ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్‌ కుర్రాడి బయోపిక్‌

ఓటీటీ ‘ఈటీవీ విన్‌’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 21 Mar 2024 17:12 IST

వెబ్‌సిరీస్: తులసీవనం; నటీనటులు: అక్షయ్‌ లగుసాని, వెంకటేశ్‌ కాకమాను, ఐశ్వర్య, విష్ణు తదితరులు; సంగీతం: స్మరన్; కూర్పు: రవితేజ గిరిజాల; ఛాయాగ్రహణం: ప్రేమ్‌ సాగర్‌; దర్శకత్వం: ప్రేమ్‌ సాగర్‌; స్ట్రీమింగ్‌ ప్లాట్‌ఫామ్‌: ఈటీవీ విన్‌.

యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఈటీవీ విన్’ (ETV Win) ముందు వరుసలో నిలుస్తోంది. కొత్త వారు రూపొందించే సినిమాలు, వెబ్‌సిరీస్‌లను ప్రేక్షకులకు అందించడంలో తనదైన ముద్ర వేస్తోంది. ‘#90s బయోపిక్‌’ (#90s Biopic), ‘వళరి’ (Valari) తదితర ప్రాజెక్టులు అలా వచ్చినవే. ఈ వారం ‘తులసీవనం’ (ThulasiVanam) సిరీస్‌ని రిలీజ్‌ చేసింది. అక్షయ్‌ లుగుసాని, ఐశ్వర్య, వెంకటేశ్‌ కాకుమాన్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్‌ రెడ్డి తెరకెక్కించిన ఈ సిరీస్ ఎలాఉందో తెలుసుకుందాం (ThulasiVanam Review)..

కథేంటంటే?: కర్నూలుకు చెందిన తులసీ రామ్ (అక్షయ్‌) అనే కుర్రాడి స్టోరీ ఇది. క్రికెటర్‌గానో, యాక్టర్‌గానో స్థిరపడాలని తులసి పాఠశాల రోజుల్లోనే ఫిక్స్‌ అయిపోతాడు. కానీ, కొడుకుని కలెక్టర్‌ చేయాలని అతని తండ్రి కల. తులసి చిన్నప్పుడే తన డ్రీమ్‌ గురించి తండ్రికి చెప్పగా ఆయన ఓ పందెం వేస్తాడు. అందులో ఓడిపోయిన తులసి నాన్న చెప్పినట్టే ఆటకు దూరమై, చదువుకునేందుకే సిద్ధపడతాడు. అలా ఇంజినీరింగ్‌ పూర్తి చేసే క్రమంలో మళ్లీ క్రికెట్‌పై మనసు పారేసుకుంటాడు. సివిల్స్‌ కోసం వెళ్లాలని ఇంట్లో అబద్ధం చెప్పి క్రికెట్‌ శిక్షణకు దిల్లీ చేరుకుంటాడు. ఆ తర్వాత ఏమైంది? తులసి క్రికెటర్‌ కావాలనే కల నెరవేర్చుకున్నాడా? తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడా? నటుడిగా మారాడా? అనేది సిరీస్‌ చూసి తెలుసుకోవాల్సిందే (ThulasiVanam Review in Telugu).

ఎలా సాగిందంటే?: ‘పెద్దయ్యాక ఏమవుతావ్?’ అని ఎవరైనా ప్రశ్నిస్తే క్రీడాకారుడిని అవుతాననో, నటుడిని అవుతాననో చాలామంది సమాధానమిస్తుంటారు. కుటుంబ ప్రోత్సాహం ఉంటే అటుగా అడుగేయడం సులువు. కానీ, ఫ్యామిలీ ‘నో’ చెబితే కష్టమే. ఇలా స్ర్టిక్టుగా ఉండే తండ్రి మాట కాదనలేక.. కల నెరవేర్చుకునేందుకు పూర్తిస్థాయిలో శ్రమించలేక సతమతమయ్యే ఎందరో యువకుల జీవితాలను తులసీరామ్‌ పాత్రతో తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు అనిల్ రెడ్డి. తినే తిండి నుంచి వేసుకునే దుస్తుల వరకూ కొడుక్కి ఏం కావాలనేది అడక్కుండా తండ్రే అన్నీ చేసేయడం.. నాన్న తీరు నచ్చట్లేదంటూ తనయుడు స్నేహితులతో బాధ వెళ్లగక్కడం.. ఇలాంటి ‘బొమ్మరిల్లు’ సజ్జెక్టు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. ఇందులోనూ ఆ ఛాయలు ఉన్నా కామెడీ ముందు అవి తేలిపోయాయి. సీరియస్‌ మోడ్‌లో కాకుండా హాస్య ప్రధానంగా సిరీస్‌ని నడిపించారు (ThulasiVanam Review).

తులసీరామ్ ప్రస్తుత పరిస్థితిని పరిచయం చేస్తూ తొలి ఎపిసోడ్‌ ప్రారంభమవుతుంది. ముందు కాస్త బోర్‌ అనిపించినా.. తన జీవితాన్ని బయోపిక్‌గా తీయాలంటూ ఓ స్నేహితుడికి తులసి విజ్ఞప్తి చేసే సన్నివేశం నుంచి అసలు కథ మొదలవుతుంది. తులసి కుటుంబ నేపథ్యం, చిన్నప్పుడు తండ్రితో వేసిన పందెం, స్నేహితులు, ఇంజినీరింగ్ బ్యాక్‌లాగ్స్‌ క్లియర్‌ చేసేందుకు ప్రయత్నించడం, క్రికెట్‌ ట్రైనింగ్‌ కోసం హైదారాబాద్‌ నుంచి దిల్లీ వెళ్లడం.. ఇలా సరదా సన్నివేశాలతో రెండు ఎపిసోడ్లు సాగుతాయి. ఆ క్రమంలో అక్కడక్కడా లాజిక్స్‌ మిస్‌ అయినట్లు అనిపించింది. మూడో ఎపిసోడ్‌లో హీరోయిన్‌ (ఐశ్వర్య) ఎంట్రీ ఇస్తుంది. ఆమె పరిచయం తర్వాత హీరో లైఫ్‌ టర్న్‌ అవుతుంది. తర్వాత కథ కోసం వేచి చూడాల్సిందే. ఎందుకంటే ప్రస్తుతానికి మూడు ఎపిసోడ్లు (ఒక్కో ఎపిసోడ్‌ నిడివి దాదాపు 40 నిమిషాలు) రిలీజ్‌ అయ్యాయి. మిగిలిన వాటిని త్వరలోనే విడుదల చేయనున్నారు  (ThulasiVanam Review). యువతే ప్రధానలక్ష్యంగా సన్నివేశాలు, సంభాషణలు తీర్చిదిద్దడం గమనార్హం.

ఎవరెలా చేశారంటే?: తులసీరామ్‌ పాత్రకు అక్షయ్‌ చక్కగా సూట్ అయ్యారు. ఆయన స్నేహితుడిగా నటించిన వెంకటేశ్ కాకుమాను మంచి నవ్వులు పంచుతారు. హీరోయిన్‌గా ఐశ్వర్య ఓకే. ఇతరులు పాత్రల పరిధి మేరకు నటించారు. టెక్నికల్‌గా సిరీస్‌ బాగుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని