Tiger 3 Review: రివ్యూ: టైగర్‌-3.. సల్మాన్‌ నటించిన స్పై థ్రిల్లర్‌ హిట్టా..? ఫట్టా?

Tiger 3 Review: సల్మాన్‌ఖాన్‌, కత్రినాకైఫ్‌ జంటగా నటించిన ‘టైగర్‌’ ఎలా ఉంది?

Published : 12 Nov 2023 14:28 IST

Tiger 3 Review: చిత్రం: టైగ‌ర్ 3; న‌టీన‌టులు: స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినాకైఫ్, ఇమ్రాన్ హ‌ష్మీ, రేవ‌తి, రిద్ధి డోగ్రా, కుముద్ మిశ్రా, సిమ్రాన్ త‌దిత‌రులు; కథ‌: ఆదిత్య చోప్రా; మాట‌లు: అంకుర్ చౌద‌రి; సినిమాటోగ్రఫీ: అన‌య్ గోస్వామి; ఎడిటింగ్‌: రామేశ్వ‌ర్ ఎస్‌.భ‌గ‌త్‌; సంగీతం: ప్రీత‌మ్‌; నేప‌థ్య సంగీతం: త‌నూజ్ టీకు; స్క్రీన్‌ప్లే: శ‌్రీధ‌ర్ రాఘ‌వ‌న్‌; నిర్మాణం: ఆదిత్య చోప్రా; ద‌ర్శ‌క‌త్వం: మ‌నీష్ శ‌ర్మ‌; సంస్థ‌: య‌శ్‌రాజ్ స్పై యూనివ‌ర్స్‌; విడుద‌ల‌: 12-11-2023

య‌శ్‌రాజ్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగా రూపొందిన మ‌రో చిత్రం ‘టైగ‌ర్ 3’. స‌ల్మాన్‌ఖాన్‌, క‌త్రినాకైఫ్ జంట‌గా ఇదివ‌ర‌కు వ‌చ్చిన ‘ఏక్ థా టైగ‌ర్‌’, ‘టైగ‌ర్ జిందా హై’ సినిమాల‌కి కొన‌సాగింపుగానే ‘టైగ‌ర్ 3’ రూపొందింది. దాదాపు ఆరేళ్ల త‌ర్వాత టైగ‌ర్‌గా మ‌రోసారి స‌ల్మాన్ ప్రేక్ష‌కుల ముందుకొస్తుండ‌డం...  హిట్ జోడీ స‌ల్మాన్‌ఖాన్ - క‌త్రినాకైఫ్  తొలిసారి దీపావ‌ళి సంద‌ర్భంగా సంద‌డి చేయ‌నుండ‌డంతో ఈ సినిమాపై ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన అంచ‌నాలు క‌నిపించాయి. య‌శ్‌రాజ్ స్పై యూనివ‌ర్స్‌లో భాగంగానే రూపొందిన ‘వార్‌’, ‘ప‌ఠాన్’ల హీరోలు షారూఖ్‌, హృతిక్ రోష‌న్‌ల అతిథి పాత్ర‌లూ ఈ సినిమాపై మ‌రిన్ని అంచ‌నాలు పెంచాయి. మ‌రి ఈ సినిమా ఎలా ఉంది?(Tiger 3 Review in telugu) స్పై యూనివర్స్‌ ఆ థ్రిల్‌ను పంచిందా?

క‌థేంటంటే: విద్వేష‌పు ఆలోచ‌న‌ల్లో ఉన్న మాజీ ఐఎస్ఐ ఏజెంట్ అతీష్ రెహ్మాన్ (ఇమ్రాన్ హ‌ష్మీ) పాకిస్థాన్‌ ప్ర‌ధాన మంత్రి న‌స్రీన్ ఇరానీ (సిమ్రాన్‌)ని హ‌త్య చేసి, ఆ నేరాన్ని ఇండియా ఏజెంట్ టైగ‌ర్ (స‌ల్మాన్‌ఖాన్‌)పై వేయాల‌ని ప‌న్నాగం ప‌న్నుతాడు. న‌స్రీన్ ఇరానీ చేస్తున్న శాంతి ప్ర‌య‌త్నాలు న‌చ్చ‌ని అతీష్‌, పాకిస్థాన్‌ దేశ సైన్యాధికారుల్ని రెచ్చ‌గొట్టి మ‌రీ ఇందుకోసం వ్యూహం ర‌చిస్తాడు. టైగ‌ర్ (స‌ల్మాన్‌ఖాన్‌), అత‌ని భార్య జోయా (క‌త్రినాకైఫ్‌) వ్య‌క్తిగ‌త జీవితంలోకి వెళ్లి వారి బిడ్డ జూనియ‌ర్‌ని అడ్డం పెట్టుకుని ఇద్ద‌రినీ ఇస్తాంబుల్‌లో ఓ ఆప‌రేష‌న్‌కి వాడుకుంటాడు. (Tiger 3 Review in telugu) ఆ ఆప‌రేష‌న్‌తోనే టైగ‌ర్‌నీ, జోయానీ దేశ‌ద్రోహులుగా ప్ర‌పంచం ముందు నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తాడు. మ‌రి అతీష్ అనుకున్న‌ది నెర‌వేరిందా? అత‌ని విద్వేష‌పు ప్ర‌య‌త్నాల్ని టైగ‌ర్ ఎలా తిప్పికొట్టాడనేది  తెర‌పై చూడాల్సిందే.

ఎలా ఉందంటే: ఇదివ‌ర‌కు ఈ యూనివ‌ర్స్‌లో భాగంగా వ‌చ్చిన సినిమాల్లాగే దేశ‌భ‌క్తి ప్ర‌ధానంగా సాగే యాక్ష‌న్ క‌థాంశం ఇది. ర‌హ‌స్య ఆప‌రేష‌న్‌లో ఉన్న రా ఏజెంట్ టైగ‌ర్ విన్యాసాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. ఏజెంట్ డ్రామాగానే కాకుండా... టైగ‌ర్ కుటుంబ క‌థ‌, ప్ర‌తీకార నేప‌థ్యాన్ని కూడా మేళ‌వించ‌డ‌మే ఈసారి క‌థ‌లో ప్ర‌త్యేక‌త‌. తొలి రెండు సినిమాల్లో జోడీగా సంద‌డి చేసిన టైగ‌ర్‌, జోయా ఇందులో ఓ బిడ్డ‌కి త‌ల్లిదండ్రులుగా క‌నిపిస్తారు. ఈ ఫ్రాంచైజీలో ఇదివ‌ర‌కు వ‌చ్చిన చిత్రాల‌కి దీటుగా భారీ హంగుల‌తోనే ఈ చిత్రమూ రూపొందింది. అయితే ప్రేక్ష‌కుల‌కు అంత‌గా క‌నెక్ట్ కాని క‌థ‌, మ‌న‌సుల్ని తాక‌ని భావోద్వేగాలు, కొత్త‌ద‌నం లేని యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో  సినిమా పెద్ద‌గా మెప్పించ‌దు.  క‌థ‌నం కూడా ప్రేక్ష‌కుల ఊహ‌కు త‌గ్గ‌ట్టే సాగుతుంది. స‌ల్మాన్‌,  క‌త్రినా జోడీ చేసిన యాక్ష‌న్‌... వాళ్ల స్వాగ్, భారీ హంగులు మిన‌హా సినిమాలో చెప్పుకోద‌గ్గ అంశాలేవీ లేవు. స‌ల్మాన్‌ఖాన్‌, ఆయ‌న అభిమానుల్ని దృష్టిలో పెట్టుకుని అల్లిన స‌న్నివేశాలు కూడా పెద్ద‌గా లేవు. దాంతో చాలా స‌న్నివేశాలు చ‌ప్ప‌గా సాగుతున్న‌ట్టు అనిపిస్తాయి.  కాస్త‌లో కాస్త ఇస్తాంబుల్‌లో  టైగ‌ర్‌, అత‌ని బృందం క‌లిసి చేసే ఓ ఆప‌రేష‌న్ ఆక‌ట్టుకుంటుంది.

కుటుంబ నేప‌థ్యం ఉన్న‌ప్ప‌టికీ ఆ స‌న్నివేశాల్ని ప్రేక్ష‌కుల‌కు క‌నెక్ట్ చేయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌య్యారు. టైగ‌ర్‌తో ప‌ఠాన్ క‌లిసి చేసే విన్యాసాలు సినిమాకి అన్నిటికంటే హైలైట్‌. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాల్లో  షారూఖ్ చేసిన అల్ల‌రి, ఇద్ద‌రి మ‌ద్య మాట‌లు  అల‌రిస్తాయి. ప‌తాక స‌న్నివేశాలు మెప్పిస్తాయి. పాకిస్థాన్‌లో నిత్యం చోటు చేసుకునే అంత‌ర్గ‌త రాజ‌కీయ వ్య‌వ‌హారాల్ని పోలి ఉంటాయి ఆ స‌న్నివేశాలు. దేశ అధ్య‌క్షురాలు టైగ‌ర్‌కి బ‌హుమానంగా జాతీయ గీతం వినిపించే స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి. (Tiger 3 Review in telugu) చివ‌ర్లో మ‌రో అతిథి పాత్ర‌లో హృతిక్ రోష‌న్ మెరుస్తాడు. ఈ యూనివ‌ర్స్ చిత్రాల్లో భాగంగా వ‌చ్చే ‘వార్ 2’ కోస‌మే ఆ స‌న్నివేశాలు. రాక్ష‌సుడిలాంటి శ‌త్రువుని ఎదుర్కోవ‌డానికి నువ్వూ రాక్ష‌సుడిలా మారిపోతావు అంటూ సాగే ఆ స‌న్నివేశాలతో త‌దుప‌రి వార్‌పై మ‌రిన్ని అంచ‌నాల్ని పెంచారు. ఆ చిత్రంలో హృతిక్‌ని ఢీ కొట్టే పాత్ర‌లో ఎన్టీఆర్ న‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.

ఎవ‌రెలా చేశారంటే: స‌ల్మాన్‌ఖాన్, క‌త్రినాకైఫ్ క‌లిసి చేసే యాక్షన్ హంగామానే ఈ సినిమాకి బ‌లం. వారిద్ద‌రి జోడీ మ‌రోసారి అల‌రిస్తుంది. క‌ణం క‌ణం పాట‌లో ఇద్ద‌రి మ‌ధ్య మంచి కెమిస్ట్రీ పండింది.  క‌త్రినా కైఫ్ ట‌వ‌ల్ క‌ట్టుకుని చేసిన పోరాట ఘ‌ట్టం ఆక‌ట్టుకుంటుంది. ఇమ్రాన్‌హ‌ష్మీ  ప్ర‌తినాయ‌కుడిగా మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. కానీ ఆ పాత్ర ర‌చ‌న‌లోనే బ‌లం లేదు. రేవ‌తి రా ఛీఫ్‌గా క‌నిపిస్తారు. సిమ్రాన్ పాకిస్తాన్ ప్ర‌ధానిగా మంచి న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించారు. షారూఖ్‌ఖాన్ అతిథి పాత్ర సినిమాకి హైలైట్‌. (Tiger 3 Review in telugu) కానీ, ఆ స‌న్నివేశాల్ని ఫ్యాన్స్‌కి మ‌రింత‌గా కిక్కెక్కించేలా తీయ‌డంలో ద‌ర్శ‌కుడు విఫ‌ల‌మ‌య్యారు. సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా పోరాట ఘ‌ట్టాలు, విజువ‌ల్స్‌, భారీ హంగులు సినిమా స్థాయిని చాటి చెబుతాయి. ఆదిత్య చోప్రా క‌థ‌, శ్రీధ‌ర్ రాఘ‌వ‌న్ క‌థ‌నాలు ప్రేక్ష‌కుల‌పై ప్ర‌భావం చూపించ‌లేక‌పోయాయి.  అన‌య్ గోస్వామి కెమెరా ప‌నిత‌నం ముగ్ధుల్ని చేస్తుంది. ప్ర‌తీ స‌న్నివేశం విజువ‌ల్‌గా ఆక‌ట్టుకుంటుంది. ఎడిటింగ్‌లో లోపాలు క‌నిపిస్తాయి.  ప్రీత‌మ్‌పాట‌లు ఓకే అనిపించినా, త‌నూజ్ టీకు నేప‌థ్య సంగీతం పెద్ద‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయింది.  ద‌ర్శ‌కుడు మ‌నీష్ శ‌ర్మ  కొన్ని స‌న్నివేశాల‌పైనే ప్ర‌భావం చూపించారు. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + స‌ల్మాన్ - క‌త్రినా జోడీ
  • + విజువ‌ల్స్‌
  • + ప‌తాక స‌న్నివేశాలు
  • బ‌ల‌హీన‌త‌లు
  • - కొత్త‌ద‌నం లేని క‌థ‌, క‌థ‌నాలు  
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • చివ‌రిగా:  టైగ‌ర్ 3... స‌ల్మాన్ షో (Tiger 3 Review in telugu)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని