Oscars 2023: 12 ఏళ్ల కష్టానికి ఆస్కార్‌ సలాం కొట్టింది

ఈ ఏడాది ఎక్కువగా అకాడమీ అవార్డులు (Oscars 2023) సొంతం చేసుకున్న ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ (Everything Everywhere All At Once) సినిమా విశేషాలు

Updated : 13 Mar 2023 14:55 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తోన్న ‘ఆస్కార్‌’ (Oscars 2023) అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. ‘అవతార్‌ 2’, ‘టాప్‌గన్‌ : మావెరిక్‌’ వంటి విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న హాలీవుడ్‌ చిత్రాలను వెనక్కి నెట్టి ఈ ప్రతిష్ఠాత్మక వేదికపై ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (Everything Everywhere All At Once)  విజయకేతనం ఎగురవేసింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు విభాగాల్లో ఆస్కార్‌ను ముద్దాడింది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు విశేషాలు..! (Everything Everywhere All At Once)

కథేంటంటే..!

‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ (Everything Everywhere All At Once).. ఇదొక సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం. డేనియల్‌ క్వాన్‌, డానియెల్‌ షైనెర్ట్‌ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. మిషెల్‌ యో, కి హుయ్‌ క్వాన్‌, జామీ లీ కర్టిస్‌ వంటి తారాగణంతో ఇది రూపుదిద్దుకుంది. ఎవిలిన్‌ క్వాడ్‌ అనే చైనీస్‌ వలసదారుల కుటుంబం అమెరికాలో లాండ్రీ షాపు పెట్టుకుంటుంది. అనుకోకుండా ఒకరోజు వేరే ప్రపంచం నుంచి వచ్చిన తన లాంటి వాళ్లే ఆమెకు ఎదురవుతారు. ఆ మల్టీవర్స్‌ కలిగించే ప్రమాదాల వల్ల ఆమె ఎలాంటి పరిణామాలను ఎదుర్కొంది? తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంది? అనే ఆసక్తికర అంశాలతో సినీ ప్రియులను ఆకట్టుకునేలా దీన్ని రూపొందించారు. (Everything Everywhere All At Once).

12 ఏళ్ల శ్రమ..!

విభిన్నమైన కథలను ప్రేక్షకులకు అందించాలని భావించిన క్వాన్‌, షైనెర్ట్‌.. 2010లోనే ‘ఎవ్రీథింగ్‌ ఎవ్రీవేర్‌ ఆల్‌ ఎట్‌ వన్స్‌’ కథ రాయడం మొదలుపెట్టారు. అలా, ఎనిమిదేళ్లపాటు శ్రమించి 2018లో ఈ సినిమాని ప్రకటించారు. 2020లో షూట్‌ మొదలు పెట్టి.. 2022లో దీన్ని విడుదల చేశారు. 2.19 గంటల నిడివి ఉన్న ఈ సినిమా హాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద రికార్డులు క్రియేట్‌ చేసింది. దాదాపు 25 మిలియన్ డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం.. పెట్టిన డబ్బు కంటే నాలుగురెట్లు అధికంగా వసూళ్లు రాబట్టింది. అలా, 108 మిలియన్‌ డాలర్లు ఇది వసూళ్లు చేసినట్లు సినీ విశ్లేషకులు అంచనా వేశారు. (Everything Everywhere All At Once).

అత్యధిక నామినేషన్స్‌.. విజయాలు..!

హాలీవుడ్‌లో విశేష ప్రేక్షకాదరణ సొంతం చేసుకున్న ఈ సినిమా 95వ అకాడమీ అవార్డుల కోసం 11 విభాగాల్లో పోటీ పడి.. అత్యధిక నామినేషన్స్‌ దక్కించుకున్న చిత్రంగా నిలిచింది. ఈ క్రమంలో ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయనటి, ఉత్తమ సహాయనటుడు.. ఇలా ఏడు విభాగాల్లో ఇది ఆస్కార్‌ను గెలుచుకుంది. ముఖ్యంగా ఉత్తమ చిత్రం విభాగంలో ‘అవతార్‌ 2’, ‘టాప్‌గన్‌: మావెరిక్‌’ వంటి భారీ చిత్రాలను పక్కకు నెట్టి అవార్డును సొంతం చేసుకోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా వీరి సినిమా టేకింగ్‌కు ‘ఆస్కార్‌’ సలాం కొట్టింది. ఉత్తమ దర్శకుడి విభాగంలో క్వాన్‌, షైనెర్ట్‌కు పురస్కారం దక్కింది. ‘ఆస్కార్‌’ ప్రదానోత్సవంతో ప్రస్తుతం అందరూ ఈసినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇక, ఈ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ప్రస్తుతం సోనీలివ్‌ వేదికగా ప్రేక్షకులకు అందుబాటులో ఉంది. (Everything Everywhere All At Once)

కెరీర్‌ అయిపోయిందనుకున్నా: కి హుయ్‌ క్వాన్‌

‘‘నా తల్లికి 84 ఏళ్లు. ప్రస్తుతం ఆమె ఇంట్లో ఉండి ఈ ప్రోగ్రామ్‌ చూస్తున్నారు. ‘అమ్మా.. నేను ఆస్కార్‌ గెలుపొందాను’. నా ప్రయాణం ఓ పడవలో మొదలైంది. శరణార్థ శిబిరాల్లో ఏడాది గడిపాను. అక్కడి నుంచి నేడు హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఈ స్టేజ్ వరకూ నా జర్నీ సాగింది. ఇలాంటి అద్భుతమైన సంఘటనలు కేవలం సినిమాల్లో జరుగుతాయని అందరూ అంటుంటారు. నేను కూడా ఈ క్షణాలను అనుభవిస్తానని ఎప్పుడూ నమ్మలేదు. నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చేందుకు ఎన్నో త్యాగాలు చేసిన మా అమ్మకు ధన్యవాదాలు. నా కెరీర్‌ అయిపోయిందని భావించిన నాలో సుమారు 20 ఏళ్ల నుంచి స్ఫూర్తి నింపుతున్న నా భార్యకు ధన్యవాదాలు’’ అంటూ సహాయనటుడిగా గెలుపొందిన అనంతరం కి హుయ్‌ క్వాన్‌ కన్నీరుపెట్టుకున్నారు.(Everything Everywhere All At Once)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని