Sapta Sagaralu Dhaati Side-B Movie Review: రివ్యూ: స‌ప్త సాగ‌రాలు దాటి - సైడ్ బి

రక్షిత్‌శెట్టి నటించిన ప్రేమకథా చిత్రం స‌ప్త సాగ‌రాలు దాటి - సైడ్ ఏకు కొనసాగింపుగా వచ్చిన ‘సైడ్‌-బి’ ప్రేక్షకులను మెప్పించిందా?

Updated : 17 Nov 2023 12:55 IST

Sapta Sagaralu Dhaati Side-B Movie Review| చిత్రం: రివ్యూ: స‌ప్త సాగ‌రాలు దాటి - సైడ్ బి; న‌టీన‌టులు: రక్షిత్ శెట్టి, రుక్మిణీ వసంత్, చైత్ర జె.ఆచార్‌, ర‌మేశ్ ఇందిర‌, అచ్యుత్ కుమార్, గోపాలకృష్ణ దేశపాండే త‌దిత‌రులు; సంగీతం: చ‌ర‌ణ్‌రాజ్‌, సినిమాటోగ్రఫీ: అద్వైత గురుమూర్తి; ఎడిటింగ్‌: సునీల్ భ‌ర‌ద్వాజ్‌; నిర్మాతలు: రక్షిత్ శెట్టి, టీజీ విశ్వ ప్రసాద్;  రచన-దర్శకత్వం: హేమంత్ ఎం రావు; నిర్మాణ సంస్థ‌: ప‌రంవా స్టూడియోస్‌; విడుద‌ల సంస్థ‌ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ; విడుద‌ల తేదీ: 17-11-2023

కొన్ని రోజుల కింద‌టే వ‌చ్చిన ‘స‌ప్త‌సాగ‌రాలు దాటి సైడ్-ఎ’కి కొన‌సాగింపుగా రూపొందిన చిత్ర‌మిది. సైడ్-బి అంటూ ప్రేమ‌జంట జీవితంలోని మ‌రో అంకాన్ని ఈ చిత్రం ఆవిష్క‌రిస్తుందీ చిత్రం. క‌న్న‌డలో రూపొందిన ‘స‌ప్త సాగ‌ర్ దాచే ఎల్లో’ చిత్రాల‌కి అనువాదంగా ఈ వ‌రుస చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకొచ్చాయి. తొలి చిత్రం క‌న్న‌డ‌లో ఘ‌న విజయం సాధించ‌గా, తెలుగులోనూ మంచి ఆద‌ర‌ణ‌నే సొంతం చేసుకుంది. ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన కొన‌సాగింపు చిత్రం ఎలా ఉంది?(Sapta Sagaralu Dhaati Side-B Movie Review) ప్రేమ సాగరాలను దాటిందా?

కథేంటంటే: ప్రేమించుకుని... ఆ ప్రేమ‌ని నిల‌బెట్టుకునేందుకు శాయ‌శ‌క్తులా ప్ర‌య‌త్నించి చివ‌రికి విధి ముందు ఓడిపోతుంది మ‌ను, ప్రియ జంట‌. ప్రియకు పెళ్ల‌వుతుంది. మ‌ను జైలులోనే జీవితాన్ని గ‌డ‌పాల్సి వ‌స్తుంది. ఇదంతా తొలి భాగం క‌థే. ప‌దేళ్ల శిక్ష త‌ర్వాత 2021లో మ‌ను (ర‌క్షిత్ శెట్టి) జైలు నుంచి తిరిగి రావ‌డంతో రెండో భాగం క‌థ మొద‌ల‌వుతుంది. బ‌య‌టికి రాగానే ప్రియ (రుక్మిణీ వ‌సంత్‌) చిరునామా తెలుసుకోవాల‌నుకుంటాడు. అందుకోసం సుర‌భి (చైత్ర జె.ఆచార్‌) సాయం తీసుకుంటాడు. మ‌రి ప్రియ‌ని మ‌ను క‌లిశాడా లేదా?ప‌దేళ్ల త‌ర్వాత ఆమె జీవితంలో ఎలాంటి మార్పు వ‌చ్చింది?ఇంత‌కీ సుర‌భి ఎవ‌రు?(Sapta Sagaralu Dhaati Side-B Movie Review) త‌ను జైలులో మ‌గ్గిపోవ‌డానికి కార‌ణమైన వాళ్ల‌పై మ‌ను ప్ర‌తీకారం ఎలా తీర్చుకున్నాడు? త‌దిత‌ర విష‌యాల్ని తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: తొలి భాగానికి దీటుగా హృద్య‌మైన భావోద్వేగాలతోపాటు.. ప్ర‌తీకార కోణాన్నీ ఆవిష్క‌రించిన చిత్ర‌మిది. దారులు వేరైపోయినా తాను ప్రేమించిన అమ్మాయి క్షేమం కోసం.. ఆనందం కోసం, ఆమె క‌న్న క‌ల‌ల కోసం పాటు ప‌డే ఓ ప్రేమికుడి క‌థగా సాగుతుంది. అదే స‌మ‌యంలో తాను అన్యాయంగా శిక్ష అనుభ‌వించ‌డానికి కార‌కులైన‌ వారిపై కూడా ప్ర‌తీకారం తీర్చుకుంటాడు మను. తొలి భాగం త‌ర‌హాలోనే నెమ్మ‌దిగా సాగే స‌న్నివేశాలు ఇబ్బందిక‌రం అనిపించినా భావోద్వేగాలు క‌ట్టిప‌డేస్తాయి. ప్రియ జీవితాన్ని దూరం నుంచి చూస్తూనే, ఆమె ప్ర‌పంచాన్ని చ‌క్క‌బెట్టేందుకు ప్ర‌య‌త్నించే స‌న్నివేశాలు స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌ని చాటి చెప్పేలా ఉంటాయి. మ‌రోవైపు మ‌ను - సుర‌భి జంట మ‌ధ్య స‌న్నివేశాలు కూడా ఆస‌క్తిక‌రంగా అనిపిస్తాయి. ప్రియ భ‌ర్త‌తో క‌లిసి మ‌ను మ‌ద్యం తాగ‌డం, అత‌న్ని కావాలనే గాయ‌ప‌ర‌చ‌డం వంటి స‌న్నివేశాలు స్వ‌చ్ఛ‌మైన ప్రేమ‌క‌థ‌ని ప‌క్క‌దారి ప‌ట్టించిన‌ట్టు అనిపించినా ఆ త‌ర్వాత మ‌ళ్లీ క‌థ గాడిన‌ప‌డుతుంది. మ‌ను జైలు నుంచి బ‌య‌టికి రాగానే, తాను శిక్ష అనుభ‌వించ‌డానికి కార‌కులైన‌ వారిపై దృష్టిపెట్టుంటే ఇదొక సాధార‌ణ ప్ర‌తీకార క‌థ అయ్యేది. కానీ, మ‌ను ప్ర‌యాణం మ‌ళ్లీ ప్రియ చుట్టూనే సాగింది.

ఆమె కోసం డ‌బ్బు అవ‌స‌రమైన‌ప్పుడే ఈ క‌థ ప్ర‌తీకార కోణంలోకి వెళ్లిపోతుంది. ఆ స‌న్నివేశాల్ని కూడా క‌వితాత్మ‌కంగా తీర్చిదిద్దారు. సుర‌భి ప్ర‌యాణం, ఆమె నేప‌థ్యంలో స‌న్నివేశాలు కూడా మ‌న‌సుల్ని క‌దిలిస్తాయి. ప్రియ కుటుంబం ఆర్థిక క‌ష్టాల నుంచి గ‌ట్టెక్క‌డంతో ఆగిపోని ఈ క‌థ‌, ప్రియ పాట పాడాలంటూ ఆమె పాట కోసం ఎదురు చూడ‌టం స‌న్నివేశాల్ని సాగ‌దీసిన‌ట్టుగా అనిపిస్తుంది. (Sapta Sagaralu Dhaati Side-B Movie Review)  సుర‌భి పాత్రకి, క‌థానాయ‌కుడి పాత్ర‌కీ మంచి ముగింపునిచ్చారు. సముద్రం ఒకొక్క‌సారి ప్ర‌శాంతంగా, మ‌రొక‌సారి భీక‌రంగానూ క‌నిపించిన‌ట్టుగానే ఈ సినిమా కూడా. సైడ్-ఎ స‌ముద్రంలోని ప్ర‌శాంత కోణాన్ని ఆవిష్క‌రిస్తే, సైడ్-బి  అల‌జ‌డి కోణాన్ని చూపిస్తుంది. మొత్తంగా నాయ‌కానాయిక పాత్ర‌లు, భావోద్వేగాల‌తో ప్ర‌యాణం చేస్తే ఓ మంచి  సినిమా చూసిన అనుభూతి క‌లుగుతుంది.

ఎవ‌రెలా చేశారంటే: తొలి భాగంలో యువ‌కుడిలా క‌నిపించిన ర‌క్షిత్ శెట్టి... రెండో భాగంలో ప‌దేళ్ల త‌ర్వాత మ‌నిషి ఎలా మార‌తాడో అలాగే క‌నిపించాడు. ఆయ‌న లుక్ ప‌రంగా కూడా చాలా  జాగ్ర‌త్త‌లు తీసుకుని న‌టించారు. భావోద్వేగాల్ని పండించ‌డంలో త‌న‌దైన ప్ర‌భావం చూపించారు. రుక్మిణీ వ‌సంత్ కూడా లుక్ ప‌రంగా చాలా వ్య‌త్యాసం చూపించారు. ఓ గృహిణిగా పాత్ర‌కి త‌గ్గ‌ట్టుగా చ‌క్క‌టి భావోద్వేగాల్ని పండించారు.  చైత్ర న‌ట‌న సినిమాకి ప్ర‌ధాన బ‌లం. న‌ట‌న‌కి ప్రాధాన్యం ఉన్న ఆ పాత్ర‌పై అంతే సాధికార‌త ప్ర‌ద‌ర్శించింది. పొట్ట‌కూటి కోసం పోరాటం చేసే యువ‌తిగానూ, హృద‌యం ముక్క‌లైన వ్య‌క్తిగానూ న‌ట‌న‌లో ఎంతో ప‌రిణ‌తి ప్ర‌ద‌ర్శించారు.(Sapta Sagaralu Dhaati Side-B Movie Review) ప్ర‌కాశ‌న్నగా గోపాల‌కృష్ణ దేశ్‌పాండే న‌ట‌న న‌వ్విస్తుంది. ప్రియ జీవితంలోకి వెళ్లొద్ద‌ని మ‌నుని వారించే స‌న్నివేశాలతోనూ, దుబాయ్‌నుంచి వ‌చ్చిన‌ట్టు చెప్పే స‌న్నివేశాల్లోనూ గోపాల‌కృష్ణ దేశ్‌పాండే చక్కని హాస్యాన్ని పంచారు. ర‌మేశ్ ఇందిర విల‌నిజం ప్ర‌ద‌ర్శించిన తీరు బాగుంది. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. కెమెరా, సంగీతం, క‌ళ విభాగాలు సినిమాకి ప్రాణం పోశాయి. ద‌ర్శ‌కుడు హేమంత్ రావు ఓ హృద్య‌మైన ప్రేమ‌గాథ‌ని...గాఢ‌మైన భావోద్వేగాల‌తో తెర‌పైకి తీసుకు రావ‌డంలో విజ‌య‌వంత‌మయ్యారు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బలాలు
  • + నటీ న‌టులు
  • + హృద్య‌మైన భావోద్వేగాలు
  • + క‌థ‌లోని ప్ర‌తీకార కోణం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - నెమ్మ‌దిగా సాగే స‌న్నివేశాలు
  • చివ‌రిగా: స‌ప్త సాగ‌రాలు దాటి సైడ్ బి... భావోద్వేగాల సాగ‌రం (Sapta Sagaralu Dhaati Side-B Movie Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని