project z movie review: రివ్యూ: ప్రాజెక్ట్‌-Z.. సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

Project Z Movie Review: ఏడేళ్ల కిందట తమిళంలో విడుదలై తాజాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ప్రాజెక్ట్‌-Z’ ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 08 Apr 2024 15:15 IST

Project Z Movie Review; చిత్రం: ప్రాజెక్ట్‌-Z; నటీనటులు: సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌, డేనియల్‌ బాలాజీ, మైమ్‌ గోపి తదితరులు; సంగీతం: జిబ్రాన్‌; ఎడిటింగ్‌: లియో జాన్‌ పాల్‌; సినిమాటోగ్రఫీ: గోపి అమర్‌నాథ్‌; రచన, నిర్మాత, దర్శకత్వం: సీవీ కుమార్‌

తెలుగు, తమిళ భాషలో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ అలరిస్తున్న నటుడు సందీప్‌ కిషన్‌. ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద చిన్న సినిమాలు విడులవుతున్న నేపథ్యంలో ఆయన నటించిన ‘మాయవన్‌’ను ‘ప్రాజెక్ట్‌-Z’ పేరుతో విడుదల చేశారు. ఏడేళ్ల తర్వాత ఇక్కడ విడుదలైన ఈ మూవీ ఎలా ఉంది? ఇంతకీ ‘ప్రాజెక్ట్‌-Z’ అంటే ఏంటి?

కథేంటంటే: కుమార్‌ (సందీప్‌ కిషన్‌) క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌. ఓ చిల్లర దొంగను పట్టుకునే క్రమంలో జిమ్‌ ట్రైనర్‌ (సాయి దీనా) అతని భార్యను హత్య చేయడం చూస్తాడు. రక్తం చూడగానే కుమార్‌ మొదట భయాందోళనకు గురైనా వెంటనే తేరుకుని, హంతకుడైన జిమ్‌ ట్రైనర్‌ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగి జిమ్‌ ట్రైనర్‌ను కుమార్‌ పొడవటంతో అతడు అక్కడిక్కడే మరణిస్తాడు. తీవ్ర గాయాల పాలైన అతడు కోలుకున్న తర్వాత ఉద్యోగంలో తిరిగి చేరడానికి మెంటల్‌ ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ కావాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే సైకోథెరపిస్ట్‌ అదిర (లావణ్య త్రిపాఠి)తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. మరోవైపు నగరంలో వరుసగా ఒకే తరహా హత్యలు జరుగుతాయి. మరి ఆ హత్యలు చేస్తున్నది ఎవరు? రక్తం చూస్తే భయపడిపోయే కుమార్‌ గతం ఏంటి?(Project Z Movie Review in telugu) వరుస హత్యలను ఛేదించడానికి వెళ్లిన అతడి టీమ్‌కు ఎదురైన పరిస్థితులు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ‘నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో జీవించు’ అంటూ మన పెద్దలు దీవిస్తారు. ఇప్పటికీ వయసులో సెంచరీ కొట్టిన వ్యక్తుల గురించి మనం పత్రికల్లో చూస్తూనే ఉంటాం. కానీ, ఒక మనిషి వెయ్యేళ్లు బతకగలడా? అందుకు అవకాశం ఉందా? ఉంటే ఎలా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే ‘ప్రాజెక్ట్‌-Z’. దీన్నొక సైన్స్‌ ఫిక్షన్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దడంలో సీవీ కుమార్‌కు మంచి మార్కులే పడ్డాయి. అయితే, సగటు ప్రేక్షకుడు దీన్ని అర్థం చేసుకోవడం కాస్త కష్టం. జిమ్‌ ట్రైనర్‌ నుంచి కుమార్‌ తనని తాను కాపాడుకునే సన్నివేశాలతో సినిమాను మొదలు పెట్టిన దర్శకుడు.. అసలు పాయింట్‌కు రావడానికి కాస్త సమయం తీసుకున్నాడు. ఈ క్రమంలో కుమార్‌ వృత్తి జీవితం, రక్తం చూస్తే అతడు ఎందుకు భయపడిపోతాడో తెలిపే గతం, సైకోథెరపిస్ట్‌తో పరిచయం.. తదితర సన్నివేశాలతో సినిమాను నడిపించాడు. ఎప్పుడైతే ప్రొఫెసర్‌ ప్రమోద్‌ హత్య జరుగుతుందో అక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. నటి విస్మ (అక్షరా గౌడ) హత్య, మేకప్‌ మ్యాన్‌ గోపి (మైమ్‌ గోపి) ఆత్మహత్య చేసుకోవడంతో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ హత్యల వెనుక మోటివేషనల్‌ స్పీకర్‌ రుద్ర (డేనియల్‌ బాలాజీ) హస్తం ఉందేమోనన్న కోణంలో విచారణ చేపట్టిన కుమార్‌కు ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. అసలు రుద్ర ప్రవర్తన కూడా అందుకు బలం చేకూరుస్తుంది. (Project Z Movie Review in telugu) అతడిని పట్టుకుని, పోలీస్‌ కస్టడీలో విచారిస్తుండగా, విస్తుగొలిపే నిజాలు తెలుస్తాయి. మోస్ట్‌ అడ్వాన్స్‌డ్‌ న్యూరాలజీ సాంకేతికతతో రుద్ర మెదడులోని ఆలోచనలను, జ్ఞాపకాలను చెరిపేసి, ప్రొఫెసర్‌ ప్రమోద్‌ తన మెదడును కాపీ చేశాడన్న ట్విస్ట్‌ ప్రేక్షకుడిని మతి పోగొడుతుంది. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ అలా ఎందుకు చేశాడు? అందుకు దారి తీసిన పరిస్థితులు ఏంటి? అన్న విషయాలు కూడా ఆసక్తికరం.

రుద్ర చనిపోయిన తర్వాత ప్రొఫెసర్‌ ప్రమోద్‌ తన మెదడును ఆర్మీ మేజర్‌ సత్యన్‌ (జాకీష్రాఫ్‌)లోకి పంపిన తర్వాత కథ మరో మలుపు తిరుగుతుంది. అప్పటి వరకూ సైన్స్‌ఫిక్షన్‌ జానర్‌లో నడుస్తూ ఉన్న సినిమా ఒక్కసారి క్రైమ్‌ థ్రిల్లర్‌గా మారిపోతుంది. ఆర్మీ మేజర్‌ సత్యన్‌ను కుమార్‌ ఎలా ఎదుర్కోగలడన్న ఉత్కంఠ ప్రేక్షకుడిని తొలిచేస్తుంది. కుమార్‌ సహ ఉద్యోగి, స్నేహితుడు అయిన కర్ణ (భగవతి పెరుమాళ్‌), అతడి కుటుంబాన్ని మేజర్‌ సత్యన్‌ హత్య చేయడం, అతడు సాగించే విధ్వంసం.. సినిమా చూస్తున్న ప్రేక్షకుడినీ కంటతడి పెట్టేలా చేస్తుంది. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్‌ ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేశాడు దర్శకుడు. ప్రొఫెసర్‌ ప్రమోద్‌ మరొకరి మెదడులోకి వెళ్లకుండా కుమార్‌ ఎలా అడ్డుకున్నాడన్నది చాలా తెలివిగా చూపించాడు. 

ఎవరెలా చేశారంటే: ఇన్‌స్పెక్టర్‌ కుమార్‌గా సందీప్‌కిషన్‌ నటన నేచురల్‌గా ఉంది. ఆయన పాత్ర, దాన్ని తీర్చిదిద్దిన విధానం ఎక్కడా శ్రుతి మించలేదు. లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌, డేనియల్‌ బాలాజీ, మైమ్‌ గోపి, భగవతి పెరుమాళ్‌ తదితరులు తమ పరిధి మేరకు నటించారు. ఇలాంటి కథలను సాధారణ ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యేలా తీయడం కాస్త కష్టమే కానీ, సీవీ కుమార్‌ తనవంతు మంచి ప్రయత్నమే చేశారు. ఈ తరహా కథతోనే  పూరి జగన్నాథ్‌, రామ్‌ కాంబినేషన్‌లో 2019లో వచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ హిట్‌ కావడానికి కారణం కథకు మాస్‌ ఎలిమెంట్స్‌ జోడించడమే. అయితే, సీవీ కుమార్‌ పూర్తిగా తాను రాసుకున్న కథకు కట్టుబడి తీయడం అభినందనీయం.

  • బలాలు
  • + కథ, స్క్రీన్‌ప్లే
  • + నటీనటులు
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - ప్రథమార్ధంలో కొన్ని సన్నివేశాలు
  • చివరిగా: ప్రాజెక్ట్‌-Z ఎంగేజింగ్‌ థ్రిల్లర్‌ (Project Z Movie Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని