Chandramohan: నటి ఫిర్యాదుతో ఆ నిర్ణయం తీసుకున్నా: గతంలో చంద్రమోహన్‌ పంచుకున్న విశేషాలు

ప్రముఖ సినీ నటుడు చంద్రమోహన్‌ మరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. గతంలో పలు ఇంటర్వ్యూల్లో ఆయన పంచుకున్న విశేషాలు..!

Updated : 11 Nov 2023 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాకతాళీయంగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి తన సహజ నటనతో సినీ ప్రియుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌ (Chandramohan). కె.విశ్వనాథ్, బాపు వంటి దర్శకుల చిత్రాల్లో నటించిన ఆయన తన కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. శనివారం ఆయన మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ ప్రియులు, ప్రముఖులు ఆయన జ్ఞాపకాలు నెమరువేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్‌ గతంలో పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్న విశేషాలివే..!

నటుడు కావాలని అనుకోలేదు..!

‘‘మాది కృష్ణా జిల్లా పమిడిముక్కల. మా నాన్నగారి పేరు వీరభద్రశాస్త్రి. అమ్మ పేరు శాంభవి. అమ్మకు చెవులు సరిగ్గా వినిపించవు. దాంతో ఆమె ఏదైనా చెప్పాలంటే అభినయం చేసేవారు. ఆమె వల్లే నాలో నటనా పటిమ పెరిగింది. నటుడిని కావాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కనీసం ప్రయత్నం చేయలేదు. సినిమా రంగంలోకి అనుకోకుండా ప్రవేశించా. నటుడు ముదిగొండ లింగమూర్తికి మా బావ బాగా తెలుసు. దర్శకుడు బి.ఎన్‌.రెడ్డిగారు కొత్త వాళ్లతో సినిమా చేయాలనుకుంటున్నారని లింగమూర్తి ద్వారా మా బావకు తెలిసింది. వాళ్లే నా ఫొటోలు పంపిస్తే.. మద్రాసుకు రమ్మని కబురు వచ్చింది. స్క్రీన్‌ టెస్ట్‌ అనంతరం నన్ను సెలెక్ట్‌ చేశారు.

అదొక కలికితురాయి..!

తొలి చిత్రం ‘రంగులరాట్నం’ అంటే నాకెంతో ఇష్టం. ఆ చిత్రానికి నేను నంది అవార్డు అందుకున్నా. నటుడిగా మంచి పేరు అందుకున్నప్పటికీ అవకాశాలు వెంటనే రాలేదు. హైట్‌ కారణంగా కొన్ని ఆఫర్స్‌ చేజారిపోయాయి. ఈ విషయంలో మొదట్లో ఎంతో ఫీలయ్యా. తర్వాత దాని గురించి ఆలోచించడం మానేశా. బాపు గారి దర్శకత్వంలో నేను నటించిన చిత్రం ‘బంగారు పిచుక’. నా సినిమాల్లో అదొక కలికితురాయి. అందులో ఎవ్వరూ నటించలేదు. జీవించారు.

‘స్వాతిముత్యం’ నేనే చేయాల్సింది..!

మా అన్నయ్య కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన ‘సిరి సిరి మువ్వ’ నాకు మంచి బ్రేక్‌ ఇచ్చింది. నా కెరీర్‌కు అది ఎంతో ఉపయోగపడింది. ఆయన దర్శకత్వం వహించిన ‘స్వాతిముత్యం’ నేనే చేయాల్సింది. అందులోని నా పాత్రకు తోడుగా ఒక ఉడత కూడా ఉంటుందని చెప్పారు. అందుకోసం ఒక అడవి ఉడతను పెంచుకున్నా. తర్వాత ఆ సినిమా కమల్‌ హాసన్‌తో తీశారు. అందులో కమల్‌కు కోపం వస్తే చెయ్యెత్తే మేనరిజం ఉంటుంది. అలా చేస్తే బాగుంటుందని చెప్పింది నేనే.

కథానాయికలు స్టార్‌ స్థాయికి..!

నా పక్కన ఒక్కసారి నటిస్తే చాలు తారస్థాయికి చేరుతారని చాలామంది భావించేవారు. మొదట్లో నేను పెద్దగా నమ్మలేదు. నూటికి తొంభైమంది అగ్రస్థానంలో స్థిరపడేసరికి నమ్మకతప్పలేదు. వాణీశ్రీ, జయసుధ, శ్రీదేవి, జయప్రద ఇలా ఎంతోమంది స్టార్స్‌ అయ్యారు. ఇక, జయసుధ అంటే నాకు ఎంతో అభిమానం. ఆమెతో కలిసి నేను 34 చిత్రాల్లో నటించా. శివాజీ గణేశన్‌ అంటే కూడా నాకు అభిమానమే.

నటి ఫిర్యాదు చేసింది..!

సినీ పరిశ్రమ ఎంతో మారింది. నేను హీరోగా ఎంట్రీ ఇచ్చిన రోజుల్లో నటీనటులందరూ ఒకేచోట కూర్చొని భోజనం చేసేవాళ్లం. సలహాలు ఇచ్చిపుచ్చుకునేవాళ్లం. కానీ ఇప్పుడు అలా లేదు. ఓ నూతన నటికి సలహా ఇస్తే దర్శకుడికి ఫిర్యాదు చేసింది. ఆనాటి నుంచి సలహాలు ఇవ్వకూడదని ఫిక్స్ అయ్యా.

ఏవీ శాశ్వతం కాదు..!

సినీ జీవితం నాకెంతో నేర్పించింది. పేరు, డబ్బు, బంధాలు ఏవీ శాశ్వతం కాదనే విషయాన్ని తెలిసేలా చేసింది. ఆర్థికంగా జాగ్రత్త పడకపోతే ఎన్నో ఇబ్బందులు పడాలని తెలియజేసింది. చేదు నిజాలు గుండెల్లో ఎలా దాచుకోవాలో నేర్పింది. ప్రేక్షకులను అలరించాలనే ఉద్దేశంతో ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించా. పారితోషికం గురించీ ఎన్నడూ ఆలోచించలేదు. నిర్మాతలు ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అయిన సందర్భాలూ ఉన్నాయి. వాటిని ఇంట్లో ఆల్బమ్‌లో పెట్టుకున్నా. అవార్డుల కంటే కూడా ప్రేక్షకుల ఆదరణ మెండుగా పొందాననే ఆనందం నాకు ఉంది’’ అని చంద్రమోహన్‌ గతంలో పలు సందర్భాల్లో గుర్తుచేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని