అప్పుడు మాత్రమే షూటింగ్‌లకు అనుమతి

కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లకు మహారాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

Updated : 06 Jun 2021 19:37 IST

ముంబయి: కరోనా సెకండ్‌వేవ్‌ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్‌లు త్వరలో మొదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలో సినిమా/టెలివిజన్‌ షూటింగ్‌లను తిరిగి ప్రారంభించే విషయమై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ఆదివారం చిత్ర పరిశ్రమ, టెలివిజన్‌ పరిశ్రమవర్గాల ప్రతినిధులతో వర్చువల్‌గా జరిగిన సమావేశమయ్యారు. కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని ఈ సందర్భంగా ఉద్ధవ్‌ విజ్ఞప్తి చేశారు. కరోనా కేసులు పూర్తిగా తగ్గి, పరిస్థితిని అదుపులో ఉన్నప్పుడు వెంటనే షూటింగ్‌లకు అనుమతి ఇస్తామని ఈ సందర్భంగా ఠాక్రే ప్రకటించారు.

‘‘కరోనా సెకండ్‌వేవ్‌తో సినిమా/టెలివిజన్‌ షూటింగ్‌లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుతూ వస్తున్నాయి. నగరంలో నిత్యం నమోదయ్యే కరోనా కేసులు పూర్తిగా తగ్గి, పరిస్థితి అదుపులోకి వస్తే షూటింగ్‌లకు అనుమతి ఇస్తాం.  అన్‌లాక్‌ ప్రక్రియ కూడా మొదలైంది. కరోనా విషయంలో ఎప్పుడూ నిరక్ష్యం పనికిరాదు. షూటింగ్‌ల సమయంలో కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి’’ అని ఉద్ధవ్‌ అన్నారు.

మహారాష్ట్ర ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య ఆధారంగా ఆయా ప్రాంతాల్ని స్థాయిలవారీగా విభజించి లాక్‌డౌన్‌   నిబంధనల్ని ఎత్తివేసింది. పాజిటివిటీ రేటు ఐదు శాతం కంటే తక్కువ ఉన్న ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ని పూర్తిగా ఎత్తివేసింది. అక్కడ థియేటర్లలో సినిమా ప్రదర్శనలకీ అనుమతులు ఇచ్చింది. దాంతో చివరి దశలో ఉన్న సినిమాల్ని పూర్తి చేయడంకోసం ఈ నెల 7 నుంచే బాలీవుడ్‌ వర్గాలు చిత్రీకరణలకి సిద్ధం అవుతున్నాయి. టైగర్‌ష్రాఫ్‌ ‘టైగర్‌ 3’ మొదలుకొని షారుఖ్‌ఖాన్‌ ‘పఠాన్‌’, అజయ్‌ దేవగణ్‌ ‘మే డే’, సంజయ్‌ లీలా భన్సాలీ ‘గంగూబాయి కతియావాడి’,  రణ్‌బీర్‌కపూర్‌,   అలియాభట్‌ల ‘బ్రహ్మాస్త్ర’, ప్రభాస్‌ ‘ఆదిపురుష్‌’ తదితరాలు చిత్రీకరణ దశలోనే ఆగిపోయాయి. వాటిని పునరుద్ధరించేందుకు బాలీవుడ్‌ వర్గాలు సన్నద్ధమవుతున్నాయి. అయితే నిబంధనల దృష్ట్యా అన్ని సినిమాల చిత్రీకరణలు ఇప్పట్లో ప్రారంభం కాలేవని, నిర్మాతలు తమ చిత్ర బృందాలకి టీకాలు వేయించడంపై దృష్టిపెట్టారని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని