Pushpa2: తలదించితే బానిసవి.. ఎత్తినావా నువ్వే బాదుషావి

‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్‌.

Updated : 02 May 2024 09:44 IST

‘‘తలదించినావా బానిసవి.. ఎత్తినావా బాదుషావి.. తలపొగరే నీ కిరీటమైతే భూతలమంతా నీదేరా’’ అంటూ తను నమ్మిన జీవిత సూత్రాన్ని అందరికీ బోధిస్తున్నాడు పుష్పరాజ్‌. మరి ఈసారి అతని యాక్షన్‌ హంగామా ఎలా ఉండనుందో తెలియాలంటే ‘పుష్ప: 2 ది రూల్‌’ చూడాల్సిందే. అల్లు అర్జున్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రమిది. ‘పుష్ప: ది రైజ్‌’కు కొనసాగింపుగా సుకుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం ఆగస్టు 15న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ఈ చిత్ర టైటిల్‌ గీతాన్ని విడుదల చేసింది చిత్ర బృందం. ‘‘నువ్వు గడ్డం అట్టా సవరిస్తుంటే దేశం దద్దరిల్లే.. నువ్వు భుజమే ఎత్తి నడిచొస్తుంటే భూమే బద్దలయ్యే’’ అంటూ పుష్పరాజ్‌ పాత్ర గుణగణాల్ని.. తన శక్తియుక్తిల్నీ వర్ణిస్తూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగిందీ గీతం. దీనికి దేవిశ్రీప్రసాద్‌ సమకూర్చిన మాస్‌ బాణీలు.. చంద్రబోస్‌ అందించిన సాహిత్యం.. నకాష్‌ అజిజ్‌, దీపక్‌ బ్లూ ఆలపించిన తీరు.. విజయ్‌ పొల్లంకి, శ్రేష్టి వర్మల నృత్యరీతులు.. అన్నీ చక్కగా కుదిరాయి. అలాగే పాటలో అల్లు అర్జున్‌ వేసిన షూ డ్రాప్‌ స్టెప్‌, ఫోన్‌ స్టెప్‌, ఛాయ్‌ స్టెప్స్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఆఖర్లో రెండు చేతులతో తన గడ్డాన్ని సవరించుకుంటూ ‘‘అస్సలు తగ్గేదేలే’’ అని బన్నీ చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచేలా ఉంది. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశ చిత్రీకరణలో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని