Rajini-Kamal: ‘విక్రమ్‌’ను మించేలా.. భారీ చిత్రం ప్లాన్‌ చేస్తున్న రజనీ-కమల్‌ హాసన్‌?

నటనలో సరిహద్దులు చెరిపేసిన స్టార్స్‌ రజనీకాంత్‌ (Rajinikanth), కమల్‌హాసన్‌ (Kamal Haasan). దాదాపు అయిదు దశాబ్దాలుగా తమిళ చిత్ర

Published : 19 Jul 2022 12:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటనలో సరిహద్దులు చెరిపేసిన స్టార్స్‌ రజనీకాంత్‌ (Rajinikanth), కమల్‌హాసన్‌ (Kamal Haasan). దాదాపు అయిదు దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో తిరుగులేని తారలుగా వెలుగొందుతున్నారు. ఇప్పటికీ వీరి సినిమాలు వస్తున్నాయంటే ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త కోలీవుడ్‌ ఫిల్మ్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. వీరిద్దరూ కలిసి ఓ భారీ ప్రాజెక్ట్‌ చేపట్టే అవకాశం ఉందని టాక్‌. వచ్చే ఏడాది చివరిలో లేదా, 2024 ప్రారంభంలో ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ‘విక్రమ్‌’ (Vikram) తో బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న లోకేశ్‌ కనగరాజ్‌ (lokesh kanagaraj) ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారని సమాచారం.

కరోనా మహమ్మారి దేశంలో ప్రవేశించక ముందు కమల్‌ హాసన్‌ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై రజనీకాంత్‌ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కాల్సి ఉంది. దానికి లోకేశ్‌ కనగరాజ్‌ను దర్శకుడిగా అనుకున్నారు. అయితే, పరిస్థితులు మారిపోవడంతో ఆ ప్రాజెక్టు పక్కకు వెళ్లిపోయింది. కాలగమనంలో ‘విక్రమ్‌’ పట్టాలెక్కడం, విడుదలైన రికార్డులు తిరగరాయడం జరిగిపోయింది. అప్పుడు ఆగిపోయిన ప్రాజెక్టును మళ్లీ మొదలు పెట్టాలని కమల్‌ భావించారట. ఈ చిత్రంలో రజనీకాంత్‌ను కూడా భాగస్వామిగా చేర్చుకుంటున్నారని సమాచారం. అంతేకాదు, రజనీ-కమల్‌ ఇద్దరూ తెరపై కనిపిస్తారని అంటున్నారు. ఇదే జరిగితే కొన్నేళ్ల తర్వాత వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా ఇదే అవుతుంది. ఈ ప్రాజెక్టుకు దాదాపు రూ.250 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇటు కమల్‌హాసన్‌, అటు రజనీకాంత్‌ ఇద్దరూ పారితోషికం లేకుండానే పనిచేయనున్నారని తెలుస్తోంది. అదే జరిగితే ‘విక్రమ్‌’ను మించి అంచనాలు ఈ సినిమాకు ఉంటాయి.

ఈ ప్రాజెక్టులు పూర్తవ్వాలి..

ప్రస్తుతం ఈ ముగ్గురూ తమ తర్వాతి చిత్రాల్లో బిజీగా ఉన్నారు. లోకేశ్‌ కనగరాజ్‌ విజయ్‌తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే పూర్వ నిర్మాణ పనులు మొదలయ్యాయి. మరోవైపు రజనీకాంత్‌ నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘జైలర్‌’ షూటింగ్‌లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ‘విక్రమ్‌’ విజయాన్ని ఆస్వాదిస్తున్న కమల్‌.. మహేశ్‌ నారాయణ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తారు. ఇవి పూర్తయిన తర్వాత రజనీ-కమల్‌ సినిమా పట్టాలెక్కనుంది.

ఇది ఎల్‌సీయూలో భాగమేనా?

లోకేశ్‌ కనగరాజ్‌ విజయ్‌తో సినిమా కథ, నేపథ్యం ఏంటనే విషయం ప్రస్తుతానికి తెలియదు. అయితే, ఇది ‘ఖైదీ’, ‘విక్రమ్‌’ తర్వాత విజయ్‌తో తీస్తున్న సినిమా లోకేశ్‌ కనగరాజ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ (ఎల్‌సీయూ)కే చెందుతుందా? లేదా? అన్నదానిపైనా స్పష్టత లేదు. ఇదే ప్రశ్న లోకేశ్‌ను అడిగితే ‘ఏదైనా జరగవచ్చు’ అన్నారు. దీని తర్వాత కచ్చితంగా ‘ఖైదీ2’, ‘విక్రమ్‌2’ ఉంటాయి. ఈ రెండు చిత్రాల్లో రోలెక్స్‌ (సూర్య), ఢిల్లీ (కార్తి) పాత్రలను ఎలా చూపిస్తారన్నది ఆసక్తికరం. ఇవన్నీ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే!

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని