Valentine Day: వాలంటైన్స్‌ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..

వాలంటైన్స్‌ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. 

Updated : 10 Feb 2024 20:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రేమికుల రోజంటే కేవలం గ్రీటింగ్ కార్డ్స్‌ ఇవ్వడం.. శుభాకాంక్షలు చెప్పడమేనా.. వారి మనసుకు నచ్చినవాళ్లతో సమయాన్ని గడిపి ఆ రోజును ఎప్పటికీ గుర్తుండేలా ప్లాన్‌ చేసుకుంటారు ప్రేమికులు. ఆ ప్రత్యేకమైన రోజును మరింత స్పెషల్‌గా మార్చేందుకు గతంలో అలరించిన ప్రేమకథా చిత్రాలు మరోసారి వినోదం పంచేందుకు సిద్ధమయ్యాయి. ఏకంగా నాలుగు సూపర్‌ హిట్‌ సినిమాలు ప్రేమికుల రోజు రీరిలీజ్‌కు రెడీ అయ్యాయి (Valentine's Day 2024). అవేంటంటే..

మరోసారి ‘ఓయ్‌’ అంటోన్న సిద్ధార్థ్‌..

దర్శకుడు ఆనంద్‌ రంగ (anand ranga) తెరకెక్కించిన ‘ఓయ్‌’ (Oy! Movie) చిత్రం ప్రేమికులకు ఎప్పటికీ ప్రత్యేకమే. సిద్ధార్థ్‌ (siddharth), షామిలీ జంటగా నటించిన ఈ సినిమా 2009 జులై 3న విడుదలై అలరించింది. ఇప్పడు ఫిబ్రవరి 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవల దీనికి సంబంధించిన పోస్టర్‌ను దర్శకుడు పంచుకోగా  ‘మా ఏరియాలోనూ విడుదల చేయండి’ అంటూ సినీ అభిమానులు కామెంట్స్‌ పెట్టారంటే దీనికోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.

ప్రేమికుల రోజుకు వచ్చేస్తోన్న ‘సీతా-రామ్‌’..

యుద్ధంతో రాసిన ప్రేమకథా అంటూ ప్రేక్షకుల ముందుకువచ్చి సినీ ప్రియుల మనసులు దోచేసింది  ‘సీతారామం’(Sita Ramam). రామ్‌గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాల్ ఠాకూర్ వారి నటనతో మేజిక్‌ చేశారు. ఇప్పుడీ ప్రేమకథ ప్రేమికుల రోజు సందర్భంగా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ‘‘మీకోసం మళ్లీ మేము’ ఇట్లు మీ సీత, రామ్’ అంటూ ఓ బ్యూటీఫుల్‌ పోస్టర్‌తో ఈ విషయాన్ని తెలిపింది చిత్రబృందం. 

రెండోసారి రీరిలీజ్ అవుతోన్న ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’..

కోలీవుడ్‌ స్టార్‌ సూర్య (Suriya) నటించిన ఫీల్‌గుడ్‌ ప్రేమకథా చిత్రం ‘సూర్య సన్నాఫ్‌ కృష్ణన్‌’ (Surya Son Of Krishnan). సిమ్రన్‌, సమీరారెడ్డి, దివ్యా శ్రీపాద కథానాయికలు. గౌతమ్‌ మేనన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2008లో విడుదలై మంచి టాక్‌ అందుకుంది. ఆ తర్వాత గతేడాది ఆగస్టులో రీరిలీజై థియేటర్లలో సందడి చేసింది. ఇప్పుడు ప్రేమికుల రోజు నాడు మరోసారి క్రేజ్‌ను సొంతం చేసుకునేందుకు వచ్చేస్తోంది. ముఖ్యంగా ఇందులోని పాటలు ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. 

ఫిబ్రవరి 14న ‘96’..

హృద్యమైన ప్రేమకథా చిత్రంగా అలరించింది ‘96’. విజయ్‌ సేతుపతి, త్రిష (trisha) నటించిన ఈ సినిమా త‌మిళంలో క్లాసిక్‌గా నిలిచిపోయింది. దీన్నే తెలుగులో ‘జాను’ చిత్రంగా దిల్‌రాజు రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ‘96’ ఫిబ్రవరి 14న రీరిలీజ్ కానుంది. ఇందులోని పాటలు ఇప్పటికీ ఎంతోమంది కాలర్‌ట్యూన్‌లుగా వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఈ చిత్రం మరోసారి విడుదల కానుండడంతో వారంతా ఈ పోస్టర్‌ను తెగ షేర్‌ చేస్తున్నారు.  


ఈ సినిమాలతో పాటు పవన్‌ కల్యాణ్ (Pawan kalyan) నటించిన ‘తొలిప్రేమ’ రెండోసారి రీరిలీజ్ కానున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్టర్లు దర్శనమిస్తున్నాయి. సిద్ధార్థ, త్రిష జంటగా నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’.. జై, శర్వానంద్‌, అనన్య, అంజలి నటించిన ‘జర్నీ’ కూడా ఫిబ్రవరి 14న రీరిలీజ్‌ అవుతాయంటూ న్యూ ఇయర్ నాడు పోస్టర్లు విడుదల చేశారు.  వీటిపై అప్‌డేట్ కోసం సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఈ వాలంటైన్స్‌ డేకు థియేటర్లలో ప్రేమకథా చిత్రాలు సందడి చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని