siren movie review: రివ్యూ: సైరెన్‌.. జయం రవి, కీర్తి సురేశ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉంది?

siren movie review: జయం రవి కథానాయకుడిగా ఆంటోనీ భాగ్యరాజా దర్శకత్వంలో వచ్చిన ‘సైరెన్‌’ మూవీ తెలుగులో మెప్పించిందా?

Published : 19 Apr 2024 16:36 IST

Siren Review: చిత్రం: సైరెన్‌; నటీనటులు: జయం రవి, కీర్తి సురేశ్‌, అనుపమ పరమేశ్వరన్‌, సముద్రఖని, యోగిబాబు తదితరులు; సంగీతం: జీవీ ప్రకాశ్‌, శ్యామ్‌ సీఎస్‌; ఎడిటింగ్‌: రూబెన్‌; సినిమాటోగ్రఫీ: సెల్వకుమార్‌; నిర్మాత: సుజాత విజయ్‌కుమార్‌; రచన, దర్శకత్వం: ఆంటోని భాగ్యరాజ్‌; స్ట్రీమింగ్‌ వేదిక: డిస్నీ+హాట్‌స్టార్‌

తమిళ నటుడు జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సైరెన్‌’. ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళంలో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ విడుదల చేద్దామనుకున్నారు. కానీ, సాధ్యపడలేదు. ప్రస్తుతం డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ‘సైరెన్‌’ మోత మోగిందా? తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందా?

కథేంటంటే: ప్రేమించి, పెళ్లి చేసుకున్న భార్య జెన్నీఫర్‌(అనుపమ పరమేశ్వరన్‌)ను హత్య చేసిన కేసులో అంబులెన్స్‌ డ్రైవర్‌ తిలక్‌ (జయం రవి) జైలుకు వెళ్తాడు. తల్లి చనిపోవడం, తండ్రి జైలుకు వెళ్లడంతో తిలక్‌ కూతురును అతడి అక్క పెంచుతుంది. ‘ఖైదీ కూతురు’ అని అందరూ ఎగతాళి చేస్తుండటంతో చిన్నతనం నుంచి తండ్రి తిలక్‌ అంటే ఆమెకు అస్సలు ఇష్టం ఉండదు. పెరోల్‌పై వచ్చేందుకు అవకాశం ఉన్నా, తిలక్‌ జైలు నుంచి బయటకురాడు. అయితే, అతడి మంచితనం నచ్చి, కూతురిని చూసి రమ్మంటూ జైలు సూపరింటెండెంట్‌ సలహా ఇస్తాడు. తిలక్‌ పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడల్లా నగరంలో హత్యలు జరుగుతాయి. ఈ హత్య కేసులను విచారణ చేసే బాధ్యత పోలీస్‌ ఆఫీసర్‌ నందిని (కీర్తి సురేశ్‌)కి అప్పగిస్తుంది డిపార్ట్‌మెంట్‌. తిలక్‌పై అనుమానం వచ్చిన నందిని.. అతడే నిందితుడు అంటూ అదుపులోకి తీసుకుంటుంది. అయితే, సరైన ఆధారాలు దొరక్క విడిచిపెడుతూ ఉంటుంది. మరి విచారణలో పోలీస్‌ ఆఫీసర్‌ నందినికి తెలిసిన నిజాలు ఏంటి? జెన్నీఫర్‌ను హత్య చేసింది ఎవరు? ఐపీఎస్ ఆఫీస‌ర్ నాగ‌లింగంపై (స‌ముద్ర‌ఖ‌ని) తిలక్‌ పగకు కారణం ఏంటి? చివరకు తిలక్‌ కూతురు అతడికి దగ్గరైందా? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: ప్రాణం కన్నా మిన్నగా ప్రేమించిన వారిని కోల్పోవడం.. చేయని తప్పునకు జైలు శిక్ష అనుభవించడం.. జైలు జీవితం గడిపి బయటకు వచ్చిన తర్వాత తన జీవితాన్ని చిన్నాభిన్నం చేసిన వారిపై కథానాయకుడు పగ తీర్చుకోవడం..  ఈ ఫార్మాట్‌లో కొన్ని వందల సినిమాలు వచ్చాయి. సైరెన్‌ కూడా ఆ బాపతు చిత్రమే. అయితే, కథనంపరంగా జాగ్రత్తలు తీసుకుని, ప్రేక్షకుడికి కనెక్ట్‌ అయ్యేలా మూవీ తీయడంలో మాత్రం దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్‌ విజయం సాధించారు. జైలు జీవితాన్ని గడుపుతున్న తిలక్‌ కథను ఒకవైపు చూపిస్తూనే, పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కీర్తి సురేశ్‌ను మరోవైపు చూపిస్తూ రెండు పాత్రలకు సమ ప్రాధాన్యం ఇస్తూ కథను మొదలుపెట్టాడు దర్శకుడు. ఎప్పుడైతే తిలక్‌ పెరోల్‌పై బయటకు వచ్చాడో అప్పుడే ప్రముఖ రాజకీయ నాయకుడు హత్యకు గురవడం కలకలం రేగుతుంది. అలాగే మరొకరి హత్యా జరుగుతుంది. ఇవన్నీ పగ తీర్చుకోవడంలో భాగంగా కథనాయకుడు చేస్తున్నాడన్న సంగతి సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి అర్థమవుతున్నా కానీ, ఎందుకు హత్యలు చేస్తున్నాడన్న హుక్‌ పాయింట్‌ వెంటాడుతుండటంతో మూవీ ఎక్కడా విసుగ్గా అనిపించకుండా దర్శకుడు స్క్రీన్‌ప్లేతో మేజిక్‌ చేశాడు. ద్వితీయార్ధం కూడా హత్య ఇన్వెస్టిగేషన్‌ చుట్టూనే తిరుగుతున్నా, విచారణ అంతా రొటీన్‌గా ఉండటం కాస్త మైనస్‌. చాలా సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా నడుస్తూ ఉంటాయి. సీరియస్‌ టోన్‌లో నడుస్తున్న మూవీకి మధ్య మధ్యలో యోగిబాబు కామెడీ కాస్త రిలీఫ్‌. ఒక ఎమోషనల్‌ డ్రామాతో సినిమాను ముగించిన తీరు బాగుంది.

ఎవరెలా చేశారంటే: మధ్య వయస్కుడిగా తిలక్‌ పాత్రలో జయం రవి తనదైన నటన కనబరిచారు. కథ, పాత్రకు ఎంత అవసరమో అదే స్థాయిలో నటించారు. కీర్తి సురేశ్‌ పాత్ర కాస్త అతిగా అనిపిస్తుంది. పవర్‌ఫుల్‌ ఆఫీసర్‌గా చూపించాలనుకున్నారు కానీ, తెరపై ఆ ప్రభావం కనిపించలేదు. మిగిలిన వాళ్లు తమ పరిధి మేరకు నటించారు. సాంకేతికంగా సినిమా ఓకే. నిడివి విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. దర్శకుడు ఆంటోనీ భాగ్యరాజ్‌ ఎంచుకున్న కథ కొత్తది కాకపోయినా, ప్రజెంట్‌ చేసిన విధానం బాగుంది. రివేంజ్‌ డ్రామాతో పాటు, కుల వ్యవస్థను కూడా ప్రశ్నించే ప్రయత్నం చేశారు.

కుటుంబంతో కలిసి చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. అసభ్య సన్నివేశాలు, పదజాలం ఎక్కడా లేదు. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగులోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + జయం రవి, కీర్తిసురేశ్‌
  • + కథనం
  • + దర్శకత్వం
  • బలహీనతలు
  • - కొత్తదనం లేని కథ
  • - నిడివి
  • చివరిగా: సైరెన్‌.. పాతదే..! కాస్త కొత్తగా మోగింది..!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని