Prithviraj Sukumaran: పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ బెస్ట్‌ మూవీస్‌.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?

పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..?

Updated : 13 Apr 2024 11:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆడుజీవితం’తో మరోసారి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌. బానిస పాత్రలో జీవించి ఎందరితోనో కంటతడి పెట్టించారు. క్యారెక్టర్‌కు ప్రాణం పోయడం ఆయనకు కొత్తేమీకాదు. మానసికంగా, శారీరకంగా తనని తాను మలుచుకుంటారు.  ఆయన కెరీర్‌లో ‘ది బెస్ట్‌ మూవీస్‌’ ఏవంటే..

క్లాస్ మేట్స్..

గెట్‌-టు-గెదర్‌ ఇతివృత్తంగా రూపొందిన ఈ సినిమా 2006లో విడుదలైంది. వజ్రాల వ్యాపారిగా పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటన ఆడియన్స్‌కు బాగా కనెక్ట్‌ అయింది. ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌లో విద్యార్థిగానూ ఒదిగిపోయారు. లెఫ్ట్‌వింగ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ లీడర్‌గా ఆకట్టుకున్నారు. ప్రేక్షకులకు మంచి అనుభూతి పంచిన ఈ చిత్రం మలయాళ పరిశ్రమలో క్లాసిక్‌గా నిలిచింది. ఆ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే.

వాస్తవం..

పృథ్వీరాజ్‌ హీరోగా 2006లో తెరకెక్కిన పొలిటికల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ఇది. ఇందులో బాలచంద్రన్‌గా నటించారు. తండ్రి పేరు నిలబెట్టే కొడుకుగా, నలుగురు సోదరీమణులకు అన్నీ తానై చూసుకునే అన్నగా, రాజకీయ నేతగా మెప్పించారు. ఈ బలమైన పాత్రతో ఉత్తమ నటుడిగా ‘కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు’ అందుకున్నారు. ఆ పురస్కారం దక్కించుకున్న పిన్న వయస్కుడిగా (24 ఏళ్లు) నిలిచారు.

సూపర్‌స్టార్‌ క్రేజ్‌

ఈ నటుడిలోని మరో కొత్త కోణాన్ని చూపించిన చిత్రం ‘పుతియా ముఖం’. ఇందులోనూ ఆయన పలు పార్శ్వాలున్న పాత్ర పోషించారు. మృదంగం శిక్షకుడిగా కృష్ణకుమార్‌ అలియాస్‌ కిచు పాత్రలో అలరించారు. అటు వేషధారణలో, ఇటు సంభాషణల్లో అగ్రహారం అబ్బాయిగా ఒదిగిపోయారు. తనలో ‘మాస్‌’ కూడా ఉందని నిరూపించారు. 2009లో బాక్సాఫీసు ముందుకొచ్చిన ఈ సినిమా కమర్షియల్‌ హిట్‌ కొట్టి.. సూపర్‌స్టార్‌ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది.

బయోపిక్‌కు పర్‌ఫెక్ట్‌..

మలయాళ ఇండస్ట్రీ పితామహుడు జేసీ డానియల్‌ జీవితాధారంగా రూపొందిన చిత్రం ‘సెల్యులాయిడ్‌’. ఈ బయోపిక్‌కు పృథ్వీరాజ్‌ పర్‌ఫెక్ట్‌ ఆప్షన్‌ అనిపించుకున్నారు. తండ్రి జేసీ డానియల్‌, తనయుడు హారీస్‌ డానియెల్‌గా ఆయన నటన అనిర్వచనీయం. ఈ సినిమాకు ఉత్తమ నటుడిగా ‘కేరళ స్టేట్‌ ఫిల్మ్‌ అవార్డు’ అందుకున్నారు.

రిటైర్డ్‌ హవల్దార్‌..

పృథ్వీరాజ్‌ను సరికొత్తగా పరిచయం చేసిన సినిమా ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’. ఇందులో రిటైర్డ్‌ హవల్దార్‌ కోషి కురియన్‌గా నటించారు. ఆయన కెరీర్‌లోనే పవర్‌ఫుల్‌ రోల్‌ అది. దాని కోసం బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నారు. ఇదే సినిమా తెలుగులో ‘భీమ్లానాయక్‌’ పేరుతో రీమేకైంది. రానా పోషించిన పాత్ర పృథ్వీరాజ్‌దే. బిజూ మేనన్‌ ప్లే చేసిన క్యారెక్టర్‌ను పవన్‌ కల్యాణ్‌ పోషించారు.

బానిసగా..

‘ఆడుజీవితం’ తన జీవితంలో చాలా ప్రత్యేకమైందని పలు సందర్భాల్లో తెలిపారు. ఆ స్టోరీతో జర్నీ (16 ఏళ్లు) చేసే క్రమంలోనే తన వివాహమైందని, ఓ పాప జన్మించిందంటూ ప్రెస్‌మీట్‌లో నవ్వులు పంచారు. ఉపాధి కోసం సౌదీ వెళ్లి, మోసపోయిన నజీబ్‌ మహ్మద్‌గా పృథ్వీరాజ్‌ ప్రేక్షకుల హృదయాలను హత్తుకున్నారు. పలు పార్శ్వాలున్న ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు కొన్ని సార్లు 72 గంటలపాటు మంచి నీరు మాత్రమే తాగేవారు. 31 కిలోల బరువు తగ్గారు. ఆయన కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించింది. రూ.130 కోట్లుకుపైగా వసూళ్లు సాధించిన ‘ఆడుజీవితం’.. మలయాళంలో అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన టాప్‌ 5 చిత్రాల్లో స్థానం దక్కించుకుంది.

ప్రస్తుతం నటుడిగా రెండు మలయాళ చిత్రాలు, దర్శకుడిగా ‘ఎల్‌ 2: ఎంపురాన్‌’ సినిమాతో ఆయన బిజీగా ఉన్నారు. డైరెక్టర్‌గా ఆయనకు ఇది మూడో చిత్రం. ఇంతకుముందు మోహన్‌లాల్‌తో ‘లూసిఫర్‌’, ‘బ్రో డాడీ’ తెరకెక్కించారు. బంధుప్రీతి కారణంగా తొలి సినిమాలో మాత్రమే అవకాశం ఇస్తారని.. ఆ తర్వాత కష్టపడాల్సిందేనని చెప్పడమే కాకుండా దాన్ని ఆచరణలో పెట్టి విజయాలతో ముందుకు సాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని