Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్‌ తెలుగులో ఎలా ఉంది?

Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 08 Mar 2024 10:38 IST

Premalu Movie Review | చిత్రం: ప్రేమలు; నటీనటులు: నస్లేన్ కె. గఫూర్‌, మాథ్యూ థామస్‌, మమిత బైజు, శ్యామ్‌ మోహన్‌, సంగీత్‌ ప్రతాప్‌, అఖిల భార్గవన్‌, మీనాక్షి రవీంద్రన్‌ తదితరులు; సంగీతం: విష్ణు విజయ్‌; సినిమాటోగ్రఫీ: అజ్మల్‌ సాబు; ఎడిటింగ్‌: ఆకాష్‌ జోసెఫ్‌ వర్గీస్‌; నిర్మాత: ఫహద్‌ ఫాజిల్‌, దిలీష్‌ పోతన్‌, శ్యామ్‌ పుష్కరన్‌; రచన: గిరీష్‌ ఎ.డి., కిరణ్‌ జోసో; దర్శకత్వం: గిరీష్‌ ఎ.డి; విడుదల: 08-03-2024

మ‌ల‌యాళంలో ఈమ‌ధ్య చాలా సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర స‌త్తా చాటాయి. అందులో ప్రేమ‌లు (Premalu) ఒక‌టి. తెలుగు ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచిత‌మైన న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్, ఆయ‌న మిత్ర‌బృందం క‌లిసి నిర్మించిన చిత్ర‌మిది. కొత్త‌ త‌రం ప్రేమ‌క‌థ‌తో, హైద‌రాబాద్ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. అక్కడి ప్రేక్ష‌కుల్ని గిలిగింత‌లు పెట్టింది. తెలుగులో అదే పేరుతో ఈ సినిమా అనువాద‌మై, శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌రి ఈ చిత్రం ఎలా ఉంది? తెలుగు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చుతుందా? ఈ విష‌యాల్ని తెలుసుకునే ముందు క‌థేమిటో చూద్దాం..

క‌థేంటంటే?

స‌చిన్ సంతోష్ (నాస్లెన్ కె.గ‌ఫూర్‌) ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్‌. కాలేజీలో ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. కానీ.. ఆ విష‌యాన్ని చెప్పేందుకు ధైర్యం స‌రిపోదు. కాలేజీలో చివ‌రి రోజు త‌న  ప్రేమ‌ను వ్య‌క్తం చేస్తాడు. ఆ అమ్మాయేమో అప్ప‌టికే వేరొక‌రితో ప్రేమ‌లో ఉన్నాన‌ని చెబుతుంది. అలా తొలిసారి ప్రేమ‌లో విఫ‌ల‌మైన స‌చిన్‌... యూకే వెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉంటాడు. తీరా చూస్తే  వీసా రాదు.  దాంతో గేట్ కోచింగ్‌ కోసం స్నేహితుడు అమూల్ డేవిస్ (సంగీత్ ప్ర‌తాప్‌)తో క‌లిసి హైద‌రాబాద్ చేరుకుంటాడు. అక్క‌డే రీనూ (మ‌మిత బైజు) ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగిగా చేరుతుంది. ఓ పెళ్లి వేడుక‌లో వీరిద్దరూ క‌లుస్తారు. తొలి చూపులోనే ఆమె ప్రేమ‌లో ప‌డిపోతాడు. మ‌రి ఈసారైనా స‌చిన్ ప్రేమక‌థ సుఖాంత‌మైందా? లేక మ‌ళ్లీ అత‌ని హార్ట్ బ్రేక్ అయ్యిందా? తదితర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే?
ప్రేమ ప్ర‌ధానంగా సాగే సినిమాల్లో పెద్ద క‌థ‌లేమీ ఆశించ‌లేం. ఓ అమ్మాయి, ఓ అబ్బాయి, వారి మ‌ధ్య ప్రేమ‌.. ఇలా సాగిపోతుంటుంది. ఆ మాట‌కొస్తే ఇందులో పెద్ద సంఘ‌ర్ష‌ణ కూడా ఏమీ లేదు. ఇది మ‌న గ్యాంగే అనిపించేలా పాత్ర‌ల్ని నిజాయతీగా మ‌లచ‌డంతోపాటు.. సందర్భోచితంగా పండే హాస్యంపై దృష్టి పెట్టి సినిమాను అందరికీ క‌నెక్ట్ చేశాడు ద‌ర్శ‌కుడు. కొంచెం కాలేజీ క్యాంప‌స్.. మ‌రి కొంచెం కార్పొరేట్ ఆఫీస్‌లోని వాతావ‌ర‌ణం.. రూమ్‌ల్లో మంచం షేర్ చేసుకునే బ్యాచిలర్స్ జీవితాలు.. ఆయా కుటుంబాల నేప‌థ్యాలు.. ఇలా చాలా అంశాల్ని స్పృశిస్తూ సాగే స‌న్నివేశాలు క‌నెక్టివిటీని అంత‌కంత‌కూ పెంచుకుంటూ పోతాయి. అక్క‌డే ఈ సినిమా న‌చ్చేస్తుంది. పాత్ర‌లతోనూ, వాటికి ఎదురయ్యే సంద‌ర్భాలతోనూ ప్రేక్ష‌కుడూ  ప్రేమ‌లో ప‌డేలా చేస్తుంది. క‌థేమీ లేదు క‌దా అనే విష‌యం ఎక్క‌డా గుర్తుకు రాకుండా ఈ చిత్రంలోని హాస్య సన్నివేశాలను తీర్చిదిద్దాడు దర్శకుడు. అమాయ‌క‌త్వంతో క‌నిపించే ప్ర‌తి పాత్ర గిలిగింత‌లు పెడుతుంది (Premalu Movie telugu Review).  హీరో ప్ర‌పంచాన్ని చూపిస్తూ సినిమాను మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు.. క‌థ‌ను ప‌ట్టాలెక్కించ‌డానికి స‌మ‌యం తీసుకున్నాడు.  హీరో హీరోయిన్లు పెళ్లిలో క‌లుసుకున్నాకే అసలు హంగామా మొద‌లవుతుంది. వారి మ‌ధ్య  సాన్నిహిత్యం మొద‌ల‌య్యాక... రీనూ మేనేజ‌ర్ ఆది ప‌డే  పాట్లు, అత‌డి ఆఫీస్‌లోని స్టాఫ్ చేసే అల్ల‌రి, ఆది నుంచి హీరోకి ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు సినిమాను హాస్య‌భ‌రితంగా మారుస్తాయి. హైద‌రాబాద్‌లో టూర్లు, పార్టీలు అంటూ అవే స‌న్నివేశాలు తెర‌పై పున‌రావృతం అవుతుంటాయి. కానీ.. కామెడీతో ఆ సాగ‌దీత కూడా క‌నిపించ‌కుండా చేయ‌డంలో ద‌ర్శ‌కుడు స‌ఫ‌ల‌మ‌య్యాడు. సంభాష‌ణ‌లు సినిమాకు బ‌లం. తెలుగులో ట్రెండీగా సంభాష‌ణ‌లు కుదిరాయి. ‘#90'S’ ద‌ర్శ‌కుడు ఆదిత్య హాస‌న్ మాట‌ల ర‌చ‌న ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యింది. కుర్చీని మ‌డ‌త‌పెట్టి... సంభాష‌ణ మొద‌లుకుని కుమారి ఆంటీ వ‌ర‌కూ సామాజిక మాధ్య‌మాల్లో ట్రెండ్ అయిన విష‌యాల్ని ఇందులో తెలివిగా చొప్పించి హాస్యం పండించారు. సోడెక్సో కూపన్స్ మొద‌లుకుని.. సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో వినిపించే సెటైర్ల వ‌ర‌కూ దేన్నీ వ‌ద‌ల్లేదు. హైద‌రాబాద్ నేప‌థ్యం ఈ సినిమాకు మ‌రో ఆక‌ర్ష‌ణ‌. సింహ‌భాగం క‌థ ఇక్కడే సాగుతుంది. దాంతో తెలుగు ప్రేక్ష‌కులకు ఇది మ‌న సినిమానే అనే భావ‌న క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే?
తెలిసిన న‌టులెవ్వ‌రూ ఇందులో లేరు. కొత్త‌ త‌రం న‌టులు ఈ సినిమాకు కొత్త అందాన్ని తీసుకొచ్చారు. క‌థానాయకుడు నాస్లేన్, క‌థానాయిక మ‌మిత బైజు.. తెరపై క్యూట్‌గా క‌నిపించి ప్రేక్ష‌కుల్ని ప్రేమ‌లో ప‌డేలా చేస్తారు. హీరో స్నేహితుడు సంగీత్ పాత్ర‌, అత‌డి న‌ట‌న ఆక‌ట్టుకుంటుంది. ఆది పాత్ర‌లో  శ్యామ్ మోహ‌న్ న‌ట‌న గుర్తుండిపోతుంది. మిగిలిన వారు ఆయా పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. సంగీతం, కెమెరా విభాగాలు ప్ర‌భావం చూపించాయి. ద‌ర్శ‌కుడు  గిరీశ్ ఏడీ ర‌చ‌న‌లో బ‌లం.. మేకింగ్ ప‌రంగా ఉన్న స‌మ‌స్య‌ల‌న్నింటినీ క‌ప్పేసింది. ఔట్‌పుట్‌ని ప‌క్కాగా ఊహిస్తే త‌ప్ప ఇలాంటి క‌థ‌ల్ని  నిర్మాత‌లు న‌మ్మ‌లేరు. ఈ విష‌యంలో  నిర్మాత‌లైన  ఫాహ‌ద్ ఫాజిల్, ఆయ‌న స్నేహితుల విజ‌న్‌ను మెచ్చుకోవ‌ల్సిందే.

బలాలు
+ హాస్యం
+ క‌థా నేప‌థ్యం
+ న‌టీనటులు

 బ‌ల‌హీన‌త‌లు
- సాగ‌దీత‌గా కొన్ని స‌న్నివేశాలు
చివ‌రిగా: ప‌్రేమ‌లు...  భ‌లే న‌వ్వులు

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని