Society of the Snow Review: రివ్యూ: సొసైటీ ఆఫ్‌ ది స్నో.. ఆస్కార్‌కు నామినేట్‌ అయిన మూవీ ఎలా ఉంది?

Society of the Snow review: బయోనా దర్శకత్వంలో వచ్చిన సర్వైవల్‌ థ్రిల్లర్‌ మూవీ ఎలా ఉంది?

Updated : 05 Feb 2024 18:24 IST

Society of the Snow review; చిత్రం: సొసైటీ ఆఫ్ స్నో; దర్శకత్వం: జె.ఎ. బయోనా; స్ట్రీమింగ్‌ వేదిక: నెట్‌ఫ్లిక్స్‌

ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ఇతర భాషల్లో విడుదలైన అద్భుతమైన చిత్రాలను చూసే అవకాశం అందరికీ లభిస్తోంది. దీంతో అవికాస్తా సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతూ మరింత మందికి చేరువవుతున్నాయి. అలా ఇటీవల ట్రెండ్‌ సృష్టిస్తున్న స్పానిష్‌ ఫిల్మ్‌ ‘సొసైటీ ఆఫ్ ది స్నో’. అంతేకాదు, 96వ ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌లోనూ ఉత్తమ విదేశీ చిత్రంగా ఎంట్రీ దక్కించుకుంది. (Society of the Snow review) మరి నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ ఎలా ఉంది?

కథేంటంటే: 1972లో 45 మంది సభ్యులతో కూడిన యువ రగ్బీ టీమ్‌ ఉరుగ్వేయన్‌ ఎయిర్‌ఫోర్స్‌ విమానంలో శాంటియోగోకు పయనమవుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆండిస్‌ పర్వత శ్రేణుల్లో ఆ విమానం కూలిపోతుంది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు అక్కడికక్కడే మృతి చెందగా, కొద్దిమంది మాత్రమే ప్రాణాలతో బయటపడతారు. అందులోనూ తీవ్రంగా గాయపడి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని ఆ రోజుల్లో విమాన ప్రమాదం నుంచి బయటపడిన వాళ్లు ఎలా బతికారు? అత్యంత ప్రతికూల వాతావరణంలో ఆహారం లేకుండా ఎలా ఉండగలిగారు? వారిని ఎలా కనిపెట్టారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!

ఎలా ఉందంటే: సర్వైవల్‌ థ్రిల్లర్స్‌ వెండితెరకు కొత్తేమీ కాదు. వివిధ ప్రమాదాలకు సంబంధించిన ఎన్నో చిత్రాలు, డాక్యుమెంటరీలు ప్రేక్షకులను అలరించాయి. ఆ కోవకు చెందినదే ‘సొసైటీ ఆఫ్ ది స్నో’. (Society of the Snow review) విమాన ప్రమాదంలో గాయపడి, రెండు నెలల పాటు మంచు కొండల్లో అదీ -22 డిగ్రీల చలిలో ఎలా బతికారన్నది భావోద్వేగభరితంగా చూపించడంలో దర్శకుడు విజయం సాధించాడు. రగ్బీ ఆడుతున్న యువకులతో సినిమాను ప్రారంభించిన దర్శకుడు.. ఆ టీమ్‌ శాంటియోగోకు పయనమయ్యే క్రమాన్ని చూపిస్తూ నెమ్మదిగా కథలోకి తీసుకెళ్లాడు. ఇందుకోసం కాస్త సమయం తీసుకున్నాడు. ఒకసారి విమానం ఎక్కిన తర్వాత కథ వేగం పుంజుకుంటుంది. ఆండిస్‌ పర్వతాల్లో విమానం క్రాష్‌ అవడంతో అసలు కథ మొదలవుతుంది. విమాన ప్రమాదాన్ని చూపించిన తీరు చూస్తే ఒళ్లు గగుర్పొడుస్తుంది. మనమే ఆ విమానంలో ఉన్నామా? అన్నంత సహజంగా ఆ ప్రమాదాన్ని తీర్చిదిద్దారు. తీవ్రమైన చలిలో అదీ, ఆహారం లేకుండా ఎలా బతుకుతారన్న ఉత్కంఠ సినిమా చూస్తున్న ప్రేక్షకుడికీ కలుగుతుంది. అందుకు తగినట్లుగానే కథ, కథనాలు సాగుతాయి.

తాము బతికి బయటపడాలంటే ఉన్న ఏకైక మార్గం చనిపోయిన వారి మాంసం తినాలన్న నిర్ణయానికి వచ్చినప్పుడు ప్రతిఒక్కరి కళ్లల్లో భావోద్వేగంతో కన్నీటిసుడులు తిరుగుతాయి. అన్ని రోజులు తమతో కలిసి ఉన్న ప్రాణ స్నేహితుల మాంసం తినడమన్న కాన్సెప్ట్‌ను చూపించడానికి దర్శకుడు ఏమాత్రం సంకోచించలేదు. ఆయా సన్నివేశాలు సినిమా చూస్తున్న ప్రేక్షకుడికీ కంటతడి పెట్టిస్తాయి. విమాన శకలాలలో దొరికిన వస్తువులతో రేడియో చేయడం దానిద్వారా తాము బతికే ఉన్నామన్న సంగతి ప్రపంచానికి చెప్పేందుకు చేసే ప్రయత్నాలు ఆసక్తికరంగా ఉంటాయి.  ‘స్నేహితుల కోసం ప్రాణత్యాగం చేయడమంత గొప్ప ప్రేమ ఈ లోకంలో మరొకటి లేదు’ అంటూ చేతిలో కాగితం పెట్టుకుని ఓ యువకుడు చనిపోయే సీన్‌ ప్రతిఒక్కరినీ కన్నీరు పెట్టిస్తుంది. చివరకు 16 మంది మాత్రమే మిగలగా వారిని సైన్యం కనిపెట్టినప్పుడు కలిగే ఆనందంతో సినిమా చూస్తున్న ప్రేక్షకుడూ భావోద్వేగానికి గురవుతాడు. ఆ సమయంలో వచ్చే ప్రతి సన్నివేశం హృదయాన్ని తాకుతుంది. కేవలం ఎముకల గూడుపై చర్మం కప్పినట్లు ఉన్న వాళ్ల శరీరాలు చూసి, కన్నీళ్లు ఆగవు.

ఎవరెలా చేశారంటే: నటించిన ఏ ఒక్కరూ మనకు తెలియకపోయినా, ప్రతి పాత్రకూ మనం కనెక్ట్‌ అవుతాం. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. ముఖ్యంగా మంచు పర్వతాలను తెరపై ఆవిష్కరించిన తీరు చూస్తే, వావ్‌ అనాల్సిందే. జె.ఎ. బయోనా ఈ మూవీని కేవలం ఒక సర్వైవల్‌ థ్రిల్లర్‌గానే కాకుండా భావోద్వేగాల చిత్రంగానూ మలచడంలో విజయం సాధించారు. కానీ, కథనం చాలా నెమ్మదిగా సాగుతుంది.

కుటుంబంతో చూడొచ్చా: ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. తెలుగులో ఆడియోనూ అందుబాటులో ఉంది.

  • బలాలు
  • + కథ
  • + దర్శకత్వం
  • + నటీనటులు, సినిమాటోగ్రఫీ
  • బలహీనతలు
  • - నెమ్మదిగా సాగే కథనం
  • చివరిగా: సొసైటీ ఆఫ్‌ ది స్నో..  భావోద్వేగాల ప్రయాణం
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని