర్చిదిద్దారు. 48 గంటల్లోగా రెస్క్యూ పూర్తి చేయాల్సిన ఘట్టం ఉత్కంఠగా సాగుతుంది. కోల్‌ఫీల్డ్స్‌లో పనిచేసే కార్మికుల కష్టాలు ఎలా ఉంటాయో, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఆయా సంస్థలు ఎలా స్పందిస్తాయో.. కళ్లకు కట్టినట్లు చూపించారు. సదరు కార్మికులను తీసుకొచ్చేందుకు జస్వంత్‌సింగ్ గనుల్లోకి వెళ్లడం, ఒక్కో కార్మికుడు బయటకు వస్తుంటే కుటుంబం భావోద్వేగానికి గురవడం.. ఇలా రెస్క్యూలో చోటుచేసుకునే పరిణామాలు హృదయాన్ని హత్తుకుంటాయి. రియల్‌ జస్వంత్‌సింగ్‌కు సంబంధించిన పలు దృశ్యాలతో క్లైమాక్స్‌ను తీర్చిదిద్దిన తీరు ప్రేక్షకుడికి మంచి అనుభూతి కలిగిస్తుంది. ముగింపులోనూ అవసరంలేకపోయినా ఓ పాటను జొప్పించడం వృథా ప్రయాసే! ప్రస్తుతానికి హిందీలోనే స్ట్రీమింగ్‌ అవుతోంది. త్వరలోనే ఇతర భాషల ఆడియో అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. అయితే, తెలుగు ప్రేక్షకులకు ఈ కథ పరిచయమే. నందమూరి బాలకృష్ణ హీరోగా వచ్చిన ‘నిప్పురవ్వ’ (1993) ఈ తరహా నేపథ్యంలో రూపొందిందే (Mission Raniganj Review in Telugu).

ఎవరెలా చేశారంటే: జస్వంత్‌సింగ్‌ గిల్‌గా అక్షయ్‌ కుమార్‌ ఒదిగిపోయారు. ఆయన లుక్‌, నటన ఆకట్టుకుంటాయి. తెరపై ఎక్కువగా ఆయన కనిపిస్తారు. జస్వంత్‌సింగ్‌ భార్యగా పరిణీతి చోప్రా నటించారు. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర ఆమెది. ఉన్నంత మేరకు ఓకే అనిపిస్తారు. గనుల్లో చిక్కుకున్న కార్మికులుగా ప్రముఖ నటుడు రవికిషన్‌, వరుణ్‌ బదోలా తదితరులు పరిధి మేరకు నటించారు(Mission Raniganj Review in Telugu).

సాంకేతికంగా ఎలా ఉందంటే: ఐదుగురు సంగీత దర్శకులు సంయుక్తంగా రెండు పాటలకు బాణీలు అందించారు. ఆ పాటలు లేకపోయినా సినిమాకు వచ్చే నష్టమేమీ లేదు. సందీప్‌ శిరోడ్కర్‌ అందించిన నేపథ్య సంగీతం ఆయా సన్నివేశాలకు బలాన్నిచ్చింది. ఆసీమ్‌ మిశ్రా సినిమాటోగ్రఫీ బాగుంది. రెస్క్యూ ప్లాన్‌ సిద్ధం చేసుకునే క్రమంలో అక్షయ్‌ పెట్టుకున్న కళ్లజోడులో ఆ విజువల్స్‌ (ప్లానింగ్‌ గ్రాఫ్‌) కనిపించే తీరు వావ్‌ అనిపిస్తుంది. ఎడిటర్‌ ఆరిఫ్‌ షేక్‌ పాటలను కట్‌ చేసి ఉంటే ఇంకా బాగుండేది. విపుల్‌ కె. రావల్‌ స్క్రీన్‌ప్లే వర్కౌట్‌ కాలేదు. నిర్మాణ లోపం చాలా సన్నివేశాల్లో కనిపిస్తుంది. దాదాపు ఏడేళ్ల విరామం అనంతరం టిను సురేశ్‌ దేశాయ్‌ దర్శకత్వం వహించిన చిత్రమిదే. టేకింగ్‌లో ఆ ప్రభావం కనిపించింది! (Mission Raniganj Review in Telugu). టిను గత చిత్రం ‘రుస్తమ్‌’ (2016). అందులోనూ అక్షయ్‌ కుమారే హీరో.  

  • బలాలు
  • + అక్షయ్‌ నటన
  • + ద్వితీయార్ధంలో భావోద్వేగాలు
  • బలహీనతలు
  • -  స్క్రీన్‌ప్లే 
  • -  గ్రాఫిక్స్‌
  • చివరిగా: జస్వంత్‌సింగ్‌ గిల్‌ సాహసం చూడాలనుకుంటే ‘మిషన్‌ రాణిగంజ్‌’ను ప్రయత్నించొచ్చు (Mission Raniganj Review in Telugu)!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని