Sundaram Master Review: రివ్యూ: సుందరం మాస్టర్‌.. వైవా హర్ష కీలక పాత్రలో నటించిన మూవీ ఎలా ఉంది?

sundaram master review: వైవా హర్ష కీలక పాత్రలో రవితేజ నిర్మించిన కామెడీ మూవీ మెప్పించిందా?

Updated : 23 Feb 2024 13:30 IST

Sundaram Master Review; చిత్రం: సుంద‌రం మాస్ట‌ర్‌; నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద, బాలకృష్ణ, హర్షవర్ధన్, భద్రం తదితరులు; సంగీతం: శ్రీచరణ్ పాకాల; సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరెగడ; కళ: చంద్రమౌళి ఈతలపాక; కాస్ట్యూమ్స్: శ్రీహిత కోటగిరి, రాజశేఖర్ రెడ్డి; నృత్యాలు: విజ‌య్ బిన్నీ; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమంత్ కుర్రు; ఎడిటింగ్‌: కార్తీక్ వున్నవా; నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు; రచన, దర్శకత్వం: కల్యాణ్ సంతోష్; సంస్థ‌లు: RT టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా; విడుద‌ల‌: 23-02-2024

గ్ర క‌థానాయ‌కుడిగా వరుస సినిమాల‌తో బిజీగా ఉంటూనే.. త‌న నిర్మాణ సంస్థ ఆర్‌.టి.టీమ్ వ‌ర్క్స్ ప‌తాకంపై కొత్త‌త‌రాన్ని ప‌రిచ‌యం చేస్తూ చిత్ర  నిర్మాణం కొన‌సాగిస్తున్నారు రవితేజ.  ఆయ‌న సంస్థ నుంచి వ‌స్తున్న మ‌రో చిత్ర‌మే... ‘సుంద‌రం మాస్ట‌ర్‌’. హాస్య న‌టుడిగా ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితమైన హ‌ర్ష చెముడు కీలక పాత్రలో న‌టించారు.  క‌ల్యాణ్ సంతోష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమవుతున్నారు. న‌వ్వులు పంచ‌డంలో త‌న‌కంటూ ఓ ప్ర‌త్య‌క‌మైన శైలి ఉన్న హ‌ర్ష ఎలాంటి ప్ర‌తిభ చూపించారు?(Sundaram Master Review) ఈ చిత్రం ఎలా ఉంది?

క‌థేంటంటే: సుంద‌రం మాస్ట‌ర్ (వైవా హ‌ర్ష‌) గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌లో టీచ‌ర్‌. ఎక్కువ క‌ట్నం ఇచ్చే సంబంధాన్ని చూసి పెళ్లి చేసుకునే ప్ర‌య‌త్నాల్లో  ఉంటాడు. ఇంత‌లో ఆ ప్రాంత ఎమ్మెల్యే (హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌)కి  మిర్యాల మెట్ట నుంచి ఓ ఉత్త‌రం అందుతుంది. వాళ్ల‌కి ఇంగ్లిష్ టీచ‌ర్ కావాల‌నేది దాని సారాంశం. బ‌య‌ట ప్ర‌పంచంతో సంబంధం లేని ఆ ఊరికి వెళ్లి ఇంగ్లిష్ పాఠాలు చెప్పే బాధ్య‌త‌ని తీసుకుంటాడు సుంద‌రం మాస్ట‌ర్‌. బ‌య‌టివాళ్లకి ఎవ్వ‌రికీ ప్ర‌వేశం లేని ఆ ఊళ్లో విలువైన వ‌స్తువు ఏదో ఉందనీ, దాన్ని క‌నిపెట్టే బాధ్య‌త‌ని కూడా సుంద‌రం మాస్ట‌ర్‌కి అప్ప‌జెబుతారు. అది క‌నిపెడితే  డీఈఓ పోస్ట్ కూడా ఇస్తాన‌ని చెబుతాడు ఎమ్మెల్యే. డీఈఓ అయితే ఇంకా ఎక్కువ క‌ట్నం వ‌స్తుంద‌నే ఆశ‌తో ఆ ఊరికి బ‌య‌ల్దేర‌తాడు సుంద‌రం. తీరా అక్క‌డికెళితే  ఊళ్లో అంద‌రూ మాస్టార్ కంటే బాగా ఇంగ్లిష్‌లో మాట్లాడతారు. ‘అస‌లు నీకే ఇంగ్లిష్ రాదం’టూ మాస్టార్‌కే ప‌రీక్ష పెడ‌తారు. ఆ ప‌రీక్ష‌లో ఫెయిల్ అయితే ఉరేస్తాం అని హెచ్చ‌రిస్తారు. మ‌రి ఆ ప‌రీక్ష‌లో సుంద‌రం మాస్టార్ పాస‌య్యాడా?ఇంగ్లిష్ అంత బాగా మాట్లాడుతున్నా వాళ్లు ఇంగ్లిష్ మాస్ట‌ర్ కావాల‌నుకోవ‌డానికి కార‌ణ‌మేమిటి? ఊళ్లో విలువైన వ‌స్తువుని సుంద‌రం క‌నిపెట్టాడా? అత‌ను ఊరి నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడా? ఇంత‌కీ ఆ ఊరి వెన‌కున్న చ‌రిత్ర ఏమిటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: బ‌య‌ట ప్ర‌పంచంతో  సంబంధం లేని కొన్ని ప్రాంతాల గురించి అప్పుడ‌ప్పుడూ వింటూ ఉంటాం. అక్క‌డి మ‌నుషుల్లోని స్వ‌చ్ఛ‌త‌, అమాయ‌క‌త్వం, క‌ట్టుబాట్లు, అలాంటి ప్రాంతాల చ‌రిత్ర వినేకొద్దీ ఆస‌క్తిని రేకెత్తిస్తుంటాయి.  అలాంటి నేప‌థ్యంలో సాగే చిత్ర‌మే ఇది. ప్ర‌ధాన పాత్ర‌ధారి వైవా హ‌ర్ష ఇమేజ్‌ని దృష్టిలోఉంచుకుని పూర్తిస్థాయి హాస్య‌భ‌రిత చిత్రం అనే అంచ‌నాల‌తో వెళితే ప్రేక్ష‌కుడికి నిరాశ త‌ప్ప‌దు. హాస్యం ఉంటుంది కానీ, సినిమా మొత్తం అదే ఉండ‌దు. మిర్యాలమెట్ట అనే ఓ ప్ర‌త్యేక‌మైన ప్ర‌పంచంలోకి ప్రేక్ష‌కుల్ని తీసుకెళ్లి ప్ర‌కృతి, మాన‌వ‌త్వాన్ని మేళ‌వించి ఓ మంచి విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశాడు. క‌థ చెప్పే క్ర‌మంలో అక్క‌డ‌క్క‌డా త‌డ‌బాటు క‌నిపించినా ఓ కొత్త ర‌క‌మైన చిత్రం చూసిన అనుభూతిని మాత్రం పంచాడు ద‌ర్శ‌కుడు. సుంద‌రం మాస్టార్ పాత్ర‌ని ప‌రిచయం చేయ‌డం మొద‌లుకొని అత‌ను మిరియాల మెట్ట‌కి వెళ్లి ఇంగ్లిష్ నేర్పించే ప్ర‌య‌త్నంలో ఎదుర్కొనే ఇబ్బందులు, అక్క‌డి జ‌నాలు అల‌వాట్లు, ఆచారాలతో ప్ర‌థ‌మార్ధం స‌ర‌దా సర‌దాగా సాగిపోతుంది. అర‌గంట పాటు  వైవా హ‌ర్ష మార్క్  కామెడీ స‌న్నివేశాల‌తో సినిమా సంద‌డిగా సాగుతుంది. ఆ త‌ర్వాత ఊరి చ‌రిత్ర ఆస‌క్తిని రేకెత్తిస్తుంది.

ద్వితీయార్ధం మొత్తం విలువైన వ‌స్తువు కోసం సాగించే అన్వేష‌ణ చుట్టూనే క‌థ న‌డుస్తుంది. ప్ర‌కృతి, మాన‌వ‌త్వం నేప‌థ్యంలో తాత్విక‌త‌తో కూడిన స‌న్నివేశాలు ఆక‌ట్టుకున్నా, గంద‌ర‌గోళంగా అనిపించే కొంత‌భాగం ఇబ్బంది పెడ‌తాయి. ఓ మంచి సందేశం ఉన్న చిత్ర‌మిది. మిర్యాల మెట్ట ప్ర‌పంచాన్ని తెర‌పై ఆవిష్క‌రించిన తీరే ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌. (Sundaram Master Review in telugu) ప్రేక్ష‌కుడికి ఓ స్వ‌చ్ఛ‌మైన అనుభూతిని పంచుతాయి ఆ స‌న్నివేశాలు. ఆధునిక ప్ర‌పంచం గురించి తెలియని ఆ ఊరి జ‌నాల్లోని అమాయ‌క‌త్వం, వాళ్లు బ‌తుకుతున్న ఆ అంద‌మైన ప్ర‌పంచం గ‌జిబిజి ట్రాఫిక్ నుంచి బ‌య‌టికొచ్చాక  మొహానికి  తగిలిన  ఓ చ‌ల్ల‌టి గాలి కెర‌టంలా మంచి స్వాంత‌నని, ఉప‌శ‌మ‌నాన్ని క‌లిగిస్తాయి.

ఎవ‌రెలా చేశారంటే: త‌న‌కి త‌గ్గ పాత్ర‌లోనే క‌నిపించాడు వైవా హ‌ర్ష‌. సుంద‌రం మాస్ట‌ర్ పాత్ర‌లో ఒదిగిపోయాడు. ప్ర‌థ‌మార్ధంలో త‌న‌కి అల‌వాటైన న‌ట‌న‌తో న‌వ్వించాడు. ద్వితీయార్ధంలో అసలు క‌థ‌ని చెప్పే క్ర‌మంలో ఆయ‌న‌కి  హాస్యం పండించే అవ‌కాశం ద‌క్క‌లేదు.   హాస్యంతోపాటు, ఇత‌ర  భావోద్వేగాల్ని పండించే అవ‌కాశం కూడా ఆయ‌న‌కి ద‌క్కింది. దివ్య శ్రీపాద  మిర్యాల మెట్ట‌లోని ఓ అనాథ అమ్మాయిగా క‌నిపిస్తుంది.  ఆమె క‌నిపించిన విధానం, అభిన‌యం ఆక‌ట్టుకుంటుంది.  ఓజా పాత్ర‌లో చైత‌న్య‌,  ఆ ఊరి గ్యాంగ్ న‌ట‌న మ‌రింత‌గా ఆక‌ట్టుకుంటుంది. బాల‌కృష్ణ‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్‌, భ‌ద్రం త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు మంచి అభిన‌యం ప్ర‌ద‌ర్శించారు. యువ‌రాజ్ సింగ్‌, బ్ర‌హ్మానందంల‌ని చూపిస్తూ తీర్చిదిద్దిన స‌న్నివేశాలు సినిమాకి హైలైట్‌. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా  ఉంది. ముఖ్యంగా  క‌ళా విభాగం ప‌నితీరు హ‌త్తుకుంటుంది. నిజంగా అలాంటి ఊరు ఉందేమో అనేలా ఆ ప్ర‌పంచాన్ని సృష్టించారు క‌ళా ద‌ర్శ‌కుడు చంద్ర‌మౌళి. శ్రీచ‌ర‌ణ్ పాకాల సంగీతం చిత్రానికి మ‌రో అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌. ఎగిసే పాట‌తో మంచి భావోద్వేగాలు పండాయి.  విజువ‌ల్స్‌తో ఛాయాగ్రాహ‌కుడు దీప‌క్ క‌ట్టిప‌డేశాడు. ద‌ర్శ‌కుడు క‌ల్యాణ్ సంతోష్ నిజాయ‌తీగా ఓ మంచి ప్ర‌య‌త్నం చేశాడు. ద్వితీయార్ధంలో క‌థ‌నం కాస్త ప‌ట్టుత‌ప్పిన‌ట్టు అనిపించినా, ఆయ‌న క‌థాలోచ‌న‌, ర‌చ‌న బాగుంది.  భావోద్వేగాలు బాగా పండాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.  సినిమాకి ప‌రిధులు ఉన్న‌ప్ప‌టికీ, నిర్మాణంలో నాణ్య‌త క‌నిపిస్తుంది.

  • బ‌లాలు
  • + ఆలోచ‌న రేకెత్తించే క‌థాంశం
  • + క‌థా నేప‌థ్యం.. న‌టులు
  • + ప్ర‌థ‌మార్ధంలో హాస్యం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ద్వితీయార్ధంలో కొన్ని స‌న్నివేశాలు
  • చివ‌రిగా..: సుంద‌రం మాస్ట‌ర్... కొన్ని నవ్వులు, విలువైన ఓ  పాఠం (Sundaram Master Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని