Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్‌టాపిక్‌గా నిలిచి!

అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల విశేషాలు..

Updated : 22 Mar 2024 10:28 IST

ఏదైనా సినిమాలో స్టార్‌ హీరో.. వర్ధమాన నటితో ఆడిపాడితే ప్రేక్షకులు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయరు. కానీ, అగ్ర కథానాయిక.. అప్‌కమింగ్‌ హీరోతోనో కమెడియన్‌తోనో సినిమా చేయబోతుందని తెలియడమే ఆలస్యం.. ఆ టాపిక్‌పై చర్చ సాగిస్తారు. మరి, ప్రముఖ హీరోల సరసన నటిస్తూనే ఇలా రూటు మార్చి హాట్‌టాపిక్‌గా నిలిచిన నాయికలెవరు? ఆ సినిమాలేంటి?

నయనతార.. సాహసం

మలయాళం, తమిళం, తెలుగు అగ్ర హీరోల చిత్రాల్లో నటించి స్టార్‌ హీరోయిన్‌ జాబితాలో నిలిచిన వారిలో నయనతార (Nayanthara) ఒకరు. ఇంతటి ఇమేజ్‌ ఉన్న ఆమె ‘కొలమావు కోకిల’ (Kolamaavu Kokila) (తెలుగులో వసంత కోకిల)తో ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్‌ చేశారు. అప్పటికే ఆమె పలు లేడీ ఓరియెంటెడ్‌ ప్రాజెక్టుల్లో నటించినప్పటికీ ఈ సినిమా స్పెషల్‌గా నిలిచింది. దానికి కారణం కమెడియన్‌ యోగిబాబు అందులో కీలక పాత్ర పోషించడం. కొత్త దర్శకుడు (నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌)పైగా నయన్‌తో కలిసి యోగిబాబు (Yogi Babu) కీలక పాత్రలు పోషించడంతో ఆ సినిమా విడుదలకు ముందు చిత్ర పరిశ్రమలో ఎన్నో సందేహాలు ఉండేవి. కానీ, విడుదలైన (2018 ఆగస్టు 17) తర్వాత పరిస్థితి మారింది. బాక్సాఫీసు వద్ద విజయాన్ని అందుకుంది. అనారోగ్యం బారిన పడిన తల్లిని కాపాడుకునేందుకు కోకిల అనే యువతి డ్రగ్స్‌ సరఫరా ముఠాతో చేసిన సాహసమే ఈ సినిమా కథాంశం. యోగిబాబు.. నయన్‌ను ఇష్టపడే వ్యక్తిగా నటించి, ప్రేక్షకులకు వినోదం పంచారు.

‘మూకుత్తి అమ్మన్‌’ (Mookuthi Amman) (తెలుగులో అమ్మోరు తల్లి)తోనూ ఆ ట్రెండ్‌ రిపీటైంది. ఆర్జే బాలాజీ (RJ Balaji) స్వీయ దర్శకత్వంలో నటించిన ఆ సినిమాలో నయనతార అమ్మోరుగా నటించారు. అమ్మవారి కోరికను నెరవేర్చేందుకు రిపోర్టర్‌ ఏం చేశాడనే ఇతివృత్తంతో రూపొందిన ఈ మూవీ నేరుగా ఓటీటీ ‘డిస్నీ+హాట్‌స్టార్‌’లో విడుదలైంది (2020 నవంబరు 14). ‘అన్నపూరణి’తో 75 చిత్రాలు పూర్తి చేసిన నయన్‌ త్వరలోనే ‘టెస్ట్‌’తో సందడి చేయనున్నారు. స్పోర్ట్స్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో మాధవన్‌, సిద్ధార్థ హీరోలు.


మిస్‌ అనుష్క శెట్టి..

కెరీర్‌ ప్రారంభంలోనే టాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసిన నటి అనుష్క శెట్టి (Anushka Shetty). అనతి కాలంలోనే అగ్ర నాయికగా మారారు. దాదాపు టాలీవుడ్‌ టాప్‌ హీరోలందరితో ఆమె కలిసి నటించారు. మరోవైపు, నాయికా ప్రాధాన్య చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచారు. ‘నిశ్శబ్దం’ (2020) తర్వాత దాదాపు మూడేళ్లు గ్యాప్‌ తీసుకున్న ఆమె తదుపరి ఏ సినిమాతో వస్తారోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు. ‘మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty)ని ప్రకటించడం హాట్‌ టాపిక్‌ అయింది. అప్పటికీ హీరోగా మూడు సినిమాల అనుభమున్న నవీన్ పొలిశెట్టి (Naveen Polishetty)కి ఆమె జోడీగా కనిపించనున్నారని తెలియడంతో అప్పట్లో అందరి దృష్టి ఆ మూవీపై పడింది. ప్రేమ, పెళ్లికి వ్యతిరేకమైన మాస్టర్‌ చెఫ్‌ మనసుని స్టాండప్‌ కమెడియన్‌ ఎలా మార్చగలిగాడు? అన్న కథాంశంతో రూపొందిన ఈ సినిమా 2023 సెప్టెంబరు 7న విడుదలై, ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ నటి ‘ఘాటి’ (Ghaati) (తెలుగు), ‘కథనార్‌’ (మలయాళం) (Kathanar: The Wild Sorcerer)లతో బిజీగా ఉన్నారు.


సమంత.. శకుంతల

తెలుగు, తమిళంలో 40పైగా చిత్రాలతో నటించి, క్రేజ్‌ సంపాదించుకున్నారు నటి సమంత (Samantha Ruth Prabhu). అగ్ర హీరోలు నటించిన ఎన్నో హిట్‌ చిత్రాల్లో భాగమైన ఆమె లేడీ ఓరియెంట్‌ మూవీస్‌ కూడా చేశారు. అలా వచ్చిందే ‘శాకుంతలం’ (2023 ఏప్రిల్‌ 14న విడుదల) (Shaakuntalam). ఈ పౌరాణిక చిత్రంలో శకుంతలగా సమంత, ఆమెపై మనసు పారేసుకున్న దుష్యంత మహారాజుగా దేవ్‌ మోహన్‌ (Dev Mohan) నటించారు. అప్పటికీ మూడు సినిమాల ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న ఈ మలయాళీ నటుడు ఈ భారీ ప్రాజెక్టులో అగ్ర హీరోయిన్‌తో కలిసి నటించడం ఆసక్తికర అంశమైంది. సమంత నటించిన కొత్త వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌: హనీ బన్నీ’ (Honey Bunny) త్వరలోనే ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో విడుదల కానుంది.


సెటైరికల్‌ కామెడీ మూవీతో కీర్తి

కీర్తి సురేశ్ (Keerthy Suresh) తాజాగా ఈ జాబితాలోకి వచ్చారు. కమెడియన్‌గా కెరీర్‌ ప్రారంభించి కథానాయకుడిగానూ సందడి చేస్తున్న సుహాస్‌ (Suhas)తో కలిసి ఆమె నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో డైరెక్టర్‌ ఐవీ శశి తెరకెక్కిస్తున్న సెటైరికల్‌ కామెడీ డ్రామా ఫిల్మ్‌ ‘ఉప్పు కప్పురంబు’ (Uppu Kappurambu). ఒక గ్రామం సంక్షోభాన్ని ఎదుర్కోగా.. అక్కడి ప్రజలు దాన్నుంచి ఎలా బయటపడ్డారనే కథాంశంతో రూపొందుతోందీ చిత్రం. నేరుగా ఓటీటీ ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో రిలీజ్‌ కానుంది. ప్రస్తుతం ‘రఘుతాత’, ‘రివాల్వర్‌ రీటా’, ‘కన్నివేడి’ సినిమాల చిత్రీకరణలలో పాల్గొంటున్నారు కీర్తి.


వీరు ఇలా..

ఇలా.. తమన్నా- సత్యదేవ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘గుర్తుందా శీతాకాలం’ (2022) చిత్రం, నిత్యా మేనన్‌- నిరుపమ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కుమారి శ్రీమతి’ (2023) వెబ్‌సిరీస్‌లు సైతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని