Chiranjeevi: ఆ అవమానం ఎదుర్కొని.. నం.1 హీరోగా ఎదిగి: చిరంజీవి ప్రయాణమిదీ

ఆగస్టు 22.. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం మీకోసం..

Published : 22 Aug 2023 09:55 IST

చిరంజీవి (Chiranjeevi).. పరిచయం అక్కర్లేని పేరు. మధ్యతరగతి వ్యక్తిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన ఆయన నంబరు 1 హీరోగా ఎదగడానికి కారణం.. కృషి, పట్టుదల.. ఎదురైన అవమానాలు.. నేడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ.. ఆయన నెలకొల్పిన పలు రికార్డుల వివరాలు చూద్దాం (Happy Birthday Chiranjeevi)..

తొలి సినిమా అలా..

అది 1978.. ఎందరో హేమా హేమీల్లాంటి నటులున్న తెలుగు చిత్ర పరిశ్రమలోకి శివ శంకర వరప్రసాద్‌ (చిరంజీవి అసలు పేరు) బిక్కుబిక్కుమంటూ ప్రవేశించారు. నటనపై ఎంతో ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చారు కాబట్టి ఆయన.. వారందరినీ చూసి భయపడలేదు. అదే రంగంలో రాణిస్తాననే బలమైన నమ్మకంతో ఉండేవారు. ఎన్నో ప్రయత్నాల తర్వాత తొలిసారి ‘పునాది రాళ్లు’ సినిమాలో నటించారు. దాని తర్వాత నటించిన ‘ప్రాణం ఖరీదు’ చిత్రం ముందుగా విడుదలైంది. ఈ సినిమాతోనే ఆయన ప్రేక్షకులకు పరిచయమయ్యారు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన్ను ఇతర హీరోల చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించమని కొందరు డిమాండ్‌ చేసేవారట. ఒకవేళ చెయ్యను అని చెబితే భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమోనన్న భయం, మనల్ని మనం నిరూపించుకునే సమయం ఎప్పటికైనా వస్తుందనే ఆశతోనే వాటిలో నటించినట్లు చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు. తాననుకున్న గమ్యాన్ని చేరుకుని ఎందరిలోనో స్ఫూర్తినింపారు. అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని వీడకూడదనే దాన్ని ఈ సంఘటన తెలియజేస్తుంది (Happy Birthday Megastar).


ప్రివ్యూలు చూసి.. రివ్యూలు ఇచ్చి

ఇండస్ట్రీలోకి వెళ్లకముందు చిరంజీవి.. హరిప్రసాద్‌, సుధాకర్‌లతో మద్రాసులో ఉండేవారు. ‘పూర్ణా పిక్చర్స్‌’ సంస్థ మేనేజరు తాము పంపిణీ చేసే సినిమాల ప్రివ్యూలు చూసి, వాటి రివ్యూలు ఇవ్వమని వారికి చెప్పేవారు. అలా ఓ హోదాలో ఓ సినిమా చూడడానికి వెళ్లిన వారు ముందు వరుసలో కూర్చొన్నారు. ఇంతలో ఆ సినిమాలో హీరోగా నటించిన వ్యక్తికి చెందిన డ్రైవర్‌, మేకప్‌మ్యాన్‌లు రావడంతో చిరంజీవి, హరిప్రసాద్‌, సుధాకర్‌లను లేపి, వారిని కూర్చోబెట్టారట. చేసేదేమీలేక చిరు అండ్‌ కో నిల్చొనే సినిమాని చూశారు. ‘సినిమా ఎలా ఉంది?’ అని ఆ సంస్థ అధినేత భార్య అడగ్గా.. ‘ఆంటీ.. మీ అతిథులుగా మేం అక్కడకు వెళ్లాం. కానీ, ఆ హీరో మమ్మల్ని డోర్‌ దగ్గర నిలబెట్టాడు. తిరిగి వచ్చేస్తే మీకు చెడ్డపేరు వస్తుందని భరించాం. చూడండి ఆంటీ.. ఈ ఇండస్ట్రీకి నంబరు 1 హీరోని కాకపోతే నన్ను అడగండి’ అని ఆవేశంతో అన్నారట. చివరకు ఆమెకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆత్మవిశ్వాసానికి మించింది మరొకటి లేదని ఈ పరిణామం స్పష్టం చేస్తుంది. 


విమర్శలు స్వీకరించి..

డ్యాన్స్‌ అంటే చిరు అని చాలామంది అంటుంటారు. ఆయన అంత గొప్ప డ్యాన్సర్‌గా మారడం వెనుక ఆసక్తికర కథ ఉంది. తొలినాళ్లలో.. చిరంజీవి ఓ సినిమాలోని పాట పూర్తిచేసుకుని బయటకు వచ్చి.. వెంకన్న అనే మేనేజరును కలుసుకున్నారు. ‘ఎలా ఉంది? నా పెర్ఫామెన్స్‌’ అని అడగ్గా.. ‘ఆ.. అందులో ఏముంది? నీ వెనుక డ్యాన్సర్లు ఏం చేశారో, అదే నువ్వు చేశావ్‌. నీ ప్రత్యేకత చూపించాలి కదా?’ అని ఆ మేనేజరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి కొరియోగ్రాఫర్లు చెప్పినదానికి అదనంగా డ్యాన్స్‌ చేస్తూ ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించారు చిరు. నటన మెరుగుపరుచుకోవడంలో సినీ క్రిటిక్‌ గుడిపూడి శ్రీహరి పాత్ర ఉందని చిరంజీవి ఓ సందర్భంలో తెలిపారు. ఓ సినిమాకి సంబంధించిన రివ్యూలో ‘నటనలో వేగం ఉండాలిగానీ మాటలో కాదు’ అని శ్రీహరి ఇచ్చిన సమీక్ష తనలో మార్పు తీసుకొచ్చిందన్నారు. సద్విమర్శలను స్వీకరించి, ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటే విజయం వరిస్తుందనడానికి ఇవి ఉదాహరణలు.


‘ఖైదీ’కి ముందు.. తర్వాత

చిరంజీవి కెరీర్‌ని ‘ఖైదీ’కి ముందు.. తర్వాత అని ప్రస్తావించాల్సిందే. 1983లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది మరి! చిరంజీవికి మాస్‌ ఇమేజ్‌, స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. తనదైన శైలి డ్యాన్స్‌, డైలాగ్స్‌తో అలరించే ఆయన పాలిటిక్స్‌లో వెళ్లి, నటనకు దూరమవడం అభిమానులు, ఆడియన్స్‌ను కాస్త బాధపెట్టింది. ‘ఖైదీ నం. 150’తో రీ ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రేక్షకుల్లో మళ్లీ అదే హుషారు తీసుకొచ్చారు. వరుస సినిమాలు చేస్తూ యంగ్‌ హీరోలకు పోటీనిస్తున్నారు. ఇప్పటి వరకు 155 చిత్రాల్లో నటించిన చిరు.. ‘నంది’, ‘ఫిల్మ్‌ఫేర్‌’వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. ‘పద్మ భూషణ్‌’గా నిలిచారు. తమిళం, కన్నడ, హిందీలోనూ నటించిన చిరంజీవి హీరోగా ఓ హాలీవుడ్‌ మూవీ ఖరారైనా, అది కార్యరూపం దాల్చలేదు.


రెండు బిరుదులు..

ఒకే హీరోకి రెండు బిరుదులు ఉండటం అరుదు. తొలినాళ్లలో ‘సుప్రీమ్‌ హీరో’గా పేరొందిన చిరు ఆ తర్వాత ‘మెగాస్టార్‌’గా విశేష క్రేజ్‌ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. 1988లో వచ్చిన ‘మరణ మృదంగం’తో చిరంజీవి.. మెగాస్టార్‌గా మారారు. ఆ చిత్ర నిర్మాత కె.ఎస్‌. రామారావు చిరుకి ఆ బిరుదునిచ్చారు. అంతకు ముందు వరకు ఆయన నటించిన సినిమా టైటిల్స్‌లో కొన్నింటిలో చిరంజీవి అని, మరికొన్ని చిత్రాల్లో ‘సుప్రీమ్‌ హీరో’ అని కనిపిస్తుంది. చిరు ‘సుప్రీమ్‌ హీరో’గా కనిపించిన చివరి చిత్రం ‘ఖైదీ నంబరు. 786’. సుప్రీమ్‌ హీరో, మెగాస్టార్‌.. ఈ రెండింటిపైనా పాటలు రావడం విశేషం.


45 ఏళ్ల ప్రస్థానంలో చిరు సాధించిన ఘనతల్లో కొన్ని..

  • పర్సనల్‌ వెబ్‌సైట్‌ కలిగిన తొలి భారతీయ నటుడు. ఆయన గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుకుంటే https://www.kchiranjeevi.com/ ను సందర్శించవచ్చు.
  • ప్రతిష్ఠాత్మక ‘ఆస్కార్‌’ వేడుక (1987)లో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడు. 
  • 1999- 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి ‘సమ్మాన్‌’ అనే అవార్డు పొందారు. 2002లో.. అప్పటి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి చిరుకి ఈ అవార్డుని అందించారు.
  • ‘పసివాడి ప్రాణం’ సినిమాతో బ్రేక్‌ డ్యాన్స్‌ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేశారు.
  • ‘బావగారు బాగున్నారా’ చిత్రంలో బంగీజంప్‌ చేశారు. ఈ సినిమాలోని ఓ సన్నివేశం కోసం 240 అడుగుల ఎత్తునుంచి దూకారు.
  • ఏక పాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన సినిమాలు 100 రోజులు ప్రదర్శితమైన రికార్డు ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో చిరంజీవికే దక్కింది.
  • అత్యధిక పారితోషికం (రూ.కోటికిపైగా) అందుకున్న తొలి భారతీయ నటుడిగా 1992లో వార్తల్లో నిలిచారు.
  • చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’.. రూ. 10 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ సాధించిన తొలి తెలుగు చిత్రంగా, ‘ఇంద్ర’..రూ. 30 కోట్లకుపైగా గ్రాస్‌ వసూళ్లు చేసిన తొలి తెలుగు చిత్రంగా చరిత్ర సృష్టించాయి.
  • రష్యన్‌లోకి డబ్‌ అయిన తొలి తెలుగు చిత్రం.. చిరంజీవి నటించిన ‘స్వయంకృషి’.
  • 1980, 1983.. ఈ ఏడాదుల్లో చిరంజీవి నటించిన 14 చిత్రాలు విడుదలయ్యాయి.

- ఇంటర్నెట్‌ డెస్క్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని