The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ

షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్‌ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Published : 01 Mar 2024 18:13 IST

డాక్యుమెంటరీ- సిరీస్‌: ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌; దర్శకత్వం: ఉరాల్‌ బహల్‌, షానా లెవీ; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: నెట్‌ఫ్లిక్స్.

ఓటీటీ సంస్థలు సినిమాలు, వెబ్‌సిరీస్‌లతోపాటు డాక్యుమెంటరీలను ప్రేక్షకుల ముందుకుతీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ క్రమంలో ‘ది హంట్‌ ఫర్‌ వీరప్పన్‌’, ‘కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌’ తదితర వాటిని విడుదల చేసిన ‘నెట్‌ఫ్లిక్స్‌’ (Netflix) ఇప్పుడు ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ: ది బరీడ్‌ ట్రూత్‌’ని స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఒకప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసుపై రూపొందించిన డాక్యుమెంటరీ ఇది. ఫిబ్రవరి 23నే విడుదల కావాల్సిన ఈ డాక్యూ- సిరీస్‌ న్యాయపరమైన సమస్యలు ఎదుర్కొని ఎట్టకేలకు మార్చి 1న రిలీజైంది. మరి, ఏంటీ షీనా బోరా హత్య కేసు (Sheena Bora murder case)? అందులో ఇంద్రాణీ ముఖర్జియా (Indrani Mukerjea) పాత్ర ఎంత? ఇందులో ఏం చూపించారు? తెలుసుకుందాం (The Indrani Mukerjea Story Review)..

ఏం జరిగింది?: అది 2015 ఆగస్టు. ప్రముఖ మీడియా పర్సన్‌ పీటర్‌ ముఖర్జియా భార్య, ఓ మీడియా సంస్థ సీఈవో ఇంద్రాణీ ముఖర్జియా ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. ఎవరూ ఊహించనివిధంగా ఇంద్రాణీ అరెస్టయ్యారు. సమాజంలో పేరు ప్రఖ్యాతలున్న వ్యక్తి అరెస్ట్‌ కావడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ట్విస్ట్‌ ఏంటంటే.. 2012లో షీనా బోరా హత్య జరగ్గా మూడేళ్ల తర్వాత ఆ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కేసులో అరెస్టు అయిన ఇంద్రాణీ ముఖర్జియా డ్రైవర్‌ శ్యామ్‌రాయ్‌ను విచారించగా.. షీనాను ఇంద్రాణీ గొంతు నులిమి హత మార్చిందని తెలిపాడు. తీగ లాగితే డొంకంతా కదిలినట్లు.. చిన్న కేసును దర్యాప్తు చేసే క్రమంలో ఎదురైన షీనా బోరా కేసు ముంబయి పోలీసులకు సవాలుగా మారింది. దర్యాప్తు ముమ్మరం చేసే కొద్దీ విస్తుపోయే విషయాలు తెరపైకి వచ్చాయి. ఆ షీనా మరెవరో కాదు ఇంద్రాణీ కుమార్తె. మొదటి భర్త ద్వారా కలిగిన సంతానమైన షీనా, కుమారుడు మిఖైల్‌లను గువాహటిలోని తన తల్లిదండ్రుల వద్ద ఉంచి, ఇంద్రాణీ వెళ్లిపోతుంది. కొన్నాళ్లకు ఓ క్లబ్‌ మెంబర్‌ అయిన సంజీవ్‌ఖన్నాతో ఆమెకు వివాహమవుతుంది. వీరికి పుట్టిన అమ్మాయి పేరు విధి ముఖర్జియా. తర్వాత, రెండో భర్త నుంచి కూడా విడిపోయిన ఇంద్రాణీ.. పీటర్‌ ముఖర్జియాను మూడో పెళ్లి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఇంద్రాణీ జీవితంలోకి షీనా, మిఖైల్‌ వస్తారు. పీటర్‌ మొదటి భార్య కుమారుడైన రాహుల్‌ ముఖర్జియా, షీనాల మధ్య పరిచయం ప్రేమగా మారుతుంది. ఈ విషయంలో తల్లీకుమార్తెల మధ్య గొడవలు జరుగుతుండేవని, ఆర్థిక విభేదాలూ తలెత్తాయని, వాటిని జీర్ణించుకోలేని ఇంద్రాణీ.. రెండో భర్త, డ్రైవర్‌ సాయంతో షీనాను హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పెళ్లికాకముందూ ఇంద్రాణీ ఎందుకు పేరెంట్స్‌కు దూరంగా వెళ్లిపోయింది? కన్న కూతురిని ప్రపంచానికి చెల్లెలుగా ఎందుకు పరిచయం చేసిందనేది కీలకం (The Indrani Mukerjea Story).

ఎలా చూపించారు?: ఎలాంటి హంగుల్లేకుండా జరిగింది జరిగినట్లు చెప్పేవే డాక్యుమెంటరీలు. వీటిపై చాలామంది ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. ‘ఎలా చూపించారో’ అని అప్పటికే ఆయా ఘటనపై అవగాహన ఉన్నవారు ఎదురుచూస్తారు. ‘అసలు ఈ కేసు ఏంటి?’ అని కొత్తవారు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’ ఈ రెండు వర్గాల వారిని ఆకట్టుకుంటుంది. నేరుగా ఇంద్రాణీ కుటుంబ నేపథ్యాన్ని, ఆమె ఎదిగిన క్రమాన్ని చూపించకుండా మలుపులతో కథను మలిచిన విధానం బాగుంది. కానీ, ఈ కేసు గురించి ఏమాత్రం తెలియని వారికి కొంత కన్‌ఫ్యూజ్‌గా ఉంటుంది. కొన్ని రోజులుగా షీనా బోరా కనిపించట్లేదంటూ రాహుల్‌ తన తండ్రి పీటర్‌, ఇంద్రాణీతో ఫోన్‌లో మాట్లాడే సీన్‌తో ఈ సిరీస్‌ ప్రారంభమవుతుంది. షీనా బతికే ఉందా? అనే సందేహాన్ని కొనసాగిస్తూనే.. విధి ముఖర్జియా స్పందనను చూపించారు. ఇలా ఓవైపు.. తన తల్లి, కన్న తండ్రి సంజీవ్‌, పెంచిన తండ్రి పీటర్‌, షీనా, మిఖైల్‌తో ఉన్న జ్ఞాపకాలను విధి గుర్తుచేసుకుంటుండగా మరోవైపు.. షీనా అదృశ్యమవడం, ఆ కేసు ముంబయి పోలీసుల నుంచి సీబీఐకు మారడం, ఇంద్రాణీ ఆరున్నరేళ్లు జైలు జీవితం గడపడం, బెయిల్‌పై బయటకురావడం.. ఇలా కీలక పరిణామాలన్నింటినీ వివరించారు. నాడు రికార్డు చేసిన క్లిప్పింగ్స్‌ ద్వారా ఈ కేసుపై ప్రజలు ఎంత ఆసక్తి కనబరిచారో, దాన్ని ఛేదించేందుకు పోలీసులు ఎంతగా శ్రమించారో, మీడియా కవరేజీ ఎలా ఉండేదన్న విషయం తెలుస్తుంది. ఈ కేసును ముందునుంచీ ఫాలో అయిన పలువురు జర్నలిస్టుల స్టేట్‌మెంట్లూ ఇందులో చూడొచ్చు (The Indrani Mukerjea Story Review In Telugu).

ఎక్కడైనా కారు- బైకు ప్రమాదం చోటుచేసుకుంటే.. బైకు వాడిదే తప్పు అని కారు నడిపే వ్యక్తి, కారు డ్రైవరే రాంగ్‌రూట్‌లో వచ్చాడంటూ ద్విచక్ర వాహనదారుడు ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం చేస్తారు. ‘అక్కడేదో అవుతోంది’ అని అనుకుని వెళ్లిన వారికి ఎవరు చెప్పింది నిజమో తెలియదు. ఈ ‘ఇంద్రాణీ స్టోరీ’ కూడా అంతే. ఉరాల్‌ బహల్‌, షానా లెవీ తామెవరి పక్షం కాదన్నట్లుగా.. ప్రధానంగా ఇంద్రాణీ, మిఖైల్‌ కోణంలో దీన్ని చూపించారు. మిఖైల్‌ మాట్లాడింది వింటే ఇంద్రాణీనే షీనాను మర్డర్‌ చేసిందని, తాను అనుభవించిన బాధను ఇంద్రాణీ చెబుతుంటే ఆమెకు దాంతో ఏం సంబంధం లేదని ప్రేక్షకుడు భావిస్తాడు. ఒకవేళ షీనాని చంపి ఉంటే మూడేళ్లు ఆ రహస్యాన్ని ఎలా దాచిపెట్టగలిగారు? తాను ప్రేమించిన అమ్మాయి కనిపించడం లేదని రాహుల్‌ మిస్సింగ్‌ కేసు పెట్టినా పోలీసులు జాప్యం చేయడానికి కారణమేంటి? ఆ మూడు సంవత్సరాల్లో సోదరి గురించి మిఖైల్‌ పట్టించుకోలేదా? ఇంద్రాణీ ఎప్పుడో వదిలేసిన రెండో భర్త సాయం ఎందుకు కోరింది? ఇలా అనేక సందేహాలు తలెత్తుతాయి. తన కుమార్తె బతికే ఉందని, తాను జైల్లో ఉన్న సమయంలో ఓ మహిళా ఖైదీ.. షీనాను కశ్మీర్‌లో చూసినట్లు చెప్పిందంటూ ఇంద్రాణీ సీబీఐకు లేఖ రాసి, మరో ట్విస్ట్‌ ఇచ్చింది. ఆ మిస్టరీ ఇప్పటికీ వీడకపోవడం గమనార్హం. నాలుగు ఎపిసోడ్లలో (ఒక్కో ఎపిసోడ్‌ నిడివి 40 నిమిషాలకు పైగా) రూపొందిన ఈ సిరీస్‌ తెలుగులోనూ అందుబాటులో ఉంది (The Indrani Mukerjea Story).

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని