Raju Yadav Review: రివ్యూ: రాజు యాదవ్‌.. గెటప్‌ శ్రీను హీరోగా చేసిన మూవీ ఎలా ఉంది?

‘జబర్దస్త్‌’ షోతో పాటు, వివిధ చిత్రాల్లో హాస్య నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న గెటప్ శ్రీను కీలక పాత్రలో నటించిన చిత్రం ‘రాజు యాదవ్‌’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మెప్పించిందా?

Updated : 24 May 2024 16:27 IST

Raju Yadav Review; చిత్రం: రాజు యాదవ్‌; నటీనటులు: గెటప్‌ శ్రీను, అంకిత కారాట్‌, ఆనంద చక్రపాణి, రాకెట్‌ రాఘవ, మిర్చి హేమంత్‌, జబర్దస్త్‌ సన్నీ తదితరులు; సంగీతం: హర్షవర్థన్‌ రామేశ్వర్‌; ఎడిటింగ్‌: బి.నాగేశ్వర్‌రెడ్డి; సినిమాటోగ్రఫీ: సాయిరామ్‌ ఉదయ్‌; నిర్మాత: రాజేశ్‌ కళ్లేపల్లి, ప్రశాంత్‌రెడ్డి; దర్శకత్వం: కృష్ణమాచారి; విడుదల: 24-05-2024

‘జ‌బర్ద‌స్త్’ షోతో ఎంతో మంది న‌టులు వెలుగులోకి వ‌చ్చారు. అందులో కొద్దిమంది క‌థానాయ‌కులుగా సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఆ షోతో ప్రేక్ష‌కుల‌కు చేరువైన మ‌రో న‌టుడు.. ‘గెట‌ప్’ శ్రీను. ర‌క‌ర‌కాల గెట‌ప్పుల‌తో క‌నిపిస్తూ బుల్లితెర క‌మ‌ల్‌హాస‌న్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయ‌న క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌య‌మైన చిత్ర‌మే... ‘రాజు యాద‌వ్‌’. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది? గెటప్‌ శ్రీను కెరీర్‌కు ఏమైనా హెల్ప్‌ అయిందా?

క‌థేంటంటే: రాజుయాద‌వ్ (గెట‌ప్ శ్రీను) డిగ్రీ వ‌ర‌కూ చదువుకున్న ఓ యువ‌కుడు. ఉద్యోగం లేక క్రికెట్, స్నేహితులు అంటూ స‌ర‌దాగా తిరుగుతుంటాడు. క్రికెట్ ఆడుతున్న‌ప్పుడు మొహానికి బాల్ త‌గిలి తీవ్రంగా గాయ‌ప‌డ‌తాడు. స‌రైన వైద్యం అంద‌కపోవ‌డంతో ఎప్పుడూ న‌వ్వు మొహంతోనే క‌నిపిస్తూ ఉండాల్సి వ‌స్తుంది. అలాంటి రాజు యాద‌వ్ అనుకోకుండా స్వీటీ (అంకిత కారాట్‌)ని చూసి ప్రేమ‌లో ప‌డ‌తాడు. ఆమెకోసం త‌న సొంతూరు మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వ‌దిలి హైద‌రాబాద్ వెళ‌తాడు. క్యాబ్ డ్రైవ‌ర్ అవ‌తార‌మెత్తి స్వీటీ చుట్టూనే తిరుగుతుంటాడు. ఇద్ద‌రూ ద‌గ్గ‌రైన‌ట్టే అయ్యి, ఆ త‌ర్వాత స్వీటీ మ‌రొక‌రితో ప్రేమ‌లో ప‌డుతుంది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన స్వీటీని మ‌రిచిపోలేక రాజు యాద‌వ్ ఏం చేశాడు?అత‌ని జీవితం ఎన్ని మ‌లుపులు తిరిగిందనేది తెర‌పైనే చూడాలి.

ఎలా ఉందంటే: అసంబద్ధ‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో రూపొందిన ఓ ప్రేమ‌క‌థా చిత్ర‌మిది. ఎదుటి వ్య‌క్తి ఇష్టాయిష్టాల్ని ప‌ట్టించుకోకుండా... ప్రేమ పేరుతో వెంటప‌డే కొద్దిమంది ప్రేమికుల గురించి త‌ర‌చూ వింటూనే ఉంటాం. కొన్నిసార్లు త‌మ‌ని ప్రేమించ‌లేద‌ని ఎదుటివ్య‌క్తుల‌పై అఘాయిత్యాల‌కి పాల్ప‌డ‌టం, మ‌రికొన్నిసార్లు దేవ‌దాసులుగా మారిపోవ‌డం లాంటి సంఘ‌ట‌న‌లు నిత్యం జ‌రుగుతూనే ఉంటాయి. అలాంటి అప‌రిప‌క్వ‌మైన ఆలోచ‌న‌లున్న  ఓ యువ‌కుడి ప్రేమ‌క‌థ‌గా  రూపొందిన చిత్ర‌మే ఇది. ఏదేదో ఊహించుకోవ‌ద్దు అంటూ క‌థానాయిక త‌ర‌చూ వారిస్తూనే ఉంటుంది. కానీ, స్నేహం పేరు చెప్పి అత‌నే ఆమె చుట్టూ తిరుగుతుంటాడు. అలా తానొక్క‌డే ప్రేమించి.. చివ‌రికి మోస‌పోయాన‌ని తానే భ్ర‌మించి, క‌న్న‌వాళ్ల క‌ల‌లు, వాళ్ల ఆశ‌ల‌తో సంబంధం లేకుండా వ్య‌వ‌హ‌రించే ప్రేమికుడిపైన, అత‌ని ప్రేమ‌పైనా ఎవ‌రికైనా ఎందుకు జాలి క‌లుగుతుంది?పైగా హీరో డిగ్రీ ఫెయిల్‌. హీరోయిన్ ఏమో కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగి. మ‌రి అత‌న్ని ఆమె ఎందుకు ప్రేమించాల‌నే ప్ర‌శ్న కూడా ప్రేక్ష‌కుడిలో ఉద‌యించిన‌ప్పుడు ఆ క‌థ ఎలా పండుతుంది? ప్ర‌థ‌మార్ధం సినిమా అంతా కూడా క‌థానాయ‌కుడు, అత‌ని స్నేహితులు, మ‌ధ్య త‌ర‌గతి జీవితం చుట్టూ సాగుతుంది. క్రికెట్ బాల్ త‌గిలాక క‌థానాయ‌కుడి ముఖ క‌వ‌ళిక‌ల్లో మార్పు రావ‌డం, ఆ నేప‌థ్యంలో పండే హాస్యం కాస్త కాల‌క్షేపాన్ని పంచుతుంది.

ద్వితీయార్ధంలోనే అస‌లు క‌థ ఉంటుంది. తాను ప్రేమించిన అమ్మాయి కోసం క‌థానాయ‌కుడు హైదరాబాద్‌కి  వెళ్లి  ఆమెకి ద‌గ్గ‌ర‌య్యేందుకు ప్ర‌య‌త్నించ‌డం వంటి స‌న్నివేశాలతో సినిమా సాగుతుంది. క్లైమాక్స్‌లో  భాగంగా వ‌చ్చే చివ‌రి 20 నిమిషాల స‌న్నివేశాలతో భావోద్వేగాలు పండించే ప్ర‌య‌త్నం చేసినా ఆ ప్ర‌భావం సినిమాపై ఏమాత్రం క‌నిపించ‌దు. కారులో హీరోయిన్ ఫ్రెండ్స్ మ‌ధ్య తీసిన బోల్డ్ స‌న్నివేశాలు ఈ కథకు నప్పలేదు. క‌థానాయ‌కుడు న‌వ్వు మొహంతో క‌నిపించ‌డానికీ, ఈ క‌థ‌కీ మ‌ధ్య పెద్ద‌గా సంబంధం లేదు కానీ... అలా క‌నిపిస్తూనే భావోద్వేగాలు పండించిన  గెట‌ప్ శ్రీను ప్ర‌తిభ మాత్రం మెచ్చుకోద‌గ్గ‌ది.

ఎవ‌రెలా చేశారంటే: గెట‌ప్ శ్రీను న‌ట‌న చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం.  పాత్రని తీర్చిదిద్దిన విధానంలో లోపాలు క‌నిపించిన‌ప్ప‌టికీ, త‌న‌కి అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ని స‌మ‌ర్థ‌ంగా నిర్వ‌హించాడు. ప్ర‌థ‌మార్ధంలో  న‌వ్వు మొహంతో క‌నిపిస్తూ న‌వ్వించిన ఆయ‌న‌, ద్వితీయార్ధంలో న‌వ్వుతూనే భావోద్వేగాల్ని పండించాడు.  అంకిత కారాట్‌ అందంగా క‌నిపించింది. లుక్స్‌తోనూ, న‌ట‌న‌తోనూ వైవిధ్యం ప్రదర్శించింది. ఆనంద్ చ‌క్ర‌పాణి,  సంతోష్ త‌దిత‌రులు కీల‌క‌మైన పాత్ర‌ల్లో క‌నిపిస్తారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాపై ప్ర‌భావం చూపిస్తాయి.  చివ‌ర్లో చంద్ర‌బోస్ రాసి, స్వ‌యంగా పాడిన పాట మ‌రింతగా ఆక‌ట్టుకుంటుంది.  కెమెరా, ఎడిటింగ్ విభాగాలు మంచి ప‌నితీరుని క‌న‌బ‌రిచాయి. కృష్ణ‌మాచారి ర‌చ‌న‌లో ప‌రిణ‌తి లోపించింది. క‌థ‌, క‌థ‌నాలు పెద్ద‌గా మెప్పించ‌వు. నిర్మాణం సినిమా స్థాయికి త‌గ్గ‌ట్టుగా ఉంది. 

  • బలాలు
  • + గెట‌ప్ శ్రీను న‌ట‌న
  • + ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఆస‌క్తి రేకెత్తించ‌ని క‌థ‌, క‌థ‌నాలు
  • - ద‌ర్శ‌క‌త్వం
  • చివ‌రిగా: రాజు యాద‌వ్‌... ఎక్కువ ఆశించొద్దు.. అక్కడక్కడా మెప్పిస్తాడంతే!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు