Ponniyin selvan 2 review: రివ్యూ: పొన్నియిన్ సెల్వన్-2
Ponniyin selvan 2 review: మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ ఫిల్మ్ ‘పొన్నియిన్ సెల్వన్2’ ఎలా ఉందంటే?
Ponniyin selvan 2 review; చిత్రం: పొన్నియిన్ సెల్వన్-2; నటీనటులు: విక్రమ్, కార్తి, జయం రవి, ఐశ్వర్యరాయ్ బచ్చన్, త్రిష, శోభిత ధూళిపాళ్ల, ప్రకాశ్‌రాజ్, జయరాం, ప్రభు, శరత్‌కుమార్, పార్తిబన్, రెహమాన్, విక్రమ్ ప్రభు తదితరులు; సంగీతం: ఏఆర్ రెహమాన్; సినిమాటోగ్రఫీ: రవి వర్మన్; ఎడిటింగ్: ఎ.శ్రీకర్ ప్రసాద్; నిర్మాత: మణిరత్నం, శుభాష్ కరణ్; స్క్రీన్‌ప్లే: మణిరత్నం, బి.జయమోహన్, కుమర్‌వేల్; దర్శకత్వం: మణిరత్నం; విడుదల: 28-04-2023
బాహుబలి... కె.జి.ఎఫ్ సినిమాల స్థాయిలో తదుపరి భాగం ఎప్పుడెప్పుడా అంటూ ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన చిత్రం `పొన్నియిన్ సెల్వన్`. 9వ శతాబ్దం నాటి చోళ సామ్రాజ్యం నేపథ్యంలో సాగే కథ ఇది. కల్కి కృష్ణమూర్తి రచించిన నవల ఆధారంగా రూపొందింది. పలువురు దర్శకులు చేసిన పలు ప్రయత్నాల తర్వాత ఈ సినిమాని విజయవంతంగా తెరకెక్కించారు అగ్ర దర్శకుడు మణిరత్నం. తొలి భాగం సినిమా గతేడాది విజయవంతంగా ప్రేక్షకుల్ని మెప్పించింది. రెండో భాగంగా `పి.ఎస్2` పేరుతో వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం..
కథేంటంటే: చోళ యువరాజు అరుణ్‌మొళి వర్మ అలియాస్ పొన్నియిన్ సెల్వన్ (జయం రవి) తనపైకి వచ్చిన శత్రుమూకలతో పోరాడుతూ సముద్రంలో మునిగిపోవడంతో తొలి భాగం కథ ముగుస్తుంది. అరుణ్‌మొళికి ఎప్పుడు ఆపద వచ్చినా కాపాడే ఓ వృద్ధురాలు ఈసారి కూడా అతని కోసం సముద్రంలో ప్రత్యక్షమవుతుంది. నందిని (ఐశ్వర్యరాయ్) పోలికలతో కనిపించే ఆ వృద్ధురాలు ఎవరు? ఈసారి వచ్చిన ఆపద నుంచి అరుణ్‌మొళిని ఆమె కాపాడిందా లేదా? వీరపాండ్య హత్యకి ప్రతీకారంగా చోళ రాజుల్ని అంతం చేయడమే లక్ష్యంగా వేచి చూస్తున్న పాండ్య సైన్యం లక్ష్యం నెరవేరిందా? మరోవైపు మధురాంతకుడి (రెహమాన్)ని చోళ రాజ్యానికి పట్టపురాజుని చేయాలని సొంత రాజ్యంలోనే నడుస్తున్న రాజకీయాలు ఎంతవరకు చేరాయి? తనపై మనసుపడిన ఆదిత్య కరికాలుడు (విక్రమ్)ని వ్యూహం ప్రకారం తన కోటకి రప్పించిన నందిని అతడిని ఏం చేసింది? అసలు 9వ శతకంలో చోళ సామ్రాజ్యంలో ఏం జరిగిందనేది రెండో భాగం సినిమాలోని కథ.
ఎలా ఉందంటే: నందిని పోలికలతో ఉన్న ఆ వృద్ధురాలు ఎవరనే ఆసక్తిని రేకెత్తిస్తూ తొలి భాగాన్ని ముగించిన దర్శకుడు... ఆ అంశంపైనే రెండో భాగం ప్రధాన కథని తీర్చిదిద్దాడు. తొలి భాగం సినిమాలో చోళ సామ్రాజ్యం.. అందులోని ప్రధాన వ్యక్తులు.. వారికున్న ఆకాంక్షలు పరిచయం కాగా రెండో భాగం సినిమా మరింత లోతుల్లోకి తీసుకెళ్లి కథని వివరిస్తుంది. ఒక రాజ్యంపై శత్రువులకి ఉండే పగ, ప్రతీకారాలు... వాటిని తీర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు, రాజ్యాధికారమే పరమావధి అనుకున్నప్పుడు సొంత మనుషుల మధ్యే చోటు చేసుకునే కుట్రలు, కుతంత్రాలు.. ఆ క్రమంలో చోటు చేసుకునే నాటకీయ పరిణామాలు, ప్రేమతో దగ్గరై ఆ తర్వాత దూరమైన కొన్ని మనసుల మధ్య సంఘర్షణ, వీరోచిత సాహసాలు, త్యాగాల నేపథ్యంలోనే ఈ కథ సాగుతుంది. చరిత్రాత్మక నవల పొన్నియిన్ సెల్వన్ ఆధారంగా అదే పేరుతోనే ఈ సినిమా రూపుదిద్దుకుంది. నవలలోనే సినిమాకి కావల్సినంత డ్రామా ఉంది. దాన్ని పక్కాగా తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు. నందిని, ఆదిత్య కరికాలుడి ప్రేమ సన్నివేశాలతో ఆహ్లాదకరంగా సినిమా మొదలవుతుంది. చిరంజీవి వాయిస్ ఓవర్‌తో అసలు కథలోకి ప్రవేశిస్తుంది.
అరుణ్‌మొళి సముద్రంలో మునిగిపోయిన తర్వాత చోళరాజ్యంలోనూ, పాండ్యనాడులోనూ చోటు చేసుకునే పరిణామాలు, బౌద్ధ గురువుల సమక్షంలో చోటు చేసుకునే నాటకీయ పరిణామాలు ప్రేక్షకుడిని కథలో లీనం చేస్తాయి. మందాకిని ఎవరనే అంశం చుట్టూ అల్లిన సన్నివేశాలు, ఆదిత్య కరికాలుడు... నందిని మధ్య సంఘర్షణ ఈ సినిమాకి కీలకం. ఆ రెండు పాత్రలకి ముగింపునిచ్చిన తీరు మనసుల్ని హత్తుకుంటుంది. తొలి భాగం కథ ఎక్కువగా వల్లవరాయుడు చేసే సాహసాలు, అతడు చేసే అల్లరి చుట్టూనే సాగుతుంది. ఈసినిమాలోనూ ఆ పాత్ర కీలకం. దర్శకుడు ఈ కథ సాగే 9వ శతాబ్దంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్లి కూర్చోబెట్టాడు. ఆయనకి సాంకేతిక విభాగాలు చక్కటి సహకారాన్ని అందించాయి. యుద్ధ సన్నివేశాలతో పతాక సన్నివేశాలు సాగుతాయి. వాటిని తీర్చిదిద్దిన విధానంలో కొత్తదనమేమీ లేదు. కానీ ఆ తర్వాత సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. అయితే పాత్రల విషయంలో మాత్రం కాస్త గందరగోళం తప్పదు. తొలి భాగం చూసినా సరే, మరోసారి ఆ కథని పక్కాగా గుర్తు చేసుకుని వెళితే తప్ప రెండో భాగం సినిమా అర్థం కాదు. అసలు నందిని... ఆదిత్య కరికారులుడు యుక్త వయసులో దూరం కావడానికి నిజమైన కారణాలేమిటి? దాని వెనక ఎవరున్నారు? మందాకినికి సుందర చోళుడుకీ మధ్య సంబంధం ఏమిటి? అతను ఆమెకి ఎలా అన్యాయం చేశాడు? తదితర ప్రశ్నలకి సమాధానాలు స్పష్టంగా చెప్పలేకపోయారు దర్శకుడు. ఆ విషయాల్లో గందరగోళమే ఎక్కువ.
ఎవరెలా చేశారంటే: తారాగణమే సినిమాకి ప్రధానబలం. ప్రతి ఒక్కరూ ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా రెండో భాగంలో విక్రమ్, ఐశ్వర్యరాయ్ పాత్రలు మనసుల్ని హత్తుకుంటాయి. విక్రమ్ కనిపించేది తక్కువ సమయమే కావొచ్చు, కానీ.. ఆ పాత్ర బలమైన ప్రభావమే చూపిస్తుంది. ఐశ్వర్యరాయ్ రెండు కోణాల్లో సాగే పాత్రలో కనిపించి ఆకట్టుకుంటారు. కార్తీ, జయం రవి ఆయా పాత్రల్లో ఒదిగిపోయారు. తొలి భాగంలో జయరాం పాత్ర నవ్వించింది. ఇందులో ఆ పాత్ర పరిధి తక్కువే. కుందవై పాత్రలో త్రిష తన అందంతో ఆకట్టుకున్నారు. ఐశ్వర్యలక్ష్మి, శోభితా ధూళిపాళ్ల, శరత్‌కుమార్, పార్తీబన్, విక్రమ్ ప్రభు, ప్రభు, రెహమాన్ తదితరులు పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. రవివర్మన్ కెమెరా అద్భుతాలే చేసింది. కోటలు, రాజమందిరాల్లో తీర్చిదిద్దిన సన్నివేశాలు, యుద్ధ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. ఆయన లైటింగ్ 9వ శతాబ్దంలోనే ఉన్నామా అనిపించేలా ఉంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం మరో ఆకర్షణ. పాటలు, నేపథ్య సంగీతం సినిమా స్థాయికి తగ్గట్టు కుదిరాయి. తోట తరణి కళా ప్రతిభ ఆకట్టుకుంటుంది. కూర్పు, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయి. జయం రవి, కార్తీ సొంతంగా చెప్పిన సంభాషణలు, జయరాం పాత్రకి తనికెళ్ల భరణి చెప్పిన డబ్బింగ్ సినిమాకి తెలుగుదనాన్ని తీసుకొచ్చింది. నిర్మాణం ఉన్నతంగా ఉంది. ప్రతీ సన్నివేశం బలమైన హంగులతో కనిపిస్తుంది. దర్శకుడు మణిరత్నం తన మార్క్ మేకింగ్‌తో సినిమాని తీర్చిదిద్దారు.
బలాలు: + కథ.. సంఘర్షణ, + భావోద్వేగాలు, + విజువల్స్.. సంగీతం
బలహీనతలు: - యుద్ధ సన్నివేశాలు, - అక్కడక్కడా సాగదీతగా సన్నివేశాలు
చివరిగా: పీఎస్2... మణిరత్నం విజువల్ వండర్
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taiwan: చైనా మనసు మారలేదు.. తైవాన్ను వదిలేది లేదు..!
-
India News
Airport: ప్రయాణికురాలి బాంబు బూచి.. విమానాశ్రయంలో కలకలం!
-
Sports News
David Warner: క్రికెట్ ఆస్ట్రేలియాపై మరోసారి విరుచుకుపడిన డేవిడ్ వార్నర్
-
World News
Prince Harry: కోర్టు బోనెక్కనున్న రాకుమారుడు.. 130 ఏళ్లలో తొలిసారి!
-
Movies News
Ahimsa movie review: రివ్యూ: అహింస.. దగ్గుబాటి అభిరామ్ ఫస్ట్ మూవీ ఎలా ఉందంటే?
-
India News
Periodic Table: పిరియాడిక్ టేబుల్‌ను ఎందుకు తొలగించామంటే..? NCERT వివరణ