Sam Bahadur Review: రివ్యూ: సామ్‌ బహదూర్‌.. విక్కీ కౌశల్‌ నటించిన వార్‌ డ్రామా మెప్పించిందా?

Sam Bahadur Review in telugu: విక్కీ కౌశల్‌ కీలక పాత్రలో మేఘనా గుల్జార్‌ దర్శకత్వం వహించిన ‘సామ్ బహదూర్‌’ ఎలా ఉందంటే?

Updated : 26 Jan 2024 18:43 IST

Sam Bahadur Review; చిత్రం: సామ్‌ బహదూర్‌; నటీనటులు: విక్కీ కౌశల్‌, ఫాతిమా సనా షేక్‌, సాన్య మల్హోత్ర తదితరులు; సంగీతం: శంకర్‌-ఎహెసాన్‌-లాయ్‌, కేతన్‌ సోథి (నేపథ్యం); సినిమాటోగ్రఫీ: జయ్‌ ఐ.పాటిల్‌; ఎడిటింగ్‌: నితిన్‌ బైది; రచన: శంతను శ్రీవాత్సవ; దర్శకత్వం: మేఘనా గుల్జార్‌; స్ట్రీమింగ్‌ వేదిక: జీ5

విభిన్న పాత్రలతో బాలీవుడ్‌లో అలరిస్తున్న నటుడు విక్కీ కౌశల్‌. ఆయన కీలక పాత్రలో మేఘనా గుల్జార్‌ దర్శకత్వంలో వచ్చిన బయోగ్రాఫికల్‌ వార్‌ డ్రామా ‘సామ్‌ బహదూర్‌’. భారతదేశపు మొదటి ఫీల్డ్‌ మార్షల్‌ సామ్‌ మానెక్‌షా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. (Sam Bahadur Review in telugu) గత నెలలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద రూ.125 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. జనవరి 26వ తేదీ నుంచి జీ5 ఓటీటీ వేదిక స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది?

కథేంటంటే: 1934లో బ్రిటిష్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియన్‌ మిలటరీ అకాడమీ మొదటి బ్యాచ్‌లో క్యాడెట్‌గా శిక్షణ పొందుతాడు మానెక్‌షా (విక్కీ కౌశల్‌). సైన్యం అంటే ఎనలేని గౌరవం. వృత్తి విషయంలో అంకితభావంతో ఉండే మానెక్‌షా.. విడిగా ఉన్నప్పుడు సరదాగా, చిలిపిగా తన మాటల గారడీతో ప్రతి ఒక్కరినీ కట్టిపడేస్తాడు. శిక్షణ పూర్తయిన తర్వాత సెకండ్‌ లెఫ్టినెంట్‌గా ఫిరోజ్‌పూర్‌కు వెళ్తాడు. అక్కడే సిల్లో బోడే (సాన్య మల్హోత్ర)ను చూసి తొలి చూపులోనే ఇష్టపడతాడు. ఏకంగా పెళ్లి ప్రపోజల్‌ పెట్టేస్తాడు. మానెక్‌షాను సిల్లో కూడా ఇష్టపడుతుంది. భారత్‌కు స్వాత్రంత్యం వచ్చిన తర్వాత మేజర్‌ యహ్యాఖాన్‌ విన్నపాన్ని తిరస్కరిస్తూ మానెక్‌షా భారత సైన్యంలోనే కొనసాగుతాడు. భారత్‌లో కశ్మీర్‌ విలీనం, చైనాతో యుద్ధం, తూర్పు పాకిస్థాన్‌ విముక్తి పోరాటం ఇలా చరిత్రలో అరుదైన అధ్యాయాల్లో మానెక్‌షా ఎలాంటి పాత్ర పోషించారు? (Sam Bahadur Review in telugu) క్లిష్ట సమయాల్లో ప్రధానులను (ఇందిరాగాంధీ) సైతం ఒప్పించి ఆయన తీసుకున్న సాహసోపేతమై నిర్ణయాలు ఏంటి? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సాధారణ కథలతో పోలిస్తే జీవిత కథలను సినిమాలుగా తీసేటప్పుడు చాలా విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. మరీ ముఖ్యంగా భారతదేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను కాపాడేలా దేశం కోసం పనిచేసిన గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రల విషయంలో మరింత జాగరూకత వహించాలి. అలాంటి వ్యక్తుల్లో మొదటి ఫీల్డ్‌మార్షల్‌ మానెక్‌షా ఒకరు. ఆయన జీవిత కథను భావి తరాలకు స్ఫూర్తినిచ్చేలా అద్భుత చిత్రంగా తీయడంలో దర్శకుడు మేఘనా గుల్జార్‌ విజయం సాధించారు. (Sam Bahadur Review in telugu) ఇండియన్‌ మిలటరీ అకాడమీలో మానెక్‌షా శిక్షణ పొందే సన్నివేశాలతో కథను మొదలు పెట్టిన దర్శకుడు.. ఎక్కువగా ఆయన వ్యక్తిగత జీవితం, అనవసర విషయాల జోలిక పోకుండా, కేవలం వృత్తిపరమైన కీలక ఘట్టాలను ఆవిష్కరిస్తూ కథను నడిపించాడు. కశ్మీర్‌ విషయంలో భారత్-పాకిస్థాన్‌ మధ్య జరిగిన మొదటి యుద్ధ సమయంలో మానెక్‌ షా సలహాలు, కశ్మీర్‌ వెళ్లి మరీ అక్కడి రాజును దిల్లీకి తీసుకొచ్చే సీన్‌ అలరిస్తుంది. మానెక్‌షా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ జరిగే విచారణ సందర్భంగా వచ్చే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి.

భారత్‌-చైనా యుద్ధ సమయంలో నెహ్రూ శాంతి మంత్రాలు వల్లిస్తుంటే, ‘వాళ్లేమీ (చైనా) సాధారణ పరిస్థితిని కోరుకోరు. యుద్ధంలో గెలవడానికే ప్రయత్నిస్తారు. నేను కూడా అంతే. నాకు ఇక్కడ పనిలేకపోతే, నేను వెళ్లిపోవడానికి సిద్ధమే’, ‘దేశం కోసం చనిపోవడం సైనికుడి బాధ్యత కాదు. శత్రువుని చంపి, దేశాన్ని కాపాడటం’ అంటూ మానెక్‌షా పలికే సంభాషణలు ఉద్విగ్నంగా ఉంటాయి. ప్రధాని ఇందిరా గాంధీ ముందు మాట్లాడటానికి ఎవరికీ ధైర్యం ఉండేది కాదు. అలాంటిది తూర్పు పాకిస్థాన్‌ విముక్తి పోరాటానికి మద్దతు తెలుపుతూ పాకిస్థాన్‌పై ఇందిర యుద్ధ ప్రతిపాదన తెస్తే.. ‘మేము ఇప్పుడు సిద్ధంగా లేము. మీరు యుద్ధం ఆదేశిస్తే ఇప్పుడే రాజీనామా చేస్తా. ఎందుకంటే ఓడిపోయే యుద్ధం నేను చేయను’ అంటూ ఆమె నిర్ణయాన్నే మానెక్‌షా ధైర్యంగా తోసిపుచ్చే సీన్‌ హైలైట్‌. (Sam Bahadur Review in telugu) యుద్ధ సమయంలో ఇక సైనికులను ఉద్దేశిస్తూ ‘సైనికుడి గౌరవం అతడు ధరించే దుస్తుల్లో ఉంటుంది’ అంటూ ఆయన ఇచ్చే స్ఫూర్తి ప్రసంగం రొమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుంది. కథా పరంగా ఎలాంటి లోటుపాట్లూ లేకపోయినా, కీలక సన్నివేశాల ముందు జరిగే డ్రామాతో కథనం కాస్త నెమ్మదిగా సాగినట్లు అనిపిస్తుంది.

ఎవరెలా చేశారంటే: కథలు, పాత్రల ఎంపిక విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్న విక్కీ కౌశల్‌.. సామ్‌ బహదూర్‌ అలియాస్‌ మానెక్‌ షా పాత్రలో ఒదిగిపోయారు. ఆయన ఆహార్యం, డైలాగ్‌ డిక్షన్‌తో కట్టిపడేశారు. సినిమాలో ఎక్కడా పరిధి దాటి నటించలేదు. కొన్ని సన్నివేశాల్లో మానెక్‌ షాను ఆవాహన చేసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇందిరాగాంధీ పాత్రకు తగిన విధంగా ఫాతిమా సన్‌ షేక్‌ కనిపించిన తీరు హుందాగా ఉంది. మానెక్‌ షా భార్య సిల్లోగా సాన్య మల్హోత్ర కూడా ఒదిగిపోయారు. (Sam Bahadur Review in telugu) ప్రతి నటుడు, నటి తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. నాటి వాతావరణం రీక్రియేట్‌ చేయడంలోనూ, దాన్ని అంతే సహజంగా తెరపై ఆవిష్కరించడంలోనూ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్‌ విభాగాలు చక్కగా పనిచేశాయి. సాంకేతిక సిబ్బంది, ప్రొడక్షన్‌ హౌస్‌ పడిన కష్టం ప్రతిదీ తెరపై కనిపిస్తుంది. అనవసర కమర్షికల్‌ హంగులకు పోకుండా, మానెక్‌షా జీవిత కథను వక్రీకరించకుండా ప్రతి భారతీయుడికీ కనెక్ట్‌ అయ్యేలా ‘సామ్‌ బహదూర్‌’ను మేఘనా గుల్జార్‌ తీశారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: నవ భారత చరిత్ర గతిని మలుపుతిప్పిన గొప్ప వ్యక్తుల గురించి నేటి యువత తప్పక తెలుసుకోవాలి. ఫీల్డ్‌ మార్షల్‌ మానెక్‌ షా అలాంటి వారే. కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం. కానీ, ఒకే ఒక్క సమస్య. తెలుగు ఆడియో ఇచ్చి ఉంటే బాగుండేది. (Sam Bahadur Review in telugu) ఇలాంటి చిత్రాలను ఇతర భారతీయ భాషల్లోనూ అనువదించాల్సిన అవసరం ఉంది.

  • బలాలు
  • + విక్కీ కౌశల్‌ నటన
  • + దర్శకత్వం
  • + సినిమాటోగ్రఫీ, ఇతర సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - అక్కడక్కడా నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: సెల్యూట్‌.. ‘సామ్‌ బహదూర్‌..’
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని