National Awards 2023: పాత్ర కోసం ప్రాణం పెట్టి.. జాతీయ ఉత్తమ నటిగా నిలిచి...

జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికైన అలియా భట్‌, కృతిసనన్‌ గురించి ప్రత్యేక కథనం..

Published : 24 Aug 2023 20:10 IST

వారిద్దరూ కెరీర్‌ ప్రారంభంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. నటనతోనే ట్రోలర్స్‌కు సమాధానం చెప్పాలనుకున్నారు. కట్‌ చేస్తే, జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలిచారు. వారెవరో కాదు అలియా భట్‌ (Alia Bhatt), కృతి సనన్‌ (Kriti Sanon). 69వ జాతీయ చలన చిత్ర అవార్డులను (National Awards 2023) కేంద్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం ప్రకటించింది. అలియా, కృతి ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. ఆయా పాత్రల కోసం వారెంత కష్టపడ్డారో తెలుసుకుందాం..

అలియా అలా..

‘గంగూబాయి కాఠియావాడి’ (Gangubai Kathiawadi) చిత్రంలోని నటనకుగానూ అలియా భట్‌ జాతీయ అవార్డుకు ఎంపికైంది. సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద దాదాపు రూ.210 కోట్లు వసూళ్లు చేసింది. వేశ్య పాత్రలో అలియా నట విశ్వరూపం ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. అప్పుడే ఆమెకు జాతీయ అవార్డు ఖాయమని చాలామంది భావించారు. అది ఇప్పుడు నిజమైంది. ముంబయి మాఫీయా క్వీన్‌గా పేరొందిన గంగూబాయి జీవితాధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాత్రతో అలియా మూడేళ్లు ప్రయాణం చేసింది. ఆ క్యారెక్టర్‌ను ఎంతగా ఆకళింపు చేసుకుందంటే.. కొన్ని సార్లు తనకు తెలియకుండానే గుంగూబాయిలా కూర్చోవడం, ఆమెలా మాట్లాడడం చేసేదట. వేశ్య పాత్రకావడంతో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ ఈ చిత్రాన్ని తిరస్కరించారనేది బాలీవుడ్‌ టాక్‌. వాళ్లు నో చెప్పడంతో అలియా ఆ అవకాశాన్ని అందుకుంది. విమర్శకులకు తన సత్తా ఏంటో తెలియజేసింది. ప్రముఖ దర్శక, నిర్మాత మహేశ్‌ భట్‌ కుమార్తె కాబట్టి అవకాశాలొస్తున్నాయనే మాటలు ఆమె కెరీర్‌ ప్రారంభంలో వినిపించేవి. 2012లో ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’తో హీరోయిన్‌గా మారిన అలియా సినిమా సినిమాకు ప్రత్యేకత చాటుతూనే ఉన్నారు. ‘హైవే’, ‘2 స్టేట్స్‌’, ‘హంప్టీ శర్మ కీ దుల్హానియా’, ‘షాందార్‌’, ‘కపూర్‌ అండ్‌ సన్స్‌’ వంటి కామెడీ- డ్రామాల్లో చలాకీ పాత్రలతో ఆకట్టుకున్నారు. స్పై థ్రిల్లర్‌ ‘రాజీ’, మ్యూజికల్‌ డ్రామా ‘గల్లీబాయ్‌’లో కొత్త కోణాన్ని ఆవిష్కరించారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అలియా.. ‘హార్ట్‌ ఆఫ్‌ స్టోన్‌’తో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టారు. ఇన్నేళ్ల కెరీర్‌లో అలియా ఇంటర్నేషనల్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌ సహా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. నేషనల్‌ అవార్డుతో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు.


కృతి సనన్‌ ఇలా..

ఏదైనా సినిమాలో గర్భిణిగా కనిపించాలంటే చాలామంది హీరోయిన్లు అంగీకరించరు. ‘మిమి’ (Mimi) కోసం ఆ సాహసం చేసి ప్రేక్షకుల మన్ననలు అందుకోవడంతోపాటు ఇప్పుడు జాతీయ ఉత్తమ నటిగా నిలిచారు కృతిసనన్‌. లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె సరోగేట్‌ మదర్‌గా నటించారు. సన్నజాబిలా నాజూగ్గా ఉండే కృతి ఆ పాత్ర కోసం దాదాపు 15 కిలోలు బరువు పెరిగింది. అదే సమయంలో వేరే చిత్రాల్లో నటించాల్సి రావడంతో బరువు తగ్గారు. ‘‘మిమి’ కోసం బరువు పెరగడం చిన్న విషయం కాదు. అలాగని తిరిగి ఆ బరువు తగ్గించుకోవడం ఓ సవాల్‌. మూడు నెలలు పాటు ఎలాంటి వ్యాయామం, యోగా లేదు’’ అని కృతి ఓ సందర్భంలో చెప్పడం ఆమె కష్టాన్ని తెలియజేస్తుంది. తెలుగు చిత్రం ‘1 నేనొక్కడినే’తోనే కృతి తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని