Vicky Kaushal: విక్కీ కౌశల్‌పై పోలీసులకు ఫిర్యాదు..!

బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌పై ఇండోర్‌కు చెందిన జైసింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమతి తీసుకోకుండా తన ద్విచక్ర వాహన నంబర్‌ని విక్కీ తదుపరి సినిమాలో ఉపయోగించారని పేర్కొ్ంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు..

Updated : 02 Jan 2022 14:12 IST

ముంబయి: బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌పై ఇండోర్‌కు చెందిన జైసింగ్‌ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమతి తీసుకోకుండా తన ద్విచక్ర వాహన నంబర్‌ని విక్కీ తదుపరి సినిమాలో ఉపయోగించారని పేర్కొంటూ ఆయన పోలీసులను ఆశ్రయించాడు. ‘‘విక్కీ కౌశల్‌ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రంలో హీరో నడిపే ద్విచక్రవాహనానికి ఉన్న నంబర్ వాస్తవానికి నాది. ఈ విషయంపై చిత్రబృందానికి అవగాహన ఉందో లేదో నాకు తెలియదు. కానీ, అనుమతులు తీసుకోకుండా ఒక ద్విచక్రవాహన నంబర్‌ వేరొకరు వాడటం చట్ట వ్యతిరేకం. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. తగిన చర్యలు తీసుకుంటారని భావిస్తున్నా’’ అని జైసింగ్‌ యాదవ్‌ తెలిపారు. ఈ విషయంపై పోలీస్‌ అధికారి స్పందిస్తూ..  ఫిర్యాదు అందిన మాట వాస్తమేనని, ఒకవేళ చిత్రబృందం చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే మోటర్‌ సైకిల్‌ యాక్ట్‌ కింద వాళ్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

విక్కీ కౌశల్‌ ప్రస్తుతం సారా అలీఖాన్‌తో కలిసి ఓ విభిన్న ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ గత కొన్ని రోజుల నుంచి మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా చిత్రీకరణకు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే జైసింగ్‌ పోలీసులను ఆశ్రయించాడు. మరోవైపు నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొనేందుకు షూట్‌ నుంచి చిన్న బ్రేక్‌ తీసుకొని ఇటీవల విక్కీ ముంబయికి వచ్చారు. తన సతీమణి కత్రినాతో కలిసి వేడుకలు జరుపుకొన్న అనంతరం తిరిగి ఇండోర్‌ పయనమయ్యారు.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని