Chiranjeevi: ఆ అవమానమే.. సుప్రీం హీరోను మెగాస్టార్‌ చేసింది: పద్మ విభూషణ్‌ చిరంజీవి ప్రయాణమిది!

ప్రముఖ నటుడు చిరంజీవికి అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన ‘పద్మ విభూషణ్‌’ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..

Updated : 26 Jan 2024 14:30 IST

నటుడిగా విశేష అభిమాన గణాన్ని సొంతం చేసుకున్న చిరంజీవి (Chiranjeevi) సామాజిక కార్యక్రమాల్లోనూ ముందుంటారు. సినీ పరిశ్రమకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం మరో అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. 2006లో ‘పద్మ భూషణ్‌’ అందుకున్న ఆయన్ను.. తాజాగా పౌర పురస్కారాల్లో రెండో అత్యున్నతమైన ‘పద్మ విభూషణ్‌’ (Padma Vibhushan) వరించింది. ఈ సందర్భంగా ఆయన ప్రయాణాన్ని చూద్దాం.. (Padma Vibhushan Chiranjeevi).. 

తాత మాటలు నిజం చేసి..

1955 ఆగస్టు 22న నరసాపురంలోని (పశ్చిమ గోదావరి) మిషనరీ ఆస్పత్రిలో చిరంజీవి జన్మించారు. తాత (అంజనాదేవి తండ్రి) జె.ఆర్‌.కె. నాయుడు శివుడి భక్తుడు కావడంతో ఆయనకు శివశంకర వరప్రసాద్‌ అని పేరు పెట్టారు. చాలా హుషారుగా ఉండే తన మనవడు ఏదో సాధిస్తాడని తాత నమ్మకంగా ఉండేవారు. ‘నువ్వు గొప్పవాడివి అవుతావు నాన్నా.. ఈలోకం నీకు జేజేలు పలుకుతుంది’ అంటూ మనవడిని చూసి మురిసిపోయేవారు. తాత చెప్పిన మాటలు అప్పుడు వరప్రసాద్‌కు అర్థం కాలేదు గానీ.. తర్వాత అవి నిజమయ్యాయి. రామాయణం, భారతం, భాగవతాల గురించి తల్లి చెబుతుంటే ఆసక్తిగా వినేవారు. నాటకాలు ఎక్కువగా చూసేవారు. అప్పుడప్పుడు రికార్డింగ్‌ డ్యాన్స్‌లకు వెళ్లి ఇంటికొచ్చాక తమ్ముళ్లు, చెల్లెళ్ల ముందు వాటిని అనుకరించేవారు. అలా సుమారు ఆరేళ్ల వయసులోనే నృత్యంపై మనసు పడ్డారు. ‘డ్యాన్స్‌ అంటే చిరంజీవిదే’ అని ఆరు పదుల్లోనూ అందరితో అనిపించుకుంటున్నారు. పెద్ద కొడుకుని పోలీసు అధికారి చేయాలని తండ్రి, వైద్యుడిని చేయాలని తల్లి అనుకునేవారు. ఒకవేళ ఆయన ఈ రెండింటిలో ఏదో ఒక వృత్తిలో స్థిరపడి ఉండుంటే.. ఆయన అభిమానులే కాదు.. సినీ ప్రియులు దాన్ని ఊహించడం కష్టమే!

నటనకు బీజం..

హైస్కూల్లో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతుండగా ఓ మిత్రుడు రాసిన నాటిక రిహార్సల్స్‌ చూసేందుకు వరప్రసాద్‌ వెళ్లారు. అనుకోకుండా అందులోని పరంధామయ్య పాత్రను తానే పోషించాల్సి వచ్చింది. వీక్షకుల చప్పట్లతోపాటు ‘విజేత’గా బహుమతి అందుకున్నారు. వరప్రసాద్‌ నటనకు బీజం పడింది అక్కడే. ఆ దృశ్యాలను చూసి తల్లి, తండ్రి ఉప్పొంగిపోయారు. తల్లి కోరిక మేరకు ఇంటర్‌లో బైపీసీలో చేరిన ఆయన.. నరసాపురంలోని వై.ఎన్‌.ఎం. కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఆ సమయంలో.. ‘రాజీనామా’ నాటికలో ఛైర్మన్‌ పాత్ర పోషించి మరో బహుమతి అందుకున్నారు. ఎన్‌.సి.సి.లో సీనియర్‌ క్యాడెట్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు. ఓ ఏడాది.. దిల్లీలో రిపబ్లిక్‌ డే వేడుకల్లో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రా జట్టు తరఫున మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ముందు పోలేరమ్మ జాతరను ప్రదర్శించారు. తిరుగు ప్రయాణంలో రైలుకంటే వేగంగా వరప్రసాద్‌ ఆలోచనలు తిరిగాయి. ‘సినిమాల్లోకి వెళ్లడం కరెక్టేనా? అసలు అది ఎలా సాధ్యం?’.. ఇలా సందేహాల నడుమే ఇంటికి చేరుకున్నారు. డిగ్రీ పూర్తయ్యాక ఎట్టకేలకు నటుడిని అవుతానంటూ తండ్రికి చెప్పాలనుకున్నారు. ఈలోగా.. నటనలో శిక్షణ కోసం ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు అప్లికేషన్‌ పంపగా ఇంటర్వ్యూకు రావాలంటూ లేఖ వచ్చింది. దాన్ని చూసి తండ్రి.. వరప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ పరిశ్రమలోని సాధకబాధకాలు చెప్పి పరోక్షంగా వెళ్లొద్దన్నారు. ‘నేను వెళతాను నాన్నా..’ అంటూ వరప్రసాద్‌ మద్రాస్‌ రైలు ఎక్కారు.

అలా చిరంజీవిగా..

మద్రాసులో జరిగిన ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇంటర్వ్యూకు హాజరై, శిక్షణకు ఎంపికయ్యారు. అదే ఇంటర్వ్యూకు వెళ్లిన హరిప్రసాద్‌, సుధాకర్‌లతో కలిసి ఓ గదిలో ఉండేవారు. మరో ఐదు నెలల్లో శిక్షణ పూర్తికావాల్సి ఉండగా ‘పునాది రాళ్లు’లో నటించే అవకాశం అందుకున్నారు. ఆ ఆనందాన్ని కుటుంబంతో పంచుకునేందుకు మొగల్తూరు వెళ్లారు. అప్పుడే పేరును కూడా మార్చుకోవాలనుకున్నారు. అమ్మ, నాన్న, తమ్ముళ్లు, చెల్లెళ్లు చెప్పిన ఏ పేరూ నచ్చలేదు. ‘చిరంజీవి..’ అంటూ తన కొచ్చిన కల గురించి చెబుతూ ‘చిరంజీవి అంటే హనుమంతుడే కదమ్మా?’ అని అడిగారు. అవును బాబు.. ఇకపై నీ పేరు చిరంజీవి అంటూ అంజనాదేవి కొడుకుకి మళ్లీ నామకరణం చేశారు. ‘పునాది రాళ్లు’ చిత్రీకరణకు కొంతకాలం బ్రేక్‌ పడింది. ఆ టైమ్‌లో ‘ప్రాణం ఖరీదు’కు ఎంపికయ్యారు. రెండు చిత్రాల చిత్రీకరణ ఒకేసారి పూర్తయినా ‘ప్రాణం ఖరీదు’ (1978) ముందుగా విడుదలైంది. ఆ సినిమా ప్రివ్యూ చూసిన ప్రముఖ దర్శకులు బాపు, కె. బాలచందర్‌ తమ చిత్రాల్లో (మన ఊరి పాండవులు, ఇది కథ కాదు) అవకాశాలు ఇవ్వడంతో చిరంజీవి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారారు.

ప్రేక్షక హృదయాల్లో ‘ఖైదీ’

నటుడిగానే కాదు వ్యక్తిగాను చిరంజీవి ‘అందరివాడు’ అయ్యారు. ‘మనవూరి పాండవులు’తో విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాదు.. తొలి పారితోషికాన్ని ఆ చిత్రంతోనే అందుకున్నారు. వరుస అవకాశాలొస్తున్నప్పటికీ.. అవన్నీ వేరే హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు, నెగెటివ్‌ రోల్స్‌. వాటిని తిరస్కరిస్తే నటుడిగా భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయంతో నటించేవారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆత్మవిశ్వాసం కోల్పోకుండా లక్ష్యాన్ని చేరుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, మురళీమోహన్‌.. ఇలా ఎందరో హేమాహేమీల్లాంటి వారు ఉన్నా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. డ్యాన్స్‌, ఫైట్స్‌లో కొత్త ఒరవడి సృష్టించి ప్రేక్షకుల హృదయాల్లో ‘ఖైదీ’ అయ్యారు. చిరంజీవి నట ప్రస్థానం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘ఖైదీ ముందు.. ఖైదీ తర్వాత’ అనాల్సిందే. 1980, 1983లో అత్యధికంగా 14 చిత్రాల్లో నటించారు. ‘చిరంజీవి కళాకారుడు కాదు కళాకార్మికుడు’ అని రావుగోపాలరావు, ‘ఉదయించే సూర్యుడు సాయంత్రానికి అలసిపోతాడు, అలుపెరగని సూర్యుడు చిరంజీవి’ అని బ్రహ్మానందం ఇందుకే అన్నారేమో! తొలినాళ్లలో సుప్రీం హీరోగా అలరించిన చిరు.. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో మెగాస్టార్‌గా మారారు.

చెప్పింది చేశారు.. 

నట శిక్షణలో ఉన్న సమయంలో ‘పూర్ణా పిక్చర్స్‌’ సంస్థ పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి చిరంజీవి, హరిప్రసాద్‌, సుధాకర్‌ రివ్యూలు ఇస్తుండేవారు. అలా ఓ సినిమా చూసేందుకు వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌లు ఆ ముగ్గురిని లేపారు. చేసేదేమీలేక వారు నిల్చొనే సినిమాను చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత భార్య అడగ్గా.. ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. చూడండి ఆంటీ.. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని చిరంజీవి ఆవేశంలో చేసిన ఆ ‘ఛాలెంజ్‌’ను నెగ్గారు. ఈ నంబర్లపై  చిత్ర వర్గాల్లో ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ‘ఇండస్ట్రీకి నంబర్‌ 1 హీరో చిరంజీవి గారే’ అని మహేశ్‌బాబు సైతం అభిప్రాయం వ్యక్తం చేశారు. సామాజిక సేవలోనూ చిరంజీవిది ప్రత్యేక ముద్ర. ఛారిటబుల్‌ ట్రస్టు, బ్లడ్‌ బ్యాంక్‌, ఐ బ్యాంక్‌ స్థాపించారు. రాజకీయాల్లోకీ వెళ్లొచ్చారు. నిర్మాతగానూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మించి తెలుగు సినీ పరిశ్రమ సర్వతోముఖాభివృద్ధికి తనవంతు కృషి చేశారు. కరోనా వేళ సినీ కార్మికులను ఆదుకునేందుకు అవిశ్రాంతంగా శ్రమించారు.

పురస్కారాలు..  

వ్యక్తిగత వెబ్‌సైట్‌ కలిగిన తొలి భారతీయ నటుడిగా నిలిచిన చిరంజీవి.. 1999-2000 సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా ‘సమ్మాన్‌’ అవార్డు పొందారు. 90ల్లో అత్యధిక పారితోషికం (రూ.కోటికిపైగా) తీసుకున్న తొలి భారతీయ నటుడిగా, ‘ఆస్కార్‌’ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా పేరొందారు. నాలుగు దశాబ్దాల ప్రస్థానంలో కోట్లాది అభిమానులతోపాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా ‘నంది’ పురస్కారం (స్వయం కృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర) అందుకున్నారు. తొమ్మిది ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు, రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు (2016), ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు (2022), పద్మ భూషణ్‌ (2006) తీసుకున్నారు. తాజాగా ‘పద్మ విభూషణ్‌ చిరంజీవి’గా మరో మెట్టు ఎక్కారు. ప్రస్తుతం ‘విశ్వంభర’ (156వ సినిమా)లో నటిస్తున్నారు.

- ఇంటర్నెట్‌  డెస్క్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని