Parking Movie Review: రివ్యూ పార్కింగ్‌.. తమిళ సూపర్‌హిట్‌ మూవీ ఎలా ఉంది?

Parking Movie Review: హరీశ్‌ కల్యాణ్‌, ఎం.ఎస్‌. భాస్కర్‌ కీలక పాత్రల్లో నటించిన ‘పార్కింగ్’ ఎలా ఉంది?

Updated : 02 Jan 2024 15:14 IST

Parking Movie Review; చిత్రం: పార్కింగ్‌; నటీనటులు: హరీశ్‌ కల్యాణ్‌, ఎం.ఎస్‌ భాస్కర్‌, ఇందుజ, రమ రాజేంద్ర, ఇళవరసు, రమేష్‌ తదితరులు; సంగీతం: శ్యామ్‌ సి.ఎస్‌.; సినిమాటోగ్రఫీ: జిజు సన్నీ; ఎడిటింగ్‌: ఫిలోమిన్‌ రాజ్‌; రచన, దర్శకత్వం: రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

మంచి కాన్సెప్ట్‌ ఉంటే, నటీనటులతో సంబంధం లేకుండా ప్రేక్షకులు ఆదరిస్తారని ఎన్నో చిత్రాలు రుజువు చేశాయి. తాజాగా అలా తమిళ బాక్సాఫీస్‌ వద్ద అలరించిన చిత్రం ‘పార్కింగ్‌’. డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విమర్శకులను సైతం మెప్పించింది. (Parking Movie Review) తాజాగా డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ  సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయిందా?

కథేంటంటే: ఈశ్వర్‌ (హరీశ్‌ కల్యాణ్‌) పెద్దలను ఎదిరించి అతిక (ఇందుజ)ను వివాహం చేసుకుంటాడు. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి అయిన ఈశ్వర్‌ తన ఆఫీస్‌కు దగ్గరలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుంటాడు. అప్పటికే ఇంటి గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ప్రభుత్వ ఉద్యోగి ఏకరాజు (ఎం.ఎస్‌.భాస్కర్‌) కుటుంబం నివసిస్తూ ఉంటుంది. పని విషయంలో ఏకరాజు ఎంతో నిక్కచ్చిగా ఉంటాడు. అవినీతిని అస్సలు ప్రోత్సాహించడు. రిటైర్‌మెంట్‌కు ఇంకా కొన్ని నెలలే ఉంటుంది. ఈశ్వర్‌, ఏకరాజు కుటుంబ సభ్యులు త్వరగానే స్నేహితులుగా మారతారు. అతిక గర్భవతి కావడంతో ఈశ్వర్‌ ఆమెను కాలు కింద పెట్టకుండా చూసుకుంటూ ఉంటాడు. ‘భార్యను ఎంత బాగా చూసుకుంటున్నాడో.. మీరూ ఉన్నారు ఎందుకు..?’ అంటూ ఏకరాజు భార్య అతడిని ఒకట్రెండు సార్లు ఎద్దేవాచేస్తుంది. మరోవైపు భార్యను ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అవసరమవుతుందని ఈశ్వర్‌ కారుకొంటాడు. దాన్ని ఇంటి ముందు పార్క్‌ చేస్తాడు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఉంటున్న తన వాకిలి ముందు కారును పార్క్‌ చేయడం ఏకరాజుకు నచ్చదు. దీంతో ఈశ్వర్‌తో వాగ్వాదానికి దిగుతాడు. నెమ్మదిగా ఇరు కుటుంబాల మధ్య దూరం పెరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు కూడా ఈశ్వర్‌, ఏకరాజులు గొడవలు పడుతుంటారు. ఈ గొడవలు తారస్థాయికి చేరి, పోలీసు కేసుల వరకూ వెళ్తుంది. ఈశ్వర్‌, ఏకరాజు మధ్య పెరిగిన అహం వీరిని ఎంత దూరం తీసుకెళ్లింది? ఒకరినొకరు చంపుకొనేంత వరకూ పరిస్థితి వెళ్లడానికి కారణం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘తన కోపమే తన శత్రువు.. తన శాంతమె తనకు రక్ష..’ అంటాడు సుమతీ శతక పద్యకర్త. ఇద్దరు సాధారణ వ్యక్తులకు అహం అడ్డు వచ్చి కోపంతో విచక్షణ కోల్పోతే, ఎక్కడ వెళ్తారనేది ఈ చిత్ర కథ. సాధారణంగా ప్రతి కుటుంబంలోనూ ఇది కనపడుతుంది. భార్యాభర్తలు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు, స్నేహితులు ఇలా ప్రతి మనిషిలోనూ అహం ఉంటుంది. చాలా మంది దాన్ని సెల్ఫ్‌రెస్పెక్ట్‌ అనుకుంటారు. రెండింటికీ మధ్య చిన్న గీత మాత్రమే ఉంటుంది. అది చెరిగిపోయిన వేళ మనిషి తన విచాక్షణా జ్ఞానాన్ని ఎలా కోల్పోతాడో దర్శకుడు రామ్‌కుమార్‌ చాలా బాగా చూపించారు. అటు ఈశ్వర్‌, అటు ఏకరాజు కుటుంబాలను, వారి నేపథ్యాలను చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. పాత్రల మధ్య సంఘర్షణ మొదలవడానికి కాస్త సమయం పడుతుంది. ఎప్పుడైతే పార్కింగ్‌ విషయంలో ఇరు కుటుంబాలకు మనస్పర్థలు వస్తాయో అక్కడి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, ఏకరాజు, ఈశ్వర్‌ల కోపం, ఆవేశం కారణంగా వారి కుటుంబ‌స‌భ్యులు ప‌డే ఇబ్బందులు ఉద్వేగ‌భ‌రితంగా చూపించాడు. ప్రత్యర్థిపై పైచేయి సాధించడానికి చేసే ప్రయత్నాలు చూస్తే, మన చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు మదిలో మెదులుతూ ఉంటాయి. దీంతో కథకు మనం చాలా ఈజీగా కనెక్ట్‌ అవుతాం.

దర్శకుడు ఈ కథను ఎంత సహజంగా రాసుకున్నాడో, అంతే బలంగా చెబుతూ వెళ్లాడు. తక్కువ పాత్రలనే ఎంచుకున్నా, ప్రతి పాత్రా సినిమాపై ప్రభావం చూపేలా తీర్చిదిద్దిన విధానం బాగుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాలు మరింత ఆసక్తికరంగా మార్చాడు దర్శకుడు. చిన్న పార్కింగ్‌ కోసం ఇద్దరూ చంపుకొనే వరకూ వెళ్లడం చూస్తే, తమ అహం తృప్తి చెందడానికి మనుషులు ఇంత మృగాల్లా మారతారా? అనిపిస్తుంది. కానీ, ఒక చిన్న సంఘటన కారణంగా ఈశ్వర్‌, ఏకరాజు మారిపోయడం కూడా ఉత్కంఠగా చూపించాడు. ఆ సన్నివేశాలు మెప్పిస్తాయి. చివరిలో ఈశ్వర్‌ వచ్చి సారీ చెబితే ఏకరాజు తన భార్యతో ఒక మాట అంటాడు. ‘‘కుమారి.. అతనికి 28ఏళ్లు ఉంటాయి. నాకు 60ఏళ్లు వస్తున్నా సర్దుకుపోవాలనే జ్ఞానం లేదు. ఉండి ఉంటే, ఈ స్థితికి వచ్చే వాళ్లమా.. చాలా చీప్‌గా ప్రవర్తించాం. ఆఫ్టారాల్‌ పార్కింగే కదా! సారీ బాబూ’’ అంటూ ఏకరాజు చెప్పే డైలాగ్‌ కన్నీళ్లు పెట్టిస్తుంది. ఇక పార్కింగ్ అన్న‌ది ఎప్ప‌టికీ పరిష్కారం కాని స‌మ‌స్య అని చెబుతూ సినిమాను ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: ‘పార్కింగ్‌’ కథ మొత్తం హ‌రీశ్‌ క‌ల్యాణ్‌, ఎంఎస్ భాస్క‌ర్ పాత్ర‌ల చుట్టూనే సాగుతుంది. ఇద్దరూ పోటీపడి నటించారు. ఈ సినిమాలో ప్ర‌త్యేకంగా హీరో, విల‌న్స్ అంటూ ఎవరూ ఉండరు. మనిషిలోని అహమే ప్రధాన శత్రువు. పరిస్థితుల ప్రభావమే వారిని మృగాలుగా మారుస్తుంది. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా బాగుంది. సంగీతం, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ అన్నీ చక్కగా కుదిరాయి. దర్శకుడు రామ్‌కుమార్‌ వాస్తవ పరిస్థితుల నుంచి తీసుకుని రాసుకున్న కథను అంతే ఎంగేజింగ్‌గా చూపించాడు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: కుదిరితే, ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా. చిన్న పిల్లలతోనూ కలిసి చూడొచ్చు. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగులో ఆడియోలోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + కథ, కథనాలు
  • + హరీశ్‌ కల్యాణ్‌, భాస్కర్‌ పాత్రలు
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - ప్రారంభ సన్నివేశాలు
  • చివరిగా: ‘పార్కింగ్‌’.. ప్రతి చోటా కనిపించే సమస్య..
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని