Mahesh Babu: అనుకోకుండా తెరంగేట్రం చేసి.. సూపర్‌స్టార్‌గా నిలిచి: మహేశ్‌బాబు బర్త్‌డే స్పెషల్‌

ప్రముఖ నటుడు మహేశ్‌బాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం..

Published : 09 Aug 2023 09:58 IST

కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పినా ఎందుకో నమ్మబుద్ధికాదు. అలాంటి ఓ ప్రశ్నే మహేశ్‌బాబు (Mahesh Babu) వయసెంత? ఆ నమ్మలేని సమాధానం.. 48 సంవత్సరాలు. ‘ఐదు పదుల వయసుకు చేరువవుతున్నా మహేశ్‌బాబు పాతికేళ్ల నవ యువకుడిగానే కనిపిస్తారు’ అనేది ఎంతోమంది మాట. అందంతో మాత్రమే కాదు.. వ్యక్తిత్వంతోనూ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకునే మహేశ్‌ పుట్టిన రోజు నేడు (HappyBirthday Mahesh Babu). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు మీకోసం..

అందం వెనుక రహస్యమిది..!

మహేశ్‌బాబు అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది అందం. తన గ్లామర్‌ రహస్యాన్ని మహేశ్‌ ఓసారి ఇలా పంచుకున్నారు. ‘‘ముఖంమీద చెరగని చిరునవ్వే నిజమైన అందం. ఆ నవ్వు మనస్ఫూర్తిగా రావాలి. అందుకు మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలి. నేనింత ప్రశాంతంగా ఉండటానికి కారణం.. నేనే తప్పు చేయకపోవడం, భవిష్యత్తులోనూ చెయ్యను అని నా మీద నాకున్న నమ్మకం. ఇది నాన్న నుంచి నేర్చుకున్నా’’ అని తెలిపారు.

రియల్‌ హీరోగా..

మహేశ్‌ ఎన్నో చిట్టి ‘గుండె’లకు ఊపిరిలూది రియల్‌ హీరో అనిపించుకున్నారు. పుట్టుకతో వచ్చే సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ పేద పిల్లలకు ఆపరేషన్లు చేయించాలని మహేశ్‌ దంపతులు నిర్ణయించుకున్నారు. విజయవాడ ఆంధ్రా హాస్పిటల్‌ ద్వారా మహేశ్‌బాబు ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో వేల మంది చిన్నారులకు వైద్య సాయం అందించారు. తెలంగాణలో ఉండేవారికీ ఇబ్బంది లేకుండా ‘ప్యూర్‌ లిటిల్‌ హార్ట్‌ ఫౌండేషన్‌’ పేరిట హైదరాబాద్‌లోనూ గుండె ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు.

పుస్తకం చదివి.. సిగరెట్‌ మానేసి!

మహేశ్‌కు పుస్తకాలు చదవడం ఇష్టం. కాలక్షేపం కోసం చదివి వదిలేయకుండా వాటి నుంచి స్ఫూర్తిపొందుతుంటారు. ఒకప్పుడు తనకు సిగరెట్‌ తాగే అలవాటు ఉండేదని, ఎంత ప్రయత్నించినా మానలేకపోయానని, ఎలెన్‌ కార్‌ రాసిన ‘ది ఈజీ వే టు స్టాప్‌ స్మోకింగ్‌’ (The Easy Way to Stop Smoking) అనే పుసక్తం చదివాక సిగరెట్‌ని పట్టుకోలేదని మహేశ్‌ ఓ సందర్భంలో తెలిపారు. తాను ఏ పుస్తకం చదివినా వాటి నుంచి ఎంతో కొంత నేర్చుకుని, పుస్తకాల వివరాల్ని సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంటారు.

తెరంగేట్రం.. ఊహించనిది!

జీవితంలో కొన్ని ముఖ్య ఘట్టాలు మన ప్రమేయం లేకుండానే జరిగిపోతుంటాయి. మహేశ్‌బాబు సినీ రంగ ప్రవేశం కూడా అంతే. ఓ సారి తన అన్నయ్య రమేశ్‌తో కలిసి మహేశ్‌ విజయవాడ వెళ్లారు. రమేశ్‌ ‘నీడ’ అనే సినిమాలో నటిస్తున్న రోజులవి. దాసరి నారాయణరావు ఆ చిత్రానికి దర్శకుడు. ఓ కీలక పాత్రని మహేశ్‌కి తెలియకుండానే ఆయనపై చిత్రీకరించారు దాసరి. బాల నటుడిగా మహేశ్‌ తెరంగేట్రం చేసిన సినిమా ఇదే. అప్పుడు మహేశ్‌ వయసు సుమారు 4 ఏళ్లు. అలా.. అనుకోకుండా నటుడిగా మారిన మహేశ్‌ సూపర్‌స్టార్‌గా ఎదిగిన ప్రయాణం ఆసక్తికరం.

బాల్యంలోనే సాహసం..

ఊహ తెలిశాక మహేశ్‌ నటించిన తొలి చిత్రం ‘పోరాటం’. ఆయన తండ్రి కృష్ణ హీరోగా తెరకెక్కింది. ‘శంఖారావం’ సినిమాలోని మహేశ్‌ పాత్రకు సంబంధించిన సాహస సన్నివేశాల్లో డూప్‌ని పెట్టాలనుకున్నారట దర్శక, నిర్మాతలు. అయితే, ఆ వయసులోనే డూప్‌ వద్దని వారితో చెప్పి, తానే నటించారు. ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలోనూ మహేశ్‌ డూప్‌ లేకుండా నటించారు. ‘బజార్‌ రౌడీ’, ‘ముగ్గురు కొడుకులు’, ‘గూఢచారి 117’, ‘కొడుకు దిద్దిన కాపురం’.. తనకు హాలీడేస్‌ ఉన్న రోజుల్లో ఈ సినిమా షూటింగ్స్‌లో మహేశ్‌ పాల్గొన్నారు. వేసవిలో చిత్రీకరణ జరగాల్సిన ‘అన్నా తమ్ముడు’ అనివార్య కారణంగా వాయిదా పడింది. దాంతో మహేశ్‌ స్కూల్‌కు వెళ్లలేకపోయారు. డిగ్రీ చదివే రోజుల్లో మళ్లీ నటనపై ఆసక్తి కలగడంతో.. ‘రాజకుమారుడు’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఖాతాలో ఇండస్ట్రీ హిట్‌లతో తెలుగు సినీ చరిత్రను తిరగరాసిన సినిమాలూ ఉన్నాయి. ప్రస్తుతం ‘గుంటూరు కారం’ (త్రివిక్రమ్‌ దర్శకుడు) (Guntur Kaaram)లో నటిస్తున్న మహేశ్‌.. అది పూర్తయిన తర్వాత రాజమౌళి (SS Rajamouli) దర్శకత్వంలో నటించనున్నారు.

  • వివిధ రంగాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారి మైనపు విగ్రహాలు ‘మేడమ్‌ టుస్సాడ్స్‌’ (Madame Tussauds)లో కొలువుదీరుతాయనే విషయం తెలిసిందే. ఈ గౌరవం దక్కించుకున్న అతి కొద్దిమంది నటుల్లో మహేశ్‌ ఒకరు.
  • ‘డాల్బీ ఎక్స్‌ సరౌండ్‌ సౌండ్‌ సిస్టమ్‌’ టెక్నాలజీ.. మహేశ్‌ సినిమా ‘నిజం’తో టాలీవుడ్‌కి పరిచయమైంది.
  • ‘టైమ్స్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌మ్యాన్‌’గా 2010లో 12వ, 2011లో 5వ, 2012లో 2వ, 2013లో 1వ స్థానం దక్కించుకున్నారు. 2014, 2015లో 6వ, 2016లో 7వ, 2017లో 6వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత, ‘ఫరెవర్‌ డిజైరబుల్‌’ జాబితాలో చేరారు.
  • హీరోగా మహేశ్‌ది సుమారు 24 ఏళ్ల ప్రస్థానం. ఇన్నేళ్లలో ఆయన ఒక్క రీమేక్‌ చిత్రంలోనూ నటించకపోవడం విశేషం.
  • పలు సినిమాలకు సంబంధించి బెస్ట్‌ మేల్‌ డెబ్యూ, బెస్ట్‌ యాక్టర్‌, స్పెషల్‌ జ్యూరీ విభాగాల్లో 8 ‘నంది’ అవార్డులు అందుకున్నారు.
  • మహేశ్‌ కటౌట్‌కి ఎంత క్రేజ్‌ ఉందో ఆయన వాయిస్‌కి అంతే ఉంటుంది. అందుకే ఇతర అగ్ర హీరోలు సైతం ఈయనతో తమ సినిమా కథల్ని ప్రేక్షకులకు వినిపించేందుకు ఆసక్తి చూపిస్తారు. అలా.. పవన్‌ కల్యాణ్‌ ‘జల్సా’, ఎన్టీఆర్‌ ‘బాద్‌ షా’, కృష్ణ ‘శ్రీశ్రీ’, చిరంజీవి ‘ఆచార్య’ చిత్రాలకు మహేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ‘మేజర్’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు.
  • ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌.. ఈ మూడు సామాజిక మాధ్యమాల్లో కోటికిపైగా ఫాలోవర్స్‌ను కలిగిన ఏకైక సౌత్‌ ఇండియన్‌ హీరో మహేశ్‌.
  • గ్రామాన్ని దత్తత తీసుకునే కాన్సెప్ట్‌తో తాను హీరోగా తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ని స్ఫూర్తిగా తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెం, తెలంగాణలోని సిద్ధాపురం గ్రామాల్ని దత్తత తీసుకున్నారాయన.

- ఇంటర్నెట్‌ డెస్క్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని