Pippa Movie Review: రివ్యూ: పిప్పా.. ఇషాన్‌ ఖట్టర్‌ ‘వార్‌’ మూవీ మెప్పించిందా?

pippa movie review: రాజా కృష్ణమేనన్‌ తెరకెక్కించిన ‘పిప్పా’ ఎలా ఉందంటే?

Published : 10 Nov 2023 20:25 IST

Pippa Movie Review Telugu: చిత్రం: పిప్పా; నటీనటులు: ఇషాన్‌ ఖట్టర్‌, మృణాల్‌ ఠాకూర్‌, ప్రియాంన్షు పైనియులి, సోనీ రజ్దానా తదితరులు; సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌; సినిమాటోగ్రఫీ: ప్రియా సేథ్‌; ఎడిటింగ్‌: హేమంతి సర్కార్‌; నిర్మాత: రోన్ని స్క్రూవాలా, సిద్ధార్థ్‌రాయ్‌కపూర్‌; రచన: రవీంద్ర రంధ్వ, రాజా కృష్ణమేనన్‌, తన్మే మోహన్‌; దర్శకత్వం: రాజా కృష్ణమేనన్‌; స్ట్రీమింగ్‌ వేదిక: అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

ప్రేక్షకులకు వినోదం రూపంలో దొరికిన మరో మాధ్యమం ఓటీటీ. థియేటర్‌లో వరుస సినిమాలు సందడి చేస్తున్నా.. ఇప్పటికీ కొన్ని నేరుగా ఓటీటీలో వస్తున్నాయి. అలా తాజాగా స్ట్రీమింగ్‌కు వచ్చిన చిత్రం ‘పిప్పా’. ఇషాన్‌ ఖట్టర్‌ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? దేని కోసం ఇషాన్‌ యుద్ధం చేయాల్సి వచ్చింది?

కథేంటంటే: బంగ్లాదేశ్‌ను ఆక్రమించుకుని తూర్పు పాకిస్థాన్‌గా మార్చాలని అక్కడ నరమేధం సృష్టిస్తుంటుంది పాకిస్థాన్‌. బంగ్లా విముక్తి కోసం ఉద్యమించిన వారితో పాటు, సామాన్యులను సైతం అతి దారుణంగా హత్య చేసి, మహిళలు, పిల్లలను బందీలుగా చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉన్నా, మానవత్వంతో ఆలోచించి బంగ్లా నుంచి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని వచ్చిన లక్షల మంది శరణార్థులకు భారత్‌ ఆశ్రయం కల్పిస్తుంది. ఇది సహించలేని పాకిస్థాన్‌ భారత్‌పై పలుచోట్ల బాంబు దాడులు చేస్తుంది. దీంతో ప్రధాని ఇందిరాగాంధీ బంగ్లా విముక్తికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ, సైన్యాన్ని పంపుతారు. సొవియట్‌ యూనియన్‌ సాయంతో నేల, నీటిపైనా నడిచే యుద్ధం ట్యాంకులను రష్యా.. భారత్‌కు అందిస్తుంది. వాటి సాయంతో పాక్‌ అధీనంలో ఉన్న గర్బీపూర్‌కు భారత సైన్యం పయనమవుతుంది. కెప్టెన్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా (ఇషాన్‌ ఖట్టర్‌) ఒక యుద్ధ ట్యాంకును లీడ్‌ చేస్తూ ఉంటాడు. మరి గర్భీపూర్‌ వెళ్లే క్రమంలో బలరామ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? వాటిని అతడు ఎలా ఎదుర్కొన్నాడు? పాక్‌ సైన్యంపై భారత్‌ ఎలా విజయం సాధించింది? బలరామ్‌ సోదరుడు మేజర్‌ రామ్‌ మెహతా (ప్రియాంన్షు)కు సైన్యం అప్పగించిన మిషన్‌ ఏంటి? వీరి సోదరి రాధా మెహతా (మృణాల్‌) సైన్యానికి చేసిన సాయం ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: భారత సైన్యం ధైర్య సాహసాలు, ప్రతిభా పాటవాలను సువర్ణాక్షరాలతో లిఖించి భావితరాలకు స్ఫూర్తినింపే ఎన్నో అరుదైన ఘట్టాలు చరిత్రలో ఆవిష్కృతమయ్యాయి. శత్రుసైన్యంపై అసమాన పోరాట పటిమను చూపించి, జయకేతనాలను ఎగురవేసి, జయజయ ధ్వానాలను మోగించిన ఘట్టం 1971 ఇండో-పాకిస్థాన్‌ యుద్ధం. పాకిస్థాన్‌ కబంధ హస్తాల్లోకి వెళ్లిపోకుండా బంగ్లా విముక్తి పోరాటంలో భారత్‌ అందించిన సాయం ఆ దేశ చరిత్రలోనూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఆధునిక ప్రపంచంలో ఒక దేశ స్వాతంత్ర్యం కోసం మరొక దేశం పోరాటం చేయటం బహుశా ఇదేనేమో. నాటి యుద్ధంలో ఒక అంకానికి అక్షర రూపం ఇచ్చిన బ్రిగేడియర్‌ బలరామ్‌ సింగ్‌ మెహతా రాసిన ‘ది బర్నింగ్‌ చాఫే’ పుస్తకానికి దృశ్యరూపమే ఈ ‘పిప్పా’. (Pippa Movie Review Telugu) ఢాకా లైబ్రరీలో జరుగుతున్న బంగ్లా విముక్తి పోరాట సమావేశంపై పాక్‌ సేనలు దాడి చేసి, దొరికిన వారిని దొరికినట్టు కాల్చి చంపే సన్నివేశంతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు.. వాయిస్‌ ఓవర్‌తో తర్వాతో ఏం జరగబోతోందో కథను వివరించే ప్రయత్నం చేశాడు. రష్యా అందించిన యుద్ధ ట్యాంకును పరీక్షించే బృందంలో ఒకడిగా కెప్టెన్‌ బలరామ్‌గా ఇషాన్‌ ఖట్టర్‌ పాత్రను పరిచయం చేస్తూనే.. విపత్కర పరిస్థితుల్లోనూ బలరామ్‌ ఎంత ధైర్యంగా ఉంటాడో చెప్పేలా ఆ సన్నివేశాన్ని తీర్చిదిద్దారు.

అయితే, క్రమశిక్షణకు మారుపేరైన ఆర్మీలో బలరామ్‌ దుందుడుకు స్వభావం వల్ల ఫ్రంట్‌ ఫోర్స్‌ నుంచి ఆఫీస్‌ వర్క్‌కు వచ్చేయడం, మేజర్‌ రామ్‌ మెహతా (ప్రియాంన్షు)కు సైన్యం ఒక సీక్రెట్‌ మిషన్‌ అప్పగించడం, బలరామ్‌ సోదరి రాధా మెహతా (మృణాల్‌) సైన్యానికి సాయం చేసే పనిలో చేరడం, ఇలా మూడు పాత్రలను బ్లెండ్‌ చేస్తూ కథను నడిపాడు దర్శకుడు. అయితే, ఈ పాత్రల మధ్య బలమైన ఎమోషన్‌ లేకపోవడంతో మూడు వేర్వేరు కథలుగా అనిపిస్తాయి. ఇక బలరామ్‌ తిరిగి యుద్ధం క్షేత్రంలోకి అడుగు పెట్టిన తర్వాత తొలిసారి పాక్‌ సేనలను ఎదుర్కొనే సన్నివేశాలు సినిమాకే హైలైట్‌. దాదాపు 20 నిమిషాల పాటు సాగే యుద్ధ సన్నివేశం ఆద్యంతం ఉత్కంఠగా సాగుతుంది. ‘యుద్ధమంటే కేవలం శత్రు సేనలను చంపుకొంటూ వెళ్లడమే కాదు.. తన సేనలను కూడా రక్షించుకుంటూ ముందుకు సాగడం’ అని చెప్పేలా బలరామ్‌ చీఫ్‌ చేసే సాహసం ఒళ్లుగగుర్పొడుస్తుంది. యుద్ధం ముగిసిన తర్వాత వచ్చే ప్రతి సీన్‌ భావోద్వేగభరితంగా సాగుతుంది. మరోవైపు సీక్రెట్‌ మిషన్‌ కోసం వెళ్లి మేజర్‌ రామ్‌ మెహతా శత్రు సేనలకు చిక్కడంతో కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. చివరిగా గర్భీపూర్‌లో దాగి ఉన్న శత్రుమూకలను మట్టుబెట్టే మరో యాక్షన్‌ ఎపిసోడ్‌తో సినిమాను సాధారణంగా ముగించాడు దర్శకుడు. (Pippa Movie Review) హీరో పాత్రను ఎలివేట్‌ చేయడం కోసం ఎక్కడెక్కడో దాగి ఉన్న శత్రువులు కూడా అతడికే కనిపించడం చూస్తుంటే కొంత సినిమాటిక్‌గా అనిపిస్తుంది. భావోద్వేగాల మధ్య సాగాల్సిన పతాక సన్నివేశాలన్నీ హీరో సెంట్రిక్‌గా సాగడంతో తేలిపోయాయి. ఈ వీకెండ్‌లో ఏదైనా వార్‌ యాక్షన్‌ మూవీ చూడాలనుకుంటే ‘పిప్పా’ ఒకసారి ప్రయత్నించవచ్చు. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. కేవలం హిందీ ఆడియో, ఇంగ్లీష్‌ సబ్‌టైటిల్స్‌తో చూడాలి. ఇంతకీ ‘పిప్పా’ అంటే అర్థం ఏంటో తెలుసా? ‘లవర్‌ ఆఫ్‌ హార్సెస్‌’.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: దేశభక్తిని, స్ఫూర్తిని నింపే సినిమా కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు.

ఎవరెలా చేశారంటే: కెప్టెన్‌ బలరామ్‌ పాత్రలో ఒదిగిపోయేందుకు ఇషాన్‌ కట్టర్‌ తనవంతు ప్రయత్నం చేశాడు. సైన్యాన్ని ఉత్తేజపరిచేలా ప్రసంగించే సన్నివేశాల్లో చక్కని భావోద్వేగాలు పలికించాడు. అయితే, కెప్టెన్‌ బలరామ్‌ పాత్ర ఇషాన్‌ స్థాయికి సరిపోలేదేమో అనిపిస్తుంది. ఎటు నుంచి చూసినా చిన్నపిల్లాడిలా కనిపిస్తాడు. ఆర్మీ అంటే క్రమశిక్షణకు మారుపేరు, కానీ, బలరామ్‌ పాత్రకు దాన్ని ఆపాదించలేదు. రాధా మెహతాగా మృణాల్‌ ఠాకూర్‌, రామ్‌ మెహతాగా ప్రియాంన్షు తమ పాత్రలకు న్యాయం చేశారు. తెరపై ప్రధానంగా కనిపించేది ఈ మూడు పాత్రలే అయినా, వాటి మధ్య సంఘర్షణ లోపించింది. సాంకేతికంగా సినిమా ఓకే. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ పర్వాలేదు. ఏఆర్‌రెహమాన్‌ నేపథ్య సంగీతం యుద్ధ సన్నివేశాలను ఎలివేట్‌ చేసింది. దర్శకుడు రాజా కృష్ణమేనన్‌ ఒక వార్‌ ఫిల్మ్‌ను తీశాడు కానీ, పూర్తిస్థాయి భావోద్వేగభరితంగా మలచడంలో తడబడ్డాడు. గతంలో ఆయన అక్షయ్‌ కుమార్‌తో తీసిన ‘ఎయిర్‌లిఫ్ట్‌’ పోలిస్తే చాలా అడుగులు దూరంలోనే ‘పిప్పా’ ఉండిపోయింది. ‘ఎవరైతే బలహీనులు, నిస్సహాయల కోసం పోరాటం చేస్తారో వాళ్లే నిజమైన ధైర్యవంతులు’, ‘చరిత్రలో ఏ దేశమూ మరొక దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేయలేదు. కానీ, మన దగ్గర 45 కేవలరీ ఉంది? సరికొత్త చరిత్ర లిఖించడానికి..’ వంటి సంభాషణలు బాగున్నాయి.

  • బలాలు
  • + ఇషాన్‌ ఖట్టర్‌
  • + యుద్ధ సన్నివేశాలు
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - పాత్రల మధ్య సంఘర్షణ లేకపోవడం
  • - భావోద్వేగాలను పూర్తి స్థాయిలో ఆవిష్కరించలేకపోవడం
  • చివరిగా: ‘పిప్పా’.. మరో వార్‌ ఫిల్మ్‌..!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు