My Dear Donga Review: రివ్యూ: మై డియర్‌ దొంగ.. అభినవ్‌ గోమఠం నటించిన సినిమా ఎలా ఉందంటే?

అభినవ్‌ గోమఠం, శాలిని కొండెపూడి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మై డియర్‌ దొంగ’. ఓటీటీ ‘ఆహా’లో విడుదలైన ఈ సినిమా రివ్యూ మీ కోసం..

Updated : 20 Apr 2024 10:35 IST

My Dear Donga Review; చిత్రం: మై డియర్‌ దొంగ; నటీనటులు: అభినవ్‌ గోమఠం, షాలిని కొండెపూడి, నిఖిల్‌ గాజుల, దివ్య శ్రీపాద, శశాంక్‌ మండూరి, వంశీధర్‌ గౌడ్; రచన: శాలిని కొండెపూడి; దర్శకత్వం: బి.ఎస్‌. సర్వజ్ఞ కుమార్‌; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: ఆహా.

ఓటీటీ ఆడియన్స్‌ను టార్గెట్‌ చేసుకుని ఇటీవల కొన్ని సినిమాలు రూపొందుతున్నాయి. ఆ జాబితాలోని ‘మై డియర్‌ దొంగ’ (My Dear Donga) విడుదలైంది. అభినవ్‌ గోమఠం (Abhinav Gomatam), షాలిని కొండెపూడి (Shalini Kondepudi) ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’ (Aha)లో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఈ మూవీ స్టోరీ ఏంటి? ఎలా ఉందంటే? (My Dear Donga Review)..

కథేంటంటే?: ఓ డేటింగ్‌ యాప్‌నకు కాపీ రైటర్‌గా పనిచేసే సుజాత (షాలిని), డాక్టర్‌ విశాల్‌ (నిఖిల్‌ గాజుల) ప్రేమికులు. తొలుత బాగానే ఉన్నా కొంతకాలం తర్వాత విశాల్‌లో మార్పు వచ్చిందని సుజాత భావిస్తుంది. డ్యాన్స్‌ క్లాస్, యోగా శిక్షణ.. ఇలా ఎక్కడికి పిలిచినా బిజీ అని చెబుతున్నాడంటూ ఫీలైపోతుంటుంది. ఈ క్రమంలోనే సురేశ్‌ (అభినవ్‌ గోమఠం) ఆమె ఫ్లాట్‌లో చోరీ చేసేందుకు వెళ్తాడు. అదే సమయానికి షాలిని బర్త్‌డే సెల్రబేషన్‌ చేసేందుకు స్నేహితులు బుజ్జి (దివ్య శ్రీపాద), వరుణ్‌ (శశాంక్‌ మండూరి), విశాల్‌ ఆమె ఇంటి వస్తారు. అప్పటికే సురేశ్‌తో కాసేపు మాట్లాడిన సుజాత.. అతడిని తన చిన్ననాటి స్నేహితుడిగా వారికి పరిచయం చేస్తుంది. సురేశ్‌.. సుజాత ఇంట్లో ఏ వస్తువు చోరీ చేశాడు? అసలు.. దొంగ అని తెలిసినా సుజాత.. సురేశ్‌తో ఎందుకు పరిచయం పెంచుకుంది? వారి కుటుంబ నేపథ్యాలేంటి? విశాల్‌ పోలీసుస్టేషన్‌కు వెళ్లడానికి కారణమేంటి? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (My Dear Donga Review in Telugu).

ఎలా ఉందంటే?: ఓ హీరోయిన్‌.. ఇద్దరు హీరోలు.. ప్రేమ.. చివరికి ఎవరో ఒకరు ఫీలవడం.. ఈ టెంప్లేట్‌ ఎన్నో సినిమాల్లో చూసేందే. ఇది ఆ ఫార్మాట్‌లో సాగే స్టోరీనే. కానీ, కామెడీ ప్రధానంగా తీర్చిదిద్దడంతో ప్రత్యేకంగా నిలిచింది. ఒకట్రెండు సన్నివేశాలు మినహా సినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది. లగ్జరీ అవసరం లేదు.. చిన్న చిన్న ఆనందాలే జీవితం అనుకునే యువతి సుజాత కథ ఇది. ఆమె ప్రేమ కథలను నేరుగా చెప్పకుండా.. ఓ హోటల్‌లో వెయిటర్‌కు సుజాత తన బ్యాక్‌ స్టోరీలను తానే వివరించడం ఆసక్తి కలిగిస్తుంది. ఈ సినిమా కథను తానే స్వయంగా రాయడం విశేషం. ఆమె చేసే ఉద్యోగ ప్రస్తావన, స్నేహితులు, ప్రేమికుడు విశాల్‌ పరిచయ సన్నివేశాలు నెమ్మదిగా సాగినా.. సుజాత ఫ్లాట్‌లోకి సురేశ్‌ ప్రవేశించడం నుంచి కథలో వేగం పుంజుకుంటుంది. అభినవ్‌ తనదైన మార్క్‌ హావభావాలతో అలరించారు. తమ కుటుంబాల గురించి సుజాత, సురేశ్‌ ఒకరికొకరు వివరించే తీరు కన్‌ఫ్యూజ్‌ క్రియేట్‌ చేస్తుంది. ఆ ఎమోషనల్‌ సీన్స్‌ను ఇంకా బలంగా చూపించి ఉంటే బాగుండేది. సుజాత పుట్టిన రోజు ఇతివృత్తంగా రాసిన సీన్స్‌ కడుపుబ్బా నవ్విస్తాయి. సర్‌ప్రైజ్‌ చేసేందుకు ఇంటికొచ్చిన బుజ్జి, వరుణ్‌, విశాల్‌లకు సుజాత.. సురేశ్‌ను తన ఫ్రెండ్‌గా పరిచయం చేయడం, మెకానికల్‌ ఇంజినీర్‌గా సురేశ్‌ వారిని నమ్మించేందుకు ప్రయత్నించడం చూస్తే నవ్వాగదు (My Dear Donga Review).

సురేశ్‌ గురించి అసలు విషయం తెలుసుకున్న విశాల్‌ ఏం చేశాడనేది సెకండాఫ్‌లో ప్రధానాంశం. సురేశ్‌ను ఇరికించాలని ప్రయత్నించి తాను పోలీసుకు చిక్కడం, అందుకు సుజాత ఫైర్‌ అవ్వడం.. ఇలా ప్రతి ఎపిసోడ్‌ను ప్రేక్షకుడిని నవ్వించాలనే లక్ష్యంతోనే రూపొందించారు. ప్రీ క్లైమాక్స్‌ సీన్స్‌ను ఎమోషనల్‌గా రూపొందించినా క్లైమాక్స్‌ను కామెడీ ట్రాక్‌లోనే పెట్టారు.

ఎవరెలా చేశారంటే?: సుజాతగా షాలిని ఒదిగిపోయారు. కొన్ని సీన్స్‌లో ఎక్స్‌ప్రెషన్స్‌తోనూ ఆమె ఆకట్టుకున్నారు. ఆమెను ప్రేమించిన డాక్టర్‌ విశాల్‌గా నిఖిల్‌ ఫర్వాలేదనిపించారు. దివ్య శ్రీపాద, ఆమె లవర్‌గా నటించిన శశాంక్‌, వెయిటర్‌గా నటించిన వంశీధర్‌ గౌడ్‌ ఓకే అనిపిస్తారు. ఎప్పటిలానే అభినవ్‌ తన కామెడీతో గిలిగింతలు పెట్టారు. సాంకేతిక విభాగానికొస్తే.. నేటి ప్రేమికుల మనస్తత్వం ఎలా ఉందో తనదైన శైలిలో చెప్పే ప్రయత్నం చేశారు షాలిని. ఆమె రాసిన కథను అంతే చక్కగా తెరపైకి తీసుకొచ్చారు సర్వజ్ఞ కుమార్‌. మ్యూజిక్‌, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ ఓకే (My Dear Donga Review).

కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఓటీటీని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించే కంటెంట్‌ అనగానే అందులో డబుల్‌ మీనింగ్స్‌ డైలాగ్స్‌, అసభ్య సన్నివేశాలు ఉంటాయనేది చాలామంది అభిప్రాయం. ఇందులో ఎలాంటి అసభ్యతకు తావులేదు. ఫ్యామితో కలిసి చూడదగ్గ చిత్రమిది. నిడివి కూడా తక్కువే

  • బ‌లాలు:
  • + శాలిని, అభినవ్‌ గోమఠం నటన
  • + కామెడీ
  • బ‌ల‌హీన‌త‌లు:
  • - అక్కడక్కడా స్లో నెరేషన్‌
  • చివ‌రిగా: ఈ ‘దొంగ’.. కామెడీతో ప్రేక్షకుల మనసు దోచుకుంటాడు! (My Dear Donga Review in Telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు