Swatantrya Veer Savarkar review: రివ్యూ: స్వతంత్ర వీర్‌ సావర్కర్‌.. రణ్‌దీప్‌ హుడా నటించిన బయోపిక్‌ ఎలా ఉంది?

Swatantrya Veer Savarkar review; వినాయక్‌ దామోదర్‌ సవార్కర్‌ జీవిత కథ ఆధారంగా రణ్‌దీప్‌ హుడా రూపొందించిన ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ మూవీ మెప్పించిందా?

Updated : 28 May 2024 18:25 IST

Swatantrya Veer Savarkar review: చిత్రం: స్వతంత్ర వీర్‌ సావర్కర్‌; నటీనటులు: రణ్‌దీప్‌ హుడా, అంకితా లోఖండే, అమిత్‌ సయాల్‌, రాజేశ్‌ ఖేరా తదితరులు; సంగీతం: అనుమాలిక్‌, విపిన్‌ పాట్వా, మథియాస్‌ డుప్లెసి, సందేశ్‌ షాదిలియా; సినిమాటోగ్రఫీ: అర్వింద్‌ కృష్ణ; ఎడిటింగ్‌: కామేశ్‌ కర్ణ, రాజేశ్‌ జి. పాండే; రచన, దర్శకత్వం: రణ్‌దీప్‌ హుడా; స్ట్రీమింగ్‌ వేదిక: జీ5

దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది తమ ప్రాణాలను త్యాగం చేశారు. 1857 సిపాయిల తిరుగుబాటుతో తొలిసారి ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ జ్వాల 1947 ఆగస్టు 15వ తేదీన భారత త్రివర్ణ పతాకం రెపరెపలాడే వరకూ ఏదోఒక రూపంలో రగులుతూనే ఉంది. ఈ మహాయజ్ఞంలో భాగస్వాములైన దేశ నాయకుల్లో వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ ఒకరు. ఆయన జీవిత కథ ఆధారంగా రణ్‌దీప్‌ హుడా తీసిన చిత్రమే ‘స్వతంత్ర వీర్‌ సావర్కర్‌’ (Swatantrya Veer Savarkar). తాజాగా జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఎలా ఉంది? రణ్‌దీప్‌ హుడా ఎలా నటించారు?

కథేంటంటే: భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తన ప్రసంగాలు, రచనల ద్వారా ప్రజల్లో స్ఫూర్తినింపిన వ్యక్తి వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌. బ్రిటిష్‌ వారిపై పోరాటం చేసేందుకు ఆయన అనుసరించిన మార్గం ఏంటి? ఈ క్రమంలో ఏళ్ల పాటు అండమాన్‌ జైల్లో ఘోరమైన జీవితాన్ని ఎందుకు గడపాల్సివచ్చింది? జైలు నుంచి విడుదలైన తర్వాత ‘హిందుత్వ’ భావజాలం సృష్టించి, దాన్ని ఏవిధంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు? గాంధీతో ఉన్న సైద్ధాంతిక విభేదాలు ఏంటి? బాపూజీ హత్యోదంతంలో సావర్కర్‌ పాత్ర ఉందా? ఇలా ఎన్నో ప్రశ్నలకు సమాధానమే ఈ చిత్రం.

ఎలా ఉందంటే: సాధారణ కథలతో పోలిస్తే, బయోపిక్‌లు తెరకెక్కించడం కత్తిమీద సాములాంటిది. ఏమాత్రం తేడా వచ్చినా విమర్శలు వెల్లువెత్తుతాయి. అలాగని సినిమాటిక్‌ లిబర్టీ తీసుకోకుండా తీస్తే, అది కాస్తా డాక్యుమెంటరీ అవుతుంది. దామోదర్‌ సావర్కర్‌ జీవిత కథను మూవీగా తెరకెక్కించడంలో దర్శకుడు రణ్‌దీప్‌ హుడా కొంతమేరే సఫలమయ్యారు. అందుకు కారణం సావర్కర్‌కు సంబంధించిన ఏయే అంశాలను ప్రధానంగా చూపించాలన్న స్పష్టతకు రాలేక, పొరపాటున ఏమైనా వదిలేస్తామేమోన్న భయంతో సినిమాను సుదీర్ఘంగా తీశారు. ఒక వ్యక్తి జీవిత కథను చూస్తున్నామన్న భావన కన్నా, చరిత్ర పాఠం చదువుతున్నామన్న ఫీలింగ్‌ ఎక్కువగా ఉంటుంది.(Swatantrya Veer Savarkar) దీంతో ఆ కథను కూడా పూర్తిగా ఆస్వాదించలేకపోతాం.

భారతీయులపై బ్రిటిష్‌ వారు సాగించిన దమనకాండను కళ్లకు కడుతూ వారి క్రౌర్యాన్ని పరిచయం చేస్తూ కథను ఆసక్తికరంగానే మొదలుపెట్టాడు దర్శకుడు. స్వాతంత్ర్యం కోసం సావర్కర్‌ కుటుంబం పోరాటం చేయటం, దాని నుంచి స్ఫూర్తి పొంది అతనూ అదే బాటలో పయనించడం వంటి సన్నివేశాలతో కథ ముందుకుసాగుతుంది. సోదరుడితో కలిసి సీక్రెట్‌ సొసైటీ ‘అభినవ్‌ భారత్‌’ స్థాపించడం, బ్రిటిష్‌ వారిపై దాడులకు ఇండియా హౌస్‌లో కుట్రలు పన్నడం.. ఇలా సావర్కర్‌ జీవితంలోని ప్రతీ అంశాన్నీ దర్శకుడు టచ్‌ చేశాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం శిక్ష విధిస్తూ సావర్కర్‌ను అండమాన్‌ జైలుకు పంపిన తర్వాత వచ్చే సన్నివేశాలు మరింత హింసతో కూడి ఉంటాయి. అవన్నీ చూడటానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తాయి. భారతీయ ఖైదీలకు బ్రిటిష్‌ వారు ఎంత ఘోరంగా శిక్షలు విధించేవారో చూపించిన వైనం, మృతదేహాలపై వారు వ్యవహరించే తీరును తీసిన విధానం హృదయాన్ని ద్రవింపజేస్తుంది.

సావర్కర్‌ బ్రిటీష్‌ ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీని మన్నించి అతడిని జైలు నుంచి విడుదల చేస్తుంది. అక్కడినుంచి కథ మరో మలుపు తీసుకుంటుంది. అప్పటివరకూ తన రచనలతో స్ఫూర్తినింపిన సావర్కర్‌.. ఆ తర్వాత తన ప్రసంగాలు ముఖ్యంగా హిందుత్వ వాదాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసే సీన్స్‌.. గాంధీతో సైద్ధాంతికంగా విభేదించే సన్నివేశాలు కేవలం ఒక దృష్టి కోణం నుంచే తీశారేమో అనిపిస్తుంది. ముస్లిం లీగ్‌ ఏర్పాటు ద్వారా ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని మొదటినుంచి జిన్నా పట్టుబడితే, అఖండ భారతావని కోరుకునే వ్యక్తిగా సావర్కర్‌ను చూపించారు. ఆయా సన్నివేశాలు చాలావరకూ డాక్యుమెంటరీలా అనిపిస్తాయి. (Swatantrya Veer Savarkar) రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగే చర్చలు, స్వాతంత్ర్యానంతరం భారతదేశం ముక్కలవడం వంటి సన్నివేశాలు ఆసక్తిగా తీర్చిదిద్దారు. చివరిలో గాంధీ హత్యోదంతం కూడా టచ్‌ చేశారు.

ఎవరెలా చేశారంటే: సావర్కర్‌ పాత్రలో రణ్‌దీప్‌ హుడా ఒదిగిపోయి నటించారు. ఆ పాత్ర కోసం తనని తాను మార్చుకున్నతీరు చూస్తే నిజంగా హ్యాట్సాఫ్ అనాల్సిందే. మిగిలిన నటీనటులు ఎవరూ పెద్దగా తెలుగువారికి తెలియనివారే. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. స్వాతంత్ర్యానికి పూర్వం పరిస్థితులను రిక్రియేట్‌ చేసిన విధానం అద్భుతంగా ఉంది. సావర్కర్‌ జీవిత కథను వెండితెరపై ఆవిష్కరించడంలో రణ్‌దీప్‌ హుడా తపన ప్రతీ సన్నివేశంలోనూ కనిపించింది. నిడివి విషయంలోనూ ఇలాగే ఆలోచించి ఉంటే సినిమా ఇంకాస్త బాగుండేది. 2 గంటలా 50 నిమిషాలు చాలా ఎక్కువ. అంతసేపు ప్రేక్షకుడిని ముఖ్యంగా ఓటీటీలో సినిమా చూసేవాళ్లను నిలబెట్టడం కష్టం. పైగా హిందీ, మరాఠీ భాషల్లోనే సినిమా అందుబాటులోకి తెచ్చారు.

  • బలాలు
  • + రణ్‌దీప్‌ హుడా నటన
  • + సినిమాటోగ్రఫీ
  • + సాంకేతిక బృందం పనితీరు
  • బలహీనతలు
  • - నిడివి
  • - బలమైన ఎమోషన్స్‌ లేకపోవడం
  • చివరిగా: ఒక కోణం నుంచే ‘సావర్కర్‌ బయోపిక్‌’(Swatantrya Veer Savarkar)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని