Vasantha Kokila Review: రివ్యూ: వసంత కోకిల

బాబీ సింహా, కశ్మీరా పరదేశి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘వసంత కోకిల’. ఓటీటీలో శుక్రవారం విడుదలైందీ సినిమా. ఎలా ఉందంటే?

Published : 03 Mar 2023 17:23 IST

చిత్రం: వసంత కోకిల; నటీనటులు: బాబీ సింహా, కశ్మీరా పరదేశి, రమాప్రభ, ఆర్య, శరత్‌బాబు తదితరులు; సంగీతం: రాజేష్‌ మురుగేశన్‌; కూర్పు: వివేక్‌ హర్షన్‌; ఛాయాగ్రహణం: గోపీ అమర్‌నాథ్‌; నిర్మాతలు: రజనీ తాళ్లూరి, రేష్మి; దర్శకత్వం: రమణన్‌ పురుషోత్తమ; ఓటీటీ వేదిక: ఆహా, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో.

కొందరు నటులు ప్రతినాయక పాత్రలు పోషిస్తూనే హీరోగా అవకాశాలు అందుకుని రెండు పడవలపై ప్రయాణిస్తుంటారు. అలాంటి నటుల్లో బాబీ సింహా (Bobby Simha) ఒకరు. ‘డిస్కో రాజా’, ‘వాల్తేరు వీరయ్య’ తదితర చిత్రాల్లో విలనిజం ప్రదర్శించిన ఆయన ఇటీవల ‘వసంత కోకిల’ (Vasantha Kokila)లో కథానాయకుడిగా నటించారు. ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలు ‘ఆహా’, ‘అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో’లో స్ట్రీమింగ్‌ అవుతోంది. మరి, బాబీ హీరోగా మెప్పించగలిగారా? వసంత కోకిల ఎవరు? (Vasantha Kokila Review)

ఇదీ కథ: రుద్ర (బాబీ సింహా) సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఓ భారీ ప్రాజెక్టుకు మేనేజర్‌గా వ్యవహరించే అవకాశాన్ని అందుకుని, కంపెనీ పెద్దలు నిర్ణయించిన సమయానికంటే ముందుగానే దాన్ని పూర్తి చేస్తానని మాటిస్తాడు. లక్ష్యాన్ని చేరుకునేందుకు నిద్రాహారాలు మానేసి మరీ పనిచేస్తుంటాడు. ఓ రోజు రుద్ర ఆరోగ్య పరిస్థితి చూసి షాకైన అతడి ఫ్రెండ్‌ నిషా (కశ్మీరా పరదేశి) (Kashmira Pardeshi) ఆస్పత్రికి తీసుకెళ్తుంది. నిద్రలేమి వల్ల అలా జరుగుతుందని, ఇకపై విశ్రాంతి తీసుకోకపోతే ప్రమాదమని వైద్యురాలు రుద్రకు సూచిస్తుంది. సమస్య నుంచి రుద్రను బయటపడేయాలనుకున్న నిషా అతణ్ని టూర్‌కు తీసుకెళ్తుంది. ఆ క్రమంలో ఓ రాత్రి బస చేసేందుకు అడవిని తలపించే ఓ ఊరిలోని ‘వసంత కోకిల’ అనే హోటల్‌కు వెళ్తారు. అక్కడికి కమల్‌ (ఆర్య) అనే వ్యక్తి ఎందుకొచ్చాడు? వారికి, కమల్‌కు ఉన్న సంబంధమేంటి? నిషాను తనెందుకు చంపాలనుకున్నాడు? .. అంటే సినిమా చూసి తెలుసుకోవాల్సిందే (Vasantha Kokila Review).

ఎలా ఉందంటే: మెసేజ్‌ ఓరియెంటెడ్‌ సస్పెన్స్‌ చిత్రంగా దీన్ని పరిగణించవచ్చు. మనిషి ఒక్కరోజులో కనీసం 7-8 గంటల నిద్రపోవాలి.. లేదంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలుంటాయనే విషయం అందరికీ తెలిసిందే. ఇదే అంశాన్ని ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీవితానికి ముడిపెట్టి తెరపైకి తీసుకొచ్చారు దర్శకుడు పురుషోత్తమ. ‘ఈ వయసులోనే కష్టపడాలి. డబ్బు సంపాదించుకోవాలి. దాని కోసం నిద్రలేకపోయినా ఫర్వాలేదు’ అని అనుకునే నేటి యువత ఆలోచనకు ఈ సినిమా ప్రతిబింబంలాంటిది. నిద్రలేకపోతే కష్టమే అనే ఒకే ఒక్క పాయింట్‌తో సినిమాని పూర్తి సందేశాత్మక చిత్రంగా మలచకుండా దానికి టైమ్‌ లూప్‌ కాన్సెప్ట్‌, సస్పెన్స్‌ను జోడించడం కొత్త ప్రయత్నం. అయితే, తక్కువ నిడివి (106 నిమిషాలు)లో ఇన్ని నేపథ్యాలతో కథను నడిపించడంతో ప్రేక్షకులందరూ దాన్ని ఫాలో అవడం కష్టమే. క్లారిటీ మిస్‌ అయ్యే అవకాశం ఉందీ ఈ చిత్రంలో. ఐటీ ఎంప్లాయ్‌ అయిన కథానాయకుడు తన సహోద్యోగులతో సంభాషించడం, గాళ్‌ ఫ్రెండ్‌తో మాట్లాడడం, ఓ థియేటర్‌లో ఫైట్‌ తదితర సన్నివేశాలను చూసి ఈ సినిమా సాఫ్ట్‌వేర్‌ ప్రేమకథా నేపథ్యంలోనే సాగుతుందేమో అనిపిస్తుంది. కానీ, ఊహించని విధంగా ట్రాక్‌ మారుతుంది. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే వసంత కోకిల హోటల్‌ సన్నివేశాలు ఆసక్తి రేకెత్తిస్తాయి.

హీరోయిన్‌ శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడుతుంటే హీరో ఫార్మసీకి వెళ్లి మెడిసన్‌ తెచ్చే ప్రయత్నం చేస్తాడు. కట్‌ చేస్తే, హీరో తిరిగి హోటల్‌కు చేరుకునే సమయానికి హీరోయిన్‌ అక్కడ ఉండదు. ఆమె ఏమైందో తెలుసుకోవాలనే ఉత్కంఠ రేకెత్తిస్తూనే టైమ్‌లూప్‌ కాన్సెప్ట్‌తో ఇచ్చిన ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ వావ్‌ అనిపిస్తుంది. ద్వితీయార్ధంలో ఇంకేదో జరగబోతోందనే ఉత్సుకత పెంచుతుంది. లూప్‌ సన్నివేశాలతో సెకండాఫ్‌ వేగంగా సాగుతుంది. కమల్‌గా ఆర్య ఎంట్రీని ఊహించడం కష్టం. ఆయన సడెన్‌ సర్‌ప్రైజ్‌కు షాక్‌ అవ్వాల్సిందే. నిషాను కమల్‌ ఎందుకు చంపాలనుకున్నాడు? అనే ట్విస్ట్‌ రివీల్‌ అయ్యాక నిద్రలేమి వల్ల హీరో మానసికంగా ఎంత బాధపడ్డాడో అర్థమవుతుంది. ఇక, అంతా అయిపోయింది.. హీరోహీరోయిన్లు వివాహం చేసుకున్నారు.. శుభంకార్డు పడబోతుందనుకునేలోపు మరో ట్విస్ట్‌ ఎదురవుతుంది (Vasantha Kokila Review). 

ఎవరెలా చేశారంటే: ఎన్నో విభిన్న పాత్రలతో మెప్పించిన బాబీ సింహా హీరోగా ఈ కథను తన భుజాలపై వేసుకుని నడిపించారు. ఒత్తిడికి గురైన సాఫ్ట్‌వేర్‌ రుద్ర పాత్రలో ఒదిగిపోయారు. కశ్మీరా పరదేశి అందం, అభినయంతో మెప్పించింది. సీనియర్‌ నటి అయిన రమాప్రభను హోటల్‌లో పనిచేసే వ్యక్తిగా చూపించారంతే. ఆమె పోషించిన పాత్రకు ఒక్క సంభాషణా ఉండదు. ఆమె స్థానంలో ఎవరిని తీసుకున్నా, అసలు ఆ క్యారెక్టరే లేకపోయినా ఇబ్బందేం లేదు. ఆర్య అతిథిగా కనిపించినా ఉన్నంతమేర ఆకట్టుకున్నారు. శరత్‌బాబు మరో అతిథి పాత్రలో కనిపించి, ఆకట్టుకున్నారు. నేపథ్య సంగీతం, సినిమాటోగ్రఫీ ఫర్వాలేదనపిస్తాయి. ప్రథమార్ధంలోని పలు సన్నివేశాలను వివేక్‌ ‘కట్‌’ చేసి ఉంటే బాగుండేది. పురుషోత్తమ టేకింగ్‌ బాగుంది (Vasantha Kokila Review).

బ‌లాలు:  + కథ, + ఇంటర్వెల్‌ ట్విస్ట్‌,  + బాబీ సింహా నటన

బ‌ల‌హీన‌త‌లు: - ప్రథమార్ధంలోని కొన్ని సన్నివేశాలు, - జానర్ల మిక్సింగ్‌లో స్పష్టత లోపించడం

చివ‌రిగా: ఈ ‘వసంత కోకిల’ను చూసేటపుడు నిద్రరాదుగానీ నిద్ర ఎంత అవసరమో గుర్తుచేస్తుంది.

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని