Telugu Movies: రిపబ్లిక్‌ డే ‘డబ్బింగ్‌’ చిత్రాలదే.. ఆ రోజు ‘ఈగల్‌’ సింగిల్‌గా..?

రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదలకానున్న చిత్రాలు, ఫిబ్రవరి రెండో వారంలో రాబోతున్న సినిమాలపై ప్రత్యేక కథనం..

Published : 16 Jan 2024 09:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంక్రాంతి పండగను పురస్కరించుకుని ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు ఏటా చాలా చిత్రాలు సిద్ధమవుతుంటాయి. థియేటర్లు సరిపడకపోవడం తదితర కారణాల వల్ల చివరకు నాలుగో.. ఐదో సందడి చేస్తుంటాయి. వాయిదా పడినవి రిపబ్లిక్‌ డే, ఫిబ్రవరి ప్రథమార్ధంలోనో విడుదలవుతుంటాయి. ఈసారి అలా వస్తున్న ప్రాజెక్టులేంటో చూద్దామా..

ఓ రోజు ముందుగానే..

ముగ్గుల పండగకు రావాల్సిన ‘కెప్టెన్‌ మిల్లర్‌’ (Captain Miller) తెలుగు వెర్షన్‌ జనవరి 25న వస్తుంది. ధనుష్‌ (Dhanush), ప్రియాంక అరుళ్‌ మోహన్‌ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించిన చిత్రమిది. పీరియాడికల్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న తమిళంలో విడుదలై మంచి రివ్యూలు సొంతం చేసుకుంది.

ఈ జాబితాలో నిలిచిన మరో తమిళ చిత్రం ‘అయలాన్‌’ (Ayalaan). శివ కార్తికేయన్‌ (Sivakarthikeyan), రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా దర్శకుడు రవికుమార్‌ తెరకెక్కించారు. గ్రహాంతర వాసి నేపథ్యంతో భారీ విజువల్స్‌తో రూపొందించారు. జవనరి 12నే తెలుగులోనూ రిలీజ్‌కావాల్సిన ఈ చిత్రం రిపబ్లిక్‌ డేకు రాబోతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఇద్దరు హీరోలకు తెలుగులో మంచి మార్కెట్‌ ఉన్న సంగతి తెలిసిందే.

వరుస సినిమా అవకాశాలతో దూసుకెళ్తున్న మలయాళ అగ్ర నటుడు మోహన్‌లాల్‌ (Mohanlal). గతేడాది మూడు చిత్రాలతో అలరించిన ఆయన ఈ ఏడాదిలో ముందుగా ‘మలైకోటై వాలియన్‌’ (Malaikottai Vaaliban)తో బాక్సాఫీసు ముందుకు రాబోతున్నారు. పీరియాడిక్‌ డ్రామా నేపథ్యంలో లిజో జోస్‌ పెల్లిస్సేరి దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది.  ఒకే ఒక్క పాత్రతో ఎడిటింగ్‌ లేకుండా సింగిల్‌ షాట్‌లో చిత్రీకరించిన చిత్రం ‘105 మినిట్స్‌’ (One Not Five Minuttess). హన్సిక నటించిన ఈ సినిమాని రాజు దుస్సా తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని జనవరి 26న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు టీమ్‌ ప్రకటించింది. హృతిక్‌ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె జంటగా నటించిన యాక్షన్‌ ఫిల్మ్‌ ‘ఫైటర్‌’ (Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న హిందీలోనే విడుదలకానుంది. విక్రమ్‌, మాళవిక మోహనన్‌ ప్రధాన పాత్రల్లో పా. రంజిత్‌ తెరకెక్కిస్తున్న ‘తంగలాన్‌’ (Thangalaan) ఈ నెల 26న రావాల్సి ఉండగా ఏప్రిల్‌కు వాయిదా వేశారు.

ఫిబ్రవరి రెండో వారం.. ఆసక్తికరం

ఫిబ్రవరి రెండో వారంలో తెలుగు ప్రేక్షకులకు మళ్లీ ఫుల్‌ ఫన్‌ లభించనుంది. ఇద్దరు ప్రముఖ నటుల సినిమాలతోపాటు యంగ్‌ హీరోల చిత్రాలు ఆ సమయంలో విడుదలకానున్నాయి. ఫిల్మ్‌ ఛాంబర్‌తో జరిగిన చర్చల అనంతరం హీరో రవితేజ, నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌ ‘ఈగల్‌’ను వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ‘బాగు కోసం రద్దీ తగ్గించాం. అందరూ చూడాల్సిన ఇలాంటి సినిమాని ప్రదర్శించడానికి ఎక్కువ మొత్తంలో థియేటర్లు కావాల్సి ఉంటుంది. అందుకే ‘ఈగల్‌’ను ఫిబ్రవరి 9న విడుదల చేయబోతున్నాం’ అని ప్రకటించారు. పెద్ద పండగకే రావాల్సిన ‘లాల్‌ సలామ్‌’ (Lal Salaam) కూడా అదే రోజున రాబోతోంది. విష్ణు విశాల్‌, విక్రాంత్‌ హీరోలుగా నటించిన ఈ సినిమాలో రజనీకాంత్‌ (Rajinikanth) కీలక పాత్ర పోషించారు. రజనీకాంత్‌ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించారు. సందీప్‌ కిషన్‌ హీరోగా వీఐ ఆనంద్‌ తెరకెక్కించిన ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona)ను ఫిబ్రవరి 9న రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు, ఇప్పటికే వాయిదా పడిన ‘టిల్లు స్క్వేర్‌’ (Tillu Square)ను 2024 ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు టీమ్‌ గతేడాది అక్టోబరులోనే ప్రకటించింది. మరి, వీటిలో ఏయే సినిమాలు ఫిబ్రవరి రెండో వారంలో బాక్సాఫీసు ముందుకు వస్తాయో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు